Monday, June 28, 2010

ఆది ద్రావిడం అరవల సొమ్మా? Does Adidravidam belong only to Tamils?

రాయీ, మన్నూ పుట్టకముందే పుట్టిన ప్రపంచపు తొలిభాష తమిళ్‌. ఇది ప్రపంచ భాషలన్నింటిలోకీ అత్యంత ప్రాచీనమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి నిస్సంకోచంగా ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించారు. అదే మాటను ప్రపంచ తమిళ మహాసభల సందర్భంగా ఉద్ఘోషించి చెప్పారు. ఇది తమిళ తంబిల భేషజానికి ఎన్ని తరాలు మారినా మారని వారి అలవి మీరిన అహంకారానికి నిదర్శనంగా కనబడుతోంది. ద్రవిడ భాష అతి ప్రాచీనమైనదే ఎవ్వరూ కాదనరు. దానికి సంస్కృత భాషకున్నంత చరిత్ర ఉన్న మాట కూడా సత్యమే! దాన్ని కూడా ఎవ్వరూ కాదనరు. అయితే అవన్నీ అన్వయించాల్సింది ఆది ద్రవిడానికే కాని తమిళానికి కాదు. ఆది ద్రావిడం అనేక భాషలకు తల్లి లాంటిది. అంత మాత్రాన దాన్ని ప్రపంచ భాషలకు తల్లిలాంటిది అనడం అతిశయోక్తి! తమిళం వేరు ఆది ద్రవిడం అని పిలువబడే మూల ద్రవిడం వేరు అన్న విషయం అంతా గుర్తించాలి. సంస్కృతం ఆర్యుల భాష అయితే ద్రవిడం పూర్తిగా స్థానిక భాష. సంస్కృతం ఆర్యులతోపాటే మన దేశానికి వలస వచ్చిన భాష. శతాబ్దాలుగా ఇక్కడే ఉండి, ఈ దేశానికే సొంతమైనట్టుగా స్థిరపడిపోయింది. భారతీయతకు కీర్తి పతాకగా, మన సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, వేద, పురాణేతిహాసాది భారతీయ సాహితీ సంపదకు అది ఆటపట్టు అన్న వాస్తవాన్ని కూడా ఎవ్వరూ కాదనరు. దాని చరిత్రను, దానికి గల గౌరవాన్ని ఎవ్వరూ శంకించరు. స్థానికంగా ఉన్న ప్రాకృత, పాళి వంటి భాషలను అణగదొక్కి అది రాజభాషగా ఎలా చెలామణి అయిందో అలాగే ఆది ద్రవిడం దక్షిణాదిని ఆవరించి బలమైన స్థానిక భాషగా తలయెత్తి నిలిచింది. ఈ మూల ద్రవిడ భాష ప్రాంతానికి ఒక రకంగా ఉండి అనేక జాతులకు మాతృభాషను అందించింది. అలా మూల మధ్య ద్రవిడ భాష నుంచి పుట్టినది తెలుగుభాష. అనంతమైన ధ్వనిసంపదను, సాహితీ సంపదను కలిగి ఉన్న తెలుగుకు సవర, గొండి, కుయి, కోయ, కొలిమి భాషలు కూడా ఇలాగే పుట్టి తెలుగుకు ఉపభాషలుగా మారిపోయాయి. తెలుగు భాషలో ఉన్నన్ని భాషాధ్వనులు మరే భాషలో లేవంటే అతిశయోక్తికాదు. ఆది ద్రవిడం కుటుంబంలో పుట్టి ఆ భాషామతల్లి పాలు తాగిన భాషలు 26 ఉన్నాయి. అందులో తమిళం ఒకటి మాత్రమే! ఈ విషయం ఆ భాష అంటే ప్రాణాలు వదిలేవాళ్లు గుర్తించాలి. సంస్కృత భాషా సాంగత్యం వల్లే తెలుగు తన ధ్వని సంపదను అనంతంగా విస్తరించుకోగలిగింది. అందువల్ల స్పష్టత, మార్దవం, మాధుర్యం పెంచుకోగలిగింది. అందుకే తెలుగుతేట అని కీర్తి పొందింది. 15వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్‌ యాత్రికుడు నికోలొ డా కాంటి తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని కీర్తించాడు. తెలుగు భాషా సౌందర్యాన్ని మాధుర్యాన్ని సంపూర్ణంగా గమినించిన వాడు కనుకనే దక్షిణాది భాషలు కరతలామలకం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అని కితాబు ఇచ్చాడు. దేశభాషలు ప్రాంతీయ భాషలు అని అర్థం. దక్షిణాన ఉన్న ప్రధాన ప్రాంతాలేమిటి తమిళసీమ, కర్నాటక సీమ, మళయాళ సీమ, తెలుగు సీమ. ఈ ప్రాంతాలలో వ్యవహారంలో ఉన్న అన్ని భాషల కంటే తెలుగు చాలా గొప్పది అని గొంతెత్తి చాటాడు. అంటే ద్రవిడ భాషలలో కెల్లా అమిత మధురమైన భాష తెలుగు అని తేటతెల్లమైంది కదా అక్కడితో ఆగలేదు. తనను తెలుగు వల్లభుడనని, ఆంధ్రభోజుడనని చాటుకున్నాడు.


