Tuesday, June 29, 2010

Chivaraku Migiledi by Butchi BabuDownload Chivaraku Migiledi here: Chivaraku Migiledi

చివరకు మిగిలేది బుచ్చిబాబు గారి నవలల్లో అత్యంత ప్రసిద్దినొందిన పుస్తకం.
తెలుగు నవలాచరిత్రలో ప్రముఖ సాహితీవేత్తలు శాశ్వత స్థానం గలదిగా గుర్తించిన నవల బుచ్చిబాబు గారి "చివరకు మిగిలేది". దీన్లో కధ స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో సాగుతుంది. ముఖ్యంగా నవల కధానాయకుడైన ధయానిధి జీవితానికి సంభందించిన అనేక మార్పులు, అతనికి తారసపడిన అనేకానేకుల మనస్తత్వాలను విశ్లేషించుకొంటూ రచయిత ధయానిధి పాత్రను నడిపిస్తుంటాడు.

The Novel Chivaraku Migiledi is Butchibabu's most famous work. The protagonist's quest involves him in a conflict with society and results in an agonizing reappraisal of life's values and finally leads him to self knowledge, acceptance and peace.

Chivaraku Migiledi was serialized in the Telugu magazine Navodaya between 1946-47. It was published in book form in 1952. Chivaraku Migiledi published by Adarsha Grandha Mandali in 1957 became a best seller. The book is now published by Visalaandhra Publishing House, Hyderabad.

Katyayani Vidmahe did extensive research on the novel in Chivaraku Migiledi - Manasika Samajika Jeevana Sravanti Navala Vimarsa (Kakateeya University, Warangal, India) and was awarded a doctorate (PhD) for it. The Novel has been translated into English by Kakani Chakrapani in Four Classics of Telugu Fiction (Dravidian University, Kuppam, India)

This novel is made into Telugu film by Gutha Ramineedu in 1960.Savitri acted as Padma got National Film Award for Best Actress. It is a debut film for M. Prabhakar Reddy.
Monday, June 28, 2010

తెలుగు భాషలో నవలా ప్రక్రియ -- Novel in Telugu Literature ( ప్రొపెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌ - 7/6/2010 ఆంధ్రప్రభ లో వచ్చిన వ్యాసం )తెలుగు భాషలో నవలా ప్రక్రియ మొదలై నూరు సంవత్సరాలు దాటింది. నవల అనే సాహిత్య ప్రక్రియను మనం పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్నాం. నవల్లో మన తెలుగు నవలా రచయితలపై పాశ్చాత్య రచయితల ప్రభావంతో పాటు వంగ, మహారాష్ట్ర, కన్నడ, ఉర్దూ రచయితల ప్రభావం ఎంతగానో ఉంది. నేడు తెలుగు సాహిత్యంలో ప్రజల గౌరవాదరణలను పొందుతున్న ఏకైక సాహితీ ప్రక్రియ నవల అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
తెలుగునాట నవలా సాహిత్య ప్రక్రియకు నవయుగాంధ్ర సాహిత్య నిర్మాత గద్యతిక్కన బిరుదాంకితుడైన కందుకూరి వీరేశలింగం పంతులు గారు మూల పురుషుడు. ఆయన 1878 లో వ్రాసిన రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవలగా ప్రసిద్ధికెక్కింది. ఇది సాంఘిక నవల. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర అయితే తొలి చారిత్రక నవల చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి హేమలత. ఇది 1896 వ సంవత్సరంలో వ్రాయబడింది. హేమలత కథ మేవారు రాణా లక్ష్మణ సింగు కాలంలో జరిగినట్టు తెలుస్తుంది. ఈయన చిత్తూరుకు మహారాజు. చిన్న తనంలోనే తండ్రిపోవడంతో అతని పినతండ్రి భీమసింగురాజు అతనికి అండగా నిలిచి రాజ్యపాలన చేస్తాడు. ఇది హేమలత నవలకు ఇతివృత్తం. ఇందులో మొగలాయి రాజ్యంలో జరిగిన అత్యాచారాలను చిలకమర్తి వారు వర్ణించారు. ఢిల్లీ చక్రవర్తి అల్లాయొద్దీన్‌ వీరి రాజ్యంపై దండెత్తుతాడు. ఇందులో కథానాయిక హేమలత 1301 వ సంవత్సరంలో ఈ కథ జరిగినట్లు తెలుస్తున్నది. శ్రీవేరేశలింగం ఏర్పరచిన 'చింతామణి' పత్రిక పోటీలలో అనేక బహుమతలు పొంది ఎన్నో నవలలు వ్రాసిన చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు ఇంకా అహల్యాబాయి, కర్పూరమంజరి, మణిమంజరి, కృష్ణవేణి, సువర్ణ గుప్తుడు, శాపము మొదలైన చారిత్రక నవలలదో విశిష్ట స్థానం. అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సాంఘిక నవలలు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వవచ్చు. కాని వాటివల్ల ప్రయోజనం తక్కువ. మనకు స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు కావస్తుంది. మనం భౌతికంగా స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం. కాని మానసికంగా జాతి ఇంకా పరాధీన స్థితిలోనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో జాతికి కావలసింది ఆనందం కాదు. జాతికి స్ఫూర్తినివ్వాలి. అలాంటి ఇతివృత్తాన్ని రచయిత సృష్టించడు. చరిత్రలో జరిగిన సంఘటనలను తీసుకొని పాఠకులకు అర్థమయ్యే విధంగా అందంగా వర్ణన చేస్తాడు. దీని వల్ల పాఠకులకు ఆనందంతో పాటు చరిత్రలో జరిగిన సంఘటనలు తెలుస్తాయి.
చారిత్రక నవలలు రెండు రకాలుగా ఉంటాయి. అవి 1. చరిత్రలో వాస్తవ కథను తీసుకొని వ్రాసినవి ఒక రకం. కొంత వాస్తవాన్ని తీసుకొని దానిపై కల్పనలతో రచించినవి ఇంకో రకం. మొత్తం మీద చారిత్రక నవల అంటే పూర్తి అభూత కల్పనలను అని కాకుండా వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే కల్పనలన్న మాట.
కీ||శె|| కొమర్రాజు వెంకట లక్షణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి తెలుగులో చారిత్రక నవలా రచనలను బాగా ప్రోత్సహించింది. ఇంకా ఆంధ్ర ప్రచారిణి, సరస్వతి, వేగుచుక్క గ్రంధమాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రచురణ సంస్థలు విద్యాలయాలు చారిత్రక నవలలను విరివిగా ముద్రించి పాఠకుల్లో పఠనాశక్తినీ, పఠనాసక్తినీ ఇనుమడింప జేశాయి.


