Friday, December 17, 2010

బారిష్టర్ పార్వతీశం (నవల)
(వికీపీడియా నుండి)


మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. .ఈ నవలలో ముఖ్య కథానాయకుడైన పార్వతీశం ఒక పల్లెటూరు నుండి బయలుదేరి ఇంగ్లండ్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాందించి కథ చివరిభాగం లో స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొంటాడు.ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది.ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది. ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.


 బారిష్టర్ పార్వతీశం మొదటి భాగం

పార్వతీశం మొగల్తూరు నుండి బయలు దేరి నిడదవోలు మీదుగా చెన్నై వెళ్తాడు. అక్కడ నుండి ఓడ పట్టుకొని ఇంగ్లాడు చేరుతాడు.ఈ భాగం చాలా హాస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా నిడదవోలు నుండి మద్రాసు వెళ్ళే రైలు ప్రయాణం చాలా హాస్యరసంగా చిత్ర్రించడం జరిగింది. మద్రాసు నుండి ఇంగ్లాండు వెళ్ళడానికి కావలసిన సరంజామా కొనుక్కొనే సన్నివేశాలు చాలా హాస్యవత్తరంగా ఉంటాయి. ఈ నవలను తెలుగు అకాడమీ పుస్తకాల్లో పదవ తరగతి తెలుగు ఉపవాచకముగా అందించారు.

 బారిష్టర్ పార్వతీశం రెండవ భాగం

ఓడలో ఇంగ్లండ్ చేరు కొన్న పార్వతీశం ఓడలో చిక్కిన స్నేహితుడి వల్ల స్కాట్‌లాండ్ లో ఎడిన్‌బరా నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టు గా చేరుతాడు. ఒక లా కాలేజి లో చేరుతాడు. ఆంగ్లం కుడా రాని పార్వతీశం ఏకసంధాగ్రహి క్రింద అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడం తో గ్రహించి అందరి మన్ననలు పొందుతాడు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతాడు. హాస్యం పాళ్ళు ఈ భాగం లొ తగ్గినా ఈ భాగం రసవత్తరంగానే ఉంటుంది. ఈ భాగం చివరి అంకం లొ బారిష్టర్ పాసై ఇంటి ప్రయాణం పట్టుతాడు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చాలా చక్కగా చిత్రించారు.


 బారిష్టర్ పార్వతీశం మూడవ భాగం

మూడవ భాగం ముఖ్యంగా ఇంటివచ్చాక తనని ఇంటి వారు ఏవిధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సాంప్రదాయల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు ఎదుర్కొనే సంఘటనలు చిత్రించారు. ఇంగ్లాండు నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా అసక్తికరంగా ఉంటాయి. తరువాత పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. హాస్యం పాళ్ళు ఈ భాగంలో మరింత తగ్గుతుంది.

Thursday, September 23, 2010

ఎన్.జి.ఓ లేదా గుమాస్తా - ఆచార్య ఆత్రేయ (N.G.O play by Acharya Atreya)

ఈ మధ్యన నేను చదివిన పుస్తకం ఆత్రేయ గారు రాసిన ఎన్జీఓ అనే నాటకం. ఆత్రేయ..ఈ పేరు వినని తెలుగువాడు ఉండడనుకుంటా! ఆత్రేయ గురించి మనకు(నాకు!) తెలిసినంతవరకు ఏవో సినిమా పాటలు రాసాడని.

నా మిత్రుడు ఒకడు ఈ నాటకం గురించి చెప్పడంతో చదవటం మొదలెట్టా. ఒక గంటలో పూర్తి చేశా. చాల బాగా రాసారు ఆత్రేయ గారు. ఈ నాటకం రాసింది 1948 లో. అప్పుడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి మధ్యతరగతి పరిస్థితులను చక్కగా ఈ నాటకంలో ప్రతిబింబింప చేసారు ఆత్రేయగారు. ఇంకా చెప్పాలంటే Hungry 30's లోని పరిస్థితులను మనం ఇందులో చూడవచ్చు.

ఆత్రేయ గారి మాటల్లో "ఎన్.జి.ఓ అనే పేరేగాని, మన మధ్యతరగతి కుటుంబాల - అందులో పట్నవాసుల అగచాట్లు, మనస్తత్వం, ప్రెస్టేజి పేరుతో పడుతూన్న ఆర్థిక సాంఘిక బాధలు చిత్రించటానికి ప్రయత్నించాను. ఏమాత్రం సఫలుణ్ణి కాగలిగానో ప్రజా బాహుళ్యమే నిర్ణయించాలి". ఆత్రేయ గారు! మీరు సఫలం ఏంటి...ఈ నాటకంతో ట్రెండ్సెట్టర్ అయ్యారు. కావాలంటే 1950 నుంచి మొన్న మొన్నటి దాక వచ్చిన సాంఘిక సినిమాలు చుస్తే అర్ధమైపోతుంది. మధ్యతరగతి మీద వచ్చిన ప్రతీ సినిమాలో ఎన్.జి.ఓ మార్కు స్పష్టంగా కనబడుతుంది.

ఇప్పుడు మనం చదివితే అంత గొప్పగా అనిపించదు ఈ నాటకం. ఎందుకంటే దీని ఆధారంగా వచ్చిన సినిమాలు, నవలలు, నాటికలు, కధలు మనం ఆల్రెడీ చాలా చూసే (చదివే) ఉంటాం కాబట్టి.

ఇక download చేసి చదవడం ప్రారంభించండి: ఎన్.జి.ఓ
ఇందులో పాత్రలు:

రంగనాథం - గుమాస్తా
గోపి - అతని తమ్ముడు (విప్లవ భావాలు కలవాడు)
ముసలాయన - అతని తండ్రి
గుప్త - అద్దెకొంప యజమాని
.
..
...
కాలం - స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత

స్థూలంగా  ఈ నాటకం చెప్పాలంటే, మన కధానాయకుడైన రంగనాథం ఒక గుమస్తా. మధ్యతరగతి జీవి. అతని మాటల్లోనే చెప్పాలంటే ఇంటి ముందున్న గుడిసెలను చూసి వారి కన్నా తన స్థాయి బాగుందని తృప్తి పడలేదు. అలాగే పక్కనున్న కోటీశ్వరుడి బంగ్లా చూసి అసూయ పడకుండా ఉండలేడు. లేని పోని భేషజాలకు పోయి అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకుంటారు వీరు. ఇక గోపి రంగనాథం తమ్ముడు. విప్లవ భావాలు కల్గినవాడు. చిన్న వయసులోనే జీవితం పట్ల విరక్తి కలిగినవాడు. రంగనాథం ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగం తో బాధపడుతూఉంటారు. ఇన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ లంచం తీసుకోడు రంగనాథం. చివరికి ఒకానొక పరిస్థితిలో అతనికి డబ్బులు అత్యవసరం అయినప్పుడు లంచం తీసుకుంటాడు. అప్పుడే గోపి ఒక బహిరంగ సభలో ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తుంటే, అతన్ని నిలదీస్తాడు. చివరికి వీరిద్దరి పరిస్థితి ఏమయిందనేది నాటకం చదివితే తెలుస్తుంది.

Download NGO book here: NGO

Wednesday, September 15, 2010

కడపలో రచయతల కలబోత -రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి

సాహితీ సంస్థలు, సాహితీ పత్రికలు రచయితల్ని ఒకచోటికి చేర్చడం, సాహితీ సామాజికాంశాల గురించి చర్చించడం సహజం. ఒక వార్తాపత్రిక వారానికి ఒకరోజు ఒక పేజీని సాహిత్యానికి కేటాయించే పత్రిక ఈ పని చేయడం అరుదైన అంశమే. ‘ఆంధ్రభూమి’ తన స్వర్ణోత్సవం సందర్భంగా ఆ పని చేస్తున్నది. సెప్టెంబర్ 5న కడప ‘హరిత’ టూరిజం హోటల్ సమావేశ మందిరంలో ‘ఆంధ్రభూమి’ సంపాదకులు ఎం.వి.ఆర్. శాస్ర్తీగారి పర్యవేక్షణలో రాయలసీమ రచయితలతో చర్చాగోష్ఠి జరిగింది. చిత్తూరు, అనంతపురం, వైయస్సార్ జిల్లాలనుండి ఇరవై అయిదుమంది రచయితలు, కవులు, సాహిత్య విమర్శకులు హాజరయ్యారు. వాళ్లలో సంప్రదాయవాదులు, ఆధునికులు ఉన్నారు.
ఒక పత్రిక యాజమాన్యానికైనా, సంపాదకులకైనా తమదంటూ ఒక భావజాలం, ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక సాహిత్య సిద్ధాంతమూ, అభిరుచీ ఉంటాయి. అలాగే రచయితలకు కూడా. ఈ రెండు వర్గాల భావజాలాలు, అభిరుచులూ సమానమైనవైతే కలవడం, చర్చించుకోవడం సులభం. ఇద్దరి మధ్య ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటే పని నెరవేరుతుంది. కడపలో ‘ఆంధ్రభూమి’ నిర్వహించిన ఇష్టాగోష్ఠి అలా ప్రజాస్వామిక వాతావరణంలో జరిగింది.
అక్కడికొచ్చిన రచయితలందరూ కూడా ఒకేరకమైన వాళ్లు కారు. సంప్రదాయవాదులు, మార్క్సిస్టులు, దళిత బహుజనులు, మైనారిటీవాదులు అందరూ ఉన్నారు. సంపాదకులు శాస్ర్తిగారు మొదట్లోనే తన అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఎవరి అభిప్రాయాలను వాళ్లు స్పష్టంగా వ్యక్తం చేయవచ్చని ప్రకటించడంతో ప్రజాస్వామిక చర్చకు అనుకూల వాతావరణమేర్పడింది. అన్ని వాదాల రచయితలూ మూడు గంటలసేపు స్వేచ్ఛగా ఇష్టాగోష్ఠి జరిపారు. అది సీమ రచయితల కలబోత అయ్యింది.
గోష్ఠికి వచ్చిన ప్రతి రచయితకూ ‘ఆంధ్రభూమి’తో ఎప్పుడో ఒకప్పుడు రచనా సంబంధముండడం పరిచయాల సమయంలోనే తెలిసిపోయింది. అయినప్పటికీ పేరున్న రచయితలు ఏమిరాసినా ప్రచురిస్తారు, పేరులేని రచయితలు ఎంత బాగా రాసినా ప్రచురించరు అనే పాయింట్ రానే వచ్చింది. దానిమీద చర్చ సాగింది. రాయలసీమ సాహిత్య ప్రచురణకు సంబంధించి అనేకులు తమ అనుభవాలను నిర్మొహమాటంగా చెప్పారు.
‘రాయలసీమ సాహిత్యం దశ దిశ’ అనే అంశం మీద రచయితలు ఆసక్తికరంగా చర్చించారు. రాయలసీమలో ఆధునిక సాహిత్యం ఆలస్యంగా మొదలు కావడానికి, ఇప్పటికీ అక్కడ అవధానాలకు, పద్యానికీ ఆదరణ బాగా ఉండడానికి అక్కడి అభివృద్ధిలోని వెలుగునీడలు, ఆ ప్రాంతపు భావజాలం కారణమని అందరూ ఆమోదించారు. రాయలసీమ నిర్దిష్ట జీవితమనగానే అక్కడి కరువు, కక్షలు అనే భావన స్థిరపడిపోయింది. రచయితలు ఈ రెండంశాలనూ విడివిడిగానే చిత్రించారు. ఈ సందర్భంలో రాయలసీమ రచయితల వేదిక ఒకటి మొదలైతే బాగుంటుందేమో చూడమని సంపాదకులు సూచించారు. ఆ ఆలోచన రాయలసీమలో ఇదివరకే నలుగుతూ ఉంది. కార్యరూపం ధరించవలసి ఉంది. రాయలసీమ సాహిత్య ప్రచురణను వేగవంతం చెయ్యడానికి ఆయన ఒక సూచన చేశారు. రాయలసీమ నాలుగు జిల్లాలకు కలిపి ఆ ప్రాంతానికి వచ్చే పత్రికలో వారానికి ఒకటి రెండు రోజులు రాయలసీమ చరిత్రా సంస్కృతుల మీద రచనల్ని వేస్తే బాగుంటుందా అన్నది ఆయన ప్రస్తావన. దానిమీద రచయితలు రెండు రకాలుగా స్పందించారు. ‘ఆంధ్రభూమి’ అనంతపురంనుంచి మొదలైనప్పుడు 1998లో అఫ్సర్ ఆ పని చేశారు. అది తర్వాత ఆగిపోయింది. దానిని పునరుద్ధరిస్తే మంచిదేనని ఒక అభిప్రాయం రాగా, అలా చేస్తే సీమ సాహిత్యాన్ని సీమకే పరిమితం చేసినట్లవుతుంది కదా అన్నది మరో అభిప్రాయం. గోష్ఠి ముగిసిపోయిన తరువాత కూడా రచయితలు దీనిని గురించి మాట్లాడుకున్నారు. ఏప్రాంతం సాహిత్యాన్నైనా అన్ని ప్రాంతాలకూ చేరవేసే మెకానిజమ్ మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ గోష్ఠిలో సంపాదకులు ఒక రాజకీయ చర్చను కూడా ఆసక్తికరంగా లేవనెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నడుస్తున్నది. రాయలసీమ మేధావులు ఎందుకు స్పందించవలసినంతగా స్పందించడంలేదు? అని అడిగారు. రాయలసీమ భౌగోళిక పరిస్థితి, అక్కడి రాజకీయ నాయకత్వం వంటివి ఇందుకు కారణాలని రచయితలు అభిప్రాయపడ్డారు.
ఆయన అన్నిటికన్నా మించిన ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తి సుదీర్ఘమైన చర్చకు అవకాశమిచ్చారు. యువత సాహిత్యానికి ఎందుకు దూరమైపోతున్నది? యువకులలో సాహిత్యాభిరుచిని కలిగించడం ఎలాగ? ఇది నాటి సమావేశంలో సంపాదకులను, రచయితలను, సాహిత్య విమర్శకులను వెంటాడిన ప్రశ్నలు. ఏ సాహిత్య సమావేశంలో చూచినా, రచనా రంగంలో చూచినా నలభై ఏళ్లకు పైబడిన వాళ్లు మాత్రమే కనిపిస్తున్నారు. వీళ్లంతా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యవసర పరిస్థితికి ముందు పుట్టినవాళ్లు. అత్యవసర పరిస్థితి తర్వాత పుట్టిన వాళ్లలో ప్రత్యేకంగా ఉద్యమాలు, భావజాలాలు ఆకర్షించినవాళ్లు తప్ప సాధారణ సాహిత్య పాఠకులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోపాతికేళ్లకు ఇప్పుడు రాస్తున్న చదువుతున్న వాళ్ల శకం ముగిసిందంటే, కొత్త తరాన్ని సాహిత్య రంగంలోకి తీసుకురాకుంటే అప్పుడు సాహితీ రంగం పరిస్థితేంటి? రాసేదెవరు? ఎవరైనా రాసినా చదివేదెవరు? నూటికి నూరు పాళ్లు పరిస్థితి ఇంత అద్వాన్నమై పోకపోవచ్చు గాని, మొత్తంమీద మన సాంస్కృతిక రంగం బాగా బలహీనపడిపోయే ప్రమాదముంది. ఈ దారుణ పరిణామాలను అరికట్టడం ఇప్పుడు సాహితీ రంగంలో ఉన్న వాళ్లదే బాధ్యత.
సమాజాన్ని గురించికాక, వ్యక్తిని గురించి జనం శకలాలు శకలాలుగా చీలిపోయి ఆలోచించే సందర్భంలో సాహితీరంగం నీరసపడిపోతుంది. అభ్యుదయ విప్లవ, స్ర్తి, దళిత బహుజన, మైనారిటీ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలన్నీ సమాజాన్ని గురించి వివిధ పరిధులలో పరిమితులలో సమష్టి ఆలోచనలు చేసేవే. సమష్టి ఆచరణలు గలిగినవే. ప్రపంచీకరణ వచ్చి ఈ ఉద్యమాలనన్నిటినుంచీ జనాన్ని లాగి వ్యక్తిగత సంచిలో కూరేస్తున్నది. ఈ కుట్రకు బలైపోకుండా నిలబడగలిగిన చిన్న సమూహమే ఇవాళ సాహిత్య రంగాన్ని బలోపేతం చేస్తున్నది.
కడప సదస్సులో రచయితలకు శిల్పశాలలు (వర్క్‌షాపులు) నిర్వహించాలని, సాహితీ సభలను నగరాలనుంచీ, పట్టణాలనుంచీ మండల కేంద్రాలకు తీసుకుపోవాలని, గ్రామాలకు వెళ్లాలని, గ్రామీణ విద్యాసంస్థలకు వెళ్లి సాహిత్య సభలు పెట్టాలని-ఇంకా అనేకమంది అనేకంగా సలహాలు, సూచనలు చేశారు. ఆలోచనలు మంచివే. ఆచరణతోనే గదా పేచీ. ఎవడు తీరిగ్గా ఉన్నాడు రచయితతో సహా? స్వక్షేమ సిద్ధాంతం ప్రబలమవుతున్న కొలదీ సమూహ సిద్ధాంతం బలహీనపడుతుంది. ఇవాళ సాహిత్యంలోనూ అదే ప్రతిబింబిస్తున్నది.
చివరకేమి మిగిలినది? ‘ఆంధ్రభూమి’ ఏర్పాటు చేసిన రాయలసీమ రచయితలతో ఇష్టాగోష్ఠి అక్కడి రచయితలు మరోసారి సాహితీ కర్తవ్యాన్ని గురించి ఆలోచించుకోడానికి అవకాశమేర్పడింది.
గోష్ఠిలో రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, జానుమద్ది హనుమచ్ఛాస్ర్తీ, మధురాంతకం నరేంద్ర, విఆర్ రాసాని, బండి నారాయణస్వామి, వేంపల్లి గంగాధర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రాధేయ, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, సుంకోజి దేవేంద్రాచారి, ఎన్.ఈశ్వరరెడ్డి, ఎన్.రామచంద్ర, ఎన్.కేశవరెడ్డి, కె.నరసింహులు, అబ్బిగారి రాజేంద్రప్రసాద్, డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్‌రెడ్డి, టిఎన్‌ఎ కృష్ణమూర్తి, పుత్తా పుల్లారెడ్డి, డాక్టర్ రామచంద్రయ్య, వేంపల్లి సికిందర్, కలువకుంట్ల రామ్మూర్తి, వై.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
--------------------
September 13th, 2010