సాహిత్య సంపదలో తమిళంతో అన్నిటా ముందుండగల భాష తెలుగు. ఇందులో ఉర్దూ, పర్షియన్‌, ఇంగ్లీషు పదాలు సంగమించి ఉన్నాయి. నదులన్నీ సంగమించడం వల్లే సాగరం అంతుపట్టనంతగా విస్తరించింది. అలాగే ఇన్ని భాషలు తమంత తాముగా వచ్చి తెలుగుతో సంగమించబట్టే ఎలాంటి భావాన్నయినా, ఎంతటి క్లిష్టమైన వాఖ్యాన్నయినా అలవోకగా అక్షరబద్ధం చేయగల సత్తా తెలుగుకు ఉంది. ఇక్కడ ఇంగ్లీషులో ఉన్నట్టుగా సైలెంట్‌ అక్షరాలు ఉండవు. ఎలా మాట్లాడతావెూ అలా రాయగలుగుతాము. ఎలా రాయగలుగుతావెూ అలాగే ఉచ్ఛరించగలుగుతాము. అందుకే మనది జీవద్భాషగా వాసికెక్కింది. అందుకే ప్రముఖ జన్యు శాస్త్రవేత్త జెబిఎన్‌ హాల్డెన్‌ తెలుగుకు ఇండియాకు జాతీయ భాషగా నిలువగల అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అన్నారు. రెండు పదాలను కలిపి మూడో అర్థం ఇవ్వగల పదాన్ని సృష్టించగల విలక్షణ లక్షణం తెలుగుకు మాత్రమే ఉంది. సౌందర్యాన్ని సంగ్రామ భూమిని సమానంగా ప్రేమించగలవాళ్లు తెలుగువారు అని ఉద్యోతనుడు తన ప్రాకృత గ్రంథం కువలయమాలలో ప్రశంసించాడు. తెలుగు వారు అందమైన వారని, అందాన్ని అమితంగా ఆరాధించేవారని, అందమైన భోజనాన్ని ఆనందంగా ఆరగించే వారని కూడా అన్నాడు. ఈ రోజున ఇండియా మొత్తంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు స్థానం దక్కించుకుంది. హిందీని జాతీయ భాషగా చెప్పే వాళ్ళ లెక్క ప్రకారం తెలుగు రెండవ అతిపెద్ద భాషగా ఉంది. దాన్ని ప్రాంతీయ భాషగా లెక్కకట్టి చూస్తే తెలుగే అతి పెద్ద ప్రాంతీయ భాషగా నెంబర్‌ వన్‌ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగుమాట్లాడే వారున్నారు. తమిళభాషను తోసిరాజనగల తెలుగు భాషకు, తెలుగు జాతికి 2,500 సంవత్సరాల చరిత్ర ఉందని నిర్ద్వద్వంగా నిగ్గుతేలితే దాన్ని పడనివ్వకుండా కోర్టుకెక్కి ప్రాచీన భాషా హౌదా దక్కనివ్వకుండా అడ్డుకున్న సంస్కారవంతులు తమిళులు.