చారిత్రక నవలలవు వస్తువు రీత్యా పలురకాలుగా విభజింపవచ్చు. భారతదేశ చరిత్రను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు, ఆంధ్రుల చరిత్రను ఇతివృత్తంగా చేసుకొని వచ్చిన నవలలు కవులను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు మత ప్రవర్తలను ఆధారంగా చేసుకొని వచ్చిన నవలలు, ఇలా పలు రకాలుగా విభజించవచ్చు.
1. భారత చరిత్రను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు. భారతదేశ చరిత్రలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని మన తెలుగు రచయితలు ఎన్నో నవలలు రాశారు. మరెన్నింటినో ఇతర భాషల నుంచి అనువదించారు. 'చంఘీజ్‌ఖాన్‌' అనే చారిత్రక నవలను శ్రీ తెన్నేటి సూరి వ్రాశాడు. ఇది మొదట ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితమైంది.
13 శతాబ్దాల మధ్యగల ఆసియా ఖండ చరిత్రలో గర్వకారకుడైన మహాపురుషుడు చంఘీజ్‌ఖాన్‌ విదేశీ చరిత్రకారులు అతనిని ఒక సైతానుగా, అధికార దుర్మదాంధుడుగాను నియంతగాను నరరూపు రాక్షసునిగాను చిత్రించారు. శ్రీ తెన్నేటి సూరి ఎన్నో శ్రమల కోర్చి యదార్థ చరిత్రను వెలికితీసి, ప్రాచ్య, పాశ్చాత్య గ్రంథాలను అపోశనపట్టి ఎంతో దక్షతతో ఈ నవలను తీర్చిదిద్దారు. ఆయనకు గల పరిపాలనా దక్షతను, శక్తి సామర్థ్యాలను, తనకింది అధికారుల పట్ల చూపిన ప్రేమాదరాలను చక్కగా వివరించారు.
వంగ భాషలో శ్రీ ధీరేంద్రనాథ్‌పాల్‌ వ్రాసిన నవలను శ్రీ మొసలి కంటి సంజీవరావు మొగలాయి దర్బారు పేరున నాలుగు భాగాలలో తెలుగులోకి అనువదించారు. ఈ నవలలో మొగలాయి రాజ్యంలోని నిరంకుశ విధానం, భోగలాలసత స్వార్థపర్వతం కన్నులకు కట్టినట్లు వర్ణించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ వ్రాసిన 'జయ¸°ధేయ' అనే నవలను శ్రీ ఆలూరి భుజంగరావు ఆంధ్రీకరించాడు. ఇందులో 350 400 కాలం నాటి భారత రాజకీయ సామాజిక స్థితిగతులు చిత్రించబడ్డాయి. బకించంద్ర చటర్జీ వ్రాసిన 'సీతారామ' నవలను శ్రీ వెంకట పార్వతీశ్వర కవులు 'సీతారామ రాయలు' అన్న పేరున తెనిగించారు. ఇది ఢిల్లీ చక్రవర్తియైన అక్బరు పాదుషా సన్నిధిలోని ఒక సీతారామ అనే పేరుని గాధ. బకించంద్ర మరో నవల 'కపాల కుండలను' కూడా వెంకట పార్వతీశ్వర కవులే ఆంధ్రీకరించారు. అక్బర్‌, జహంగీర్‌ కాలం నాటి పరిస్థితులు ఇదులో వర్ణించారు. ప్రధానంగా వీరు 'ఏకాంతసేవ' వంటి భావగీతాలు వ్రాసినా ప్రమధావనము వంటి చారిత్రక అనువాద నవలలు కూడా వ్రాసి సుప్రసిద్ధులైనారు.
జహంగీర్‌ నూర్జహాన్‌ల ప్రేమోదంతాలను శ్రీ యన్‌ రామ చంద్ర నూర్జహాన్‌ అనే నవలలో చిత్రించారు. 'మధురా విజయ' మనే నామంతరం గల వీరకంపరాయలు అనే నవలను శ్రీ వేలమూరి ప్రసాదరావు రచించారు.
కీ||శే|| వేలాల సుబ్బారావు రచించిన రాణీ సంయుక్త నవలకు ఆఫ్‌ఘనుల భారతదేశ దండయాత్ర కథావస్తువు. పృథ్వీరాజు కాలంలో అటువంటి దండయాత్ర మూలంగా భారతదేశ స్వాతంత్య్రం ఎట్లా నశించింది. అన్న విషయాన్ని వర్ణించాడు.
మెడోస్‌ టెయిలర్‌ అనే ఆంగ్ల రచయిత టిప్పుసుల్తాన్‌ అనే నవలను ఆంగ్లంలో వ్రాశాడు. దీనిని అదే పేరుతో కీ||శే|| అక్కిరాజు ఉమాకాంత కవిశేఖరులు తెలుగులోకి అనువదించారు. ప్రసిద్ధ వీరుడు టిప్పుసుల్తాన్‌ జీవితానికి సంబంధించింది ఇందులో కథ. ఈ నవలలో అప్పటి హిందూ మహమ్మదీయ మతాల మధ్య సంబంధాలేగాక భారతీయుల సాంఘిక రాజకీయ వ్యవహారాల కూడా వర్ణించబడ్డాయి. ఈ విధంగా భారత చరిత్రను ఆధారంగా చేసుకొని ఎన్నో చారిత్క నవలలు తెలుగులో వచ్చాయి. 2. ఆంధ్రుల చరిత్రను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు.
ఆంధ్రుల చరిత్రను ఆధారంగా చేసుకొని కూడా అనేక నవలలు తెలుగులో వచ్చాయి. ఆంధ్రప్రదేశ చరిత్రకు సంబంధించిన కథలలో శాతవాహనుల నాటి కథను తీసుకొని 'హిమబిందు' అనే నవలను అడవి బాపిరాజుగారు వ్రాశారు. శాతవాహనుల చరిత్రనే ఆధారంగా చేసుకొని ఇంకా ఎన్నో నవలలు వచ్చాయి. శాతవాహన రాజులపై పరిశోధించి లేదు. నవలలు ప్రకటించారు. శాతవాహన చక్రవర్తి అయిన మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానీక వైవాహిక వృత్తాంతాన్ని ఆ'నాగానిక' నవలగాను హల వీలావతుల కళ్యాణగాథను వసంతగౌతమి గాను రచించాను. నాకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన 'శ్రీలేఖ' శాతవాహనుల సామ్రాజ్యస్థాపన నాటి స్థితి గతులను కళ్లకు కట్టినట్లు వర్ణించే ఈ నవల ఎందరో పండితుల ప్రశంసలకు పాత్రమైంది. కుహనా ప్రణయాలపై ఆధారపడి రచించే నిర్జీవ రచనలతో విసిగిపోయిన పాఠకులకు శ్రీలేఖ చైతన్యపు రాక అని స్వర్గీయ దాశరథి ప్రశంసించారు. మీ శ్రీలేఖచదువుతుంటె విశ్వనాథవారు, బాపిరాజు గారు లేనివోటు ఆంధ్రశారదకు మీరు కనిపించనీయలేదని ఆచార్యపాటిలు తిమ్మారెడ్డి అభినందించారు. శ్రీలేఖ 1980 వ సంవత్సరంలో వ్రాయబడింది. 1983 లో నాగానిక ఆవిష్కరిస్తూ శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన ఒక సభలో ''చారిత్రక నవలా చక్రవర్తి''గా పెద్దలు అభివర్ణించారు. నిబద్ధత కల పరిపూర్ణచారిత్రక నవలా రచయితగా నన్ను సి.నా.రె. ప్రస్తుతించారు. విజ్ఞాన సర్వస్వం (మాగ్నం అపస్‌) అని చెప్పదగిన నవల ''ఆచార్య నాగార్జున'' బౌద్ధయుగానికి చెందిన నవల శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు కాకతీయుల గాధను ఆధారంగా చేసుకొని ''రుద్రమ దేవి'' నవలను వ్రాశారు. మరో ఆరు చారిత్రక నవలలు వీరి ప్రసిద్ధములు.
చారిత్రక నవలా మార్గంలో విశ్వనాథ వారిది ఒక విశిష్టమైన శైలిగా చెప్పవచ్చు. వీరు తెలుగుదేశ చరిత్రలోని కథలను తీసుకొని ఎన్నో నవలలు వ్రాశారు. 'ఏకవీర' వాటన్నిటివో ఉత్తమమైన నవలగా చెప్పవచ్చు. ఇది మధురనాయక రాజుల కాలాన్ని ఇతివృత్తంగా చేసుకొని రచించిన కాల్పానిక చారిత్రక నవల. దీనిని ఇంగ్లీషులో 'రొమాంటిక్‌ హిస్టారికల్‌ నవల అంటారు. ఇది 1925 లో వ్రాయబడింది. ఈ నవల చరిత్రలోని కథను అనుసరించి, దానికి లోబడి కథాకథనానికి తోడ్పడి, చరిత్రకు నవలకు గల సంబంధాన్ని నిపుణతతో ప్రదర్శించారు. ధర్మానికి, ప్రేమకు మధ్య ఉత్పన్నమైన సంఘర్షణ దీనిలో ప్రధాన ఇతి వృత్తం. విశ్వనాథ వారి మరో నవల 'బద్దన్న సేనాని (1938)కి వేంగీ చాళుక్య ప్రభువుల కథ ఇతివృత్తం. విశ్వనాథ వారే 1946 లో పల్లవ కదంబులకు చెందిన కథను ఇతివృత్తంగా గ్రహించి 'కడిమి చెట్టు' అనే నవలను విజయపురి నేలిక ఇక్ష్వాకు వంశ ప్రభువుల చరిత్రను ఆలంబనగా చేసుకొని 'ధర్మచక్రము (1947) అనే నవలలను వ్రాశారు. పై నవలలన్నీ ఆంధ్రేతి హాసానికి సంబంధించినవే. దీనిని బట్టి ఆయనకు ఆంధ్ర చరిత్ర పట్ల ఉన్న అభిమానం తెలుస్తుంది.
అడవి బాపిరాజు గారు కాకతీయ సామ్రాజ్యాన్ని ఆలంబనగా చేసుకొని 'గోనగన్నారెడ్డి' అన్న నవలను వ్రాశారు. పశ్చిమాంధ్ర భూభాగాన్నంతటిని సమర్దతతో ఏలిన మాండలిక ప్రభువు గోనగన్నారెడ్డి కాకతీయ సామ్రాజ్యాన్ని కబళించడానికి మహారాష్ట్రులు ప్రయత్నించినప్పుడు ప్రభుశక్తి పరాయణుడైన గొన్నారెడ్డి వారికి ఎదురొడ్డి నిలిచి తన భుజ బలంతో బుద్ది వైభవంతో రాజనీతి చతురతతో ఓడించి తమ ప్రభువు రుద్రమ దేవికి విజయం చేకూర్చడం దీనిలోని ప్రధానాంశం. శ్రీ కొండూరు వీర రాఘవ చార్యులు మోహనాంగి అనే ఒక గొప్ప నవలను వ్రాశారు. శ్రీకృష్ణ దేవరాయల పట్టమహిషి తిరుమల దేవికి జన్మించిన కూతురే మోహనాంగి. ఈమె కథ ఈ నవలకు ఇతివృత్తం.


