Friday, June 25, 2010

తమిళ తంబికి వణక్కం ( ప్రొ" ముదిగొండ శివప్రసాద్ ‌)

'త్రిలింగ దేశం మనదేనోయ్‌ తెలుంగులంటే మనమేనోయ్‌'' సుమారు డెబ్బయి సంవత్సరాలకు పూర్వం పైడిపాటి సుబ్బరామశాస్త్రి వ్రాసిన పాటనా చెవులలో ఇప్పటికీ మారుమోగుతున్నది. తెలుగు భాష జాతి అత్యంత ప్రాచీనమైనది. కాని ఏం ప్రయోజనం? నిన్న మొన్న పుట్టిన హిందీ, మరాఠీ, మలయాళ భాషల కన్నా మన పరిస్థితి మరీ హీనంగా మారిపోయింది. పక్కనున్న తమిళులు మనలను చూసి నవ్వుకుంటున్నారు.


భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఏ భాష సౌందర్యం ఆ భాషదే! దేని పలుకుబడి దానిదే! నిజానికి భారత దేశ భాషలలోనే కాదు ప్రపంచ భాషలన్నింటిలోనూ చాలా అందమైన భాష ఏది? అని సాపేక్ష దృష్టి లేకుండా శాస్త్రీయంగా పరిశీలిస్తే తెలుగు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది అజంత భాష. నాద సౌందర్యం తద్వారా సిద్ధిస్తుంది. మాట మంత్రంగా, సంగీత భరితంగా అనిపించేలా వినిపించే భాష మనది. తమిళ భాషకు అక్షరాలు ఇరవై ఆరు మాత్రమే! తెలుగు భాషకు యాభై ఆరు! తమిళులు గర్వంగా చెప్పుకునే జ ష లకు మధ్యలో ఉచ్ఛరించే అక్షరం కూడా తెలుగు ప్రాచీన శాసనాలలో ఉంది. ఇది బండిరాకు కొంచెం సన్నిహితంగా ఉండే లిపి సంజ్ఞ. ఐతే ఏమిటి అని ఎవరైనా ప్రశ్న వేయవచ్చు. అక్షరాలు ఎక్కువైన కొద్దీ భాషోచ్ఛారణలో క్లారిటీ పెరుగుతుంది. తమిళంలో కాంతి అని వ్రాసి గాంది అని పలుకుతారు ఉర్దూలో సీతారామయ్య అని వ్రాసి సత్తార్‌మియ్యా అని పలుకుతారు. ఇంగ్లీషు మరీ ఘోరం. లిపికీ, సంజ్ఞకూ, ఉచ్ఛారణకూ సంబంధమే ఉండదు. ఐనా అది అంతర్జాతీయ భాష కాబట్టి నోరు మూసుకొని పిల్లలకు అలాగే నేర్పవలసిందే! టి ఎ ఎల్‌ కె అని వ్రాసి టాక్‌ అని ఉచ్చరింపవలసిందే! ఎల్‌ ఏమయింది. అంటే సైలెంట్‌ అని భాషా శాస్త్రవేత్తలు సంజాయిషీ చెప్పారు. శెభాష్‌! సైలెంట్‌ అయితే మరి వ్రాయటం ఎందుకు? టి ఎ ఎ కె అని వ్రాస్తే పోదా? అయితే శివప్రసాద్‌ షేక్స్పియరు కన్నా గొప్పవాడు కాడు. అందుకని వాళ్ల భాష వాళ్ల ఇష్టం అంటారే కాని నా మాట ఎవడు వింటాడు? విశ్వనాథ సత్యనారాయణ గారు 1963వ సంవత్సరంలో విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అనే నవల వ్రాశారు. కాకతాళీయంగా ఆ నవల ముద్రణ నా చేతులమీదుగానే ధారావాహికంగా ప్రచురింపబడటమూ పుస్తకంగా ముద్రింపబడటమూ జరిగింది. దయచేసి తెలుగువారంతా దానిని చదివి తీరాలి.