మూల ద్రవిడానికి దగ్గరి భాష మాదే కనుక అసలు ద్రవిడ భాష మాదే అని గడుసుతనంతో నోరేసుకుని అరిచి ప్రచారాలు చేసుకుని వాస్తవాలను చెరిపేసినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదు. చింపేస్తే చిరిగిపోదు. తమిళ ప్రభువుల అధికార పీఠాలు వేసుకుని కూచున్న చెన్నై ఎక్కడిది తెలుగువారి ఓడరేవు చెన్నపట్నం కాదా వాళ్ళు గొప్పగా చెపðకునే చాళుక్యులు ఆంధ్ర ఇక్ష్వాకుల సంతతి వారు కారా వారిని తెలుగు రాజులుగా చెపðకోడానికి వారు ఇబ్బంది పడ్డా చరిత్ర సాక్ష్యం పలకడం మానేస్తుందా పల్లవులు పరిపాలించిన తెలుగునేల పల్నాడుగా కీర్తిగాంచలేదా వారి రాజధాని నగరం కాంచీపురంలో కొలువున్న వరదరాజు అచ్చతెలుగు దేవుడు. వరదరాజు, వరదయ్య, వరం వంటి పేర్లు తెలుగు ప్రజలలో విరివిగా కనబడతాయి. శ్రీరంగనాథుడు కొలువున్న కావేరీ తీరం పూర్తిగా తెలుగునేల. కస్తూరి రంగడిగా, కావేటి రంగడిగా ఆ దేవుడు తెలుగు వారి జీవితంలో భాగంగా ఉండిపోయాడు. రంగారావులు, రంగారెడ్డి, రంగయ్య, రంగరాజు, రంగబాబు, రంగనాయకుడు, రంగనాథ్‌లు ఇక్కడ ఉన్నంతగా తమిళనాట లేరు. 'కస్తూరి రంగ రంగ..మాయన్న కావేటి రంగ రంగ' అని పాడని తెలుగు తల్లి ఉందా ఇలా పాడని తమిళ తల్లులు మాత్రం కోకొల్లలుగా ఉన్నారు. తెలుగువాడికే సొంతమైన చిదంబర రహస్యం మరిచిపోయారా సర్వేపల్లి రాథాకృష్ణన్‌ పుట్టినపుడు తిరుత్తణి తెలుగునాడులో ఉందా తమిళనాడులో ఉందా సర్వేపల్లి తమిళనాడు వాడని చంకలు గుద్దుకునే పెద్దలు ఆయన చిననాడు రేణిగుంటలోనూ, తిరుపతిలోనూ ఎందుకు చదువుకున్నాడు తెలుగు మీడియాలో చదువుకుంటే తమిళనాడులో చెల్లుబాటు కాదని తెలియకే చదువుకున్నాడా అన్నది చెప్పాలి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి కూడా అచ్చతెలుగు ఆడపడుచులు. మధురనేలిన నాయకరాజులు అచ్చతెలుగు నాయకులు. క్షీణాంధ్ర సాహితీయుగంలో స్వర్ణయుగాన్ని స్థాపించిన వారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కట్టించింది తెలుగు రాజులుకాదా సరస్వతీమహల్‌ కట్టింది తెలుగువారు కాదా తెలుగు అంటే చిరాకు పడే, మండిపడే పెద్దలు ఇప్పటికీ తమ రాజకీయాలకు పెద్దదిక్కు అని కొలుచుకునే జయలలిత తెలుగు అమ్మాయి కాదా తెలుగుగంగ పారితేగాని గొంతైనా తడుపుకోలేని వీళ్ళు ప్రపంచమంతా నాదేనని మాట్లాడడం శోచనీయం. విడ్డూరం.