మల్లాది వసుందరగారి తంజావూరు పతనం నవలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం బహుమతి లభించింది. వీరే సప్తవర్ణి, రామప్పగుడి కూడా వ్రాశారు. నా ఆవాహన నవల కాకతీయుల శిల్పకళ ప్రాభవానికి అద్దం పట్టింది. ఇది 1974 లో వ్రాయబడింది. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్ధుడైన రఘునాథ భూపాలుని చరిత్రను తంజావూరు విజయంగా 1980 లో రచించాను. తంజావూరు విజయం ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు కొంతకాలం క్రితం ఉపవాచకంగా కూడా ఉండేది.
ఏ నవలలోనైనా నైతిక విలువల పతనం, ఒకనాటి భారత దేశ సుస్థితి, వైభవాలు చిత్రీకరించడం నా లక్ష్యం. ఆంధ్ర విశ్వవిద్యాలయం చారిత్రక నవలల పోటీలు పెట్టినప్పుడు శ్రీ దూళిపాళ శ్రీరామమూర్తి “భువన విజయం కొర్లపాటి శ్రీరామ మూర్తిగారి చిత్రకళ నవలలకు బహుమతులు వచ్చాయి.
3. కవులను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు. చారిత్రక నవల అటే చరిత్రలో జరిగిన సంఘటనను గాని ఒక రాజును గాని ఒకరాణిని గాని తీసుకొని దాని చుట్టూ కథను అల్లడం. ఆ రాజులకు తోడ్పడిన మంత్రులను, సేనాపతులను మహా వీరులుగా చేసి వారి చుట్టూ కథలను అల్లడం ఒక సంప్రదాయ బద్ధమైన ఆచారం.
శ్రీనోరి నరసింహ శాస్త్రి గారు దీనిని త్రోసిరాజని తన నవలల్లో ఆయా కాలాల్లో వర్థిల్లిన మహా కవులకు ప్రాధాన్యమిచ్చి వారి చుట్టూ కథను నడిపాడు. ఈ విధంగా శ్రీనోరి నరసింహశాస్త్రి గారు తర్వాతి కవులకు మార్గదర్శకులయ్యారు. చరిత్రలో కొంతమంది మహాకవుల వల్లనే చిన్న చిన్న రాజ్యాలు సైత్యం ప్రసిద్ధి చెందాయి. నన్నయ మహాకవి వల్ల రాజ రాజ తిక్కన మహా కవి వల్ల “మనుమసిద్ధి’ ప్రభువునకు చరిత్రలో విలువ వచ్చింది. అలాంటి మహాకవులపై నవలలు వ్రాయడం శుభపరిణామంగా భావించవచ్చు. శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు “నారాయణభట్టు’ (చాళుక్య వంశం) మల్లారెడ్డి (రెడ్డిరజ్యం) కవిసార్వభౌముడు (పేదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి) ధూర్జటి (కృష్ణదేవరాయల యుగం) వంటి సరికొత్త చారిత్రక నవలలను వ్రాశారు. వీరి మల్లారెడ్డి నవలకు ఇతి వృత్తంగా కవిత్రయంలో మూడవ వాడైన ఎఱ్ఱాప్రగడను తీసుకున్నారు. కవి సార్వభౌముడులో శ్రీనాథ కవి సార్వభౌముని జీవితం ఆయన సలిపిన సాహిత్య జైత్రయాత్రలు చక్కగా వర్ణితమైనాయి. “రంగాజమ్మ’ అనే చారిత్రక నవల తంజావూరు కాలం నాటి కథ వ్రాశారు. తిక్కన సోమయాజి అనే నవలను శ్రీ తుమ్మల పల్లి రామలింగేశ్వరరావు రచించాడు. ఆచార్య డాక్టర్‌ కె.వి.ఆర్‌. నరసింహం వ్రాసిన “కనకాభిషేకం’ నవలలో శ్రీనాథుడు ప్రౌడదేవరాయల సభలో డిండిమభట్టును ఓడించి కనకాభిషేక సత్కారం పొందిన విషయం తదనంతర పరిస్థితులు వర్ణించడం జరిగింది.
నా రచనలు వసంత గౌతమి. ఆచార్య నాగార్జున, ఆవాహన, పద కవితా పితామహుడు అన్నమాచార్యుల జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని శ్రీ పదార్చన అన్న నవలను వ్రాశాను. ఈ నవలను తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలగా గుర్తించింది. ఒకేసారి శ్రీపదార్చన నవలను లక్షప్రతులు ముద్రించి తెలుగు నవలా చరిత్రలోనే సంచలనం సృష్టించారు. దీనిని బట్టి ఆ నవలకు ఎంతగా ప్రజాస్పందన లభించిందో అర్థమవుతుంది. తంజావూరు విజయం ఇంటర్‌ మీడియట్‌ పాఱ్య గ్రంధం.
4. మతం మత ప్రవక్తలను ఆధారంగా చేసుకొని వచ్చిన నవలలు. భారతదేశ ప్రజలపై మత ప్రభావం ఇంతా అంతా అని చెప్పలేము. ముఖ్యంగా తెలుగు ప్రజలపై మత ప్రభావం మిక్కుటంగా ఉంది. ఈనాటికి మత ప్రవక్తలను ఈ దేశంలో దేవుళ్లుగా కొలుస్తున్నారు. కనుక మతం మత ప్రవక్తలను ఆధారంగా చేసుకొని తెలుగులో సహజంగానే ఎన్నో నవలలు వచ్చాయి. ఉత్పల సత్యనారాయణం గారి “”రాజమాత’’ ఇతి హసిక నవలా ప్రక్రియ కిందికి వస్తుంది. అలాంటిదే జి.వి. పూర్ణచంద్‌ గారి నవల కూడా. శ్రీమతి తెన్నేటి హేమలత రామాయణం ఆధారంగా ఒక నవల వ్రాశారు. మాదిరెడ్డి సులోచన ఒక చారిత్రక నవల వ్రాసింది. కాని దానికి అంతగా ప్రసిద్ధి రాలేదు.
విశిష్టాద్వైత మత స్థాపకుడైన శ్రీ రామానుజాచార్యులు తన మత స్థాపనకు చేసిన ప్రయత్నాలు, తత్ఫలితంగా ఆయన పడిన కష్టాలను రామానుజుని ప్రతిజ్ఞ అనే నవలలో పి. రాజగోపాల నాయుడు యుక్తియుక్తంగా వివరించారు. అడవి బాపిరాజుగారు అడవి శాంతిశ్రీ నవలలో వైదిక బౌద్ధ మతాల మధ్య జరిగిన సంఘర్షణలను చిత్రించారు. పాత్రలను చారిత్రక పరిస్థితులకనుగుణ్యంగా మలచడంలో వర్ణనలు చేయడంలో సంభాషణలు నడపడంలో ఆయనకు ఆయనే సాటి. పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ “ద్రౌపది’ సత్యభామ రచించారు.
కళ్యాణి చాళుక్యరాజైన బిజ్జలుని వద్ద మంత్రిగా పనిచేసి వీరశైవ మతాన్ని ఝంఝామారుతంలా వ్యాపింపజేసిన బసవేశ్వరుని, జీవిత చరిత్రను “అనుభవ మంటపం’ పేర నేను నవలగా మలిచాను. ఈ విధంగా అడవి బాపిరాజు, విశ్వనాథ, నోరి నరసింహ శాస్త్రుల తరువాత మళ్లీ చారిత్రక నవలా మార్గాన్ని స్వీకరించి దీన్నొక ఉద్యమంగా చేసుకొని ఉత్తమమైన చారిత్రక నవలలందించడంలో సంపూర్ణంగా కృతకృత్యుడనైనాను. ఏ కాలం ఇతివృత్తం గ్రహించినా దానికి సంబంధించిన సకల చారిత్రక గ్రంథాలు పరిశీలించి అవసరమైనంత వరకే కల్పనలు జోడించి ప్రణాళికా బద్ధంగా నవలలు వ్రాయడం నా పద్ధతి. రెసిడెన్సీ, అసఫ్‌ జాహిల కాలం గుణాడ్యుని బృహత్కథను ఆధారంగా చేసుకొన్న ఎపిక్‌ నావెల్‌ తెలుగు చారిత్రక నవలకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని కల్పించడం నా లక్ష్యం. ఆధునికోత్తర చారిత్రక నవల (1980 తర్వాత) నాగపూర్ణిమ, నా విధ్యాధర చక్రవర్తి, వసంత గౌతమి, అల్లాడ నారాయణరావు “”రుచీదేవి’’ (విజయ నగర రాజుల కాలం నాటి కథ) శ్రీకృష్ణ దేవరాయులు శ్రీ అయ్యదేవర పురుషోత్తమరావు. కీ||శే|| శ్రీమతి ఓగేటి ఇందిరా దేవి రుద్రమదేవి. కోటలో నారాజు, యుగాది శ్రీమతి పాలంకి సత్య (12 వ శతాబ్ది నాటి ఖుజరహ: ఆంధ్రభూమి సీరియల్‌ ఇలా అక్కడక్కడ కొన్ని వస్తున్నాయి. పఠనాసక్తి తగ్గటంతో చారిత్రక నవల వ్రాయడానికి రచయిత భయపడుతున్నారు. అయినా ఈ యాగం యోగం అవిచ్ఛిన్న జాహ్నవిలా సాగుతూనే ఉంటుంది

వచన కవిత తీరుతెన్నులు -- డా|| సి. భవానీ దేవి (ఆంధ్ర ప్రభ 10 May 2010)