మళ్లీ మొదటికి వస్తాను. తెలుగు భాష బ్రాహ్మీ లిపి నుండి పుట్టిందని అంటారు. మరి తమిళ లిపి ఎలా పుట్టింది? తమిళ అక్షరాలను దివ్యఫలకాలపై వ్రాసి పరమశివుడో, కుమారస్వామియో వారికి ఇచ్చాడని ఒక కథ. నమ్మితే నమ్మండి లేకుంటే లేదు. ఈ వివరాలు కొన్ని ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో నీత్కారుని కథ అనే ఘట్టంలో ఉన్నాయి. తమిళులకు భాషాభిమానం ఎక్కువ. ప్రతివాడూ తన మాతృభూమిని మాతృభాషనూ ప్రేమిస్తాడు. తెలుగువారు తప్ప! తెలుగువారికి భాషాభిమానం లేదు. ''తెలుగు తల్లిట తెలుగు తల్లి ఈ చంద్రబాబు సెంటిమెంటల్‌ (మెంటల్‌?) డైలాగులు కొడతాండు అని అన్నది ఎవరు?? తెలుగువారు కలిసి ఉండరు. ప్రపంచ తెలుగు భాషా మహోత్సవాలు చేసుకోరు. తమిళనాడులో ప్రపంచ తమిళ మహాసభలు జరుగుతున్నాయి. తమిళ ప్రభ ఏమిటో వారు ప్రపంచానికి ఉజ్వలంగా చాటుతారు. మరి తెలుగు వాళ్లు ఏం చేస్తున్నారు? కొట్టుకొని చస్తున్నారు. ఇదీ అభిశప్తమైన ఒక జాతి చరిత్ర.
ఎట్టి దురభిమానం లేకుండా చెపుతున్నారు. ఆషామాషీగా కాదు సుదీర్ఘ అధ్యయనానంతరం చెపుతున్నాను. తమిళం కన్నా హిందీ కన్నా కూడా తెలుగు చాలా సుసంపన్నమైన భాష. తక్కిన భాషా కవులకు ఈ కవుల సరసన కూర్చునే అర్హత కూడా లేదు. ఇది ప్రాంతీయ దురభిమానంతో అనటం లేదు.
రెండువేల సంవత్సరాల చరిత్ర గల తెలుగు భాషను అధ్యయనం చేసి అంటున్నాను. ఒక్క సంస్కృత భాషను మినహాయిస్తే తెలుగుతో సాటిరాగల భాష మరొకటి లేదు. కాని మన దురదృష్టం ఏమిటి? బుద్ధి పూర్వకంగా భాషా సంపదను విచ్ఛిన్నం చేసుకున్నాము. నన్నయనుండి చిన్నయ వరకు గల మొత్తం సాహిత్యాన్ని తుడిచి పెట్టాలని ఈ గడ్డమీద పుట్టిన తెలుగు బిడ్డలు ప్రయత్నించటం దారుణం. శారదాదేవి ''అక్ష''మాల నుండి ఎన్నో అక్షరాలు జారిపోయాయి. అరసున్న బండిరా దంత, తాలవ్యాలు మాయమయ్యాయి. శ ష స భేదం కూడా అదృశ్యమైపోయింది. ఇట్లా భాషా సంపదను భ్రష్ఠు పట్టించాము. పాఠకుడు పాటకుడు అయినాడు. స్థానబలం అని వ్రాసి పంపితే స్థనబలం అని అంగప్రదక్షిణ అంటే అంగ ప్రదర్శన అని మన డిటిపి పండితులు టైపుచేసి పంపుతున్నారు. ఏం చేయను? నిస్సహాయుణ్ణి. ఈ పతనానికి ప్రేక్షక పాత్ర వహిస్తున్నాను.


2010 జూన్‌ నెలలో తమిళనాడులో ఒక ఉద్యమం మొదలైంది. ఎక్కడెక్కడ తమిళేతర నామాలున్నాయో వాటిని అన్నింటినీ తమిళ ప్రత్యామ్నాయ నామాలతో మారుస్తున్నారు. అంటే ప్రపంచ తమిళ మహాసభలకు ఇది పూర్వరంగం మంచిపనే కదా! కాదన గలమా? కాని ఎందుకో కొందరు తమిళులకు ఇదేదో మరీ ''అతి''గా అనిపించి పత్రికలలో నిరసన తెలియజేశారు. ''స్టాలిన్‌'' అనే నిరంకుశ నరరూప రాక్షసుడి పేరు నీకెందుకు? తమిళం పేరు పెట్టుకో అని కె.బాలు అనే చెన్నై రచయిత ఒక ప్రముఖ పత్రికలో వ్రాశారు. ఆ మాటకొస్తే రామచంద్రన్‌, జయలలిత, కరుణానిధి, దయానిధి మారన్‌,చిదంబరం, మణిశంకర అయ్యవారు (అయ్యశబ్దం ఆర్య శబ్ద వికృతి) ఇవేవీ కూడా తమిళనామాలు కావు. విశుద్ధ సంస్కృత పదాలు. సూర్య టి.వి. కూడా సంస్కృత పదమే. ధనుష్కోటి, మహాబలేశ్వర్‌, బృహదీశ్వర, కాంచీపురం, మధుర, నాగపట్టణం వంటి పేర్లను కూడా మారుస్తారా? ఏమో ఎవడికి తెలుసు! లక్ష్మణన్‌ అనే పేరును ఎలకుమారన్‌గా మార్చారు. మరి రామన్‌, ముత్తురామన్‌ రామస్వామి నాయకర్‌ వంటి పేర్లను ఎలా మారుస్తారు?? వేచి చూద్దాం!! నాస్తిక పార్టీల వారు దేవాలయాల్లో సంస్కృతం వాడకూడదని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ మధ్య హైదరాబాద్‌లో కొందరు త్యాగరాయ గానసభ పేరును కాళోజీ ప్రాంగణంగా మార్చాలని, రవీంద్ర భారతిని కొమరం భీం కళామందిర్‌గా మార్చాలని బ్రహ్మానందరెడ్డి పార్కును అసఫ్‌ జాహీ పార్క్‌గా హైదరాబాద్‌, సికిందరాబాదులను బాగామతి, తారామతి నగర్‌లుగా మార్చాలని ఆందోళన చేశారు. మంచిదే కదా!!