తెలుగును తెనుంగు అని పిలిచే వారు తమిళులు. తెన్‌ అంటే దక్షిణాది అని అర్థం. తెనుంగు అనడం ద్వారా అది దక్షిణాది భాష అని అనడానికే తప్ప దాని పూర్తి వికాసరూపమైన తెలుగు పదాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ద్రవిడ భాషా కుటుంబాలలో అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన జాతి తెలుగుజాతి. తమిళులతో అన్ని విధాల పోటీపడి పోరాటాలు చేయగల నేర్పు, ప్రతిభ గలవారు తెలుగువారు. కనుకనే వారికి తెలుగువారు అంటే సహజమైన మంట ఉంటుంది. అందుకే దాన్ని ఎలాగైనా తొక్కిపట్టాలని, ఇక్కడికి ఎలాంటి ప్రయోజనాలు రాకుండా చూడాలని శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తుంటారు. వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించి వేరుపడిన వారు తెలుగువారు. ఆ తరువాతే కన్నడ, మళయాళ సీమల వారు వేరుపడ్డారు. తెలుగువారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద తమిళం మాట్లాడే వారు ద్రవిడం అనేది ఒక ప్రత్యేకమైన భాషా కుటుంబం. ఇందులో ప్రధానంగా తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం ఉన్నాయి. మళ్ళీ వేటికి వాటికే ఉపభాషలు ఉన్నాయి. మా భాషే శుద్ధమైంది. మిగిలిన భాషలు సంస్కృతాన్ని ఆహ్వానించడం ద్వారా సంకరజాతి భాషలుగా మారిపోయాయి అని వారు అంటుంటారు. ముగ్గదీసుకుని బతకడంలో సంకుచితత్వం ఉంటుంది. అందరినీ ఆదరించగలగడంలో విశాల హృదయం ఉంటుంది. మిగిలిన భాషలు ఆ పని చేయగలిగాయంటే అది అక్కడి సార్వజనీన ధోరణికి నిదర్శనం. శాంతియుతంగా సహజీవనం చేయాలన్నా, సమాన స్థాయినిచ్చి గౌరవించాలన్నా విశాల దృక్పథం, విశాల హృదయం కావాలి. మూల ద్రావిడం తనదే అయినట్టు చెపðకుంటున్న తమిళుల వాదన ఏ రకంగా చూసినా నిజం కాదు. మూల ద్రావిడం అందరిదీ! అది దాక్షిణాత్య భాషలకు అమ్మగారి ఇల్లులాంటిది. ఆ ఉగ్గుపాలు తాగి, ఆ చేతి ముద్ద తిని పెరిగిన భాషలన్నీ ఆ గూటి పాటనే పాడతాయనే విషయం వారు గుర్తుంచుకోవాలి. తమిళభాష మీద మాకు ఉన్న గౌరవం అపారం. ఆ భాష మీద మాకెలాంటి ద్వేషం లేదు. శత్రుత్వం అంతకన్నా లేదు. కానీ ఆ భాష మాట్లాడేవారు చూపించే అతి సంకుచిత మనస్తత్వానికి, ఇరుకైన వారి ఆలోచనా ధోరణిని మాత్రం హర్షించలేం. సరిసమానులను గౌరవించడం ఎవరికైనా మంచిది. అది మర్యాదస్తుల లక్షణం.

