Thursday, July 29, 2010

An article on Molla Ramayanam -- రాసిన వారు: నిడదవోలు మాలతి


Download Molla Ramayanamu here : Molla Ramayanamu
http://tethulika.wordpress.com

“కుమ్మర మొల్లగా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని కథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనంముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో. మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను గమనించింది -మొల్ల రామాయణంలో 2400 శ్లోకాలు రాసిందని “మానుషి” అన్న ఇంగ్లీషు పత్రికలో చూసినప్పుడు. ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఆతరవాత లలిత, తారూ రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని. అప్పుడే నాకు మొల్లగురించిన ఆసక్తి మొదలయింది. ఇవి చదివినప్పుడు నాకు తోచిన మొదటి ఆలోచన శ్లోకం అన్నది సంస్కృత సాంప్రదాయవిశేషం. మొల్ల సంస్కృతాన్ని వదలి, జానుతెలుగులో రాయపూనుకున్న కవయిత్రి. ఆమె రచనని శ్లోకాలు అనడం ఆమెకి ఒక పాండిత్యస్థాయిని కల్పించడంకోసమేమో అనిపించింది. ఆరుద్ర మొల్ల రామాయణంలో ఉన్నవి 871 గద్యపద్యాలు అనీ, ప్రస్తుతం లభ్యమయిన ప్రతులు సమగ్రమయినవి కాకపోవచ్చు అనీ రాశారు (సమగ్రాంధ్ర సాహిత్యం, సం.2.). నాకు దొరికిన ప్రతిలో పద్యాలూ, వచనం ఒకే వరసలో లెక్కించి, మొత్తం ఆరుకాండలలో 880 ఉన్నట్టు చూపించారు. అందులో వచనంగా గుర్తించిన భాగాలు 208. అవి కొన్ని కేవలం ఒకటి రెండు మాటలు “అట్టి సమయంబున,” “అని మఱియును” లాటివి అయితే, కొన్ని దాదాపు ఒకపేజీ నిడివి ఉన్నాయి. మరో రెండు, మూడు చోట్ల గద్య అని కూడా ఉంది. దీనికి పీఠిక రాసినవారు (పరిష్కర్త కావచ్చు) క.కో.రా. అని ఉంది కానీ ఆయనెవరో నాకు తెలీదు. కోరాడ రామకృష్టయ్యగారేమో. రాసిన
మొల్లనిగురించి తెలిసింది చాలా తక్కువ అని మొదట్లో చెప్పేను. చదువుతున్నకొద్దీ, నాకు అబ్బురం అనిపించిన కొన్ని విషయాలు ముందు ప్రస్తావిస్తాను.
మొదటిది ఆమెపేరు, “కుమ్మర” మొల్లగా ప్రచారం కావడం. నేను చూసినంతవరకూ మరే ఇతర కవిని గానీ కవయిత్రిని గానీ కుల, వృత్తులపేరుమీదుగా ప్రస్తావించినట్టు కనిపించదు. ఆమె తనకు తానై ఎక్కడా తనపేరు “కుమ్మర మొల్ల” అని చెప్పుకోలేదు. మరి ఈ కుమ్మర అన్నపదం ఇంటిపేరుకి మారుగా ప్రాచుర్యంలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు.
పూర్వకవులు తమగ్రంథాదిని కులగోత్రాలు, వంశక్రమం చెప్పుకోడం సాంప్రదాయం. మొల్ల తాను రచించిన రామాయణానికి అవతారికలో “గురులింగజంగమార్చనపరుడు, శివభక్తరతుడు, బాంధవహితుడు” అయిన కేసయసెట్టి తనయనని చెప్పుకుంది. తండ్రినిగురించి రాస్తున్నప్పుడు కూడా కులప్రసక్తి కానీ వృత్తి ప్రసక్తి కానీ లేదు. అంచేత, ఈ కుమ్మర నామవిశేషణం ఆమెపేరుకి ముందు తగిలించడం, పరిష్కర్తలూ, ప్రచురణకర్తలూ చేసిన నిర్ణయంగానే కనిపిస్తోంది తప్ప మొల్ల అభిమతంగా తోచదు.