తొలి ప్రబంధం - ద్వా.నా.శాస్త్రి

పదహారవ శతాబ్దం నాటి రాయలకాలాన్ని విమర్శకులు ప్రక్రియాపరంగా ‘ప్రబంధయుగం’ అన్నారు. రాయలకాలంలో వెలువడిన వాటికే ప్రబంధాలనే పేరు వచ్చింది. రాయలు రాసిన ‘ఆముక్తమాల్యద’ కూడా ప్రబంధం అన్నారు. నిజానికి ఇది ఆధునిక విమర్శకుల సృష్టితప్ప వేరొకటి కాదు. తిక్కన తన భారతాన్ని ‘ప్రబంధమండలి’ అన్నాడు. ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనే బిరుదు వుంది. అవచి తిప్పయసెట్టి శైవ ప్రబంధం రాయమంటే శ్రీనాధుడు ‘హరవిలాసం’ రాశాడు. దండి కావ్యానికి చెప్పిన అష్టాదశ వర్ణనలే ప్రబంధానికి ఉంటున్నాయి. కాబట్టి పూర్వం ప్రబంధ శబ్దం మంచి రచన, మంచి కూర్పుకలది, కావ్యం, కృతి అనే అర్ధాలలోనే వాడబడింది. ఇప్పటికీ మనుచరిత్ర కావ్యం, ఆముక్తమాల్యద కావ్యం అనే అంటున్నాం కదా! ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య కె.వి.ఆర్.నరసింహం, ఆచార్య పల్లా దుర్గయ్య, ఆచార్య దివాకర్ల వేంకటావధాని మొదలైనవారు ప్రబంధ లక్షణాలు తెలిపి కావ్యంకన్నా ప్రబంధం భిన్నమైందని నిర్ధారించారు. మరి తొలి ప్రబంధమేది? అనే అంశంపై మళ్లీ వాదోపవాదాలు బయలుదేరాయి. కొంతమంది నన్నెచోడుని ‘కుమార సంభవం’ తొలి ప్రబంధమన్నారు. దానికి కారణం వర్ణనలు, కథా నిర్వహణ శిల్పం, ఉక్తి వైచిత్రి వంటి లక్షణాలే. అయితే మరి కొందరు దీనిని అంగీకరించలేదు. ప్రబంధం అనువాదం కాకూడదు, శృంగారం ప్రధానంగా వుండాలి... అని చెప్పినవి పూర్తిగా కుమారసంభవానికి అన్వయించడంలేదు. కాళిదాసు కుమారసంభవంనుంచి కొన్ని అనువాదాలుండడం గమనార్హం. ఎఱ్ఱనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు అతని వర్ణనా నైపుణ్యం వల్లనే వచ్చింది కాబట్టి అతని నృసింహ పురాణం, హరివంశాలు అనువాదాలు కావడంవల్ల కావ్యాలుగానే పరిగణిస్తున్నారు. పురాణాలు అరణ్యాలవంటివైతే ప్రబంధాలు తీర్చిదిద్దిన ఉద్యానవనములవంటివి-అన్న వేటూరి ప్రభాకరశాస్ర్తీగారి మాటలు సమంజసాలు.ఆ కోణంనుంచి చూస్తే అల్లసాని పెద్దన రాసిన ‘మనుచరిత్ర’ తొలి ప్రబంధనమనటం సముచితం. ప్రబంధ లక్షణాలన్నీ మనుచరిత్రకి అన్వయించకపోయినా (చాలా ప్రబంధాలకి అన్ని లక్షణాలు వర్తించవు) రసానందం, చమత్కారత్వం వంటివి పుష్కలంగా గలది మనుచరిత్ర. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం కూడా ప్రబంధ యుగంలో పెద్దన ఒక మేరుపర్వతం వంటివాడనీ, ప్రబంధ ధ్వని ప్రతీయమానమయ్యేట్టు కథా సంవిధానం చేశాడనీ పేర్కొన్నారు. ఆరుద్ర ప్రబంధ వృక్షానికి ఎన్ని కాయలు కాసినా-తొలి ఫలం మనుచరిత్ర అన్నారు. అంతకు ముందు కల కావ్యాలలో ప్రబంధ పోకడలు వున్నాయి. ప్రబంధ మార్గానికి స్పూర్తినిచ్చాయి. ప్రబంధం అనగానే మనుచరిత్ర,పెద్దన గుర్తుకురావాల్సిందే! కాబట్టి ఎక్కువమంది మనుచరిత్రనే తొలి ప్రబంధంగా నిర్ణయించారు.
----------------------

తొలి రచన 15 - ద్వా.నా.శాస్ర్తీ, September 5th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-rachana-566

దాశరథి ‘అగ్నిధార’కు అరవయ్యేళ్ళు -పున్న అంజయ్య

తెలంగాణలో ఎందరో కవులున్నారు. కానీ పీడిత ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి గొంతెత్తి చెప్పగలిగిన మహాకవి ఒక్కరే. ఆయనే దాశరథి.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేనీ
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన ఘనత ఆయనకే దక్కింది. తన కవిత్వం ద్వారా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అభ్యుదయ కవి. 1949లో దాశరధి తొలి కృతి అయిన ‘అగ్నిధార’ను వెలువరించిన కీర్తి సాహితీ మేఖల సంస్థదే. 1934లో అంబటిపూడి వెంకటరత్నం చండూరులో స్థాపించిన ఈ సంస్థకు 75 వసంతాలు నిండాయంటే ఆశ్చర్యమేమరి. ఆంధ్ర, తెలంగాణ భేదాలను పోగొట్టడానికా అన్నట్లు ఆంధ్రలో పుట్టి తెలంగాణలో స్థిరపడ్డి ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలుగు జాతికి వెలుగుబాటగా సాహిత్య కృషిచేసిన అంబటిపూడి ధన్యులు.
నల్లగొండ జిల్లా చండూరు ప్రాంతంలో అంబటిపూడి స్థాపించిన సాహితీ మేఖల ఎందరినో ప్రభావితం చేసింది. ఈ సంస్థకు పట్టుగొమ్మల్లాంటి వారిలో ధవళా శ్రీనివాసరావు, సిరిప్రెగడ భార్గవరావు, పులిజాల హనుమంతరావు, మద్దోజు సత్యనారాయణలతోపాటు దాశరథి కూడా ఉన్నారు. దాశరథి కవిత ‘అగ్నిధార’ ఐతే ధవళశ్రీ కవిత అమృతధార అని చెప్పుకుంటారు. సాహితీ మేఖలతో సాన్నిహిత్యం పెంచుకున్న దాశరథి నాడు వెలువడిన మాతృభూమి, ప్రజామిత్ర, గోలకొండ, సారధి, అభ్యుదయ, విశాలాంధ్ర వంటి పత్రికల్లో ప్రచురింపబడిన కవితలన్నీ సంపుటీకరించి ‘అగ్నిధార’ పేరుతో సాహితీ మేఖల ప్రచురించింది. ఈ పవిత్ర కార్యానికి ప్రధాన కారకులైన దేవులపల్లి రామానుజరావు అభినందనీయులు. ఈ విషయాన్ని దాశరథి తన ‘కవితా పుష్పకాన్ని’ దేవులపల్లి రామనుజరావుకు అంకితంచేస్తూ ఇలా అన్నారు.
నాడు వెన్ను తట్టి ననుమెచ్చి
చిననాడు
కైత యనెడు లతకు నూతనిచ్చి
మొదటి పొత్తమీవు
పులిజాలతో గూడి
అచ్చువేసి వెలుగు లిచ్చినావు
దాశరథి తన ‘అగ్నిధార’ను వట్టికోట అళ్వార్‌స్వామికి అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా దాశరథి వట్టికోటను గురించి ఇలా అంటారు.
మిత్రుని కోసం కంఠం
ఇవ్వగలవాడు
మంచికి పర్యాయపదం ఆళ్వార్
అతనిదే సార్థకమైన జీవితం
అతనికే అగ్నిధార అంకితం
దాశరథి, ఆళ్వార్‌స్వామి 1948లో మూడునెలలు నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనతో మైత్రికి చిహ్నంగా ఈ అగ్నిధారను అంకితం చేసుకున్నానని వట్టికోట అన్నారు. అందుకే దాశరథిని ‘కవితా పయోనిధి’ అని వట్టికోట సంభోధించేవారు.
ముసలి నక్కకు రాచరికంబు దిక్కునే’ అని నిజాంను నిలువెల్లా వణికించిన ఉద్యమకవి దాశరథి. ‘తెలంగాణము రైతుదే’ అని ఘంటాపథంగా ఎలుగెత్తి చాటిన ధీశాలి ఆయన. రుద్రవీణను మీటి, అగ్నిధార కురిపించి అభ్యుదయ కవితా మార్గంలో పయనించిన దాశరధి ఎప్పటికీ చిరస్మరణీయుడే.

తొలి చిత్ర గర్భ బంధ కావ్యం - ద్వా.నా.శాస్త్రి

నన్నెఛొడుడు మొట్టమొదటగా ఈ చిత్ర గర్భ బంధ కవితా రచన చేశాడు. ఆ తర్వాత ప్రబంధ కవులు అక్కడక్కడ చిత్ర, గర్భ, బంధ కవితారచనలు చేసారు. ఒకే అక్షరంతో పద్యం రాయడం, ఎటు చదివినా ఒకేపద్యం రావడం, మొదటి రెండు పాదాలు తిరగేస్తే తర్వాతి రెండు పాదాలు రావడం మొదలైన విచిత్ర కవిత్వం. ఒకేపద్యంలో అనేక పద్యాలను ఇమిడ్చి రాయడం గర్భకవిత్వం. నాగబంధం, చక్రబంధం వంటి రచనలుప్రత్యేకం. ఆరుద్ర ఇటువంటి రచనల్ని ‘సాముగరిడీలు’ అన్నారు. అయితే ఈ చిత్ర, గర్భ, బంధ కవిత్వం రాయటం మాటలు కాదు. ఎంతో పాండిత్యంతోపాటు పద్యరచనా శిల్పంపై సాధికారం వుండాలి. మెదడు కంప్యూటర్‌లా వుంటేనే ఇటువంటి రచన సాధ్యం.
17వ శతాబ్దికి చెందిన గణపవరపు వేంకట కవి ఏకంగా కావ్యమంతా ఈ చిత్ర, గర్భ, బంధ కవిత్వంతో నింపేశాడు. కొన్ని పద్యాలు రాయడమే కష్టమైనప్పడు దాదాపు కావ్యమంతా రాయటానికి ఎంత ప్రతిభ ఉండాలో ఊహించలేం. పనె్నండవ ఏటనే కావ్యరచన ప్రారంభించిన కవి ఇతడు. యమశతకం, శృంగారమంజరి, కృష్ణమల్ల కధ, బాలరామాయణం, వేంకటేశ్వర నిఘంటువు మొదలైన రచనలు ఇరవైకి పైగా రాశాడు. అవన్నీ ఒక ఎత్తు. ‘‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము’’ ఒక ఎత్తు. ఇది తొలి చిత్ర, గర్భ, బంధ కావ్యం. అంతేకాదు-ఏకాశ్వాస కావ్యం. ఇదీ విశేషమే. వేంకటేశ్వరునికి ఆకాశరాజు కూతురికి జరిగిన వివాహమే ఇందులోని కథ. కథకంటే చిత్రకవితా భేదాలే ఎక్కువ. ‘సుఖసుప్తినున్న సమయంబున వేకువజామువేళ బాలవేంకట శౌరి ప్రత్యక్షమై’’ అంకితం కోరాడట. ఈ ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయవిలాస కావ్యం శ్రీపూండ్ల రామకృష్ణయ్యగారివల్ల వెలుగుచూసింది. శబ్ద చిత్ర సీసము, అనుప్రాసయుక్త అక్కలివడి సీసము, చౌపదములు, ద్వంద్వ ప్రాసకందము, సర్వలఘురూప సీసము, జాతి వార్తావచనము, గర్భిత చరణ దుర్ఘట సీసము, గర్భిత కందము, కటారికాబంధ కందము, రథబంధకందయు మొదలైనవెన్నో ఈ కావ్యంలో వున్నాయి. అయితే ఈ కావ్యంలోగల 808వ సీస పద్యం వంటిది ప్రపంచ సాహిత్యంలోనే లేదు. ఆపద్యం ఇది
‘‘సారాగ్య్రసారస సమనేత్ర యుగళ నారద రుచి కాంతిన రఘనపనిత
సారాగధీర విశదవీనతురగ భైరవభవ జైత్రభరశుభకరణ...’’
ఈ సీసపద్యంలో 64 పద్యాలున్నాయి. తేటగీతులు, ఆటవెలదులు, మంగళారతులు, శ్లోకములు, వృత్తములు, అష్టకములు, ఉత్కళికలు, 20 కందాలు, చేపదాలు అన్నీ కలిపి మొత్తం అరవె నాలుగున్నాయట! చాలావరకు పండితులు గుర్తించారు. ఇదీ మన భాషా ప్రాభవం మన పద్యరచనా వైభవం! అందుకే గణపవరపు వేంకటకవిని చిత్రగర్బ బంధకవిత్వాల పహిల్వాన్ అనటం!
-----------------------

తొలి రచన 16 - ద్వా.నా.శాస్ర్తీ, May 23rd, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/dwana-395

Monday, August 30, 2010

Gona Ganna Reddy by Adivi Bapiraju


Download Gona Ganna Reddy book here: Gona Ganna Reddy 

రచయిత  గురించి:
Bapiraju was born to Krishnayya and Subbamma, a Niyogi Brahmin family, on October 8, 1895 in Bhimavaram City. He graduated from a high school in Bhimavaram.  Later after graduating from law school, he practiced law for a while in Bhimavaram.  However, he gave up law practice for teaching and other interests such as journalism, painting and poetry.
He was interested in writing poetry from his childhood.  He became famous with his “Narayanarao” novel which got him Andhra Viswwakala Parishattu Award. He was also interested in painting. His popular oil paintings are samudraguptudu and tikkana. He also drew pictures for Viswanadha Satyanarayana’s famous lyrics, kinnerasani patalu.
In 1922, Bapiraju participated in Non-cooperation Movement and was jailed for one year.  He wrote “tolakari” after his jail experience. Later he wrote toophan, gona gannareddy, konangi and himabindu. His radio dramas like dukkiteddulu, uhasundari, bhogiraloya etc. and stories like tulikanrityam, hampi sidhilalu, silpabala, veena etc. were very popular. He also directed several movies, e.g., meerabai, anasuya, dhruv vijayam etc.  He also several short stories and songs. Some of his writings were translated into Kannada language.
After a short stint as a lawyer, Bapiraju worked at Bandar National College as a professor from 1934 through 1939. In 1944, he worked for meejan, a Telugu daily published from Hyderabad, as an editor.  Later, he joined Vijayawada Radio as an advisor. He was a founding member of Navya Sahitya Parishattu. He also established an art foundation in Guntur to teach painting.
Bapiraju was a multifaceted personality with a range of interests that included poetry, story writing, drama, journalism, painting, sculpture, music, and dance. He carved out himself a special place in Telugu literature and art by his contributions. He died in 1952.
Source: Nooruguru Telugu Pramukhulu, by M. L. Narasimharao.


అడివి బాపిరాజు (Adivi Bapiraju) (1895 - 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచే వారు.

బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజన్ సంపాదకునిగా పని చేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారుని ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు. బాపిరాజుకు చిన్ననాటినుండీ కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాధ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.


రచనలు : 
     నవలలు    
    * నారాయణరావు
    * తుఫాన్
    * గోనగన్నారెడ్డి
    * కోనంగి
    * హిమబిందు
    * కోణంగి
    * అడవి శాంతిశ్రీ
    * అంశుమతి
రేడియో నాటికలు
    * దుక్కిటెద్దులు
    * ఉషాసుందరి
    * భోగిరలోయ ?
ప్రసిద్ధి చెందిన కధలు
    * తూలికా నృత్యం
    * హంపీ శిధిలాలు
    * శిల్పబాల
    * వీణ
దర్శకత్వం వహించిన సినిమాలు
    * మీరాబాయ
    * అనసూయ
    * ధ్రువ విజయం


మరెన్నో కధలు, గేయాలు రచించాడు. కొన్ని కధలు కన్నడ భాషలోకి అనువదింపబడ్డాయి.

