Monday, June 28, 2010

వచన కవిత తీరుతెన్నులు -- డా|| సి. భవానీ దేవి (ఆంధ్ర ప్రభ 10 May 2010)


తెలుగులో వచనం అంటే గద్యం. మన నిత్యానుభవాల భాష ఇది. ఇది ఒక వాదం కాదు. ఫ్రెంచి భాషలో Verse Libre అని ఇంగ్లీషులో Free verse అని అంటారు. తెలుగులో 1935 సంవత్సరం నుండి వచన కవితా రచన జరుగుతూనే ఉంది. 50వ దశకంలో అభ్యదయ కవిత్వదశ మారి ప్రగతివాద ప్రాణప్రతిష్ట జరిగింది. సామాజిక కవిత్వధోరణి నవీన ప్రగతి మార్గంలో ప్రయాణించినప్పుడు వచన పద్యం కొత్త తరం కవుల్ని సృష్టించింది. లయాన్విత వచనమే వచన కవిత్వమైంది. ప్రతి అక్షరంలో స్వాభావికమైన సంగీతం అంతర్లీనంగా ఉంటుంది. అక్షరంలోని సంగీతాన్ని అర్థం చేసుకొని, ఆ అక్షరాన్ని సమయానుకూలంగా ప్రయోగించటం ద్వారా ఈ లయ సాధ్యమవుతుంది. ప్రతిభగానీ, లయగానీ లేకపోతే పద్యంగానే మిగుల్తుంది కానీ కవిత్వం కాలేదు.
1950 సంవత్సరంలో భారతదేశం సంపూర్ణ గణతంత్ర దేశంగా రూపొందింది. దేశంలోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. 1944 సంవత్సరంలో 'నయాగరా' కృతితో వచన కవిత ఆవిర్భవించింది. 1956 సంవత్సరంలో 'నాలోని నాదాలు' భూమికలో కుందుర్తి కొత్త పద్యం పుట్టుకను వివరించారు. 'తెలంగాణ' కావ్యాన్ని రాశారు. 1960 నాటికి వచన కవిత ఒక స్థిరరూపాన్ని సాధించింది. ఇప్పుడు ఎందరో కవులీ ప్రక్రియను స్వీకరించి విరివిగా రచనలు చేస్తున్నారు.
వచన కవితా ప్రక్రియలో కుందుర్తి 'నగరంలో వాన', తిలక్‌ 'అమృతం కురిసిన రాత్రి', పఠాభి 'ఫిడేలు రాగాలడజన్‌', బైరాగి 'నూతిలో గొంతుకలు, ఆరుద్ర 'త్వమేవాహం' దాశరథి 'పునర్నవం', సినారె 'మంటల్లో మానవుడు' మొదలైన ఎన్నో ఖండకావ్యాలు వెలువడ్డాయి. శేషేంద్ర, డా|| ఎన్‌. గోపి, కె. శివారెడ్డి మొదలైన ఎందరో కవులు, కవయిత్రులు వచన కవిత్వాన్ని మరింత పరిపుష్టం చేశారు. 1967లో Free verse Front స్థాపనతో వచన కవితకు పీఠం వెలిసింది.
వచన కవిత లక్షణాలు :
సమకాలీనత :
వచన కవిత ప్రధాన లక్షణం సమకాలీనత. అట్టడుగు వర్గాల, మధ్యతరగతి వర్గాల ఆర్థిక దుస్థితి ఈ కవిత్వం వర్ణించింది, వర్తమాన కృత్రిమ జీవనభారాన్ని మోస్తున్న సామాన్యుని జీవితాన్ని ఆవిష్కరించింది. ఆరుద్ర 'గుమస్తా ప్రేమగీతాలు', మాదిరాజు రంగారావు 'పృథ్వీగీతం' ఉదాహరణలు. ఒక కోర్టు గుమాస్తా ముళ్ళ దుప్పటి కప్పుకొని కుటుంబ వ్యధలను దిండుగా నిద్రిస్తాడని అజంతా వర్ణించారు. బైరాగి 'నాక్కొంచం నమ్మకమివ్వు' అంటూ మనకి ఆత్మవిశ్వాసం ఉండాలంటాడు. సమకాలీన రాజకీయ చారిత్రాత్మక సంఘటనలైన విశాలాంధ్రావతరణం, యుద్ధ, రాజకీయకుట్రల మీద కాళోజి-సి. విజయలక్ష్మి రాశారు. తిలక్‌ మధ్యతరగతి ప్రజల గురించి రాస్తూ