రెండవ అంశం “మొల్ల” అన్న పేరు ఆధారంగా పండితులు ఆమెవృత్తి లేక కులం నిర్ణయించ పూనుకోడం. ఈవిషయం ఆండ్ర శేషగిరిరావుగారు “ఆంధ్రవిదుషీమణులు” అన్న గ్రంథంలో విపులంగా చర్చించేరు. స్థూలంగా – మొల్లకనుపర్తి వరలక్ష్మమ్మగారు మొల్ల తన రామాయణంలో వేశ్యలగురించి ప్రస్తావించినతీరు చూస్తే, ఆమె వేశ్య కాదని స్పష్టంగా తెలుస్తుంటారు. శేషగిరిరావుగారు కూడా ఆమె కులటాంగన కాదనే నిర్ధారించేరు. మల్లియజాతికి చెందినపువ్వు. పూర్వకాలంలో పువ్వులపేర్లు వేశ్యలు మాత్రమే పెట్టుకునేవారుట. అంచేత ఆమె వేశ్య కావచ్చునని ఒక వాదన. ఈవాదనకి ప్రతిగా
మొల్ల కాలనిర్ణయం చేసినప్పుడు కూడా ఆమె రామాయణంలోని అవతారికే ఆధారమయింది. అందులో ఆమె గౌరవపురస్సరంగా పేర్కొన్న పూర్వకవులు ఆధారంగా ఆమె పదహారవ శతాబ్దం కృష్టదేవరాయలకాలంలో జీవించి ఉండవచ్చునని నిర్ణయించేరు. ఇక్కడ నాకు కలిగిన సందేహం – మొల్ల తన రామాయణంలో పేర్కొన్నకవులు గుర్తుగా వారి జీవితకాలం ఆధారంగా ఆమె కాలనిర్ణయం చేసేరు కానీ ఆమెతరవాత కవులు ఎవరైనా ఆమెని పేర్కొన్నారో లేదో వివరించలేదు. నేను సాహిత్యమంతా తరిచి చూడలేదు కానీ పైన పేర్కొన్న పండితులు పేరెన్నిక గన్నవారే. వారి వ్యాసాలలో ఈ ప్రస్తావన లేదు. శేషగిరిరావుగారు ఏదో ఒక ఉదాహరణ చెప్పేరు కానీ మళ్లీ అది మొల్లగురించి కాదేమోనన్న సందేహం కూడా వెలిబుచ్చారు. మరి మొల్లని ఆమెకాలంలోనూ, ఆ తరవాతా ఎవరైనా ఆమెను రామాయణకర్త్రిగా గుర్తించి ప్రశంసించేరా లేదా, ఈ విషయంలో పరిశోధన ఏమైనా జరిగిందా లేదా అన్నది తెలిసినవారెవరైనా చెప్పాలి.
విద్య మాటకొస్తే, తాను అట్టే చదువుకోలేదని ఆమె వినయంగా చెప్పుకున్నా, ఆమెరచనలో చమత్కారాలూ, పాండిత్యప్రకర్షా, పూర్వకవుల గ్రంథాల్లో భాషగురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు చూస్తే, ఆమె విస్తృతంగా కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నట్టే కనిపిస్తుంది. ఉదాహరణకి, అవతారికలో ఈ పద్యం చూడండి.
దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్
సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రపంధము
లాయా సమాసంబులర్థములును
భావార్థములుఁ గావ్యపరిపాకములు రస
భావచమత్కృతుల్ పలుకుసరవి
బహువర్ణములును విభక్తులు ధాతు లం
లంకృతి చ్ఛంధోవిలక్షణములుఁ
గావ్యసంపదక్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుఁగ విఖ్యాత
గోపవరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి.
పైపద్యంలో వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టాఆవర్జాలు వల్లించడం ఏమీ తెలీనివారికి సాధ్యం కాదు కదా. అంతే కాదు, తాను సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణానికి తెలుగుసేత చేస్తూ, మళ్లీ అందులో సంస్కృత సమాసాలు వాడడం సముచితం కాదంటుంది.
తాను అలా “కావ్యసంపదక్రియల” జోలికి పోనని చెప్పి, పదం చూడగానే పాఠకుడికి అర్థం తోచని భాషలో రాస్తే అది మూగ, చెవిటివారు ముచ్చటలాడినట్టే ఉంటుందంటూ హాస్యమాడుతుంది..
తేనె సోఁక నోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగచెవిటివారి ముచ్చట యగును.
నాలుకకి తేనె తగలగానే నోరు తీయన అయినట్టే పదానికి అర్థం చదువుతుండగానే పాఠకుడికి స్ఫురించాలి అని ఆమె అభిమతం!
తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాటివి ఉన్నాయి. సాయంశోభని వివరిస్తూ చెప్పినపద్యాలలో మచ్చుకి ఒకటి -