తొలి రచన - తొలి ఇతిహాసం - ద్వా.నా.శాస్త్రి

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. భిన్న భిన్న రూపాలున్నాయి. ఈ వైవిధ్యమే సాహిత్యానికి వైశిష్ట్యాన్ని సమకూరుస్తుంది. అయితే వీటికి మూలాలుంటాయి. ఎవరో ఒకరు శ్రీకారం చుడతారు. ఆ తర్వాత ఆ ప్రక్రియ విస్తృతమవుతుంది. అలా శ్రీకారం చుట్టిన వారిని, ఒక బాట వేసినవారిని, వారి రచనను ఒకసారి గుర్తుచేసుకోవడానికే ఈ ‘తొలి రచన’ శీర్షిక.
సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణమైతే తెలుగులో తొలి ఇతిహాసం భారతం. నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతమే తెలుగులో తొలి ఇతిహాసం. నన్నయకి ‘ఆదికవి’ అనే బిరుదు అనంతరకాలంలో వచ్చిందే. మారన ‘‘ఆంధ్ర కవితా గురుడు’’ అన్నాడు. తిక్కన ‘‘ఆంధ్ర కవిత్వ విశారదుడు’’ అనీ, రామరాజ భూషణుడు ‘వాగశాసనుడు’ అనీ మాత్రమే నన్నయను స్తుతించారు. ఇతిహాసాన్ని తెలుగులో రాయడానికి రాజరాజ నరేంద్రుడే కారకుడు. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొన్న కాలంలో ‘శాంతి’ ఏర్పడింది. అప్పుడు నన్నయ చేత వ్యాసభారతాన్ని ‘తెనుగున’ రచియింపజేశాడు. మరికొందరు కవులున్నా నన్నయనే పిలిచి రాయించటంలో ఆంతర్యం ఏమిటంటే- నన్నయ తన కుల బ్రాహ్మణుడు, అనురక్తుడు, విపులశబ్ద శాసనుడు, సంహితాభ్యాసుడు, లోకజ్ఞుడు, ఉభయ భాషా కావ్య రచనా శోభితుడు, నిత్య సత్య వచనుడు... వంటి సుగుణాలూ యోగ్యతలూ కలవాడు కావడమే! నన్నయ తెలుగులో ఇతిహాస రచనకి, కావ్యశైలికి, అనువాద ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు. రాజరాజు భారతం రాయించటంలో వ్యక్తిగతమైన అభిరుచులు ఉంటే ఉండవచ్చు కానీ తెలుగులో నన్నయ భారతం రావటానికి- ఆ తర్వాత కవిత్రయ భారతం రావటానికి కారకుడైన రాజరాజును తెలుగుజాతి సదా స్మరించవల్సిందే. నన్నయ అనువాద రచనకి ఒరవడి పెట్టాడు. యథానువాదం సరికాదని ప్రకటించాడు. మూలానికి సొంత ప్రతిభను జోడించి చేర్పులూ, మార్పులూ చేసి అనువాదంగా కాకుండా ‘అనుసృజన’గా రాయటం ఎలాగో చూపించాడు. తర్వాతి కవులకి మార్గం చూపించాడు. నన్నయ తన కవితా రీతుల్ని ప్రకటించి దీనికి కూడా మార్గదర్శకుడయ్యాడు. అప్పటినుంచి తిలక్ వరకూ చాలామంది తమ కవితా తత్త్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. బహుభాషా కోవిదుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరణగా కాకుండా కొత్తగా రాస్తున్నట్టు రచించాడు. అందుకే విమర్శకులు నన్నయ మూలానికి మెరుగుపెట్టాడు. నగిషీ చెక్కాడు, వనె్న పెట్టాడు అన్నారు. వ్యాసుని కథకి, వ్యాసుని పాత్రలకి తెలుగుదనాన్ని అద్దాడు. అందుకే కొలని గణపతిదేవుడు ‘శివయోగసారము’లో నన్నయను ‘‘ఆంధ్ర కావ్య పథము తీర్చినవాడు’’గా ప్రశంసించాడు. నన్నయ రాసింది రెండున్నర పర్వాలే అయినా తెలుగుజాతి ఉన్నంతవరకు జీవించే వుంటాడు.
---------------

తొలి రచన- ద్వా.నా.శాస్ర్తీ, May 23rd, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-rachana-566

తొలి వ్యాకరణ గ్రంథం - ద్వా.నా.శాస్త్రి

తెలుగులో కంటే ముందుగా తమిళ, కన్నడ భాషలలో వ్యాకరణాల రాయబడ్డాయి. పదకొండవ శతాబ్దం వరకు తెలుగు భాషకి వ్యాకరణాలు వెలువడలేదు (ఎవరన్నా రాసినా దొరకలేదు). మన వాజ్ఞ్మయపు తొలినాళ్లలో అన్నీ వివాదాస్పదమైనవే. అలాగే ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథ కర్తృత్వం కూడా వివాదాస్పదమైనా చాలామంది నన్నయ రాసాడని భావించారు. ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ తెలుగు భాషకు రాయబడిన మొదటి వ్యాకరణమే కానీ-సంస్కృతంలో రాయబడింది. ఇందులోని సూత్రాలు, ఆర్యావృత్తములు ఇంచుమించు 270 వున్నాయి. ఆంధ్ర శబ్ద చింతామణికి నన్నయభట్టీయము, వాగనుశాసనీయము, శబ్దాను శాసనము అనే పేర్లున్నాయి. నన్నయ శబ్ద శాసనుడు, వాగనుశాసనుడు అని ప్రసిద్ధి పొందడానికి ఈ వ్యాకరణమే కారణం. ఆంధ్ర శబ్ద చింతామణిలో సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ అనే అయిదు పరిచ్ఛేదాలున్నాయి. ఛందోబద్ధత ఆ రోజుల్లో నిత్యం కాబట్టి శ్లోకాలలో వ్యాకరణ సూత్రాలు రాయటం అప్పటి రచనా పద్ధతి కాబట్టి నన్నయ కూడా శ్లోకాలలో రాసి వుంటాడు. అయితే ఈ ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు భాషకి సమగ్రమైన వ్యాకరణం ఏమీ కాదు. తత్సమ శబ్ద రూప సాధనకే నన్నయ ప్రాధాన్యమిచ్చాడు. పాణినీయాన్ని అనుసరించినా నన్నయ కొంత కొత్త పరిభాషను కూడా ప్రవేశపెట్టాడు.
‘‘విశ్వశ్రేయః కావ్యమ్’’
అనే మొట్టమొదటి సూత్రమే చాలా ప్రసిద్ధమైంది. నన్నయ కాలంనాటికే కావ్య ప్రయోజనం విశ్వ శ్రేయస్సు అనే భావన వుండడం విస్మరింపరానిది. అలాగే ‘‘స్వస్థాన వేషభాషాభిమతాస్సన్తో రసప్రలుబ్ధ ధియః...’’ అంటూ స్వదేశ వేష భాషాభిమానాన్ని చాటి చెప్పిన వ్యాకరణ గ్రంథం ఇది. అంతేకాదు-
‘‘సిద్ధిర్లోకాద్దృశ్యా’’- ఆంధ్ర శబ్ద స్వరూపం లోక వ్యవహారం వల్లనే సిద్ధిస్తుంది అనడం ఎంతటి ముందు చూపు? ఆంధ్ర భాషకు ముప్పయి ఆరు వర్ణాలని పేర్కొనబడింది. చిన్న సూత్రాలతో చాలావరకు ప్రణాళికాబద్ధంగా రాయబడ్డాయి. బాల వ్యాకరణానికి ఇది ఆధారమంటారు.
‘ప్రతిషే ధవాచినాంనః’- వ్యతిరేకార్ధంలో క్రియా పదాలకు ‘ని’ చేరుకుతుందని అర్ధం. ఉదా: జయింపనివాడు, చేయనివాడు, గెలువనివాడు మొ. కంఠస్థం చేయడానికి అనువుగా వ్యాకరణ పరిజ్ఞానానికి తొలి సోపానంగా ఉపయోగపడే వ్యాకరణమిది.
ఆంధ్ర శబ్ద చింతామణికి, సంస్కృతంలో ఎనిమిది, తెలుగులో పదహారుటీకలు వ్యాఖ్యలు వెలిసాయంటే దీని ప్రాశస్త్యం తెలుస్తుంది. విశేషం ఏమిటంటే సిపి బ్రౌను దొర దీనినీ వదిలిపెట్టలేదు-ఆంగ్లంలోకి అనువదించాడట!!

------------
తొలి రచన - ద్వా.నా.శాస్త్రి, June 6th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/vyakarana-grandham-337

తొలి కావ్యం - ద్వా.నా.శాస్త్రి

సంస్కృతంలో కావ్యానికి చెప్పబడిన లక్షణాలనే తెలుగుకి అన్వయించి కావ్యం, ప్రబంధం అన్నారు. ఆ తర్వాత ప్రబంధం వేరుగా ప్రత్యేక లక్షణాలు చెప్పారు. నన్నయ రాసిన మహాభారతాన్ని కొంతమంది కావ్యేతిహాసమంటే, కొద్దిమంది కావ్యమే అన్నారు. కావ్య లక్షణాలు సంపూర్ణంగా మొట్టమొదటగా ననె్న చోడుడు రాసిన ‘కుమార సంభవం’లోనే కనబడతాయి. ‘వర్ణనాష్టాదశంబుచే పరిపూర్ణంబై, దశప్రాణంబుల సప్రాణంబై, నవరస భావ భరితంబై, షట్త్రింశదలంకారాలంకృతంబ’గుటచేతనే ‘‘రమణీయంబగు దివ్య కావ్య రచనారంభంబునకు అభిముఖుడైనట్లు’’ నన్నె చోడుడు చెప్పుకున్నాడు. ‘సకలావయవంబలంపరిపూర్ణంబైన దివ్య కావ్యంగనా సృష్టి’గా కుమార సంభవాన్ని పేర్కొన్నాడు. ‘కుమార సంభవం’ కావ్యాన్ని కనుక్కొని, పరిష్కరించి అజ్ఞాత వాసంనుంచి బయటకు తీసుకువచ్చి ప్రచురించిన ఖ్యాతి మానవల్లి రామకృష్ణ కవికి చెందుతుంది. 1909లో మొదట ప్రకటించినప్పుడు నన్నయకంటే నన్నెచోడుడు ముందటి వాడన్న చర్చ జరిగింది. ఆ తర్వాత నన్నెచోడుడు రాయలేదు-మానవల్లి రామకృష్ణ కవి రాసి ననె్నచోడుని పేరు పెట్టారని కొర్లపాటి శ్రీరామమూర్తిగారు పుస్తకం రాసినా చాలామంది ఆమోదించలేదు. ననె్నచోడునికి ‘కవిరాజ శిఖామణి’ అనే బిరుదువుంది.
‘‘మునుమార్గ కవిత లోకంబున
వెలయగ దేశికవిత పుట్టించి తెనుం
గును నిలిపి రంధ్ర విషయంబున జన
చాళుక్యరాజు మొదలుగ పలువుర్’’ అనడమే కాకుండా ‘‘మార్గకుమార్గము దేశియమార్గము’’ అని మొట్టమొదగా మార్గ, దేశి కవిత్వాలను ప్రస్తావించాడు. జాను తెనుగుకి ప్రాధాన్యమిస్తానన్నాడు. తనది వస్తుకవితగా అభివర్ణించుకున్నాడు. శివపార్వతుల కల్యాణం-వారికి కుమారస్వామి జన్మించడం ఈ కావ్యంలోని ఇతివృత్తం. నన్నె చోడుడు శివకవే కానీ పాల్కురికి సోమనలాగా వీరశైవ కవి కాదు. కొందరి దృష్టిలో ఈ కుమార సంభవం ప్రథమ ప్రబంధం కూడా!
మత్త్భాలను వర్ణించేటప్పుడు ‘మత్త్భేవిక్రీడితం’ ఛందస్సును, వసంత సమయంలో ‘మత్తకోకిల’ ఛందస్సును, శివునికి స్వాగతం చెప్పేటప్పుడు ‘స్వాగత’ ఛందస్సును...ప్రయోగించి ఆయా వృత్తాలకు నామ సార్ధక్యం కల్పించడం ఒక విశేషమైతే-మొదటగా గర్భ బంధ చిత్ర కవితను ప్రవేశపెట్టడం మరో విశేషం. ‘‘శ్రీమజ్జంగమ మల్లికార్జున దేవ దివ్య శ్రీపాద పంకజ భ్రమరాయమాణ కవిరాజ శిఖామణి’’ రాసిన ఈ కావ్యం తెలుగులో విశిష్టమైనది. దేశీయతకు పెద్దపీట వేసిన తొలి కావ్యమిది.

-----------------

తొలిరచన 4 - ద్వా.నా. శాస్ర్తీ, June 13th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-722

తొలి శతకం - ద్వా.నా.శాస్త్రి

తెలుగులో తొలి శతకమేది? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమే. కొందరు మల్లికార్జున పండితారాధ్యుడనే శివ కవి రాసిన ‘శివతత్త్వసారము’ తొలి శతకమన్నారు. అజా, రుద్రా, శివా అనే మకుటాలతో 489 పద్యాలుగల రచన ఇది. ‘‘శతకమనుపేరు లేకున్నను శివతత్త్వసారమునందలి పద్యములు సర్వ విధముల శతకములనే పోలియున్నవి’’ అని అంచనావేసారు ఆచార్య జి.నాగయ్య. కానీ నిడదవోలు వెంకటరావు ‘‘తెలుగున తొలి శతకము మల్లికార్జున పండితారాధ్యుని శ్రీగిరి మల్లికార్జున శతకము. దీని మకుటము శ్రీగిరి మల్లికార్జున’’ అని వెల్లడించారు. అయితే శ్రీగిరి శతకంలో కొన్ని పద్యాలు తప్ప శతకం లభ్యం కాలేదు. అదే నిడదవోలు వృషాధిప శతక పీఠిక రాస్తూ ‘‘ఆంధ్ర శతక వాజ్ఞ్మయమున సంఖ్యానియమము, మకుట నియమము గలిగిన శతకములలో ప్రధమము వృషాధిప శతకము’’ అన్నారు. అందువల్ల శతక లక్షణాలు సంపూర్ణంగా కలిగి, లభ్యమైన వృషాధిప శతకమే తెలుగులో తొలి శతకంగా పేర్కొనబడుతోంది.
పనె్నండవ శతాబ్దికి చెందిన పాల్కురికి సోమనది తెలంగాణలో ‘పాలకుర్తి’గా చెప్పబడుతోంది. ఇతను వీరశైవాన్ని ఆచరించిన వాడు. ‘శివకులీనుడు’ అని చెప్పుకున్నాడు. మూర్త్భీవించిన శివభక్తి స్వరూపమే పాల్కురికి సోమన. ‘‘తెలుగు మాటనంగ వలదు, వేదముల కొలదియగా’’ చూడుడని తెలుగు అభిమానాన్ని అప్పుడు చాటి చెప్పిన తొలి కవి. వృషాధిప శతకం బసవని స్తుతిరూపకమైన శతకం. వీర శైవ మత స్థాపకుడైన బసవుడంటే సోమనకి సాక్షాత్తు శివుడే.
‘‘నా యొడయుండ, నా విభుడ, నా హృదయేశ్వర, నా మనోరమా
నా యిలవేల్ప, నా వరద, నా గురులింగమ, నాదు జంగమా
నాయధినాథ, నావరుడ, నన్ను కృపామతి బ్రోవుమయ్య దే
వా. యమ బృంద వంద్య బసవా బసవా బసవా వృషాధిపా!’’
ఈ వృషాధిప శతకంలో అనుప్రాస గల పద్యాలున్నాయి. ఏక సమాసంతో కూడిన పద్యాలున్నాయి. నమస్కారాంత (నమో నమో అంటూ) పద్యాలూ వున్నాయి. సంస్కృతం, తమిళం, కన్నడం, ఆరె భాషలలో పద్యాలు రాసాడు. మణిప్రవాళ శైలిలో (సంస్కృతాంధ్ర పదాలను కలుపుతూ) రాసిన తొలి కవి కూడా సోమనే. బసవుని మహిమల్నే కాకుండా సామాన్యులైన శివభక్తుల చరిత్రను కూడా వివరించాడు. చంపక, ఉత్పలమాల పద్యాలతో రాయబడిన వృషాధిప శతకం భక్తి శతకాలలో అగ్రస్థానంలో నిలుస్తుంది.