''చిన్నమ్మా
వీళ్ళందరు తోకలు తెగిన ఎలుకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
ఆకలి అవసరం తీరని కష్టాలు, గడులు
వాచకాలలోని నీతులను వల్లిస్తారు''
అంటారు. వచన కవితలో యుద్ధం పట్ల విముఖత్వం తీవ్రంగా కనిపిస్తుంది.
నూతన మానవుడు :
వచన కవితలో సామాన్యుడే యుగపురుషుడు. శ్రీశ్రీ కూడా
''విప్లవం మున్ముందు మనుష్యుని
మనస్సులో ప్రారంభమౌతుంది'' అన్నారు
వర్తమాన సమాజ సమస్యల పరిష్కారం కోసం సామాన్య మానవుడ్ని ఉత్తేజితం చేసింది. వచన కవిత్వమే!
యవ్వన వర్ణన :
తెలుగు వచన కవులు వేశ్యావృత్తిని నిరసిస్తూ రచనలు చేశారు. యవ్వన ప్రతీకలుగా కనురెప్పలు, కళ్ళజోడు, టొమాటో వంటి వాటిని నారాయణబాబు వాడాడు. ఈ ప్రతీకల ప్రయోగశైలి ఫ్రాయిడ్‌ ప్రభావమే! పఠాభి రచనల్లో ఈ విలక్షణ కామవర్ణన వన్పిస్తుంది.
వేదన :
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పాశ్చాత్య పీడనలోని వేదన, మృత్యు సాక్షాత్కారం, భయం, తిరుగుబాటులు, అరాజకం, నిరుద్యోగం, బ్లాక్‌మార్కెట్‌, నల్లడబ్బు వంటి సమస్యల గురించి కవులు వేదన, దుఃఖం, కోపం విప్లవభావాలతో కవిత్వం రాశారు.
నగర వర్ణన :
పారిశ్రామిక విప్లవ ఫలితంగా టౌన్లు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా పరివర్తన చెందాయి. ప్రజలు నగరాలకు వలస వెళ్లారు. మహానగరాలు ఆధునికతకు కేంద్రాలైనాయి. నగరాల్లో మధ్యతరగతి మనుషుల్లోని ఏకాకితనం, అసమర్ధత, వేదనల గురించి వచన కవితా ఖండకలు వెలువడ్డాయి. ఆరుద్ర, పినిశెట్టి, సినారె మొదలైన కవులు నగర యాంత్రిక జీవితాన్ని వర్ణించారు. వీధులు, దురాణాలు, హోటళ్ళు, మురుగు కాల్వలు నగర వర్ననలుగా కనిపిస్తాయి. విశాఖ గురించి నారాయణబాబు ఇక్కడి రోడ్లు నీగ్రో స్త్రీ బుగ్గల్లా ఉన్నాయంటారు.
''ఇక్కడ సోడాలో కాక్‌టైల్‌
కిలోల్లో ఉల్లి పాషాణం
సినిమాహాలులో శిశుహత్య
సిరాబుడ్డితో ఆత్మహత్య
విమానంలో భ్రూణహత్య
పెట్టెబండిలో గర్భస్రావం''
అంటూ 'రుధిరజ్యోతి'లో అత్యంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. వచన కవులు నగర జీవనంలోని యాంత్రికతను వివిధ కోణాల్లో వర్ణించారు.