మేలిమి సంధ్యారాగము
వ్రాలిన చీకటియు గఁలిసి వరుణునివంకన్
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టే నట నభోమణి తలగన్.
సాయంకాలపు నీరెండ, కమ్ముతున్న చీకటులతో కలిసి నీలాలూ, కెంపులూ అతికినట్టున్నాయిట ఆకాశంలో.
పాఠకులమనసుని అలరించే చమత్కారాలూ (కందువలు) సామెతలూ కూర్చి అందంగా చెప్తే వీనులవిందుగా ఉంటుంది అంటుంది మొల్ల.
కందువమాటలు సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెలుఁగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధులమదికిన్.

ఆండ్ర శేషగిరిరావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మవంటి అనేక ప్రముఖులు మొల్ల తన రామాయణాన్ని జానుతెనుగులో, సులభశైలిలో సకలజనులకూ అర్థమయేరీతిలో రాసింది అని మెచ్చుకున్నారు. మొల్ల కూడా అలాగే తన రామాయణం “మూగ చెవిటి ముచ్చట” కాకుండా ఉండేలా రాయదల్చుకున్నట్టు చెప్పుకుంది. ఆమెరచనలో చవులుఁ బుట్టు జాతీయాలు కోకొల్లలుగానే ఉన్నా, సంస్కృత సమాసాలు, ముఖ్యంగా యుద్ధవర్ణనలో, నాయకీ, నాయకుల వర్ణనలలో క్లిష్ట భూయిష్టమయిన సంస్కృతసమాసాలు చాలానే కనిపించేయి. నేను చాలాచోట్ల తడుముకోవలసివచ్చింది అర్థంకోసం. “జాను తెనుగు,” “వాడుకభాష” లాటి పదాలకి ఆనాడు ఉన్న అర్థాలు ఈనాడు అన్వయించుకోలేం అనుకోవాలి.
మూలరామాయణంలో లేని కొన్ని సన్నివేశాలు మొల్ల స్వతంత్రించి ఇతర రామాయణాలనుండి స్వీకరించడం జరిగింది. అయోధ్యకాండలో రాముడు స్వర్ణనది దాటేముందు గుహుడు ఆయనపాదాలు కడగడం వాటిలో ఒకటి.
సుడిగొని రాముపాదములు సోఁకి ధూళివహించి ఱాయెయే
యేర్పడ నొక కాంతనయ్యెనఁట పన్నుగనీతని పాదరేణువి
య్యడవడి నోడసోఁకనిదియేమగునో యని సంశయాత్ముఁడై
కడిగెగుహుండు రాముపదకంజయుగంబు భయమ్ముపెంపునన్.

ఈ సన్నివేశం వాల్మీకిరామాయణంలో లేదు కానీ అధ్యాత్మరామాయణంలో ఉందని ఆరుద్ర అంటున్నారు. అలాగే మరో సన్నివేశం – పరశురాముడు రాముడిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వడం కూడా వ్యాస రామాయణంలో లేదనీ, భాస్కరరామాయణంనుండి తీసుకున్నదనీ అంటున్నారాయన. వీటివల్ల మొల్ల విస్తృతంగా తెలుగు, సంస్కృతగ్రంథాలు చదివిందనే అనుకోవాలి. ఈ గుహుడికథ చిన్నప్పడు నాలుగోక్లాసు, ఐదోక్లాసు వాచకాల్లో ఉండేది. ఈ కథ అంత ప్రాచుర్యం పొందడానికి మొల్ల రామాయణమే కారణం కావచ్చు.
*******************************************************
నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.

    మదనాగయూధసమగ్రదేశము గాని
    కుటిలవర్తనశేషకులము గాదు.
    ఆహవోర్వీజయహరినివాసము గాని
    కీశసముత్కరాంకితము గాదు
    సుందరస్యందనమందిరంబగు గాని
    సంతతమంజులాశ్రయము గాదు
    మోహనగణికాసమూహగేయము గాని
    యూధికానికరసంయుతము గాదు
    సరససత్పుణ్యజననివాసము గాని
    కఠిననిర్దయదైత్యసంఘము గాదు
    కాదు కాదని కొనియాడఁ దగినట్టి
    పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.

“కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం చూడగలం. ముందు చెప్పేను ఆమె కవిత్వంలో సంస్కృతసమాసాలు విశేషంగా ఉన్నాయని. అది కూడా పైపద్యంలో గమనించవచ్చు.

అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం -
ఏమృగంబును గన్నఁ నేణాక్షి గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
ఏపక్షిఁ గనుగొన్న నెలనాగ గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
… … …
సీత గానఁబడమి శ్రీరామచంద్రుండు
విరహతాపవహ్ని వేఁగి వేఁగి
అంటూ సీతకోసం ఆయన అనుభవించిన వేదనని పాఠకులమనసుకి గట్టిగా తగిలేలా చెప్తుంది మొల్ల. ఈ ప్రయోగం యుద్ధకాండలో నిశేషించి ఇతోధికంగా భావసమన్వితమవుతుంది. మూడు ఆశ్వాసాలలో ఆమె చేసిన యుద్ధవర్ణన చదువుతుంటే స్వయంగా యుద్ధం చూసైనా ఉండాలి, లేదా యుద్ధానికి సంబంధించిన గ్రంథాలు విశేషంగా చదివి అయినా ఉండాలి అనిపించకమానదు.