------------------

తొలి రచన 5 - ద్వా.నా.శాస్ర్తీ, June 20th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-188

తొలి కథా కావ్యం - ద్వా.నా.శాస్త్రి

కథా కావ్యమంటే కథకీ, కథా రచనకీ ప్రాధాన్యంగలది. చిత్ర విచిత్రాలైన మహిమలు, మలుపులు, వినోదాలు-వింతలు, నీతులు గల కథల సంపుటిగల కావ్యాలు కథాకావ్యాలు. సమకాలీన సాంఘిక పరిస్థితుల చిత్రీకరణ వుంటుంది. కథాకథన శిల్పం ముఖ్యం. ఒక విధంగా చెప్పాలంటే చందమామ కథల్లో భేతాళ కధల్లాగా, కాశీమజిలీ కథల్లాగా వుంటాయనవచ్చు. తిక్కన కాలంలో ప్రారంభమైన కథా కావ్యరచన శ్రీనాధ యుగంలో విస్తృతికెక్కింది. కథా కావ్యాలు చాలవరకు అనువాదాలు కావు-అనుసరణలు తప్ప.
తెలుగులో తొలి కథాకావ్యంగా ఎక్కువమంది అంగీకరిస్తున్నది కేతన రాసిన ‘దశకుమార చరిత్ర’.ఈ మూల ఘటిక కేతన తిక్కన శిష్యుడు. అంతేకాదు-ఈ దశకుమార చరిత్రను తిక్కనకే అంకితమిచ్చాడు! ఒక కవి మరొక కవికి, ఒక శిష్యుడు ఒక గురువుకు ఇచ్చిన తొలి రచన కూడా ఇదే! కవిత్రయంలో ఒక్క తిక్కనకి మాత్రమే కృతిభర్త అయ్యే అవకాశం లభించింది.
‘‘వివిధ కళానిపుణుడు, నభి
నవ దండియానాగ బుధజనంబుచేతన్
భువిపేరుగొనినవాడను’’ అని తన గురించి ప్రకటించాడు.
సంస్కృతంలో దండి ‘కావ్యాదర్శము’తోపాటు ‘దశకుమార చరిత్ర’ అనే గద్య కావ్యం రాసాడు. దీనికి ఇంచుమించుగా అనువాదమే కేతన దశకుమార చరిత్ర. అందుకే ఒకరిద్దరు అనువాదం కాబట్టి తొలి కథా కావ్యంగా అంగీకరించలేదు. ఆ దండి రచననుబట్టి కేతనకు ‘అభినవదండి’ అనే పేరు వచ్చింది. ఈ కేతన రాసిన ‘ఆంధ్ర భాషాభూషణం’ తెలుగులో రాయబడిన మొదటి వ్యాకరణ గ్రంథం. ఇతని ‘విజ్ఞానేశ్వరీయం’ కూడా తొలి ధర్మ శాస్త్ర గ్రంథం.
‘‘పదలాలిత్యముతో, మనోహరమైన వర్ణనలతో, సజీవమైన పాత్రలతో, సమకాలిక జీవితమును చిత్రించు ఘట్టములతో, హాస్య వ్యంగ్య సంభాషణములతో, రసోచితమైన కథనముతో...’’ దశకుమారుల సాహస చర్యలను, వారి ప్రేమ వృత్తాంతములను మనోహరంగా రాసాడని విమర్శకులు తెలిపారు. పనె్నండు ఆశ్వాసాలలో, సుమారు 1625 గద్యపద్యాలలో రాసాడు. తిక్కన మెప్పుపొందానని చెప్పాడు. తన కాలంనాటి ఆభరణాలను, కోడిపోరును, శృంగార వీర రసాలను హృదయంగమంగా వర్ణించాడు. ‘‘తేనియబడ్డ ఈగగతి’’, ‘‘కుక్కకు టెంకాయ దక్కదు’’ వంటి కొత్త పలుకుబడులు, వయ్యాళి (షికారు), సురంగము (సొరంగం) వంటి వాడుక పదాలూ దశకుమార చరిత్రలో కనిపిస్తాయి. కేతన పద్య రచనా వైభవానికి ఒక్క పద్యం-
‘‘చెఱుకటెవిల్లు! పువ్వులటె చిక్కని చక్కనియమ్ములేయుచో
గఱియటె చిత్తముల్! హరుడు కోపమునంగనుగొన్న నంగముం
బఱిపఱిమయ్యెనట్టె! తల ప్రాణము తోకకు వచ్చె! నెవ్వరిం
గఱచుననంగు డేమిటికి కంపము చెందెదవంబుజాననా!’’

--------

తొలిరచన 6 - ద్వా.నా.శాస్ర్తీ, June 27th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-618

తొలి వచనములు - ద్వా.నా.శాస్త్రి

ప్రథమాంధ్ర వచన వాజ్ఞయాచార్యుడిగా ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన కృష్ణమాచార్యులు కాలాన్ని కొందరు క్రీ.శ.1290 ప్రాంతంగా, మరికొందరు 1260-65 ప్రాంతంగా భావించారు. ఆంధ్ర రచయితల సంఘం పక్షాన ఆచార్య ఎం.కులశేఖరరావుగారు ‘సింహగిరి వచనములు’ పేర కొన్నిటిని సేకరించి ప్రచురించి ఎంతో మంచిపని చేసారు. ఆ తర్వాత సింహాచలం దేవస్థానం వారు వచనములు, కృష్ణమాచార్య సంకీర్తనము, సింహగిరి నరహరి వచనములు అనే భాగాలతో ప్రచురించారు. ‘చాతుర్లక్షగ్రంథ సంకీర్తన వాక్పూజలతో శ్రీ సింహాద్రి నాథుణ్ణి మెప్పించి ప్రత్యక్షం కావించుకున్న మహాభక్త శిఖామణి’’గా ప్రశంసించబడ్డాడు. కృష్ణమాచార్యులు అటు పద్య పద్ధతినీ ఇటు చంపూ పద్ధతినే కాకుండా వచన శైలిలో కవితా గానం చేసి ఆద్యుడయ్యాడు. ఇతని రచనను ‘తొలి వచన గేయాలు’గా కూడా పేర్కొన్నారు.
ఇప్పటివరకు అచ్చు అయిన సింహగిరి వచనాలు అరవై వున్నాయి. ప్రతి వచనం ‘దేవా!’ అనే సంభోదనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు.
‘‘వేదంబు తెనుగు గావించి సంసార/ఖేదంబుమాన్చిన కృష్ణమాచార్య’’ అనే ప్రశస్తి పొందాడు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు. ఇతని ప్రభావం బమ్మెర పోతనపై వుందంటారు. తాళ్లపాక వారి కీర్తన వాజ్ఞయానికి ప్రేరణ, స్పూర్తి కృష్ణమాచార్యుల వచనాలే అంటారు.
‘‘దేవాతనువుల మాయ/తలపోసి తలపోసి చెప్పెదనంటినా
కఱకఱల మోహమిది! ఆశల పాషాణంబిది/అతుకలు జల్లెడయిది....
....నాటకములాడెడు బూటకమ్ముల బొమ్మ/అమ్మమ్మా రుూ బొమ్మ’’
అంటూ సాగే వచనాలతో దేశ్య పద్యాలకే ప్రాధాన్యం గమనిస్తాం. ‘‘రణించు-జోడించు-తుండించు’’ వంటి విశిష్ట ఇంచుక్కు రూపాలు చూస్తాం. ‘‘విదురనాటి వాదా’’, ‘‘ద్వార వాకిళ్లు’’ వంటి ప్రయోగాలు 13వ శతాబ్దంలో చెయ్యడం విశేషం. కృష్ణమాచార్య వచనాలను నామసంకీర్తనా వచనాలు, పౌరాణిక వచనాలు, కథా వచనాలు సాంప్రదాయ వచనాలు...అనేవిధంగా విభజించవచ్చు. నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడే!

-------------

తొలిరచన-7 - ద్వా.నా.శాస్ర్తీ, July 4th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-244

తొలి ఆంధ్ర పురాణం - ద్వా.నా.శాస్త్రి

తిక్కన శిష్యుడైన మారన రాసిన ‘‘మార్కండేయ పురాణం’’ తెలుగులో అనువదింపబడిన మొదటి పురాణం. అంతకుముందు బసవపురాణం, నృసింహ పురాణం అనే పేర్లతో ఉన్న వాటికి పురాణ లక్షణాలు అన్వయించవు. అందువల్ల ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం మారన మార్కండేయ పురాణాన్ని ప్రధమాంధ్ర మహాపురాణంగా నిర్ణయించారు. ఇది కాకతీయ రెండవ ప్రతాపరుద్రుని కొలువులో ఉన్న గన్న సేనానికి అంకితమివ్వబడింది. ‘‘మార్కండేయమునంతటిని స్థూలముగా గమినించినచో ఒక రసవత్కంథా హారము వలె శోబిల్లుచుండును. మారన అనువాదము మూలాతి విధేయముకాదు. మూలాభావిష్కారమును స్వీయ వ్యక్తిత్వముద్రతో ఒనర్చుట అతని ప్రత్యేకత. మారన మహాకవిది అచ్చమైన ఆంధ్ర పురాణశైలి’’ అని జివిఎస్ తమ సిద్ధాంత వ్యాసంలో పేర్కొన్నారు.
అష్టాదశ పురాణాలలో మార్కండేయ పురాణం ఏడవది. ‘‘అఖిలహితమ్ము’’గా తానేర్చుగతిని ఉధాత్తమతి’’లో మారన ఎనిమిది అశ్వాసాలలో దాదాపు 2550 పద్య గద్యాలలో అనువదించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, పురాతన వంశావళి, ధర్మసందేహ నివృత్తి అనేవి మార్కండేయ పురాణంలో ప్రధానాంశాలు. అనేకమైన కథలతో కూడుకున్న ఇందులో హరిశ్చంద్ర వృత్తాంతం. వరూధినీ ప్రవరుల కధ మదాలసాకువల యాశ్వుల కథ, బహుళాశ్వ చరిత్ర మొదలైన ఉపాఖ్యానాలున్నాయి. ఈ మార్కండేయ పురాణం తర్వాతి కాలంలో అనేక కావ్యాలకు కథాభిక్షను ప్రసాదించిందని ఆచార్య ఇ.నాగయ్య అనటం అక్షరసత్యం. పెద్దన మనుచరిత్రకి ఈ పురాణమే ఆధారం. మారన తిక్కనను ‘కవిత్వ తత్త్వ విభవోజ్జలుడు’’ అని ప్రశంసించాడు. గౌరన రాసిన హరిశ్చంద్రోపాఖ్యానానికికూడా మార్కండేయ పురాణమే మూలం. మార్కండేయ పురాణంలో పద్యశైలికి ఒక ఉదాహరణ:
‘‘ఈసుకుమారె డెవ్వడొకొ యిందులకెందులనుండి వచ్చె నో
భాసుర రూపుకాంతి జిత భావజ చంద్రుడి తండు రాగలీ
లా సరస్వత మొప్ప గడులాలసుడైనను జూచెనేని నే
చేసిన పుణ్య మెవ్వరును జేయరు, కాముని దక్క నేలుదున్’’
మారన నుంచి కథను స్వీకరించి, అతని శైలిని చాలాచోట్ల అనుసరించి కూడా పెద్దన పూర్వకవి ప్రస్తుతితో నన్నయ్య, తిక్కన, ఎర్రనలను మాత్రమే స్తుతించడం గమనార్హం!
---------------

తొలిరచన 8 - ద్వా.నా.శాస్ర్తీ, July 11th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-799

తొలి సంకలన గ్రంథం - ద్వా.నా.శాస్త్రి

ఇది శ్రీ నరసింహ వర ప్రసాద లబ్ద విచిత్ర కవిత్వము కలవాడును. భారద్వాజ గోత్ర పవిత్రుడును, అయ్యలామాత్యుని పుత్రుడును, సరస గుణధర్యుడును అగు సింగనార్యుడు రచించిన సకల నీతి సమ్మతమును రాజనీతి శాస్త్రము’’ అంటూ మడికి సింగన రాసిన ‘‘సకల నీతి సమ్మతము’’ తెలుగులో తొలి సంకలన గ్రంథం. మడికి సింగన శ్రీనాథ యుగము నాటివాడు. కొందరు క్రీ.శ. 1347 ప్రాంతము వాడని, కొందరు క్రీ.శ. 1420 ప్రాంతమునాటి వాడని అభిప్రాయపడ్డారు. ఇతను పద్మ పురాణోత్తర ఖండము, భాగతవము దశమ స్కంధ ద్విపద, జ్ఞానవాసిష్ట రామాయణము అనే వాటిని కూడా రచించాడు.
వివిధ గ్రంథాలనుంచి సేకరించి ఒక సంకలనంగా తీసుకువచ్చి నేటి సంకలన గ్రంథాలకు ఆద్యుడయ్యాడు మడికి సింగన. కామందకము, పంచతంత్రము, నీతి సారము, బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి, పురుషార్థసారము, నీతి భూషణము, భారతముల నుంచి స్వీకరించిన పద్యాలతో ఈ సంకలనం చేశాడు. సకల నీతి సమ్మతం- అనే పేరున్నా గానీ ఎక్కువుగా ఆకాలపు రాజనీతి సూత్రాలే ఎక్కువుగా ఉన్నాయి. పూర్వకాలంలో రాజనీతిని గ్రహించటానికి - ఈ కాలానికి కొన్నిటిని అన్వయించుకోవటానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది. ఈ పద్య సంకలన గ్రంథాన్ని మొట్టమొదటగా మానవల్లి రామకృష్ణ కవిగారు వెలుగులోకి తెచ్చారనీ, 1923లో తొలుత శ్రీ కాశీనాథుని నాగేశ్వరావు పంతులుగారు తమ ఆంధ్ర పత్రికా ముద్రణాలయంలో ప్రచురించారనీ- ఈ పద్య సంకలనం గ్రంథాన్ని వచనంలోకి అనువదించిన బులుసు వెంకట రమణయ్య గారు పేర్కొన్నారు.
మూడాశ్వాసాలుగల ‘సకల నీతి సమ్మతము’’లో దుర్గ సంరక్షణము, ప్రజాపాలనము, ఆదాయ వ్యయ ప్రకారము, రాజనీతి, రాజునకు కొరగాని గుణములు కరణికపునీతులు, వైద్యనీతి, రాయబార ప్రకారము, చారుల నీతులు, రాజ భృత్య నీతులు, సేవింపదగని రాజులు, చతురుపాయాలు, వ్యసనములు, దండయాత్ర, చోర నీతులు, ప్రయాణ వ్యసన పరీక్ష మొదలైన అంశాలున్నాయి. సామాన్య నీతులూ వున్నాయి. కొన్ని నీతి వాక్యాలను గమనించండి.
‘‘రాజుగారి మన్ననయున్న యెడల మేకవంటి సాధువైన పురుషుడైనను సింహము వంటి వాడగును. ఆ మన్నన లేని యెడల సింహము వంటి వాడైనను మేకవలె అగును’’
‘‘ప్రజాపాలన చేయ కథనము కోరు రాజు ధాన్యపు కుప్పకు నిప్పు అంటించి పేలాలు తినదలచినవాని వంటివాడు’’
‘‘బంగారమును కాల్చినను, ముక్కలుచేసినను కూడా గుణము మార్పు చెందదు. అట్లే కష్టకాలమునందు మిక్కిలి తాపము కలిగినను. గట్టి దెబ్బలు తినిననుసరే వికారమును పొందరాదు’’
‘‘నమ్మించి మోసపుచ్చి దేవతలనైనను జయింపవచ్చును. ఇతరుల సంగతి యిక చెప్పనేల?’’

--------------

తొలిరచన 9 - ద్వా.నా.శాస్ర్తీ, July 18th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-396

తొలి రామాయణం - ద్వా.నా.శాస్త్రి

గోన బుద్ధారెడ్డి రచించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో తొలి రామాయణం. ఇతడు క్రీశ 1210 ప్రాంతంలో జన్మించినవాడుగా చె ప్తారు. ఈ రంగనాథ రామాయణం కొంతకాలం ఎవరు రాసారు? అనే అంశంపై వాదోపవాదాలు జరిగాయి. మొదట వ్రాత ప్రతులలో ‘రామాయణము’ అనే పేరున్నదనీ అనంతరకాలంలోనే రంగనాథ రామాయణం అనే పేరు వచ్చిందని రాళ్లపల్లి, మల్లంపల్లి, సి.పి.బ్రౌనులు అభిప్రాయపడ్డారు. ఇది ద్విపద ఛందస్సులో రాయబడింది. కాబట్టి రంగనాథ రామాయణం ద్విపదలో రాయబడిన తొలి రామాయణం కూడా!
రంగనాథ రామాయణం జన సామాన్యంలో ప్రచారం పొందింది. ద్విపదలో రాయడంవల్ల గానయోగ్యమైంది. వాల్మీకి రామాయణం మూలమైనా స్వతంత్రతో బుద్ధారెడ్డి మార్పులు చేర్పులు చేసాడు. ఇద దేశీయ రచన కాబట్టి జానపదులు పాడుకునేవారని, పురాణ పఠనానికి అనువుగా వుందనీ పేర్కొన్నారు.
‘‘్భమి గవీంద్రులు బుధఉలును మెచ్చ రామాయణంబు పురాణ మార్గమున’’ శ్రీరామ చరిత్రమును ఒప్పచెప్పెద అన్నాడు. అయితే వాల్మీకి రామాయణంలో లేనివాటిని చాలా బుద్ధారెడ్డి కల్పించాడు. అహల్యపై మనసుపడిన ఇంద్రుడు కోడియై కూసినట్టు సంస్కృత రామాయణం లేకున్నా బుద్ధారెడ్డి కల్పించాడు. ఈ మార్పు నచ్చిన ఓ కవి ఏకంగా ఇదే సంఘటన ఆధారంగా ‘అహల్యాసంక్రందనం’ అ ప్రబంధమే రాసేసాడు. జానపదుల కథలనుంచి కొన్ని సన్నివేశాలు స్వీకరించి ప్రజల కథనాలకి బుద్ధారెడ్డి ప్రాధాన్యమిచ్చాడు. రావణుడ్ని ఉదాత్తునిగా, శూరునిగా వర్ణించాడు. ఈ ప్రతినాయకుడు రాముని విలువిద్యా కౌశలాన్ని ఇలా కీర్తిస్తాడు.
‘‘నల్లవో రఘురామ! నయనాభిరామ! విల్లువిద్యగురువ! వీరావతార!
....బాపురే! రామభూపాల! లోకములు నీపాటి విలుకాడు
నేర్చునే...’’ పగవారి నేర్పును మెచ్చుకొనే తత్వం మనకి గుణపాఠం గదా! రాముడు సీతను ఎడబాసినప్పుడు ఎలా భావించాడో గొప్పగా వర్ణించాడు బుద్ధారెడ్డి-
‘‘ఇది మహారణ్యమై యిప్పుడు తోచె
నిది పర్ణశాలయై యిప్పుడుతోచె
నిది నాకు దపయని ఇప్పుడు తోచె
నిదినాకు దుఃఖమని యిప్పుడు తోచె’’
ఇదీ దాంపత్య వైభవం అంటే! ఆచార్య జి.నాగయ్యగారి మాటలు గుర్తుంచుకోదగినవి; ‘‘తెలుగు సాహిత్యమున రంగనాథ రామాయణము మనకొక ప్రత్యేక స్థానమున్నది శివకవుల ఆవేశమిందు లేకపోవవుట, ప్రబంధ కవుల పదబంధములకిది దూరముగా నుండుట అను రెండు గుణముల వలన రంగనాథ రామాయణం కావ్య గౌరవము ఇనుమడించుచున్నది’’.