6 comments:

 1. జయలలిత తెలుగావిడా ? బృహదీశ్వరాలయం నాకు తెలిసినంతవరకు చోళులు కట్టించారు. చోళులు తెలుగువారా ? తగిన ఆధారాలు (citations) పేర్కొంటే ఈ వ్యాసం బాగుంటుందని నా అభిప్రాయం.

  ReplyDelete
 2. ఈ వ్యాస ప్రయత్నం అద్భుతమైనది.

  ముత్యాల ముగ్గులాంటి మాతృభూమి ముక్కచెక్కలయ్యే తరుణం సహజంగా మూలాల వెతుకులాటకి ప్రేరేపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తమిళ తమ్ముళ్ళ పిడివాదనలు, పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటాయి. ద్రావిడ భాష మనందరి ఉమ్మడి సొత్తు అని తమిళులు గుర్తించాలి( దేవుడా,మా వల్ల కాదు, కనీసం నువ్వైనా ). ద్రావిడ భాష మాదికూడారా నాయనా అంటే విననట్టు నటిస్తారు, లేదా గుడ్డిగా వాదిస్తారు.

  సరే, పొరుగింటి వారు ఎన్ని ప్రగల్భాలకు పోయినా, మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి.

  ఈ వ్యాసానికి నా వంతుగా కొన్ని సవినయ సవరణలు:

  1)తెలుగు గడ్డలో పుట్టడమే తెలుగుదనానికి కొలమానమైతే, జయలలిత తెలుగావిడ కాదు, ఆధారానికి "http://en.wikipedia.org/wiki/Jayalalithaa" చూడండి.

  2) "ఈ రోజున ఇండియా మొత్తంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు స్థానం దక్కించుకుంది." కాదు, మనది మూడో స్థానమని ఇప్ప్పుడే తెలిసింది. ఆధారానికై,
  http://en.wikipedia.org/wiki/List_of_languages_by_number_of_native_speakers_in_India, చూడండి.

  విక్రం గారు చెప్పినట్టు ఈ వ్యాసం ఆధారాలతో రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తమిళ తమ్ముళ్ళకి ఆ మాత్రం ఆధారాలు చూపించకపోతే, అన్నన్నా !

  ReplyDelete
 3. తెలుగు వల్లభుడు అని తనను తాను చెప్పుకున్నది శ్రీ క్రిష్ణదేవరాలు కాదు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు. తెలుగులో తన పేర కావ్యం వ్రాయమని కృష్న దేవరాయలకు కలలో కనిపించి నప్పుడు అన్నమాట అది.
  తెన్ అంటే దక్షినం అన్నారు తెలుగు ప్రాంతం తమిళనాడు కి ఉత్తరాన ఉంది కదా? ఎవరికి తెలుగు దక్షిణం? ఇక సరస్వతీ మహల్ విషయం అది మహారాష్ట్ర పాలకులు శరభోజీ కాలంలో నిర్మించ బడింది.
  జగన్నాధరావు

  ReplyDelete
 4. cheppina manchi matallo manchi vadilesi, vyasam lo ekkada tappulunnayo vetukutunnara? anduke mana telugu vallu chivarane untam?

  ReplyDelete
 5. మంచి వ్యాసం ....... తమిలోళ్ళ గోల బరించడం చాల కష్టం .... పక్కనోళ్ళు గొప్ప అంటే భరించలేరు . మనం మనం కొట్టుకున్నా పర్లేదుగానీ మన భాష జోలికి వస్తే ఉరుకోకుడదు .

  సంస్కృతాన్ని పరాయి బాష అనేముందు కొంచెం ఆలోచించు . తగు ఆధారాల్లెకుండా అలా అనవద్దు.

  ReplyDelete
 6. వివాదాలు తలెత్తినప్పుడు , వివరణలు ఆధారాలతో సహా ఉంటేనే అది ప్రామాణికం అవుతుంది. వీలయినంతవరకు , ప్రత్యర్ధులు తిరిగి ప్రస్నించలేనంత పకద్బందీగా మన వాదన వుండాలి. చిన్న చిన్న లోపాలు కూడా వుండకూడదు. ఒక వేళ లోపాలు వుంటే , మిగిలిన విషయాలు కూడా నమ్మకం కేకోల్పోతాయి. కనుక,లోపాలను సరిదిద్దుకోవడం ఖచ్చితంగా అవసరమే . ఉదాసీనత అస్సలు పనికిరాదు. ఇవి ఒక జాతికి సంబంధించిన అంశాలు కనుక, చాలా భాద్యతాయుతంగా వాదించాలి. ------Ravi kiran.

  ReplyDelete