ఆశావాదం :
ఎన్ని వేదనలు, నిరాశలున్నా వచనకవి మనస్థైర్యాన్ని కోల్పోలేదు. చీకట్లోంచి వెలుగుని అన్వేషించాడు. వర్తమానం నుంచి శక్తి సాధించి నవ్యశక్తిని సంతరించుకుని ఉజ్వల భవిష్యత్తుకేసి నడిచారు డా|| సినారె 'మంటలు - మానవుడు'లో
''రానున్న ప్రభాతం రాక తప్పదు
రక్తి సూక్తి సత్యమౌక్తికాన్ని
ప్రసరించక తప్పదు, నవధర్మం
ప్రభవించక తప్పదు'' అంటారు.
దాశరథి 'తిమిరంలో సమరం' చేశారు. అరిపిరాల విశ్వం 'మనిషికి శక్తి ఆశ మాత్రమే!' అంటూ కవితా 'కాలరేఖలు' గీశారు.
యుద్ధవైముఖ్యం :
వచన కవిత ముఖ్యలక్షణాల్లో యుద్ధం పట్ల విముఖత ఒకటి. పైకి ఎంత ఆనందంగా ఉన్నా అందరి మనసుల్లో యుద్ధభయం, విషాదం నిండి ఉంది. కె.వి. రమణారెడ్డి, పేర్వారం, తిలక్‌ యుద్ధం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
గూఢత :
కుందుర్తి అభిప్రాయం ప్రకారం వచన కవిత కేవలం ప్రగతి భావనలకే కాదు. ప్రణయభావనల అభివ్యక్తికి ఉపయోగపడుతుంది. మాదిరాజు, బోయి భీమన్న, రచనలు ఈ కోవలోకి వస్తాయి.
భాష :
ఆధునిక కవులు మధ్యయుగపు భాషను తిరస్కరించారు. తెలుగు భాషకు కొత్త రూపం ఇచ్చారు. కొత్త వస్తువుకు కొత్త భాష, సజీవమైన దైనందిక భాషను యథాతథంగా స్వీకరించారు. సహజసుందరమైన ఈ భాషలో జీవితంలోని జటిలత్వం కన్పిస్తుంది. సమాజంలో న్యాయం, సత్యం వ్యక్తం చేసే జనభాష సాహిత్య భాషయింది. నూతన ప్రతీకలు, బింబాలు వాడారు. గురజాడతో ప్రారంభమైన వ్యవహారిక భాష వచన కవిత్వంలో మధ్యవర్గీయ స్పృహకు అనువైన అభివ్యక్తిగా మలచబడింది. వచనకవులు అవసరాన్ని బట్టి ఆంగ్ల, ఉర్దూ పద ప్రయోగాలు చేశారు. పారిశ్రామిక నాగరికతను ప్రతిబింబిస్తూ శాస్త్రీయ పదజాలం విరివిగా వాడారు. ఎక్కువ ప్రచారంలో ఉన్న విజ్ఞాన విషయాలు- పారిభాషిక పదాలు స్వీకరించారు. రైలు, లగేజి, బ్రేకు, టి.సి వంటి ఆంగ్లపదాలు చెరిషించు, రనండి, ఎర్రటేపు, నీవిన్‌ వంటి విరుద్ధ ప్రయోగాలు చేసిన ఆరుద్ర, మద్రాస్సిటీ, హైహీలుయాన వంటి పదప్రయోగాలు చేసిన పఠాభి; ఇంగ్లీషు అంకెలతో 'అపాయం 3తుంది' వంటి పదాలు సృష్టించిన శార్వరి; వైచిత్రి కోసమే భాషలో ఇటువంటి ప్రయోగాలు చేశారు.

1 comment:

  1. ప్రధమాంధ్ర వచన కవితా పితామహుడు శ్రీ కాంత కృష్ణమాచార్యుడు. ఈయన ౧౦వ శతాబ్దానికి చెందినవాడు.సింహాచల అప్పన్నని తన చాతుర్లక్ష వచనాలతో అర్చిన్చినట్టు చరిత్ర చెప్తోంది...

    ReplyDelete