------------------

తొలి రచన 10 - ద్వా.నా.శాస్ర్తీ, July 25th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-578

తొలి వీధి రూపకం - ద్వా.నా.శాస్త్రి

ది శ్రీమన్మహామంత్రి శేఖర వినుకొండ తిప్పయామాత్యనందన, చందమాంబాగర్భ పుణ్యోదయ, సుకవి జన విధేయ వల్లభరాయ ప్రణీతంబైన క్రీడాభిరామంబను వీథి నాటకంబున’’ అని గ్రంథాంత గద్యలో వుంది. అయినా కొందరు దీనిని శ్రీనాథుడే రచించాడని వాదం చేశారు. ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీనాథుడిపై సిద్ధాంత వ్యాసం రాసి క్రీడాభిరామం శ్రీనాథకృతం కాదని నిర్ణయించారు. ఈ వల్లభరాయడు కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోగల మోపూరు గ్రామ వాసి. విజయనగర రాజుల పాలనలో ఉన్నత పదవిలో ఉన్నాడు.
క్రీడాభిరామం లఘురచన. ఏకశిలా నగర వీథుల్లో విలాసార్థం విహరించిన ఇద్దరు యువకులు కన్నవి- ఇందులో ఉన్నవి. ఆ ఇద్దరిలో ఒకరు కాసల్నాటి గోవింద మంచన శర్మ, మరొకడు టిట్ట్భిసెట్టి. తెలుగులో వెలసిన మొట్టమొదటి హేళన కావ్యం కూడా ఇదే అంటారు. 13వ శతాబ్దంలో ఓరుగల్లు ఎలా వుండేదో, కాకతీయుల నాటి సాంఘిక పరిస్థితులు ఎలా వుండేవో క్రీడాభిరామం తెలియజేస్తుంది. అందుకే ఇది సాంఘిక రూపకం అయింది. తర్వాత వెలువడిన సాంఘిక కథా కావ్యాలకు క్రీడాభిరామం స్ఫూర్తి అయింది. అయితే ఈ క్రీడాభిరామానికి మూలం రావిపాటి త్రిపురాంతకుడు (14వ శతాబ్దం) రాసిన సంస్కృత ప్రేమాభిరామం! ముఖ్యమైన అంశం ఏమిటంటే- రాయలవారి ఆముక్తమాల్యలో కంటె ముందుగా ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అనే నానుడి క్రీడాభిరామంలో ఉండటం!! అయితే దీనికి ప్రాచుర్యం లభించలేదు.
క్రీడాభిరామంలో కాకతీయుల కాలం నాటి వృత్తులు, కులాలు, ఆచార వ్యవహారాలు వివరంగా తెలియజేయబడిన రచన ‘క్రీడాభిరామం’. మైలసంతలు ఉండేవి. వీరభటులు మోహరివాడలో ఉండేవారు. అట్టడుగు వర్గాలవారి నివాసం ‘వెలిపాళెం’ కాగా రైతుల నివాసం ‘హాలికవాటి’. గమనించదగిన అంశం ఏమిటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులతో వేశ్యలుకూడా ‘లోపాళె’లో నివసించేవారట. క్రీడాభిరామంలో వీటితోపాటు వేశ్యల స్వభావాలు, రతి క్రీడల విలాసాలు పచ్చిగా వర్ణించబడ్డాయి. వేశ్యల వివాదాలు తీర్చటానికి జారధర్మాసనాలుండేవి! కోడిపందాలు, జానపద కథాగేయాలు, గ్రామ దేవతలు, వస్తధ్రారణ, చిత్రకళ మొదలైన అంశాలూ వున్నాయి. ఒక రూపాయికి 15వ శతాబ్దంలో ఎంత భోజనం ఎలా పెట్టేవారో చూడండి.
‘‘కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమ పిండి వంటయున్
గుప్పెడు పంచదారయును, క్రొత్తగ కాచిన యాలనే పెస
ర్పప్పును కొమ్ము నల్లనటి పండ్లను, నాలుగునైదు నంజులున్
అప్పల తోడ క్రొంచెరుగు లక్ష్మణ వజల యింట రూకనున్!
క్రీడాభిరామం సాంఘిక చరిత్రకు గొప్ప ఆకరం!’’

------------

తొలిరచన 11 - ద్వానా శాస్ర్తీ, August 8th, 2010  - http://www.andhrabhoomi.net/sahiti/toli-334

తొలి వీర గాథా కావ్యం - ద్వా.నా.శాస్త్రి

ఈక్షోణిన్ నినుబోలు సత్కవులు లేరీనాటి కాలమ్మునన్’’ అని అల్లాడు వేమారెడ్డిచే శ్రీనాథుడు కీర్తింపబడ్డాడు. మామిడి సింగన శ్రీనాథుడ్ని ఏకంగా బ్రాహ్మీమయమూర్తి అన్నాడు. ఈ కవిసార్వభౌముడు, ఈ ఆగమజ్ఞాననిధి, ఈ బహుశాస్త్ర పారంగతుడు రాసిన ద్విపద కావ్యం ‘పలనాటి వీర చరిత్ర’. తెలుగులో ఇది మొట్టమొదటి వీరగాథాకావ్యం. కొంతమంది ఈ దేశీయ రచనను శ్రీనాధుడు చేస్తాడా? అని వాదించారుగానీ వారి వాదం నిలువలేదు.ఈ పల్నాటి వీర చరిత్ర కావ్యాన్ని శ్రీనాథుడు మాచర్ల చెన్నకేశవస్వామికి అంకితమిచ్చాడు! మాచర్ల పలనాటిలోదే!
‘జనులెల్ల భక్తిచే చదువుట కొరకు’’ద్విపదలో రాశానన్నాడు. ఈ పలనాటి చరిత్రను పిచ్చుకకుంటులు ప్రచారం చేసారు. శ్రీనాధుడు ‘నారికురుపు’చే బాధపడుతూ మాచెర్లలోని చంద్రికావంక నదిలో స్నానం చేస్తే ఆ రోగం మాయమైందట! కలలో చెన్నకేశవస్వామి కనిపించగా ఈ కావ్యం రాసాడని జనం చెప్పుకునే మాట! పల్నాటి వీర చరిత్రకు మహాభారతానికి పోలికలున్నాయి. దాయాదుల మధ్య పోరు, వ్యసనాలు, అజ్ఞాతవాసాలు, అభిమాన్యుడు బాలచంద్రుల సామ్యం వంటివి సమానమే.అందుకే పల్నాటి వీర చరిత్రను ‘పల్నాటి భారతం’ అంటారు. ఇందులోని బ్రహ్మనాయుడు సంఘ సంస్కర్త. సహపంక్తి భోజనానికి ఆద్యుడు ఇతడే! ఈ పలనాటి చరిత్ర రెడ్డిరాజుల కాలంనాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది. ఆనాటి ఆటల విశేషాలు, వధువుల అలంకరణలు, వాద్య విశేషాలు, జానపద గాయకులు మొదలైన సంచారమంతా పలనాటి వీరచరిత్రలో దొరుకుతుంది. ఈ ద్విపద కావ్యంతో ప్రౌఢకవి, పండిత కవి అయిన శ్రీనాధుడు ప్రజాకవి అయ్యాడు.
‘‘బ్రహ్మాండములబట్టి బంతులాడుదును
మృత్యుదేవతనైన మెదిపి వేసెదను
బాలుడనని నన్ను భావింపవలదు
చిన్న మిరియమునందు చెడునె కారంబు?’’
అని బాలచంద్రునినోట శ్రీనాధుడు పలికించడం అతని ప్రతిభకు నిదర్శనం! అక్కిరాజు ఉమాకాంతం వంటి పండితులు ‘శ్రీనాధుని వర్ణనము మిక్కిలి స్వాభావికముగా నున్నది. నియమములవల్ల అర్ధమును జెడుగొట్టక భావమునాదరించిన ప్రాజ్ఞుడు. కావ్య రచనకు దారితీసి, నాటక రచన ప్రారంభించి భవిష్క్యత్సంస్కార బీజములు వెదజల్లిన కృషికుడు’’ అనటం అక్షరరాక్షర సత్యం.

-------------

తొలి రచన - 12 - ద్వా.నా.శాస్ర్తీ, August 15th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-rachana-601

తొలి దండకం - ద్వా.నా.శాస్త్రి

‘‘పండిత కీర్తనీయుడగు బమ్మెర పోతన యాసుధాంశుమా
ర్తాండ కులాచలాంబునిధి తారకమై
విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె’’ అనే పద్యంవల్ల తొలి దండకం ‘్భగినీ దండకం’ బమ్మెర పోతన రాసాడని చెప్తారు. విద్వాంసులైన శ్రీ గరమెళ్ల సత్య సోమయాజి శర్మగారు భోగినీ దండకం పోతన రచించినదే అని నిరూపిస్తూ దండకాన్ని ప్రచురించారు. భోగిని సర్వజ్ఞసింగ భూపాలుని ఉంపుడుకత్తె (వేశ్య). భోగిని అందచందాలు, శృంగారం, విరహం వర్ణిస్తూ రాసిందే భోగినీ దండకం. పోతనవంటి మహా భక్తుడు దీనిని రాసి ఉండడు అని కొందరు వాదించారు. కానీ యువకుడిగా వుండగా రాసి ఉంటాడని నిర్ణయించారు.
గోపాల దేవోత్సవ క్రీడలో భోగిని అనే వేశ్య సర్వజ్ఞసింగ భూపాలుని చూసింది. వలచింది. అది తమ కులాచార విరుద్ధమని తల్లి మందలించింది. తల్లి మాటలను లెక్కచేయక ఎట్లో ప్రభువును కలిసింది. పాదాలపై పడి వేడుకుంది. అతడు ఆమెను ప్రియురాలిగా స్వీకరించాడు. ఇదీ ఈ దండకంలోని ఇతివృత్తం. ఛందస్సు ప్రకారం దండకంలో తగణం ఎక్కువగా వుంటుంది. ఆచార్య జి.నాగయ్య ‘‘్భగినీ దండక రచనవల్ల కీర్తికి కళంకము గాని, అతని భక్తికి మాలిన్యముకాని అంటదు. కావ్య రచనా వ్యాసంగమునందలి తొలిదశలో విద్వత్ ప్రభువగు సింగభూపాలుని కోరికపై ఈ దండకం పోతన వ్రాసి యుండును. ఆనాటి వేశ్యలు విదుషీమణులు. రాజులు వారిని తమ పట్టపు మహిషులతో సమానముగా గౌరవించెడివారు’’ అని చారిత్రక సత్యాన్ని తెలిపారు. నన్నయ అరణ్యపర్వంలో మొదట దండకం రచించాడు. ఆ తర్వాత శ్రీనాథుడు శృంగార నైషధంలో, కాశీఖండంలో దండకం రాశాడు. అవన్నీ సందర్భోచితంగా రాసిన లఘు రచనలే. కానీ ప్రత్యేకంగా దండకం రాసినది పోతన మాత్రమే!
‘సింగ భూపాలుడై వ్రాలి చిత్తమున్మత్తమై
సోలి కామానలాయత్తమై రాదు...’’
‘‘ఉల్లసత్ఫుల్ల మందార రాజున్మరందంబునందంబున
గ్రోలు మత్తాళి దుత్తూర ముంగ్రోలునే?...’’ అంటూ భోగినీ దండక రచన పోతన ఆలంకారిక వైచిత్రితోనే సాగుతుంది. భాగవతంలోని శైలికి, పద్య రచనకు, భావ వైశిష్టతకు సామ్యం ఉండడంవల్ల భోగినీ దండకం పోతన కృతమేనని తెలుస్తుంది.

----------------

తొలి రచన -13 -- ద్వా.నా.శాస్ర్తీ, August 23rd, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-dandakam-867

తొలి యక్షగానం - ద్వా.నా.శాస్త్రి

యక్షగానము బహుదాంధ్ర సారస్వత శాఖలలో నొకటి. మన వాజ్ఞయ వ్యక్తిత్వమును నిరూపించునట్టి ప్రక్రియ అది. ఒక్క యాంధ్ర దేశము ననే కాక ఇటు తెలంగాణములో, అటు తమిళనాడు నడిబొడ్డగు తంజావూరు ప్రాంతమున, కన్నడ దేశపుటోడికట్టగు మైసూరు ప్రాంతమునను చరిత్రకాది కారణములచే తెలుగు భాష వ్యవహరింపబడిన పలు తావుల నాయు భాషలలోనే కాక తెలుగునను వెలసినది యక్షగానములనేకము అన్నారు యక్షగానాలపై సమగ్ర పరిశోధన చేసిన ఆచార్య యస్వీ జోగారావు. యక్షగానాలకు ఆంధ్రదేశమే పుట్టినిల్లు. ఇక్కడినుంచి కర్నాటక, తమిళనాడులకు వ్యాపించింది. తెలుగులోని పూర్వ నాటక రూపం యక్షగానం అన్నారు. యక్షగానం సమాహార కళ. అంటే కవిత్వం, సంగీతం, నాట్యం కలిసి వున్న రూపం.
‘‘కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు
గాంధర్వమున యక్షగాన సరణి’’
అని శ్రీనాధుడు భీమఖండంలో పేర్కొన్నాడు. యక్షగానం పుట్టుపూర్వోత్తరాలకి వెళ్తే పనె్నండవ శతాబ్దినాటికే యక్షగానం ప్రాచుర్యం పొందిన ప్రదర్శన కళారూపంగా తెలుస్తోంది. యక్షగానానికి ‘కొరవంజి’అనే జానపద రూపకం మూలమని నిర్ధారించారు.
పాల్కురికి సోమన కాలం (12వ శతాబ్ది)నాటికి ఆటపాటగా వెలసిన యక్షగానం, శ్రీనాధుని నాటికి స్రోత్తపారోపయోగిగా గాన శైలిని అలవరుచుకుంది. దక్షిణాంధ్ర యుగంలో యక్షగానాలకి ప్రాముఖ్యం, ప్రాచుర్యం లభించింది. తొలి యక్షగానమేది-అనే మీమాంస వుండనే వుంది. పదిహేనవ శతాబ్ది చివరగల ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన ‘సౌభరి చరితం’ అనే యక్షగానాన్ని తొలి యక్షగానంగా చెప్తారు. కానీ అది లభ్యం కాలేదు. దొరకని దాని గురించి నిర్ధారించడం సహేతుకంగాదు. వెల్లంకి తాతంభట్టు ఒక యక్షగానం రచించాడని తెలుస్తున్నా-అది అలభ్యమేకాదు, ఆధారాలు లేవు. కాబట్టి 16వ శతాబ్దికి చెందిన కందుకూరి రుద్రకవి రచించిన ‘సుగ్రీవ విజయం’ అనే యక్షగానమే మొదటిదని నిర్ణయించారు. ఇది లభ్యం. కందుకూరిలోగల జనార్దన దేవుడికి అంకితమిచ్చాడు. శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్ట్భాషేకం చేయడం ఇందులోని వస్తువు. ఇది ‘కరుణ భాసుర యక్షగాన ప్రబంధం’. సుగ్రీవ విజయంలో సంవాదాత్మక శైలి వుండడంవల్ల నాటకంలా ప్రదర్శన యోగ్యంగా వుంటుంది. జనార్దన దేవుని వసంతోత్సవ సమయంలో మొదటగా దీనిని ప్రదర్శించారని చారిత్రక పరిశోధకులు డా.నేలటూరి వేంకటరమణయ్య పేర్కొన్నారు. కూచిపూడి భాగవతుల వల్ల నేటికీ యక్షగానం ప్రదర్శించబడడం గమనార్హం.
---------
తొలి రచన 14 - ద్వా.నా.శాస్ర్తీ, August 29th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-009

Sunday, August 29, 2010

Gidugu ... Vaduka mataku Godugu

తెలుగు వెలుగులేవీ? -అద్దంకి శ్రీనివాస్

 ఏభాషా అంత తేలికగా వాగ్వ్యవహారం నుంచి జారిపోదు. సువ్యవస్థితమైన భాష ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందో, అంతకంటే ఎక్కువ కాలమే జన వ్యవహారం నుంచి భాష మృగ్యమైపోవడానికి పడుతుంది. ఈ దశలో పతనం కూడా అంచెలంచెలుగానే ఉంటుంది. నేడు మన తెలుగు భాష దుస్థితికి కారణాలేమిటి?

మాతృభాషాభిమానం నేడు తెలుగును అధ్యయనం చేసేవారికీ, బోధించేవారికే పరిమితమైపోయింది. అలా కాకుండా రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్లు 'నాదు దేశము నాదు జాతి నాదు భాష' అనే అభిమానం ఉండా లి. తెలుగు మాతృభాషగా కల ప్రతి ఒక్కరికీ భాషాభిమా నం ఉండాలి. తోటి తెలుగువానితో తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి.