తెలుగులో వచనం అంటే గద్యం. మన నిత్యానుభవాల భాష ఇది. ఇది ఒక వాదం కాదు. ఫ్రెంచి భాషలో Verse Libre అని ఇంగ్లీషులో Free verse అని అంటారు. తెలుగులో 1935 సంవత్సరం నుండి వచన కవితా రచన జరుగుతూనే ఉంది. 50వ దశకంలో అభ్యదయ కవిత్వదశ మారి ప్రగతివాద ప్రాణప్రతిష్ట జరిగింది. సామాజిక కవిత్వధోరణి నవీన ప్రగతి మార్గంలో ప్రయాణించినప్పుడు వచన పద్యం కొత్త తరం కవుల్ని సృష్టించింది. లయాన్విత వచనమే వచన కవిత్వమైంది. ప్రతి అక్షరంలో స్వాభావికమైన సంగీతం అంతర్లీనంగా ఉంటుంది. అక్షరంలోని సంగీతాన్ని అర్థం చేసుకొని, ఆ అక్షరాన్ని సమయానుకూలంగా ప్రయోగించటం ద్వారా ఈ లయ సాధ్యమవుతుంది. ప్రతిభగానీ, లయగానీ లేకపోతే పద్యంగానే మిగుల్తుంది కానీ కవిత్వం కాలేదు.
1950 సంవత్సరంలో భారతదేశం సంపూర్ణ గణతంత్ర దేశంగా రూపొందింది. దేశంలోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. 1944 సంవత్సరంలో 'నయాగరా' కృతితో వచన కవిత ఆవిర్భవించింది. 1956 సంవత్సరంలో 'నాలోని నాదాలు' భూమికలో కుందుర్తి కొత్త పద్యం పుట్టుకను వివరించారు. 'తెలంగాణ' కావ్యాన్ని రాశారు. 1960 నాటికి వచన కవిత ఒక స్థిరరూపాన్ని సాధించింది. ఇప్పుడు ఎందరో కవులీ ప్రక్రియను స్వీకరించి విరివిగా రచనలు చేస్తున్నారు.
వచన కవితా ప్రక్రియలో కుందుర్తి 'నగరంలో వాన', తిలక్‌ 'అమృతం కురిసిన రాత్రి', పఠాభి 'ఫిడేలు రాగాలడజన్‌', బైరాగి 'నూతిలో గొంతుకలు, ఆరుద్ర 'త్వమేవాహం' దాశరథి 'పునర్నవం', సినారె 'మంటల్లో మానవుడు' మొదలైన ఎన్నో ఖండకావ్యాలు వెలువడ్డాయి. శేషేంద్ర, డా|| ఎన్‌. గోపి, కె. శివారెడ్డి మొదలైన ఎందరో కవులు, కవయిత్రులు వచన కవిత్వాన్ని మరింత పరిపుష్టం చేశారు. 1967లో Free verse Front స్థాపనతో వచన కవితకు పీఠం వెలిసింది.
వచన కవిత లక్షణాలు :
సమకాలీనత :
వచన కవిత ప్రధాన లక్షణం సమకాలీనత. అట్టడుగు వర్గాల, మధ్యతరగతి వర్గాల ఆర్థిక దుస్థితి ఈ కవిత్వం వర్ణించింది, వర్తమాన కృత్రిమ జీవనభారాన్ని మోస్తున్న సామాన్యుని జీవితాన్ని ఆవిష్కరించింది. ఆరుద్ర 'గుమస్తా ప్రేమగీతాలు', మాదిరాజు రంగారావు 'పృథ్వీగీతం' ఉదాహరణలు. ఒక కోర్టు గుమాస్తా ముళ్ళ దుప్పటి కప్పుకొని కుటుంబ వ్యధలను దిండుగా నిద్రిస్తాడని అజంతా వర్ణించారు. బైరాగి 'నాక్కొంచం నమ్మకమివ్వు' అంటూ మనకి ఆత్మవిశ్వాసం ఉండాలంటాడు. సమకాలీన రాజకీయ చారిత్రాత్మక సంఘటనలైన విశాలాంధ్రావతరణం, యుద్ధ, రాజకీయకుట్రల మీద కాళోజి-సి. విజయలక్ష్మి రాశారు. తిలక్‌ మధ్యతరగతి ప్రజల గురించి రాస్తూ
''చిన్నమ్మా
వీళ్ళందరు తోకలు తెగిన ఎలుకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
ఆకలి అవసరం తీరని కష్టాలు, గడులు
వాచకాలలోని నీతులను వల్లిస్తారు''
అంటారు. వచన కవితలో యుద్ధం పట్ల విముఖత్వం తీవ్రంగా కనిపిస్తుంది.
నూతన మానవుడు :
వచన కవితలో సామాన్యుడే యుగపురుషుడు. శ్రీశ్రీ కూడా
''విప్లవం మున్ముందు మనుష్యుని
మనస్సులో ప్రారంభమౌతుంది'' అన్నారు
వర్తమాన సమాజ సమస్యల పరిష్కారం కోసం సామాన్య మానవుడ్ని ఉత్తేజితం చేసింది. వచన కవిత్వమే!
యవ్వన వర్ణన :
తెలుగు వచన కవులు వేశ్యావృత్తిని నిరసిస్తూ రచనలు చేశారు. యవ్వన ప్రతీకలుగా కనురెప్పలు, కళ్ళజోడు, టొమాటో వంటి వాటిని నారాయణబాబు వాడాడు. ఈ ప్రతీకల ప్రయోగశైలి ఫ్రాయిడ్‌ ప్రభావమే! పఠాభి రచనల్లో ఈ విలక్షణ కామవర్ణన వన్పిస్తుంది.
వేదన :
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పాశ్చాత్య పీడనలోని వేదన, మృత్యు సాక్షాత్కారం, భయం, తిరుగుబాటులు, అరాజకం, నిరుద్యోగం, బ్లాక్‌మార్కెట్‌, నల్లడబ్బు వంటి సమస్యల గురించి కవులు వేదన, దుఃఖం, కోపం విప్లవభావాలతో కవిత్వం రాశారు.
నగర వర్ణన :
పారిశ్రామిక విప్లవ ఫలితంగా టౌన్లు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా పరివర్తన చెందాయి. ప్రజలు నగరాలకు వలస వెళ్లారు. మహానగరాలు ఆధునికతకు కేంద్రాలైనాయి. నగరాల్లో మధ్యతరగతి మనుషుల్లోని ఏకాకితనం, అసమర్ధత, వేదనల గురించి వచన కవితా ఖండకలు వెలువడ్డాయి. ఆరుద్ర, పినిశెట్టి, సినారె మొదలైన కవులు నగర యాంత్రిక జీవితాన్ని వర్ణించారు. వీధులు, దురాణాలు, హోటళ్ళు, మురుగు కాల్వలు నగర వర్ననలుగా కనిపిస్తాయి. విశాఖ గురించి నారాయణబాబు ఇక్కడి రోడ్లు నీగ్రో స్త్రీ బుగ్గల్లా ఉన్నాయంటారు.
''ఇక్కడ సోడాలో కాక్‌టైల్‌
కిలోల్లో ఉల్లి పాషాణం
సినిమాహాలులో శిశుహత్య
సిరాబుడ్డితో ఆత్మహత్య
విమానంలో భ్రూణహత్య
పెట్టెబండిలో గర్భస్రావం''
అంటూ 'రుధిరజ్యోతి'లో అత్యంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. వచన కవులు నగర జీవనంలోని యాంత్రికతను వివిధ కోణాల్లో వర్ణించారు.
ఆశావాదం :
ఎన్ని వేదనలు, నిరాశలున్నా వచనకవి మనస్థైర్యాన్ని కోల్పోలేదు. చీకట్లోంచి వెలుగుని అన్వేషించాడు. వర్తమానం నుంచి శక్తి సాధించి నవ్యశక్తిని సంతరించుకుని ఉజ్వల భవిష్యత్తుకేసి నడిచారు డా|| సినారె 'మంటలు - మానవుడు'లో
''రానున్న ప్రభాతం రాక తప్పదు
రక్తి సూక్తి సత్యమౌక్తికాన్ని
ప్రసరించక తప్పదు, నవధర్మం
ప్రభవించక తప్పదు'' అంటారు.
దాశరథి 'తిమిరంలో సమరం' చేశారు. అరిపిరాల విశ్వం 'మనిషికి శక్తి ఆశ మాత్రమే!' అంటూ కవితా 'కాలరేఖలు' గీశారు.
యుద్ధవైముఖ్యం :
వచన కవిత ముఖ్యలక్షణాల్లో యుద్ధం పట్ల విముఖత ఒకటి. పైకి ఎంత ఆనందంగా ఉన్నా అందరి మనసుల్లో యుద్ధభయం, విషాదం నిండి ఉంది. కె.వి. రమణారెడ్డి, పేర్వారం, తిలక్‌ యుద్ధం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
గూఢత :
కుందుర్తి అభిప్రాయం ప్రకారం వచన కవిత కేవలం ప్రగతి భావనలకే కాదు. ప్రణయభావనల అభివ్యక్తికి ఉపయోగపడుతుంది. మాదిరాజు, బోయి భీమన్న, రచనలు ఈ కోవలోకి వస్తాయి.
భాష :
ఆధునిక కవులు మధ్యయుగపు భాషను తిరస్కరించారు. తెలుగు భాషకు కొత్త రూపం ఇచ్చారు. కొత్త వస్తువుకు కొత్త భాష, సజీవమైన దైనందిక భాషను యథాతథంగా స్వీకరించారు. సహజసుందరమైన ఈ భాషలో జీవితంలోని జటిలత్వం కన్పిస్తుంది. సమాజంలో న్యాయం, సత్యం వ్యక్తం చేసే జనభాష సాహిత్య భాషయింది. నూతన ప్రతీకలు, బింబాలు వాడారు. గురజాడతో ప్రారంభమైన వ్యవహారిక భాష వచన కవిత్వంలో మధ్యవర్గీయ స్పృహకు అనువైన అభివ్యక్తిగా మలచబడింది. వచనకవులు అవసరాన్ని బట్టి ఆంగ్ల, ఉర్దూ పద ప్రయోగాలు చేశారు. పారిశ్రామిక నాగరికతను ప్రతిబింబిస్తూ శాస్త్రీయ పదజాలం విరివిగా వాడారు. ఎక్కువ ప్రచారంలో ఉన్న విజ్ఞాన విషయాలు- పారిభాషిక పదాలు స్వీకరించారు. రైలు, లగేజి, బ్రేకు, టి.సి వంటి ఆంగ్లపదాలు చెరిషించు, రనండి, ఎర్రటేపు, నీవిన్‌ వంటి విరుద్ధ ప్రయోగాలు చేసిన ఆరుద్ర, మద్రాస్సిటీ, హైహీలుయాన వంటి పదప్రయోగాలు చేసిన పఠాభి; ఇంగ్లీషు అంకెలతో 'అపాయం 3తుంది' వంటి పదాలు సృష్టించిన శార్వరి; వైచిత్రి కోసమే భాషలో ఇటువంటి ప్రయోగాలు చేశారు.

ఆది ద్రావిడం అరవల సొమ్మా? Does Adidravidam belong only to Tamils?