ఎవరు ఎన్ని మాటలు చెప్పినా తమిళులు కార్యశూరులు. వారిలో వారికి పరస్పర అభిప్రాయ భేదాలున్నా భాషా సంస్కృతుల విషయంలో వారంతా ఏకమై ఇతరులపై తిరగబడతారు. తెలుగువారు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, బృహత్‌ దండకారణ్య అంటూ భయంకరంగా సంఘర్షించుకుంటున్నారు. పురాణాలలో సుందోప సుందుల కథ మనకు గుర్తుండే ఉంటుంది. ఎవడికీ భాషాభివృద్ధి, సాంస్కృతిక పోషణ మీద దృష్టి లేదు. శ్రీకృష్ణ దేవరాయలు మావాడు అంటూ కన్నడిగులు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మహోత్సవాలు మొదలు పెట్టారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌, శ్యామశాస్త్రి, వీరంతా మావారేనని తమిళులు సగర్వంగా చెప్పుకుంటున్నారు. కాదనగలమా? త్యాగరాజును బ్రతికించింది తమిళులే కాని తెలుగు వారు కాదు. నిజానికి తమిళనాడును వందలాది సంవత్సరాలు తెలుగు నాయకరాజు పరిపాలించారు. తెలుగు భాషను యక్షగానాలను పోషించారు.


ఆ మాటకొస్తే తెలుగువాడు కోనసీమ బ్రాహ్మణుడు అయిన మయూర శర్మ కేరళను పరిపాలించి వారికి వేద భిక్షను పెట్టాడు. ఆదిశంకరాచార్యుల పూర్వీకుల కోనసీమ బ్రాహ్మణులు. కాలడికి వలసపోయారు. బర్మావంటి ప్రాంతాల్లో తెలంగ్‌ అనే ఒక జాతి ఇప్పటికే ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి కాని అల్లుడి నోట్లో శని అని తెలుగు సామెత తమిళులలో భాషాభిమానం ఉంది తెలుగు వారికి అది లేదు. ఒక తెలుగువాడు కాస్త అభివృద్ధిలోకి వస్తే వాడి కాళ్లు పట్టి గుంజడానికి పదిమంది సిద్ధంగా ఉంటారు. అందుకే వీరు విశ్వామిత్రుని చేత శపింపబడ్డావారు అని ఐతరేయ బ్రాహ్మణంలో కొన్నివేల సంవత్సరాల క్రితమే వ్రాశారు. ఇది మన ఖర్మ!! తెలుగు సంస్కృతి కాస్త వికసిస్తుందని సంతోషించే లోపలే ఎవడో ఒక రావణాసురుడు పుట్టి మనకు ఆ ఆనందం దక్కకుండా చేస్తాడు. ప్రపంచ తమిళ మహాసభలు జరుపుకుంటున్న తమిళ జాతిని అభినందిద్దాం. తమిళ సింహళ తమిళ తెలుగు భాషీయుల మధ్య సహనం పాటించవలసిందిగా ఈ సందర్భంలో కరుణానిధి జయలలిత గార్లకు విజ్ఞప్తి చేద్దాం! తెలుగు పాఠశాలలు నడుపుకుంటుంటే కృష్ణగిరి వంటి తెలుగు జనాధిక్య ప్రాంతాలపై తమిళులు దాడిచేయటం తగదు అని ప్రార్థిద్దాం!! తమిళులను చూసైనా మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు ఇలాంటి ప్రపంచ తెలుగు మహాసభలకు రూపకల్పన చేయాలని ఆశిద్దాం!!                                                                             ----------ప్రొ// ముదిగొండ శివప్రసాద్‌

No comments:

Post a Comment