తెలుగు పట్ల అభిమానం పిల్లల్లో ప్రాథమిక స్థాయి నుంచే అలవడేలా చేయాలి. భాషపై అభిమానం ఏర్పడితే పాఠ్యాంశాలలో తెలుగు లేకపోయినా స్వీయకృషితో తెలుగు భాషా సాహిత్యాలపై పట్టు సాధించగలుగుతారు.

ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే ఆంగ్లంలో మాట్లాడుకుంటారని ఒక ఛలోక్తి ఉంది. ఇది మనకు మన భాష పట్ల గల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది.

అసలు ఏ భాష అయినా మొదట వాగ్రూపంలో ఉంటుంది. మాట్లాడే భాష నుంచి లిఖిత భాష ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డ లిఖిత భాష ప్రభావం మౌఖిక భాషపై కూడా ఉంటుంది. ఈ రెండూ పరస్పరాశ్రితాలు. అలాగే మాట్లాడే భాషలో తెలుగుతనం తగ్గిపోతూ ఉండడం వల్ల క్రమంగా లిఖిత భాష కూడా ప్రభావితం అవుతుంది. అందువల్ల ముందు మౌఖిక భాషను సంరక్షించుకోవాలి. దీనికి స్పష్టమైన నిర్దిష్టమైన ఉచ్ఛారణను విధిగా అందరూ పాటించాలి.

ముఖ్యంగా భాషను ప్రాథమిక స్థాయిలో బోధించే అధ్యాపకుల నియామకంలో స్పష్టోచ్ఛారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాథమిక విద్యా బోధకులలో భాషా పండితు లు ఉండడం లేదు. తెలుగును ప్రత్యేక పాఠ్యాంశంగా చదివినవారిని ప్రాథమిక స్థాయిలో అధ్యాపకులుగా నియమించాలి.

అలా నియమితులైన వారే పిల్లలకు మంచి భాషను చిన్నప్పటి నుంచీ నేర్పడమేకాక, భాషాభిమానా న్ని కలిగించేందుకు కీలకపాత్రను పోషిస్తారు. ప్రాంతీయ మాండలిక భాషా జ్ఞానం అందరికీ తప్పనిసరి.

ఈ జ్ఞానం తో పాటుగా ప్రామాణికాంధ్ర భాషాస్వరూపాన్ని స్పష్టం గా చిన్నప్పటినుంచీ పిల్లలకు తెలియజెప్పాలి. వివిధ మాండలికాలు వాటి వ్యాప్తి, శబ్ద సాధు-అసాధువులు, ఉచ్ఛారణ విషయంలో సందేహాలు పిల్లవాడి భాషా వినియోగానికి ప్రతిబంధకాలుగా తయారవుతాయి.

ఈ సందేహాలను నివారించడానికి చిన్ననాటి నుంచి ప్రామాణిక గ్రంథాలను పాఠ్యాంశాలుగా బోధించడమే శరణ్యం. రేడియో, టీవీ వంటి ప్రసార మాధ్యమాల ప్రభావం ప్రజలపై ఎంతగా ఉందో చెప్పనవసరం లేదు. కనుక సరైన ఉచ్ఛారణను అందించే భాషా నిపుణుల్ని రేడియో టీవీల లో నియమించాలి. సాధారణంగా పాత్రికేయ నైపుణ్యా లు ఉన్న వారినే వ్యాఖ్యాతలుగా నియమిస్తున్నారు. దీనివల్ల భాష దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే నేడు తెలుగుభాషకు దిక్కు పత్రికలే. పత్రికలు దోషరహిత ప్రయోగాలను చిత్తశుద్ధితో వాడితే వాటి వ్యాప్తి వేగంగా ఉంటుంది. భాషా పాండిత్యం లేని పాత్రికేయులు కొన్నికొన్ని అపప్రయోగాలను, దుష్టపదబంధాలను రూపొందించి భాషకు తీరని అన్యాయం చేస్తున్నారు. పద, వాక్యస్థాయి దోషాలపై 'నిఘా' యంత్రాంగం పటిష్టమైన తీరులో అన్ని పత్రికల కు పనిచేయాలి.

అలాగే తెలుగు భాషలో మృగ్యమైపోతు న్న పద ప్రయోగ వ్యాప్తిని పెంచాలంటే ముందుగా ఆంగ్ల భాషా వ్యవహారాన్ని సాధ్యమయినంత వరకు కట్టడి చేయాలి. ఇది చాలా కష్టమైన విషయం.

ఎందుకంటే ఆధునిక కాలంలో శాస్త్రసాంకేతిక రంగాలలోనూ విద్యా వాణిజ్యాది రంగాలలోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఈ మార్పు ప్రజల జీవనం, సంస్కృతి, భాషలపై ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తుం ది.

తెలుగు భాషా సంస్కృతులకు సంబంధంలేని కొత్తకొత్త కొలువులు ప్రవేశిస్తున్నాయి. దీంతో తెలుగు భాషలో ఆయా కొలువులకు చెందిన పారిభాషిక పదాలను ఆంగ్లం నుంచే స్వీకరించవలసిన అనివార్య స్థితి ఏర్పడుతోంది.

ఇది ఎప్పుడూ సమస్యే. సాంస్కృతికంగా సంస్కృత భాష, పాలనాపరంగా అరబిక్ భాష, శాస్త్రసాంకేతిక పరంగా ఇప్పుడు ఆంగ్ల భాష అసంఖ్యాక పదాలను తెలు గు భాషకు అందించాయి. ఈ ప్రభావం క్రమంగా నిత్య వ్యవహారానికి కూడా వ్యాపించి, వర్ణ, పద, వాక్య స్థాయిలలో తెలుగు వాడకం తగ్గిపోతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యాకరణం తెలుగులో ఉంటుంది. పదాలన్నీ ఆంగ్ల భాషవే ఉంటాయి. దీనికి పరిష్కారం అన్య దేశాల కు బదులు స్వీయభాషలో పద నిర్మాణం జరగాలి.

అన్యదేశాలు వాడితే తప్పేం టి? ఇదొక ప్రశ్న. అన్య దేశ్యాలను వాడితే పద సంపద పెరిగి భాష విస్తృతమౌతుంది. మంచిదే. కానీ ఈ వాడుక తెలుగుభాషలోని ప్రాథమిక పదజాలాన్ని దెబ్బతీయకూడదు. వాక్యాలపై ఈ ప్రభా వం అధికంగా పడుతుంది. తద్వా రా తెలుగుభాషకు సహజం కాని వాక్యాలు తెలుగులో చోటు చేసుకొని గందరగోళం సృష్టిస్తాయి.

అలాగే మౌలికమైన తెలుగు క్రియ లు మరుగున పడిపోయి, వాటి స్థానంలో ఆంగ్ల క్రియలే వ్యాప్తిలోనికి వస్తున్నాయి. మౌలిక క్రియలు వ్యవహారంలోంచి జారిపోవడం పెద్ద ప్రమాదం. ఎందుకంటే అస లు భాషలోని పదాలన్నీ క్రియలనుంచే ఉద్భవిస్తాయనే వాదం ఒకటి ఉంది.

చాలా తెలుగు పదాలకు మూలాలు నేటికీ తెలియడం లేదు. ఈ విషయంపై నామవిజ్ఞాన శాస్త్రం కొంత కృషిచేస్తోంది. అసలు క్రియలే ఎవరికీ తెలియకపోతే భాషా, సాంస్కృతిక, సామాజిక మూలాలు తెలుసుకోవడం కుదరనిపని. అందువల్ల సాధ్యమయినంతవరకు నూతన పదాలను కల్పించాలి.

మొండిగా తెలుగువాడకూడదు. కృతకంగా ఉంటే అన్యదేశ్యాన్నే స్వీకరించాలి. భాషాపరిరక్షణ విధి వ్యక్తాకరణను బాధించేదిగా ఉండకూడదుకదా! ఇది ప్ర«ధాన భాషానియమం. ఉదాహరణకు తమిళులు ప్రాణవాయువును 'పిరాణ వాయు వు' అంటారు. ఇది తద్భవరూపం. అయినా దీనికి 'ఉయిర్‌కాట్రు' అనే ఆచ్ఛిక పద ం కల్పించారు.

ఆంగ్ల పారిభాషిక పదాలకు దీటుగా నూతన పద నిర్మాణం చేయవలసిన అవసరం ప్రధానంగా రెండు విధాలుగా కన్పిస్తుంది. ఒకటి సాంకేతిక తెలుగు భాషా వ్యవహారం. రెండు సాధారణ భాషా వ్యవహారం. సాంకేతిక పదాలను సృష్టించడానికి తత్సమ పదాలనే ఎక్కువగా వాడడం వ్యాప్తిలో ఉంది. ఇలా తయారు చేసిన వాటికంటే ఆంగ్ల పదాలే సులభంగా ఉంటాయనే విమర్శ కూడా ఉంది. శాస్త్రం ఎప్పుడూ బుద్ధిగ్రాహ్యమే. సులభం గా ఉండదు.

అందువల్ల క్లిష్టమైనా తప్పనిసరిగా తెలుగు పదాలనే వాడాలి. ఇవి స్వల్ప సంఖ్యాకులకే అర్థం కావ డం వల్ల ఇబ్బంది లేదు. ఇక సామాన్య జనుల వాగ్వ్యవహారం నుంచి భాషను రక్షించుకోవాలి.

దీని కోసమే పత్రికలు , మీడియా, మేధావులు, రచయితలు కృషి చేయాలి.

నిత్య వ్యవహారంలో బంధువు లపేర్లు, శరీరభాగాల పేర్లు, ఆహారాల పేర్లు , కూరగాయల పేర్లు, పప్పుదినుసుల పేర్లు... ఇలా చెప్పుకొంటూ పోతే నిరక్షరాస్యులు సైతం తెలుగుకు మారు గా ఆంగ్ల పదాలనే వాడుతున్నా రు. 'గ్యాస్ స్టవ్' రావడంతో కుం పటి, పొయ్య గొట్టం పదాలు వాడుకను కోల్పోయాయి. 'గ్యాసు పొయ్యి' పదం స్థిరపడిం ది.

దీనిని 'గాలికుంపటి' అని వ్యవహరించవచ్చు. పనిముట్ల వాడకం తగ్గిపోయింది. ఇళ్ళు, ఆటపాటలు, వైద్యం వంటి వాటిలో వచ్చిన మార్పుల వల్ల తెలుగు పదాల వాడుక కన్పించడం లేదు. 'షాపింగ్ మాల్స్' వచ్చాక అందులోని వస్తువులపై పేర్లుకూడా ఆంగ్లంలోనే ముద్రిస్తున్నారు.

ఈ దెబ్బకి నుడికార పు నాడి దొరకడం లేదు. ఇక భాష సంగతి వేరే చెప్పా లా?! జనవ్యవహారంలో సహజసిద్ధంగా పుట్టే పదాలను వాడుకలోనికి తేవాలి. విశాఖవాసులు 'డ్రెడ్జర్'ను 'తవ్వో డ' అని, సబ్ మెరైన్‌ను 'దొంగోడ' అనీ అంటారు.

ఇవి ఎంత సహజసిద్ధమైన పద కల్పనలో చూడండి. అలాగే లంచం తీసుకోవడం అనే మాటకు తెలుగులో 30కిపైగా నుడికారాలున్నాయి. ఇటువంటి వాటిని వెలుగులోనికి తేవాలి.

పత్రికలు కూడా తెలుగు అనువాదాలు కల ఆంగ్ల పదాలను త్యజించి తెలుగు పదాలనే విధిగా వాడాలి. అసెంబ్లీ-శాసనసభ; కోర్టు-న్యాయస్థానం; ఆర్గానిక్ ఫార్మింగ్- సేంద్రియ వ్యవసాయం; వాటర్ షెడ్స్-వాలుగట్లు; చెక్ డ్యాం-వరదకట్ట మొదలయిన సమానార్థక పద సృష్టిపై తెలుగులో పత్రికలు మొదట బాగా కృషి చేశాయి. కొన్ని మార్గనిర్దేశక సూత్రాలనుకూడా ఏర్పరచుకున్నాయి. అనవసరంగా ఆంగ్ల పదాన్ని వాడకూడదు.

ముఖ్యంగా శీర్షికలలో ఇంగ్లీషు మాటల్ని త్యజించాలి. ఆంగ్ల పదాలకు సమానానార్థకాలను వాడడానికి కొన్ని సూచనలు కూడా పూర్వ పాత్రికేయులు చేశారు.

అవి: ఉన్న మాటలనే పరిమితార్థంలో వాడటం; ఉన్న మాటకు కొత్త అర్థాలు కల్పించటం; కొత్త పదాల సృష్టి; భాషానువాదం; యథానువాదం. అర్థబోధక శక్తి ఉన్న రూపాలు వ్యాకరణ విరుద్ధాలయినా వాడటమే మంచిది. సరళీకర ణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ మొదలయినవి ఇందుకు ఉదాహరణలు.

నూతన పద నిర్మాణం కోసం తమిళులు చేసే కృషి మనకు ఆదర్శం కావాలి. నేటికీ ఆంగ్ల పత్రికలలో వచ్చే పారిభాషిక పదాలకు సమానార్థకాలను కల్పించి ఎప్పటికప్పుడు ఆకాశవాణి ద్వారా ప్రసారం చేస్తున్నారు. అలాగే హిందీ, కన్నడ భాషా పత్రికలు ఇంగ్లీషు భాషా వ్యవహారాన్ని పూర్తిగా తగ్గించాయి. వీరందరూ మనకి ఆదర్శం కావాలి.

బుద్ధికి పదునుపెడితే స్థిరంగా వ్యవహారానికి వచ్చే చక్కని పదాలను ఆంగ్ల పదాలకు మారుగా సృష్టించవచ్చు. కాశీనాథుని నాగేశ్వరరావు నైట్రోజన్‌కు నత్రజ ని, నికెల్‌కు నిఖిలము, ఆక్సిజన్‌కు ప్రాణవాయువు, ఫోటోసింథసిస్‌కు కిరణజన్య సంయోగక్రియ వంటి పదా లు సృష్టించారు.

ఇవి ఎంతగా ప్రసిద్ధి పొందాయో చెప్పనక్కర్లేదు కదా. భాష ఎప్పటికప్పుడు పరిష్కరణలు చేసుకోవడం వల్లనే విస్తృతమౌతుంది. ఆంగ్ల వ్యాప్తికి కారణం కూడా ఇదే. ఈ పరిష్కరణ ప్రక్రియ తెలుగు భాషకు అత్యంతావశ్యకం. పరిశోధనాత్మక అధ్యయనం ద్వారా పరిష్కరణ పదస్థాయిలోనూ, వాక్యస్థాయిలోనూ జరగా లి. నూతన పదనిర్మాణం ద్వారా తెలుగు భాషా వినియోగాన్ని పెంచడానికి ఒక్క ప్రయత్నలోపం తప్ప వేరేమీ కన్పించదు.

నిత్య వ్యవహారంలోనూ తెలుగును విస్మరించకూడదని, విద్యాబోధనలోనూ, అభ్యాసంలోనూ తెలు గు ప్రత్యేక పాఠ్యాంశంగా ఉండాలని, ప్రతి తెలుగు వాడూ భావించాలి. దీనికోసం భాషా సంఘాలు, సాహి తీ సంస్థలు, కవులు, రచయితలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. వివిధ చైతన్య సభల ద్వారా తెలుగు వైభవాన్ని చాటి చెప్పాలి. దీనికి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతగా స్వీకరించాలి. అప్పుడే తెలుగు దివ్వె ప్రతి ఇంటా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.