రాయీ, మన్నూ పుట్టకముందే పుట్టిన ప్రపంచపు తొలిభాష తమిళ్‌. ఇది ప్రపంచ భాషలన్నింటిలోకీ అత్యంత ప్రాచీనమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి నిస్సంకోచంగా ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించారు. అదే మాటను ప్రపంచ తమిళ మహాసభల సందర్భంగా ఉద్ఘోషించి చెప్పారు. ఇది తమిళ తంబిల భేషజానికి ఎన్ని తరాలు మారినా మారని వారి అలవి మీరిన అహంకారానికి నిదర్శనంగా కనబడుతోంది. ద్రవిడ భాష అతి ప్రాచీనమైనదే ఎవ్వరూ కాదనరు. దానికి సంస్కృత భాషకున్నంత చరిత్ర ఉన్న మాట కూడా సత్యమే! దాన్ని కూడా ఎవ్వరూ కాదనరు. అయితే అవన్నీ అన్వయించాల్సింది ఆది ద్రవిడానికే కాని తమిళానికి కాదు. ఆది ద్రావిడం అనేక భాషలకు తల్లి లాంటిది. అంత మాత్రాన దాన్ని ప్రపంచ భాషలకు తల్లిలాంటిది అనడం అతిశయోక్తి! తమిళం వేరు ఆది ద్రవిడం అని పిలువబడే మూల ద్రవిడం వేరు అన్న విషయం అంతా గుర్తించాలి. సంస్కృతం ఆర్యుల భాష అయితే ద్రవిడం పూర్తిగా స్థానిక భాష. సంస్కృతం ఆర్యులతోపాటే మన దేశానికి వలస వచ్చిన భాష. శతాబ్దాలుగా ఇక్కడే ఉండి, ఈ దేశానికే సొంతమైనట్టుగా స్థిరపడిపోయింది. భారతీయతకు కీర్తి పతాకగా, మన సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, వేద, పురాణేతిహాసాది భారతీయ సాహితీ సంపదకు అది ఆటపట్టు అన్న వాస్తవాన్ని కూడా ఎవ్వరూ కాదనరు. దాని చరిత్రను, దానికి గల గౌరవాన్ని ఎవ్వరూ శంకించరు. స్థానికంగా ఉన్న ప్రాకృత, పాళి వంటి భాషలను అణగదొక్కి అది రాజభాషగా ఎలా చెలామణి అయిందో అలాగే ఆది ద్రవిడం దక్షిణాదిని ఆవరించి బలమైన స్థానిక భాషగా తలయెత్తి నిలిచింది. ఈ మూల ద్రవిడ భాష ప్రాంతానికి ఒక రకంగా ఉండి అనేక జాతులకు మాతృభాషను అందించింది. అలా మూల మధ్య ద్రవిడ భాష నుంచి పుట్టినది తెలుగుభాష. అనంతమైన ధ్వనిసంపదను, సాహితీ సంపదను కలిగి ఉన్న తెలుగుకు సవర, గొండి, కుయి, కోయ, కొలిమి భాషలు కూడా ఇలాగే పుట్టి తెలుగుకు ఉపభాషలుగా మారిపోయాయి. తెలుగు భాషలో ఉన్నన్ని భాషాధ్వనులు మరే భాషలో లేవంటే అతిశయోక్తికాదు. ఆది ద్రవిడం కుటుంబంలో పుట్టి ఆ భాషామతల్లి పాలు తాగిన భాషలు 26 ఉన్నాయి. అందులో తమిళం ఒకటి మాత్రమే! ఈ విషయం ఆ భాష అంటే ప్రాణాలు వదిలేవాళ్లు గుర్తించాలి. సంస్కృత భాషా సాంగత్యం వల్లే తెలుగు తన ధ్వని సంపదను అనంతంగా విస్తరించుకోగలిగింది. అందువల్ల స్పష్టత, మార్దవం, మాధుర్యం పెంచుకోగలిగింది. అందుకే తెలుగుతేట అని కీర్తి పొందింది. 15వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్‌ యాత్రికుడు నికోలొ డా కాంటి తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని కీర్తించాడు. తెలుగు భాషా సౌందర్యాన్ని మాధుర్యాన్ని సంపూర్ణంగా గమినించిన వాడు కనుకనే దక్షిణాది భాషలు కరతలామలకం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అని కితాబు ఇచ్చాడు. దేశభాషలు ప్రాంతీయ భాషలు అని అర్థం. దక్షిణాన ఉన్న ప్రధాన ప్రాంతాలేమిటి తమిళసీమ, కర్నాటక సీమ, మళయాళ సీమ, తెలుగు సీమ. ఈ ప్రాంతాలలో వ్యవహారంలో ఉన్న అన్ని భాషల కంటే తెలుగు చాలా గొప్పది అని గొంతెత్తి చాటాడు. అంటే ద్రవిడ భాషలలో కెల్లా అమిత మధురమైన భాష తెలుగు అని తేటతెల్లమైంది కదా అక్కడితో ఆగలేదు. తనను తెలుగు వల్లభుడనని, ఆంధ్రభోజుడనని చాటుకున్నాడు.


సాహిత్య సంపదలో తమిళంతో అన్నిటా ముందుండగల భాష తెలుగు. ఇందులో ఉర్దూ, పర్షియన్‌, ఇంగ్లీషు పదాలు సంగమించి ఉన్నాయి. నదులన్నీ సంగమించడం వల్లే సాగరం అంతుపట్టనంతగా విస్తరించింది. అలాగే ఇన్ని భాషలు తమంత తాముగా వచ్చి తెలుగుతో సంగమించబట్టే ఎలాంటి భావాన్నయినా, ఎంతటి క్లిష్టమైన వాఖ్యాన్నయినా అలవోకగా అక్షరబద్ధం చేయగల సత్తా తెలుగుకు ఉంది. ఇక్కడ ఇంగ్లీషులో ఉన్నట్టుగా సైలెంట్‌ అక్షరాలు ఉండవు. ఎలా మాట్లాడతావెూ అలా రాయగలుగుతాము. ఎలా రాయగలుగుతావెూ అలాగే ఉచ్ఛరించగలుగుతాము. అందుకే మనది జీవద్భాషగా వాసికెక్కింది. అందుకే ప్రముఖ జన్యు శాస్త్రవేత్త జెబిఎన్‌ హాల్డెన్‌ తెలుగుకు ఇండియాకు జాతీయ భాషగా నిలువగల అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అన్నారు. రెండు పదాలను కలిపి మూడో అర్థం ఇవ్వగల పదాన్ని సృష్టించగల విలక్షణ లక్షణం తెలుగుకు మాత్రమే ఉంది. సౌందర్యాన్ని సంగ్రామ భూమిని సమానంగా ప్రేమించగలవాళ్లు తెలుగువారు అని ఉద్యోతనుడు తన ప్రాకృత గ్రంథం కువలయమాలలో ప్రశంసించాడు. తెలుగు వారు అందమైన వారని, అందాన్ని అమితంగా ఆరాధించేవారని, అందమైన భోజనాన్ని ఆనందంగా ఆరగించే వారని కూడా అన్నాడు. ఈ రోజున ఇండియా మొత్తంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు స్థానం దక్కించుకుంది. హిందీని జాతీయ భాషగా చెప్పే వాళ్ళ లెక్క ప్రకారం తెలుగు రెండవ అతిపెద్ద భాషగా ఉంది. దాన్ని ప్రాంతీయ భాషగా లెక్కకట్టి చూస్తే తెలుగే అతి పెద్ద ప్రాంతీయ భాషగా నెంబర్‌ వన్‌ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగుమాట్లాడే వారున్నారు. తమిళభాషను తోసిరాజనగల తెలుగు భాషకు, తెలుగు జాతికి 2,500 సంవత్సరాల చరిత్ర ఉందని నిర్ద్వద్వంగా నిగ్గుతేలితే దాన్ని పడనివ్వకుండా కోర్టుకెక్కి ప్రాచీన భాషా హౌదా దక్కనివ్వకుండా అడ్డుకున్న సంస్కారవంతులు తమిళులు.
మూల ద్రవిడానికి దగ్గరి భాష మాదే కనుక అసలు ద్రవిడ భాష మాదే అని గడుసుతనంతో నోరేసుకుని అరిచి ప్రచారాలు చేసుకుని వాస్తవాలను చెరిపేసినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదు. చింపేస్తే చిరిగిపోదు. తమిళ ప్రభువుల అధికార పీఠాలు వేసుకుని కూచున్న చెన్నై ఎక్కడిది తెలుగువారి ఓడరేవు చెన్నపట్నం కాదా వాళ్ళు గొప్పగా చెపðకునే చాళుక్యులు ఆంధ్ర ఇక్ష్వాకుల సంతతి వారు కారా వారిని తెలుగు రాజులుగా చెపðకోడానికి వారు ఇబ్బంది పడ్డా చరిత్ర సాక్ష్యం పలకడం మానేస్తుందా పల్లవులు పరిపాలించిన తెలుగునేల పల్నాడుగా కీర్తిగాంచలేదా వారి రాజధాని నగరం కాంచీపురంలో కొలువున్న వరదరాజు అచ్చతెలుగు దేవుడు. వరదరాజు, వరదయ్య, వరం వంటి పేర్లు తెలుగు ప్రజలలో విరివిగా కనబడతాయి. శ్రీరంగనాథుడు కొలువున్న కావేరీ తీరం పూర్తిగా తెలుగునేల. కస్తూరి రంగడిగా, కావేటి రంగడిగా ఆ దేవుడు తెలుగు వారి జీవితంలో భాగంగా ఉండిపోయాడు. రంగారావులు, రంగారెడ్డి, రంగయ్య, రంగరాజు, రంగబాబు, రంగనాయకుడు, రంగనాథ్‌లు ఇక్కడ ఉన్నంతగా తమిళనాట లేరు. 'కస్తూరి రంగ రంగ..మాయన్న కావేటి రంగ రంగ' అని పాడని తెలుగు తల్లి ఉందా ఇలా పాడని తమిళ తల్లులు మాత్రం కోకొల్లలుగా ఉన్నారు. తెలుగువాడికే సొంతమైన చిదంబర రహస్యం మరిచిపోయారా సర్వేపల్లి రాథాకృష్ణన్‌ పుట్టినపుడు తిరుత్తణి తెలుగునాడులో ఉందా తమిళనాడులో ఉందా సర్వేపల్లి తమిళనాడు వాడని చంకలు గుద్దుకునే పెద్దలు ఆయన చిననాడు రేణిగుంటలోనూ, తిరుపతిలోనూ ఎందుకు చదువుకున్నాడు తెలుగు మీడియాలో చదువుకుంటే తమిళనాడులో చెల్లుబాటు కాదని తెలియకే చదువుకున్నాడా అన్నది చెప్పాలి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి కూడా అచ్చతెలుగు ఆడపడుచులు. మధురనేలిన నాయకరాజులు అచ్చతెలుగు నాయకులు. క్షీణాంధ్ర సాహితీయుగంలో స్వర్ణయుగాన్ని స్థాపించిన వారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కట్టించింది తెలుగు రాజులుకాదా సరస్వతీమహల్‌ కట్టింది తెలుగువారు కాదా తెలుగు అంటే చిరాకు పడే, మండిపడే పెద్దలు ఇప్పటికీ తమ రాజకీయాలకు పెద్దదిక్కు అని కొలుచుకునే జయలలిత తెలుగు అమ్మాయి కాదా తెలుగుగంగ పారితేగాని గొంతైనా తడుపుకోలేని వీళ్ళు ప్రపంచమంతా నాదేనని మాట్లాడడం శోచనీయం. విడ్డూరం.


తెలుగును తెనుంగు అని పిలిచే వారు తమిళులు. తెన్‌ అంటే దక్షిణాది అని అర్థం. తెనుంగు అనడం ద్వారా అది దక్షిణాది భాష అని అనడానికే తప్ప దాని పూర్తి వికాసరూపమైన తెలుగు పదాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ద్రవిడ భాషా కుటుంబాలలో అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన జాతి తెలుగుజాతి. తమిళులతో అన్ని విధాల పోటీపడి పోరాటాలు చేయగల నేర్పు, ప్రతిభ గలవారు తెలుగువారు. కనుకనే వారికి తెలుగువారు అంటే సహజమైన మంట ఉంటుంది. అందుకే దాన్ని ఎలాగైనా తొక్కిపట్టాలని, ఇక్కడికి ఎలాంటి ప్రయోజనాలు రాకుండా చూడాలని శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తుంటారు. వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించి వేరుపడిన వారు తెలుగువారు. ఆ తరువాతే కన్నడ, మళయాళ సీమల వారు వేరుపడ్డారు. తెలుగువారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద తమిళం మాట్లాడే వారు ద్రవిడం అనేది ఒక ప్రత్యేకమైన భాషా కుటుంబం. ఇందులో ప్రధానంగా తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం ఉన్నాయి. మళ్ళీ వేటికి వాటికే ఉపభాషలు ఉన్నాయి. మా భాషే శుద్ధమైంది. మిగిలిన భాషలు సంస్కృతాన్ని ఆహ్వానించడం ద్వారా సంకరజాతి భాషలుగా మారిపోయాయి అని వారు అంటుంటారు. ముగ్గదీసుకుని బతకడంలో సంకుచితత్వం ఉంటుంది. అందరినీ ఆదరించగలగడంలో విశాల హృదయం ఉంటుంది. మిగిలిన భాషలు ఆ పని చేయగలిగాయంటే అది అక్కడి సార్వజనీన ధోరణికి నిదర్శనం. శాంతియుతంగా సహజీవనం చేయాలన్నా, సమాన స్థాయినిచ్చి గౌరవించాలన్నా విశాల దృక్పథం, విశాల హృదయం కావాలి. మూల ద్రావిడం తనదే అయినట్టు చెపðకుంటున్న తమిళుల వాదన ఏ రకంగా చూసినా నిజం కాదు. మూల ద్రావిడం అందరిదీ! అది దాక్షిణాత్య భాషలకు అమ్మగారి ఇల్లులాంటిది. ఆ ఉగ్గుపాలు తాగి, ఆ చేతి ముద్ద తిని పెరిగిన భాషలన్నీ ఆ గూటి పాటనే పాడతాయనే విషయం వారు గుర్తుంచుకోవాలి. తమిళభాష మీద మాకు ఉన్న గౌరవం అపారం. ఆ భాష మీద మాకెలాంటి ద్వేషం లేదు. శత్రుత్వం అంతకన్నా లేదు. కానీ ఆ భాష మాట్లాడేవారు చూపించే అతి సంకుచిత మనస్తత్వానికి, ఇరుకైన వారి ఆలోచనా ధోరణిని మాత్రం హర్షించలేం. సరిసమానులను గౌరవించడం ఎవరికైనా మంచిది. అది మర్యాదస్తుల లక్షణం.

Friday, June 25, 2010

తమిళ తంబికి వణక్కం ( ప్రొ" ముదిగొండ శివప్రసాద్ ‌)

'త్రిలింగ దేశం మనదేనోయ్‌ తెలుంగులంటే మనమేనోయ్‌'' సుమారు డెబ్బయి సంవత్సరాలకు పూర్వం పైడిపాటి సుబ్బరామశాస్త్రి వ్రాసిన పాటనా చెవులలో ఇప్పటికీ మారుమోగుతున్నది. తెలుగు భాష జాతి అత్యంత ప్రాచీనమైనది. కాని ఏం ప్రయోజనం? నిన్న మొన్న పుట్టిన హిందీ, మరాఠీ, మలయాళ భాషల కన్నా మన పరిస్థితి మరీ హీనంగా మారిపోయింది. పక్కనున్న తమిళులు మనలను చూసి నవ్వుకుంటున్నారు.


భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఏ భాష సౌందర్యం ఆ భాషదే! దేని పలుకుబడి దానిదే! నిజానికి భారత దేశ భాషలలోనే కాదు ప్రపంచ భాషలన్నింటిలోనూ చాలా అందమైన భాష ఏది? అని సాపేక్ష దృష్టి లేకుండా శాస్త్రీయంగా పరిశీలిస్తే తెలుగు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది అజంత భాష. నాద సౌందర్యం తద్వారా సిద్ధిస్తుంది. మాట మంత్రంగా, సంగీత భరితంగా అనిపించేలా వినిపించే భాష మనది. తమిళ భాషకు అక్షరాలు ఇరవై ఆరు మాత్రమే! తెలుగు భాషకు యాభై ఆరు! తమిళులు గర్వంగా చెప్పుకునే జ ష లకు మధ్యలో ఉచ్ఛరించే అక్షరం కూడా తెలుగు ప్రాచీన శాసనాలలో ఉంది. ఇది బండిరాకు కొంచెం సన్నిహితంగా ఉండే లిపి సంజ్ఞ. ఐతే ఏమిటి అని ఎవరైనా ప్రశ్న వేయవచ్చు. అక్షరాలు ఎక్కువైన కొద్దీ భాషోచ్ఛారణలో క్లారిటీ పెరుగుతుంది. తమిళంలో కాంతి అని వ్రాసి గాంది అని పలుకుతారు ఉర్దూలో సీతారామయ్య అని వ్రాసి సత్తార్‌మియ్యా అని పలుకుతారు. ఇంగ్లీషు మరీ ఘోరం. లిపికీ, సంజ్ఞకూ, ఉచ్ఛారణకూ సంబంధమే ఉండదు. ఐనా అది అంతర్జాతీయ భాష కాబట్టి నోరు మూసుకొని పిల్లలకు అలాగే నేర్పవలసిందే! టి ఎ ఎల్‌ కె అని వ్రాసి టాక్‌ అని ఉచ్చరింపవలసిందే! ఎల్‌ ఏమయింది. అంటే సైలెంట్‌ అని భాషా శాస్త్రవేత్తలు సంజాయిషీ చెప్పారు. శెభాష్‌! సైలెంట్‌ అయితే మరి వ్రాయటం ఎందుకు? టి ఎ ఎ కె అని వ్రాస్తే పోదా? అయితే శివప్రసాద్‌ షేక్స్పియరు కన్నా గొప్పవాడు కాడు. అందుకని వాళ్ల భాష వాళ్ల ఇష్టం అంటారే కాని నా మాట ఎవడు వింటాడు? విశ్వనాథ సత్యనారాయణ గారు 1963వ సంవత్సరంలో విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అనే నవల వ్రాశారు. కాకతాళీయంగా ఆ నవల ముద్రణ నా చేతులమీదుగానే ధారావాహికంగా ప్రచురింపబడటమూ పుస్తకంగా ముద్రింపబడటమూ జరిగింది. దయచేసి తెలుగువారంతా దానిని చదివి తీరాలి.


మళ్లీ మొదటికి వస్తాను. తెలుగు భాష బ్రాహ్మీ లిపి నుండి పుట్టిందని అంటారు. మరి తమిళ లిపి ఎలా పుట్టింది? తమిళ అక్షరాలను దివ్యఫలకాలపై వ్రాసి పరమశివుడో, కుమారస్వామియో వారికి ఇచ్చాడని ఒక కథ. నమ్మితే నమ్మండి లేకుంటే లేదు. ఈ వివరాలు కొన్ని ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో నీత్కారుని కథ అనే ఘట్టంలో ఉన్నాయి. తమిళులకు భాషాభిమానం ఎక్కువ. ప్రతివాడూ తన మాతృభూమిని మాతృభాషనూ ప్రేమిస్తాడు. తెలుగువారు తప్ప! తెలుగువారికి భాషాభిమానం లేదు. ''తెలుగు తల్లిట తెలుగు తల్లి ఈ చంద్రబాబు సెంటిమెంటల్‌ (మెంటల్‌?) డైలాగులు కొడతాండు అని అన్నది ఎవరు?? తెలుగువారు కలిసి ఉండరు. ప్రపంచ తెలుగు భాషా మహోత్సవాలు చేసుకోరు. తమిళనాడులో ప్రపంచ తమిళ మహాసభలు జరుగుతున్నాయి. తమిళ ప్రభ ఏమిటో వారు ప్రపంచానికి ఉజ్వలంగా చాటుతారు. మరి తెలుగు వాళ్లు ఏం చేస్తున్నారు? కొట్టుకొని చస్తున్నారు. ఇదీ అభిశప్తమైన ఒక జాతి చరిత్ర.
ఎట్టి దురభిమానం లేకుండా చెపుతున్నారు. ఆషామాషీగా కాదు సుదీర్ఘ అధ్యయనానంతరం చెపుతున్నాను. తమిళం కన్నా హిందీ కన్నా కూడా తెలుగు చాలా సుసంపన్నమైన భాష. తక్కిన భాషా కవులకు ఈ కవుల సరసన కూర్చునే అర్హత కూడా లేదు. ఇది ప్రాంతీయ దురభిమానంతో అనటం లేదు.
రెండువేల సంవత్సరాల చరిత్ర గల తెలుగు భాషను అధ్యయనం చేసి అంటున్నాను. ఒక్క సంస్కృత భాషను మినహాయిస్తే తెలుగుతో సాటిరాగల భాష మరొకటి లేదు. కాని మన దురదృష్టం ఏమిటి? బుద్ధి పూర్వకంగా భాషా సంపదను విచ్ఛిన్నం చేసుకున్నాము. నన్నయనుండి చిన్నయ వరకు గల మొత్తం సాహిత్యాన్ని తుడిచి పెట్టాలని ఈ గడ్డమీద పుట్టిన తెలుగు బిడ్డలు ప్రయత్నించటం దారుణం. శారదాదేవి ''అక్ష''మాల నుండి ఎన్నో అక్షరాలు జారిపోయాయి. అరసున్న బండిరా దంత, తాలవ్యాలు మాయమయ్యాయి. శ ష స భేదం కూడా అదృశ్యమైపోయింది. ఇట్లా భాషా సంపదను భ్రష్ఠు పట్టించాము. పాఠకుడు పాటకుడు అయినాడు. స్థానబలం అని వ్రాసి పంపితే స్థనబలం అని అంగప్రదక్షిణ అంటే అంగ ప్రదర్శన అని మన డిటిపి పండితులు టైపుచేసి పంపుతున్నారు. ఏం చేయను? నిస్సహాయుణ్ణి. ఈ పతనానికి ప్రేక్షక పాత్ర వహిస్తున్నాను.