-అద్దంకి శ్రీనివాస్
(వ్యాసకర్త హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులు)
నేడు తెలుగు భాషాదినోత్సవం

Saturday, August 21, 2010

Telugu Vari Charitra by Daggubati Venkateswara Rao

Download Telugu vari Charitra by Dr. Daggubati Venkateswara Rao here: Telugu Vari Charitra

Thursday, July 29, 2010

An article on Molla Ramayanam -- రాసిన వారు: నిడదవోలు మాలతి


Download Molla Ramayanamu here : Molla Ramayanamu
http://tethulika.wordpress.com

“కుమ్మర మొల్లగా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని కథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనంముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో. మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను గమనించింది -మొల్ల రామాయణంలో 2400 శ్లోకాలు రాసిందని “మానుషి” అన్న ఇంగ్లీషు పత్రికలో చూసినప్పుడు. ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఆతరవాత లలిత, తారూ రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని. అప్పుడే నాకు మొల్లగురించిన ఆసక్తి మొదలయింది. ఇవి చదివినప్పుడు నాకు తోచిన మొదటి ఆలోచన శ్లోకం అన్నది సంస్కృత సాంప్రదాయవిశేషం. మొల్ల సంస్కృతాన్ని వదలి, జానుతెలుగులో రాయపూనుకున్న కవయిత్రి. ఆమె రచనని శ్లోకాలు అనడం ఆమెకి ఒక పాండిత్యస్థాయిని కల్పించడంకోసమేమో అనిపించింది. ఆరుద్ర మొల్ల రామాయణంలో ఉన్నవి 871 గద్యపద్యాలు అనీ, ప్రస్తుతం లభ్యమయిన ప్రతులు సమగ్రమయినవి కాకపోవచ్చు అనీ రాశారు (సమగ్రాంధ్ర సాహిత్యం, సం.2.). నాకు దొరికిన ప్రతిలో పద్యాలూ, వచనం ఒకే వరసలో లెక్కించి, మొత్తం ఆరుకాండలలో 880 ఉన్నట్టు చూపించారు. అందులో వచనంగా గుర్తించిన భాగాలు 208. అవి కొన్ని కేవలం ఒకటి రెండు మాటలు “అట్టి సమయంబున,” “అని మఱియును” లాటివి అయితే, కొన్ని దాదాపు ఒకపేజీ నిడివి ఉన్నాయి. మరో రెండు, మూడు చోట్ల గద్య అని కూడా ఉంది. దీనికి పీఠిక రాసినవారు (పరిష్కర్త కావచ్చు) క.కో.రా. అని ఉంది కానీ ఆయనెవరో నాకు తెలీదు. కోరాడ రామకృష్టయ్యగారేమో. రాసిన
మొల్లనిగురించి తెలిసింది చాలా తక్కువ అని మొదట్లో చెప్పేను. చదువుతున్నకొద్దీ, నాకు అబ్బురం అనిపించిన కొన్ని విషయాలు ముందు ప్రస్తావిస్తాను.
మొదటిది ఆమెపేరు, “కుమ్మర” మొల్లగా ప్రచారం కావడం. నేను చూసినంతవరకూ మరే ఇతర కవిని గానీ కవయిత్రిని గానీ కుల, వృత్తులపేరుమీదుగా ప్రస్తావించినట్టు కనిపించదు. ఆమె తనకు తానై ఎక్కడా తనపేరు “కుమ్మర మొల్ల” అని చెప్పుకోలేదు. మరి ఈ కుమ్మర అన్నపదం ఇంటిపేరుకి మారుగా ప్రాచుర్యంలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు.
పూర్వకవులు తమగ్రంథాదిని కులగోత్రాలు, వంశక్రమం చెప్పుకోడం సాంప్రదాయం. మొల్ల తాను రచించిన రామాయణానికి అవతారికలో “గురులింగజంగమార్చనపరుడు, శివభక్తరతుడు, బాంధవహితుడు” అయిన కేసయసెట్టి తనయనని చెప్పుకుంది. తండ్రినిగురించి రాస్తున్నప్పుడు కూడా కులప్రసక్తి కానీ వృత్తి ప్రసక్తి కానీ లేదు. అంచేత, ఈ కుమ్మర నామవిశేషణం ఆమెపేరుకి ముందు తగిలించడం, పరిష్కర్తలూ, ప్రచురణకర్తలూ చేసిన నిర్ణయంగానే కనిపిస్తోంది తప్ప మొల్ల అభిమతంగా తోచదు.
రెండవ అంశం “మొల్ల” అన్న పేరు ఆధారంగా పండితులు ఆమెవృత్తి లేక కులం నిర్ణయించ పూనుకోడం. ఈవిషయం ఆండ్ర శేషగిరిరావుగారు “ఆంధ్రవిదుషీమణులు” అన్న గ్రంథంలో విపులంగా చర్చించేరు. స్థూలంగా – మొల్లకనుపర్తి వరలక్ష్మమ్మగారు మొల్ల తన రామాయణంలో వేశ్యలగురించి ప్రస్తావించినతీరు చూస్తే, ఆమె వేశ్య కాదని స్పష్టంగా తెలుస్తుంటారు. శేషగిరిరావుగారు కూడా ఆమె కులటాంగన కాదనే నిర్ధారించేరు. మల్లియజాతికి చెందినపువ్వు. పూర్వకాలంలో పువ్వులపేర్లు వేశ్యలు మాత్రమే పెట్టుకునేవారుట. అంచేత ఆమె వేశ్య కావచ్చునని ఒక వాదన. ఈవాదనకి ప్రతిగా
మొల్ల కాలనిర్ణయం చేసినప్పుడు కూడా ఆమె రామాయణంలోని అవతారికే ఆధారమయింది. అందులో ఆమె గౌరవపురస్సరంగా పేర్కొన్న పూర్వకవులు ఆధారంగా ఆమె పదహారవ శతాబ్దం కృష్టదేవరాయలకాలంలో జీవించి ఉండవచ్చునని నిర్ణయించేరు. ఇక్కడ నాకు కలిగిన సందేహం – మొల్ల తన రామాయణంలో పేర్కొన్నకవులు గుర్తుగా వారి జీవితకాలం ఆధారంగా ఆమె కాలనిర్ణయం చేసేరు కానీ ఆమెతరవాత కవులు ఎవరైనా ఆమెని పేర్కొన్నారో లేదో వివరించలేదు. నేను సాహిత్యమంతా తరిచి చూడలేదు కానీ పైన పేర్కొన్న పండితులు పేరెన్నిక గన్నవారే. వారి వ్యాసాలలో ఈ ప్రస్తావన లేదు. శేషగిరిరావుగారు ఏదో ఒక ఉదాహరణ చెప్పేరు కానీ మళ్లీ అది మొల్లగురించి కాదేమోనన్న సందేహం కూడా వెలిబుచ్చారు. మరి మొల్లని ఆమెకాలంలోనూ, ఆ తరవాతా ఎవరైనా ఆమెను రామాయణకర్త్రిగా గుర్తించి ప్రశంసించేరా లేదా, ఈ విషయంలో పరిశోధన ఏమైనా జరిగిందా లేదా అన్నది తెలిసినవారెవరైనా చెప్పాలి.
విద్య మాటకొస్తే, తాను అట్టే చదువుకోలేదని ఆమె వినయంగా చెప్పుకున్నా, ఆమెరచనలో చమత్కారాలూ, పాండిత్యప్రకర్షా, పూర్వకవుల గ్రంథాల్లో భాషగురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు చూస్తే, ఆమె విస్తృతంగా కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నట్టే కనిపిస్తుంది. ఉదాహరణకి, అవతారికలో ఈ పద్యం చూడండి.
దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్
సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రపంధము
లాయా సమాసంబులర్థములును
భావార్థములుఁ గావ్యపరిపాకములు రస
భావచమత్కృతుల్ పలుకుసరవి
బహువర్ణములును విభక్తులు ధాతు లం
లంకృతి చ్ఛంధోవిలక్షణములుఁ
గావ్యసంపదక్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుఁగ విఖ్యాత
గోపవరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి.
పైపద్యంలో వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టాఆవర్జాలు వల్లించడం ఏమీ తెలీనివారికి సాధ్యం కాదు కదా. అంతే కాదు, తాను సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణానికి తెలుగుసేత చేస్తూ, మళ్లీ అందులో సంస్కృత సమాసాలు వాడడం సముచితం కాదంటుంది.
తాను అలా “కావ్యసంపదక్రియల” జోలికి పోనని చెప్పి, పదం చూడగానే పాఠకుడికి అర్థం తోచని భాషలో రాస్తే అది మూగ, చెవిటివారు ముచ్చటలాడినట్టే ఉంటుందంటూ హాస్యమాడుతుంది..
తేనె సోఁక నోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగచెవిటివారి ముచ్చట యగును.
నాలుకకి తేనె తగలగానే నోరు తీయన అయినట్టే పదానికి అర్థం చదువుతుండగానే పాఠకుడికి స్ఫురించాలి అని ఆమె అభిమతం!
తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాటివి ఉన్నాయి. సాయంశోభని వివరిస్తూ చెప్పినపద్యాలలో మచ్చుకి ఒకటి -

మేలిమి సంధ్యారాగము
వ్రాలిన చీకటియు గఁలిసి వరుణునివంకన్
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టే నట నభోమణి తలగన్.
సాయంకాలపు నీరెండ, కమ్ముతున్న చీకటులతో కలిసి నీలాలూ, కెంపులూ అతికినట్టున్నాయిట ఆకాశంలో.
పాఠకులమనసుని అలరించే చమత్కారాలూ (కందువలు) సామెతలూ కూర్చి అందంగా చెప్తే వీనులవిందుగా ఉంటుంది అంటుంది మొల్ల.
కందువమాటలు సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెలుఁగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధులమదికిన్.

ఆండ్ర శేషగిరిరావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మవంటి అనేక ప్రముఖులు మొల్ల తన రామాయణాన్ని జానుతెనుగులో, సులభశైలిలో సకలజనులకూ అర్థమయేరీతిలో రాసింది అని మెచ్చుకున్నారు. మొల్ల కూడా అలాగే తన రామాయణం “మూగ చెవిటి ముచ్చట” కాకుండా ఉండేలా రాయదల్చుకున్నట్టు చెప్పుకుంది. ఆమెరచనలో చవులుఁ బుట్టు జాతీయాలు కోకొల్లలుగానే ఉన్నా, సంస్కృత సమాసాలు, ముఖ్యంగా యుద్ధవర్ణనలో, నాయకీ, నాయకుల వర్ణనలలో క్లిష్ట భూయిష్టమయిన సంస్కృతసమాసాలు చాలానే కనిపించేయి. నేను చాలాచోట్ల తడుముకోవలసివచ్చింది అర్థంకోసం. “జాను తెనుగు,” “వాడుకభాష” లాటి పదాలకి ఆనాడు ఉన్న అర్థాలు ఈనాడు అన్వయించుకోలేం అనుకోవాలి.
మూలరామాయణంలో లేని కొన్ని సన్నివేశాలు మొల్ల స్వతంత్రించి ఇతర రామాయణాలనుండి స్వీకరించడం జరిగింది. అయోధ్యకాండలో రాముడు స్వర్ణనది దాటేముందు గుహుడు ఆయనపాదాలు కడగడం వాటిలో ఒకటి.
సుడిగొని రాముపాదములు సోఁకి ధూళివహించి ఱాయెయే
యేర్పడ నొక కాంతనయ్యెనఁట పన్నుగనీతని పాదరేణువి
య్యడవడి నోడసోఁకనిదియేమగునో యని సంశయాత్ముఁడై
కడిగెగుహుండు రాముపదకంజయుగంబు భయమ్ముపెంపునన్.

ఈ సన్నివేశం వాల్మీకిరామాయణంలో లేదు కానీ అధ్యాత్మరామాయణంలో ఉందని ఆరుద్ర అంటున్నారు. అలాగే మరో సన్నివేశం – పరశురాముడు రాముడిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వడం కూడా వ్యాస రామాయణంలో లేదనీ, భాస్కరరామాయణంనుండి తీసుకున్నదనీ అంటున్నారాయన. వీటివల్ల మొల్ల విస్తృతంగా తెలుగు, సంస్కృతగ్రంథాలు చదివిందనే అనుకోవాలి. ఈ గుహుడికథ చిన్నప్పడు నాలుగోక్లాసు, ఐదోక్లాసు వాచకాల్లో ఉండేది. ఈ కథ అంత ప్రాచుర్యం పొందడానికి మొల్ల రామాయణమే కారణం కావచ్చు.
*******************************************************
నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.

    మదనాగయూధసమగ్రదేశము గాని
    కుటిలవర్తనశేషకులము గాదు.
    ఆహవోర్వీజయహరినివాసము గాని
    కీశసముత్కరాంకితము గాదు
    సుందరస్యందనమందిరంబగు గాని
    సంతతమంజులాశ్రయము గాదు
    మోహనగణికాసమూహగేయము గాని
    యూధికానికరసంయుతము గాదు
    సరససత్పుణ్యజననివాసము గాని
    కఠిననిర్దయదైత్యసంఘము గాదు
    కాదు కాదని కొనియాడఁ దగినట్టి
    పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.

“కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం చూడగలం. ముందు చెప్పేను ఆమె కవిత్వంలో సంస్కృతసమాసాలు విశేషంగా ఉన్నాయని. అది కూడా పైపద్యంలో గమనించవచ్చు.

అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం -
ఏమృగంబును గన్నఁ నేణాక్షి గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
ఏపక్షిఁ గనుగొన్న నెలనాగ గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
… … …
సీత గానఁబడమి శ్రీరామచంద్రుండు
విరహతాపవహ్ని వేఁగి వేఁగి
అంటూ సీతకోసం ఆయన అనుభవించిన వేదనని పాఠకులమనసుకి గట్టిగా తగిలేలా చెప్తుంది మొల్ల. ఈ ప్రయోగం యుద్ధకాండలో నిశేషించి ఇతోధికంగా భావసమన్వితమవుతుంది. మూడు ఆశ్వాసాలలో ఆమె చేసిన యుద్ధవర్ణన చదువుతుంటే స్వయంగా యుద్ధం చూసైనా ఉండాలి, లేదా యుద్ధానికి సంబంధించిన గ్రంథాలు విశేషంగా చదివి అయినా ఉండాలి అనిపించకమానదు.

మొల్ల పదాలు వాడుకోడంలో పొదుపరి, ఆమెకి ఆమెయే సాటి అంటూ మలయవాసిని, ఆరుద్ర సుందరకాండలో రామలక్ష్మణులని వర్ణించమని సీత హనుమంతుని అడిగిన సందర్భం ఉదహరిస్తున్నారు. హనుమంతుడు నిజంగా రాముని పంపున వచ్చినవాడవునో, ఇది కూడా రాక్షసమాయేనేమో నన్న సందేహంతో సీత వారిని వర్ణించమంటుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు.
సీ. నీలమేఘచ్ఛాయఁ బోలు దేహము వాఁడు
ధవళాబ్దపత్రనేత్రములవాఁడు
కంబుసన్నిభమైన కంఠంబు గలవాఁడు
బాగైనయట్టి గుల్భములవాఁడు
…. … ….
అని రాముని వర్ణించి, లక్ష్మణుని,
ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాఁడు.
అంటాడు. లక్ష్మణుడిని గురించి మళ్లీ వేరే చెప్పక్కర్లేదు. ఆయనకి కూడా ఈవర్ణనంతా సరిపోతుంది, రంగు మాత్రమే వేరు అని. పైన చెప్పినట్టు ఈపద్యం కూడా నేను చిన్నప్పుడే విన్నాను కానీ ఇది మొల్లవిరచితమని ఇప్పుడే తెలిసింది!

పూర్వకవులు మొల్ల పాండిత్యాన్ని స్పృశించినట్టు కనిపించదు కానీ ఆధునికకాలంలో పండితులు కొందరైనా ఆమె కవిత్వాన్ని తమ వ్యాసాల్లో చర్చించారు.

దివాకర్ల వెంకటావధానిగారు, “తానంత విద్యాసంపన్నురాలు కాదని చెప్పుకొన్నా ఈమె కావ్యమున పాండిత్యలోపమెచ్చటను కానిపింపదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచిములయి మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేతనగరవర్ణనము శ్లేష శబ్దాలంకారపూరితమై ఆమె పాండితీవిశేషమును పలు విధముల సూచించుచున్నది” అంటారు. “ఈమె శైలిని మృదుమధురపద గుంఫితమును, భావబంధురమునై సర్వజనరంజకముగా నుండును”, “ఔచిత్యపోషణలో కూడా అందె వేసిన చేయి” అని కూడా ప్రశంసించారు. (ఆంధ్ర వాఙ్మయచరిత్ర, పు 59-50).

అయితే ఈ ఔచిత్యపోషణవిషయంలో ఆండ్ర శేషగిరిరావుగారి అభిప్రాయం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఆమె స్త్రీవర్ణనలోనే కాక ఇతర సందర్భాలలో కూడా స్త్రీల శరీరభాగాలు ఉపమించడంలో “పూర్వకవి సాంప్రదాయాన్ని పాటించుట విశేషము” అంటారు. శేషగిరిరావుగారు ఈవిషయాన్ని మూడు పేజీలనిడివిలో చర్చించడం నాకు విశేషంగా అనిపించింది!

నేను ఈవ్యాసం రాయడానికి ఉపక్రమించిన తరవాత, మొల్ల సినిమాగా కూడా వచ్చిందని సౌమ్య చెప్పింది. ఈసినిమా వచ్చేవేళకి అంటే 1970లో నేను ఇండియాలోనే ఉన్నాను. అప్పట్లో సినిమాలు బాగానే చూసేదాన్ని కూడా. అయినా ఎంచేతో ఇది మాత్రం నాదృష్టికి రాలేదు. ఇప్పుడు లైబ్రరీలో పుస్తకాలు చూస్తుంటే ఇంటూరి వెంకటేశ్వరరావు మొల్ల జీవితం ఆధారంగా రాసిన నవల, ఆ నవల ఆధారంగా సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ కనిపించేయి. ఈ నవలవిషయంలో మహానటుడు చిత్తూరు నాగయ్య కథాగమనంవిషయంలో వెంకటేశ్వరరావుతో విబేధించేరని ఇద్దరూ తమ ముందుమాటలలో చెప్పుకున్నారు. ఆ అభిప్రాయబేధాలు ప్రత్యేకించి ఏవిషయంలోనో తెలీదు గానీ నాకు అభ్యంతరకరంగా అనిపించిన విషయాలు ప్రస్తావిస్తాను.

ప్రాక్తనకవులగురించి చదువుతున్నప్పుడు సహజంగానే ఆ కాలంలో ఆచారవ్యవహారాలగురించి కూడా తెలుసుకోగలుగుతాం అన్న ఆశ ఉంటుంది మనకి. సుప్రసిద్ధ కవులజీవితాలకీ, ఆనాటి సాంఘికపరిస్థితులకీ అవినాభావసంబంధం ఉంటుంది. మనఅవగాహన కూడా పరస్పరానుబంధంగానే ఉంటుంది. అంటే ఒకటి తెలిస్తే, రెండోది మరింత విపులంగా తెలుస్తుంది. అంచేతే ఏదో ఒక ఎజెండా పెట్టుకుని రచయితలు తమ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేస్తే, అది సాహిత్యానికి ద్రోహమే అవుతుంది. రచయితలో నిజాయితీ లోపించినట్టే అనిపిస్తుంది.