2010 జూన్‌ నెలలో తమిళనాడులో ఒక ఉద్యమం మొదలైంది. ఎక్కడెక్కడ తమిళేతర నామాలున్నాయో వాటిని అన్నింటినీ తమిళ ప్రత్యామ్నాయ నామాలతో మారుస్తున్నారు. అంటే ప్రపంచ తమిళ మహాసభలకు ఇది పూర్వరంగం మంచిపనే కదా! కాదన గలమా? కాని ఎందుకో కొందరు తమిళులకు ఇదేదో మరీ ''అతి''గా అనిపించి పత్రికలలో నిరసన తెలియజేశారు. ''స్టాలిన్‌'' అనే నిరంకుశ నరరూప రాక్షసుడి పేరు నీకెందుకు? తమిళం పేరు పెట్టుకో అని కె.బాలు అనే చెన్నై రచయిత ఒక ప్రముఖ పత్రికలో వ్రాశారు. ఆ మాటకొస్తే రామచంద్రన్‌, జయలలిత, కరుణానిధి, దయానిధి మారన్‌,చిదంబరం, మణిశంకర అయ్యవారు (అయ్యశబ్దం ఆర్య శబ్ద వికృతి) ఇవేవీ కూడా తమిళనామాలు కావు. విశుద్ధ సంస్కృత పదాలు. సూర్య టి.వి. కూడా సంస్కృత పదమే. ధనుష్కోటి, మహాబలేశ్వర్‌, బృహదీశ్వర, కాంచీపురం, మధుర, నాగపట్టణం వంటి పేర్లను కూడా మారుస్తారా? ఏమో ఎవడికి తెలుసు! లక్ష్మణన్‌ అనే పేరును ఎలకుమారన్‌గా మార్చారు. మరి రామన్‌, ముత్తురామన్‌ రామస్వామి నాయకర్‌ వంటి పేర్లను ఎలా మారుస్తారు?? వేచి చూద్దాం!! నాస్తిక పార్టీల వారు దేవాలయాల్లో సంస్కృతం వాడకూడదని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ మధ్య హైదరాబాద్‌లో కొందరు త్యాగరాయ గానసభ పేరును కాళోజీ ప్రాంగణంగా మార్చాలని, రవీంద్ర భారతిని కొమరం భీం కళామందిర్‌గా మార్చాలని బ్రహ్మానందరెడ్డి పార్కును అసఫ్‌ జాహీ పార్క్‌గా హైదరాబాద్‌, సికిందరాబాదులను బాగామతి, తారామతి నగర్‌లుగా మార్చాలని ఆందోళన చేశారు. మంచిదే కదా!!


ఎవరు ఎన్ని మాటలు చెప్పినా తమిళులు కార్యశూరులు. వారిలో వారికి పరస్పర అభిప్రాయ భేదాలున్నా భాషా సంస్కృతుల విషయంలో వారంతా ఏకమై ఇతరులపై తిరగబడతారు. తెలుగువారు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, బృహత్‌ దండకారణ్య అంటూ భయంకరంగా సంఘర్షించుకుంటున్నారు. పురాణాలలో సుందోప సుందుల కథ మనకు గుర్తుండే ఉంటుంది. ఎవడికీ భాషాభివృద్ధి, సాంస్కృతిక పోషణ మీద దృష్టి లేదు. శ్రీకృష్ణ దేవరాయలు మావాడు అంటూ కన్నడిగులు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మహోత్సవాలు మొదలు పెట్టారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌, శ్యామశాస్త్రి, వీరంతా మావారేనని తమిళులు సగర్వంగా చెప్పుకుంటున్నారు. కాదనగలమా? త్యాగరాజును బ్రతికించింది తమిళులే కాని తెలుగు వారు కాదు. నిజానికి తమిళనాడును వందలాది సంవత్సరాలు తెలుగు నాయకరాజు పరిపాలించారు. తెలుగు భాషను యక్షగానాలను పోషించారు.


ఆ మాటకొస్తే తెలుగువాడు కోనసీమ బ్రాహ్మణుడు అయిన మయూర శర్మ కేరళను పరిపాలించి వారికి వేద భిక్షను పెట్టాడు. ఆదిశంకరాచార్యుల పూర్వీకుల కోనసీమ బ్రాహ్మణులు. కాలడికి వలసపోయారు. బర్మావంటి ప్రాంతాల్లో తెలంగ్‌ అనే ఒక జాతి ఇప్పటికే ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి కాని అల్లుడి నోట్లో శని అని తెలుగు సామెత తమిళులలో భాషాభిమానం ఉంది తెలుగు వారికి అది లేదు. ఒక తెలుగువాడు కాస్త అభివృద్ధిలోకి వస్తే వాడి కాళ్లు పట్టి గుంజడానికి పదిమంది సిద్ధంగా ఉంటారు. అందుకే వీరు విశ్వామిత్రుని చేత శపింపబడ్డావారు అని ఐతరేయ బ్రాహ్మణంలో కొన్నివేల సంవత్సరాల క్రితమే వ్రాశారు. ఇది మన ఖర్మ!! తెలుగు సంస్కృతి కాస్త వికసిస్తుందని సంతోషించే లోపలే ఎవడో ఒక రావణాసురుడు పుట్టి మనకు ఆ ఆనందం దక్కకుండా చేస్తాడు. ప్రపంచ తమిళ మహాసభలు జరుపుకుంటున్న తమిళ జాతిని అభినందిద్దాం. తమిళ సింహళ తమిళ తెలుగు భాషీయుల మధ్య సహనం పాటించవలసిందిగా ఈ సందర్భంలో కరుణానిధి జయలలిత గార్లకు విజ్ఞప్తి చేద్దాం! తెలుగు పాఠశాలలు నడుపుకుంటుంటే కృష్ణగిరి వంటి తెలుగు జనాధిక్య ప్రాంతాలపై తమిళులు దాడిచేయటం తగదు అని ప్రార్థిద్దాం!! తమిళులను చూసైనా మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు ఇలాంటి ప్రపంచ తెలుగు మహాసభలకు రూపకల్పన చేయాలని ఆశిద్దాం!!                                                                             ----------ప్రొ// ముదిగొండ శివప్రసాద్‌

Thursday, June 24, 2010

Alpajeevi by Rachakonda Viswanatha Sastry or Raavi Sastri
Download Alpajeevi here:   Alpajeevi


తెలుగు నవలా ప్రపంచంలో మొట్టమొదటగా మనస్తత్వ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన నవల అల్పజీవి. దీని రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.


    ఈ నవలలోని కథానాయకుడి పై రచయిత అభిప్రాయం. " I wanted to reserve some sympathy for the clerk [the protagonist] when I started writing the novel. But by the time I reached its end I lost much of my sympathy for him. I don’t know why it happened like that. … I was surprised when Bharati came forward to serialize the novel. I was ashamed of and irritated with the idea of the novel appearing under my own name, and not pseudonymously. I don’t use a pseudonym any more. The shame too is gone. But the irritation remained."

Saturday, June 19, 2010

Alluri Seeta Ramaraju charitra - Alluri Seeta Ramaraju's biographyDownload Alluri Seeta Ramaraju's biography here: Alluri Seeta ramaraju charitra

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

వంశం

సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు.

రామరాజు, సీతారామరాజు

అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంధం అట్టపైన కూఢా "శ్రీరామరాజు", "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. (సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును "సీతారామరాజు"గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాధ.)

బాల్యం, చదువు
బాల్యంలో అల్లూరి సీతారామరాజు

సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి - 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం. [1] వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు.

రాజు తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయికముగా చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివాడు. చిత్రకళలోను, ఫొటోగ్రఫీలోను అభిరుచి కలవాడు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.

ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్ధికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం అలా సాగింది.

1909 లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో మిషన్ హైస్కూలులో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారం లో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.

రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంకి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్లనూ పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురం లో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తుని లో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడుకాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేసాడు.

రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉన్నది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవి పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.

చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, స్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.

ఉత్తరదేశ యాత్ర

1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్య గ్రంధము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంధాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నాడు.

కృష్ణదేవి పేట చేరుకుని అక్కడికి దగ్గర్లోని ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేసాడు. కృష్ణదేవి పేటలోని చిటికెల భాస్కరుడు అనే వ్యక్తి, అతని తల్లి ద్వారా రాజు తల్లికి అతని ఆచూకీ తెలిసి,ఆమె రాజు వద్దకు వచ్చింది. 1918 వరకు అందరూ అక్కడే ఉన్నారు.

రెండవ యాత్ర

1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి, బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవి పేట చేరాడు. కృష్ణదేవిపేట వద్ద తాండవ నదిలో "చిక్కలగడ్డ" కలిసేచోట గ్రామస్తులు కట్టిఇచ్చిన రెండు ఇండ్లలో రాజు, అతని తల్లి, తమ్ముడు, సోదరి, బావగారు కాపురముండేవారు. దానికి "శ్రీరామ విజయ నగరం" అని పేరు పెట్టారు. రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమె పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలుదేరేవాడు.

అనేక యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కధలు వినిపించడం చేసేవాడు. భక్తి చూపేవారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు క్రింద మండల దీక్ష నిర్వహించాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు భావించేవారు.
 బ్రిటీషు అధికారుల దురాగతాలు

ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది.


ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేదికాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.


 మన్యం ప్రజలలో రాజు తెచ్చిన చైతన్యం

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.


గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం.


అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరు గా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్ లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.

 విప్లవం మొదటిదశ

ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాటయచ్చాడట. 27-7-1923న తిమ్మాపురంలో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వరసాపురం పంపేశాడు.

గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు - భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది.


విప్లవ దళం వివిధపోలీసు స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు:
 చింతపల్లి

1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు.
 కృష్ణదేవి పేట

ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి, భోజనాలు చేసి ఆ రాత్రే ఆగష్టు 23న - కృష్ణదేవి పేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి.
 రాజవొమ్మంగి

ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి.


వరుసదాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకుని వెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది.
 అడ్డతీగల

రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసి మరీ వెళ్ళాడు.
రంపచోడవరం

అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రరీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిచేయడంలో ఇతనికి లభించిన విజయాలవల్ల రాజు ప్రతిష్ట ఇనుమడించింది. ఇతని సాహసాలను గురించి కధలు కధలుగా చెప్పుకొనసాగారు. కొన్ని సార్లు రాజు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు.


ఇతనిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డాగాని వీలయినంతవరకు రాజు దళం వారు మందలించి వదిలేశేవారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరులవలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు.

విప్లవం రెండవదశ

డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు.


ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.


1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923 ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరిమానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి "నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది" అని కలెక్టరుకు రాజు "మిరపకాయ టపా" పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.)

క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మనుషులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు.

జూన్ 17న రాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాభీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామంలోను ఆహార పదార్ధాలు సేకరించారు.


2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధించారు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు (1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.


సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు.

మరణం

17-4-1924న మన్యంకు కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు.విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక "అగ్గిరాజు" అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు.

ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవి పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత, 1923 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.

ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.
ఇతర విప్లవ వీరులు

సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవవీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాలలో మరణించారు. మరికొందరు పట్టుబడ్డారు. ఎండు పడాలును మే 26న గ్రామ ప్రజలు పట్టుకొని చంపివేశారు. సంకోజీ ముక్కనికి 12 సంవత్సరాల శిక్ష విధించారు. గంటదొర భార్యను, కూతురిని బంధించారు. జూన్ 7న "పందుకొంటకొన" వాగువద్ద గంటందొర సహచరులకు, సైనికులకు చాలాసేపు యుద్ధం జరిగింది. చాలా సేపు చెట్టు చాటునుండి తుపాకీ కాల్చిన గంటందొర తూటాలు అయిపోయాక ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అతనిని కాల్చివేశారు. జూన 10వ తేదీన గోకిరి ఎర్రేసును నర్సీపట్నం సమీపంలో పట్టుకొన్నారు. జూన్ 16న బొంకుల మోదిగాడు దొరికిపోయాడు.


22-8-1922న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైందనవచ్చును. సీతారామరాజు తల్లి 1953 ఆగష్టు 30న, తన 77వ యేట మరణించింది. అతని సోదరి సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8న మరణించింది. అతని తమ్ముడు సత్యనారాయణరాజు ఉపాధ్యాయునిగా పదవీవిరమణ చేసి పెద్దాపురం వద్ద బూరుగుపూడిలో నివశించాడు.
 రాజు గురించి వివిధ అభిప్రాయాలు
భారత తపాల శాఖ 1986లో విడుదల చేసిన అల్లూరి సీతారామ రాజు స్మారక తపాలా బిళ్ల

    * అల్లూరి సీతారామరాజు విప్లవంపై ఆనాటి పత్రికల అభిప్రాయాలు ఇలా ఉండేవి:
          o కాంగ్రెస్ పత్రిక: రంప పితూరీని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది.
          o స్వతంత్ర వార పత్రిక (1924 మే 13, 20): అటువంటి (రాజు) వారు చావాలి అని ప్రచురించింది.
          o కృష్ణాపత్రిక: విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది.

అయితే రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గమలంకరించాడని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్ తో పోల్చింది.


1929లో మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు:

    శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. - (యంగ్ ఇండియా పత్రిక - 1926)

సుభాష్ చంద్ర బోస్-

    సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. .... భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక.

"సీతారామరాజు" బుర్రకధ ముగింపులో ఇలా ఉంది -

    శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది

Joke of the day

Saturday, June 12, 2010

Gabbilam by Gurram Jashuva


Download Gabbilam here: Gabbilam

గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా  1895  సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి , విశ్వ కవి సామ్రాట్ బిరుదులు పొందారు.


             గబ్బిలమును గూర్చి జాషువా మాటలలో .........
" కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నే నీ కావ్యమును రచించితిని. గ్రంధనామము గబ్బిలము. శ్రోతలకిది కటువుగా దోచవచ్చును. కానీ అందలి కధానాయకుడు ప్రణయ సందేశమును నంపును. ఇతడంపునది తుకతుక నుడుకు నశ్రుసందేశము. అతని శిక్షా కాలపరిమితి యొక సంవత్సరము. ఇతని శిక్ష ఆజన్మాంతము. తరతరములు. దీని కవధి లేదు. అతడు మన్మధాగ్నితప్తుడు, ఇతడు క్షుధాగ్ని పీడితుడు."


“నాదు కన్నీటి కథ సమన్వయము సేయ
నార్ద్రహృదయంబు గూడ కొంతవసరంబు”


అని యితడు వాపోవును. కులీనులగు రాజులకువలె హంసలు, చిలకలు మున్నగు నుత్తమపక్షి దూతలితనికి జిక్కుట అసంభవము. కావున నిట్టిడుల జీర్ణకుటీరములలో నిరంతరము దర్శన మిచ్చు గబ్బిలము నితనికి సందేశహారిగా బరిగ్రహించితిని. రసజ్ఞుల కిందలి యౌచితి సులభగ్రాహ్యము. ఇంట బ్రవేశించి దీపమార్పిన గబ్బిలమును జూచి తన కన్నీటి కథ నీశ్వరునితో చెప్పుమని వీడు ప్రార్థించె గాని నిజమున కతని యుద్దేశ్యము దేశారాధన. కైలాసయానమునకు నాపన్నిన త్రోవ కొంత వక్రతకు గురియైనది. ఇది దోషము కాదనుకొందును. ఈ కృతి రసజ్ఞ లోకాదరణ నందిన నా శ్రమ ఫలోన్ముఖము కాగలదు. 
               నేనీ గ్రంధమును ముగించు నవసరమున గుంటూరు జిల్లా బోర్డు ప్రెసెడెంటుగారును, దేశభక్తులును, కళాభిమానులునగు శ్రీ కల్లూరి చంద్రమౌళి చౌదరిగారు మా యూరు దయచేసి గ్రంధము నామూలాగ్రముగా విని పతిత్వము వహించుట కంగీకరించుట నా యదృష్టము. వారికి నా నమస్కారములు. వారికి నేను కృతజ్ఞుడను.


రెండవ  భాగానికి తొలిపలుకు

గబ్బిలము కైలాసమునకు సందేశం తీసికొనిపోయి చిరకాలమైనది. మనపేదవాఁడెదరు తన్నులు చూడసాగినాడు. వాని సందేశ ఫలితంగా నాల్గుమూలల నుండి ప్రసన్న వాయువులు వీవసాగినవి. దేవాలయ ప్రవేశం, హరిజనోద్దరణమని, గాంధీజీ చరకా ఝూంకరణము శ్రవణశుభ గంగాగానము చేసినది. సర్వసమత్వ మను మంత్రరాజాన్ని భారతదేశం వల్లెవేయసాగింది. అరుంధతి సుతుని నిరాశాకాశంలో , ఆశాతటిల్లతలు మోసులెత్తినయి.తన చిరకాల దాస్య క్లేశాన్ని విస్మరించినాడు. గబ్బిలం తిరిగి దర్శనమిచ్చింది. ప్రఫుల్ల వదనుడై తీయని స్వాగతమిచ్చాడు. పండా, కాయాయని ప్రశ్నించినాడు. పండై నదని ప్రకృతి ప్రత్యుత్తర మిచ్చినది.అత్మదేశం, అత్మభారతాంధ్రజాతిలో గల అనైకమత్యం స్వార్థ లుబ్దత, బహుకుల మతావేశ వ్యాధి పీడ, కాబట్టనితనం నేడవని లోని తీరని వేదనలు తన దాస్యముక్తితోడుగా దేశానర్ధకములైన అనేక విషమ సమస్యలతనిని కారింపసాగినయి. తన ఇష్టదేవత తన జాతికి కేతన చిహ్నమైన గబ్బిలానికతడు మరికొన్ని చింతాసందేశాలను చెప్పుకొన  సాగినాడు. గబ్బిలమామూలాగ్రంగా ఆలకించింది. నోరులేని పక్షి మారుపలుకుటకు శక్తిచాలని ప్రాణి ఏమని యోదార్ప గలదు? ప్రదక్షణించి కన్నీరుకార్చి, శివాలయానికి తరలిపోయినది. అతని వాక్కులు చావులేనివై వాయుమార్గమున ప్రతిధ్వనించు చున్నవి.గణబద్ధములైనవి. రెండవ గబ్బిలమను కావ్యమైనిలచినది. నేడుగాక మరొకనాడు ఫలించును. ఫలితమనుభవించు భాగ్యమతని కున్నదో లేదో."


జాషువా కల నిజమైంది! ఆ పరమేశ్వరుడు గబ్బిలము యొక్క సందేశాన్ని పరిగ్రహించాడు.దళితునికి రాజ్యాధికారం వచ్చింది.