పలువురి ప్రశంసలు పొందిన ఒక సుప్రసిద్ధ కవయిత్రిని తీసుకుని నవల రాస్తున్నప్పుడు ఆ గౌరవం అలా నిలబెట్టేదిగా ఉండాలి రచన. అంతేకానీ తమ రాజకీయసిద్ధాంతాలు ప్రచారం చేసుకోడానికి ఆ పాత్రని తమ ఇష్టంవచ్చినట్టు మలచడం ఆపాత్రని అగౌరవపరచడమే అని నా అభిప్రాయం..

ఈనవలలో రచయిత మొల్ల చిన్నతనంలో అనాగరీకంగా, విసృంఖలంగా ప్రవర్తించినట్టు చిత్రించారు. ఆనాటి సాంఘికదురన్యాయాలు దుయ్యబట్టడం మొల్లద్వారా జరిగినట్టు చూపించడంకోసం అలా చిత్రించడం జరిగినట్టుంది. నిజానికి ఆనాటి సాంఘిక దురన్యాయాలు నిరసించడానికి మొల్ల వ్యక్తిత్వాన్ని వక్రీకరించనవసరం లేదనే నా అభిప్రాయం. సమర్థుడయిన రచయిత ప్రచారంలో ఉన్న వ్యక్తిత్వాలని యథాతథంగా వాడుకుంటూనే, కథని నడిపించగలడు. గలగాలి. అంతటి బలమైన మరొక పాత్రని సృష్టించలేక, మొల్లని వాడుకున్నట్టు అనిపించింది నాకు ఈనవల చదువుతుంటే. నాదృష్టిలో ఇది నవలారచనలో లోపమే.

రెండో అభ్యంతరం – అలా మొల్ల పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తుండగా, ఒక దేవదాసి ఉద్బోధనతో జ్ఞానోదయమై, అడవులకు పోతుంది. అక్కడ ఒక సుందరాకారుడు కనిపించి మొల్లకి “ఆడదాని”లా ప్రవర్తించడం, సిగ్గు పడడంతో సహా, నేర్పి ఆమెని “నిజమైన ఆడదాన్ని” చేస్తాడు. ఇది కూడా నాకు అసంబద్ధంగానే అనిపించింది.

ఆమె రచించిన రామాయణంలో అవతారికలోనూ, చివర మంగళాశాసనంలోనూ కూడా తాను శ్రీగౌరీశవరప్రసాద లబ్ధననీ, గురుజంగమార్చనవినోద, సూరిజనవినుత, నిత్యశైవాచార సంపన్న, కవితాచమత్కారి అయిన ఆతుకూరి కేసనసెట్టి తనయననీ, మొల్ల నామధేయననీ చెప్పుకుంది. మహాభక్తుడూ, కవీ అయిన కేసనసెట్టి ఇంట పెరిగిన మొల్లని అదుపాజ్ఞలు లేక దుడుకుగా ప్రవర్తించిన అనాగరీకురాలుగా ఊహించడం సమర్థనీయంగా తోచడంలేదు నాకు. అంతేగాదు. ఆమె రచించిన గ్రంథంలో ఎనలేని పాండితీగరిమ ప్రదర్శించింది. అంతటి పాండిత్యం శ్రద్ధగా నిష్ఠతో ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప రాదు. పరమ నిష్ఠాగరిష్ఠుడయిన తంఢ్రి శిక్షణలో ఆమె విద్యావతిగానే పెరిగినట్టు కనిపిస్తోంది.

సినిమావిషయం నాస్నేహితురాలు వైదేహికి చెప్తే, తను ఇంటర్నెట్‌లో ఉందని నాకు లింకు పంపింది. సినిమాగా బాగుంది. బహుశా మొల్ల పేరు పెట్టకుండా మరో బలమైన స్త్రీపాత్రని సృష్టించి తీసినా ఆ సినిమాకి లోపమేమీ ఉండేది కాదేమో.

మొల్ల రామాయణం పండితులనీ పామరులనీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. కారణం ఆమె పాండిత్యమే కానీ ఆమె కుమ్మరి వంశజురాలు కావడం కాదు. ఆమెచుట్టూ అల్లినకథలు ఆ కావ్యాన్నే ఆధారం చేసుకుని, ఆ గౌరవాన్ని ఇనుమడించేలా చేయడమే సమంజసం.

మొల్లకి పూర్వం చాలామంది మగకవులు రామాయణాలు రాశారు కానీ మొల్ల రామాయణం మాత్రమే కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచింది అన్నారు ఆరుద్ర సమగాంధ్ర. సాహిత్యం, 2వ సంపుటంలో. ఈ ఒక్కవాక్యం చాలు మొల్ల కవితాప్రౌఢిమ ఎంతటి పటిష్ఠమైనదో ఘనతరమైనదో చెప్పడానికి. ఈ రామాయణం అంతర్జాలంలో లభ్యం. పాఠకులసౌకర్యార్థం పిడియఫ్ ఫైలు ఇక్కడ

Wednesday, July 7, 2010

ఆముక్తమాల్యద Amukta Malyada by Sri Krishna Deva Rayalu


Download Amukta Malyada here: Amukta Malyada


సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలు లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది.


 ప్రారంభం

ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవేంకటేశ్వరుని స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు 'శ్రీ' శబ్దం తో కావ్యామారంభించినాడు.

    శ్రీ కమనీయ హారమణి
    జెన్నుగ దానును, గౌస్తుభంబునం
    దాకమలావధూటియును
    దారత దోప పరస్పరాత్మలం
    దాకలితంబు లైన తమ
    యాకృతు లచ్ఛత బైకి దోపన
    స్తోకత నందు దోచె నన
    శోభిలు వేంకట భర్త గొల్చెదన్.

సాధారణంగా శార్దూల విక్రీడములతో కావ్యములు ప్రారంభించుట పరిపాటియై యుండగా, ఈ కావ్యము ఉత్పలమాలతో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, రంగనాయకుల పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.

శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన

కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవేంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు.విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగు పరచి శ్రీవేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించినాడు. రాయలు తరువాతి పద్యములలో చాల భాగము తిరుమల నంతయు సాక్షాత్కరింపజేసినాడు.

తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:

    పూని ముకుందునాజ్ఞగనుబొమ్మనె
    కాంచి యజాండభాండముల్
    వానను మీద బోవ నడు
    వ న్గొనెదన్నననగ్రనిశ్చల
    త్వానుచలత్వనిష్ఠలె స
    మస్తజగంబుల జాడ్యచేతనల్
    గా నుతి కెక్కు సైన్యపతి
    కాంచనవేత్రము నాశ్రయించెదన్.

హరి పాంచజన్యమును పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడ ఒనగూర్చునని రాయల శుభాసంసన.

    హరిపూరింప దదాస్య మారుత సుగం
    ధాకృష్ణమై నాభిపం
    కరుహక్రోడమిళిందబృంద మెదు రె
    క్కందుష్క్రి యాపంక సం
    కరదైత్యాసు పరంపరం గముచు రే
    ఖం బొల్చురాకానిశా
    కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం
    గళ్యాణసాకల్యమున్.

శంఖు చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖువు గదలను వర్ణించినాడు. శ్రీవారి నందక ఖడ్గం పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:

    ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ
    భాస్వత్త్సరు స్తంభ సం
    స్థితి దీండ్రించెడుజాళువా మొసలివా
    దీప్తార్చిగా గజ్జలా
    న్వితధూమాసితరేఖ పైయలు
    గుగా విజ్ఞానదీపాంకురా
    కృతి నందం బగు నందకం బఘలతా
    శ్రేణిచ్ఛిదం జేయుతన్.


శ్రీ వైష్ణవ మతాచార్యులైన పన్నిద్దరాళ్వారులను రాయలు ఇలా కీర్తించాడు:

    అలపన్నిద్దఱు సురులందును సము
    ద్యల్లీలగా పన్నవె
    గ్గల ప్రందాపము బాపునా నిజమనః
    కంజాతసంజాతపు
    ష్కలమాధ్వీకఝరి న్మురారి నొగియం
    గా జొక్కి ధన్యాత్ములౌ
    నిలపన్నిద్దఱుసూరులందల తు
    మోక్షేచ్ఛామతిందివ్య్రులన్.

రాయలు ఆముక్తమాల్యదను శ్రీకాకుళాంధ్రదేవుని ఆనతిమీద శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. అనేక ప్రబంధ రాజములను కృతిభర్తగా శ్రీకృష్ణదేవరాయలు లోకైకనాధుడు శ్రీవేంకటేశ్వరునికి ఈ క్రింది విధంగా ఆముక్తమాల్యదను సమర్పించాడు:

    అంభోధికన్యకాకుచ
    కుంభోంభితఘసృణమసృణ గురువక్షునకున్
    జంభారిముఖాధ్యక్షున
    కంభోజాక్షునకు సామిహర్యక్షునకున్.

Tuesday, July 6, 2010

శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది పట్టాభిషేక ఉత్సవాలు

‘తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
ఎల్లనృపులు గొలువనెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స..!’
(You may ask why I instruct you to compose particularly in Telugu (because you are very adept in Samskritam, you may think writing in Telugu is not so great) - I tell you - this is Telugu land, and I am the Telugu Lord, and then Telugu is the only one (without comparison). Haven't you been speaking multiple languages, as you are worshipped by kings from all over - you should know that Telugu is the greatest among all languages! )

                        
ఈ సువర్ణాక్షరాలు కన్నడ రాజ్యరమారమణుడైన శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా తన ఆముక్తమాల్యద ప్రబంధంలో చెప్పిన పద్యమిది. దేశభాషలన్నింటిలోనూ తెలుగుకున్న ప్రత్యేక ఘనత ప్రకాశితమైనది. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిరోహించి 500 సంత్సరాలు పూర్తయ్యాయి.
తెలుగు భాషకు, జాతికీ గౌరవాన్ని తీసుకొచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ప్రాతఃస్మ రణీయుడు. విజయనగర సామ్రాజ్య వైభవం అనంతపురం జిల్లాలో కూడా విస్తరించి ఉంది. అందుకే ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఉత్సవ కార్యక్ర మాన్ని నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈనెల 27 నుం చి 29వరకూ కర్నాటక ప్రభుత్వం కూడా హంపి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. నేటి చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గరలోని దేవకీపురంలో నాగ లాంబ, నరసనాయక దంపతులకు 1471 జనవరిలో శ్రీకృష్ణదేవరాయలు జన్మించి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. నాడు శ్రీరంగపట్టణ గవర్నరుగా ఉన్న వీరప్పగౌడ కుమార్తె తిరుమలదేవితో 1498లో వివాహం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు నాగలాదేవిని వివాహమాడి ఆమె పేరును చిన్నాదేవి గా మార్చాడు. ఆ తర్వాత 1510లో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆయన పట్టాభిషేక మహోత్సవానికి ఇప్పటికి 500 సంవ త్సరాలైయ్యాయి.


కళాపోషకులు...
కవులను కళాకారులను ఆదరించడం కృష్ణదేవరాయల నిత్య కృత్యం. విజయ నగర రాజుల మొదటి రాజధాని హంపి. ఆ తర్వాత శ్రీకృష్ణదేవ రాయల కాలం లో అంతర్గత కలహాల అనంతరం తన ప్రధాన పరిపాలనా కేం ద్రం పెనుకొండ అయ్యింది. ఆనాడు పెనుకొండలో విడిది కేంద్రంగా శతృదుర్బేధ్యంగా ఒక కోట నిర్మించుకున్నారు. ఆ కోటలోనే మందుగుండు సామగ్రి, ఫిరంగులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన మంత్రి, గురువు అయిన అప్పాజీని ఖైదు చేసింది కూడా ఇక్కడే. అప్పాజీ మరణానంత రం ఇక్కడే ఆయన సమాధికూడా ఇక్కడే వుంది.అప్పాజీ మరణానంతరం శ్రీకృష్ణ దేవరాయలు కుంగిపోయి రాజ్యభారాన్ని నాడు చంద్రగిరిని పాలిస్తోన్న తన సోదరుడైన అచ్యు తరాయలుకు కట్టబెట్టాడు. తదనంతరం 1542లో అధికారం రామరా యలు చేతికి వచ్చింది.


సన్నాహాలు చేస్తోంది...
శ్రీకృష్ణదేవరాయల పాలనలో హంపి వైభవాన్ని కవులు కళ్లకు కట్టినట్లు తెలిపా రు. 1565లో తళ్లికోట యుద్ధం జరిగింది. ఆ యుద్ధం శ్రీకృష్ణదేవరాయల అల్లుడు రామరాయలకూ, బహమనీ సుల్తానుల మధ్య ఘోర యుద్ధం జరిగిం ది. ఆయుద్ధంలో బహమనీ సుల్తానుల దాడికి ఆగలేక రామరాయలు పట్టుపడ్డాడు. తదనంతరం బహమనీ సుల్తానులు రామరాయల తల నరి కి విజయనగర సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నారు. ఒకనాడు హంపి వీధుల్లో వజ్రాలు, రత్నాలను రాసులుపోసి అమ్మేవారని చరిత్రకారుల వలన తెలుస్తోంది. అలాంటి ఉన్నతమైన విజయనగర సామ్రాజ్యం తళ్లికోట యుద్ధంతో పతనమైం ది. ఒక అద్వితీయ ప్రతిభావంతుడు, సాహిత్య సమరాంగణ సార్వభౌముడు, కళాపోషకుడు, కళారాధకుడు, సంస్కృతాంధ్ర కన్నడభాషల్లో కవి అయిన శ్రీకృష్ణదేవరాయలను స్మరించు కుంటూ ఈ నెలలో అటు కర్నాటక రాష్ట్రంలో నూ, ఇటు మన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్సవాలను ఇరు ప్రభుత్వాలూ నిర్వహిం చడానికి సన్నాహాలు చేస్తున్నాయి.


హంపి... 
ఆనాటి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ నగర వీధుల్లో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట! రాజులుపోయారు... రాజ్యాలూపోయా యి... నేడు ఆ అద్భుతమైన హంపి నగరం చారిత్రక కథలు చెప్పే శిధిల నగరం. తరువాత కాలగర్భంలో కలిసిపో యింది. పురాతత్వవేత్తలు తరువాత కాలంలో తవ్వకాల్లో అనేక కట్టడాలూ, దేవాలయాలూ బయల్పడ్డా యి. ఆ హంపి పరిసర ప్రాంతాల్లో తుంగభద్రా నది ప్రవహి స్తుండటంతో ప్రకృతి అందాలు రమణీయతను విరజిమ్ముతాయి. పచ్చని చెట్లు, పొలాల మధ్య వెలసిన హంపి క్షేత్ర దర్శనం మహా భాగ్యమని పర్యాటకుల అభిప్రాయం.


కొనియాడుతూనే ఉన్నారు...
హంపిలో వెలిసిన శివుని పేరు విరూపాక్షేశ్వరుడు. ఇక్కడ హంపిలో విరూపాక్ష దేవాలయం, రాతిర థం, ఉగ్ర నరసింహ, శివలింగ, గణేశ విగ్రహాలు, రాణి స్నానగృహం, కమలమహాల్‌, గజశాల, హజ రారామదేవాలయం, అనెగుంది కోట, మాతంగ పర్వతం, కోదండరామ ఆలయం, యంత్రోద్ధారక హనుమంతుడు, హేమకూటము, కడ్లెకాళు గణప తి, శ్రీకృష్ణ దేవాలయం, బడవలింగ ఆలయం, వీర భద్ర దేవాలయం, అక్కాచెల్లెళ్ల రాయి, పాతాళే శ్వర ఆలయం, దండనాయకుని కోట, మహానవమి దిబ్బ, నల్లరాతి కళ్యాణి, కమలాపురంలో ప్రాచ్య వస్తు సంగ్రహాల యం, మల్లప్పగుడి, అనంత శయ న గుడి, పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటు న్నాయి. హంపి గత వైభవాన్ని పర్యాటకులు, రచ యితలు తమ రచనల్లో నాటి నుంచి నేటి వరకూ కొనియాడుతూనే ఉన్నారు.


హంపి శిల్పకళా సౌంద ర్యం జీవితంలో ఎన్నడూ చూడలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది రోమ్‌ నగర మంత విశాలమైనదని, ప్ర పంచంలో అద్భుతమైన సదుపాయాలు కలిగి ఉన్న నగరంగా హంపిని విదేశీ పర్యాటకులు కూడా వర్ణించారు. హంపి ప్రాముఖ్యత చాటి చెప్పేందుకు ఆలస్యంగానైనా గుర్తించిన ప్రభుత్వం 1987లో మొదటిసా రిగా హంపి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఏటా హంపి ఉత్స వాల ను తిలకించేందుకు లక్షలాదిమంది ప్రజలు, పర్యాటకులు హంపికి చేరుకుంటా రు. అక్కడ పగటిపూటను తలపించే విధంగా రాత్రి వేళల్లో విద్యుత్‌ దీపాలు దేదీ ప్యమానంగా వెలుగుతుంటాయి. ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రజలు మంత్రముగ్ధులై తిలకి స్తూ పండుగ వాతావరణంలో గడపడం విశేషం. ఆ విశేషం ఈ నెల 27 నుండి 29 వరకు జరగనుంది.


-దామర్ల విజయలక్ష్మి,