మొల్ల పదాలు వాడుకోడంలో పొదుపరి, ఆమెకి ఆమెయే సాటి అంటూ మలయవాసిని, ఆరుద్ర సుందరకాండలో రామలక్ష్మణులని వర్ణించమని సీత హనుమంతుని అడిగిన సందర్భం ఉదహరిస్తున్నారు. హనుమంతుడు నిజంగా రాముని పంపున వచ్చినవాడవునో, ఇది కూడా రాక్షసమాయేనేమో నన్న సందేహంతో సీత వారిని వర్ణించమంటుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు.
సీ. నీలమేఘచ్ఛాయఁ బోలు దేహము వాఁడు
ధవళాబ్దపత్రనేత్రములవాఁడు
కంబుసన్నిభమైన కంఠంబు గలవాఁడు
బాగైనయట్టి గుల్భములవాఁడు
…. … ….
అని రాముని వర్ణించి, లక్ష్మణుని,
ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాఁడు.
అంటాడు. లక్ష్మణుడిని గురించి మళ్లీ వేరే చెప్పక్కర్లేదు. ఆయనకి కూడా ఈవర్ణనంతా సరిపోతుంది, రంగు మాత్రమే వేరు అని. పైన చెప్పినట్టు ఈపద్యం కూడా నేను చిన్నప్పుడే విన్నాను కానీ ఇది మొల్లవిరచితమని ఇప్పుడే తెలిసింది!

పూర్వకవులు మొల్ల పాండిత్యాన్ని స్పృశించినట్టు కనిపించదు కానీ ఆధునికకాలంలో పండితులు కొందరైనా ఆమె కవిత్వాన్ని తమ వ్యాసాల్లో చర్చించారు.

దివాకర్ల వెంకటావధానిగారు, “తానంత విద్యాసంపన్నురాలు కాదని చెప్పుకొన్నా ఈమె కావ్యమున పాండిత్యలోపమెచ్చటను కానిపింపదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచిములయి మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేతనగరవర్ణనము శ్లేష శబ్దాలంకారపూరితమై ఆమె పాండితీవిశేషమును పలు విధముల సూచించుచున్నది” అంటారు. “ఈమె శైలిని మృదుమధురపద గుంఫితమును, భావబంధురమునై సర్వజనరంజకముగా నుండును”, “ఔచిత్యపోషణలో కూడా అందె వేసిన చేయి” అని కూడా ప్రశంసించారు. (ఆంధ్ర వాఙ్మయచరిత్ర, పు 59-50).

అయితే ఈ ఔచిత్యపోషణవిషయంలో ఆండ్ర శేషగిరిరావుగారి అభిప్రాయం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఆమె స్త్రీవర్ణనలోనే కాక ఇతర సందర్భాలలో కూడా స్త్రీల శరీరభాగాలు ఉపమించడంలో “పూర్వకవి సాంప్రదాయాన్ని పాటించుట విశేషము” అంటారు. శేషగిరిరావుగారు ఈవిషయాన్ని మూడు పేజీలనిడివిలో చర్చించడం నాకు విశేషంగా అనిపించింది!

నేను ఈవ్యాసం రాయడానికి ఉపక్రమించిన తరవాత, మొల్ల సినిమాగా కూడా వచ్చిందని సౌమ్య చెప్పింది. ఈసినిమా వచ్చేవేళకి అంటే 1970లో నేను ఇండియాలోనే ఉన్నాను. అప్పట్లో సినిమాలు బాగానే చూసేదాన్ని కూడా. అయినా ఎంచేతో ఇది మాత్రం నాదృష్టికి రాలేదు. ఇప్పుడు లైబ్రరీలో పుస్తకాలు చూస్తుంటే ఇంటూరి వెంకటేశ్వరరావు మొల్ల జీవితం ఆధారంగా రాసిన నవల, ఆ నవల ఆధారంగా సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ కనిపించేయి. ఈ నవలవిషయంలో మహానటుడు చిత్తూరు నాగయ్య కథాగమనంవిషయంలో వెంకటేశ్వరరావుతో విబేధించేరని ఇద్దరూ తమ ముందుమాటలలో చెప్పుకున్నారు. ఆ అభిప్రాయబేధాలు ప్రత్యేకించి ఏవిషయంలోనో తెలీదు గానీ నాకు అభ్యంతరకరంగా అనిపించిన విషయాలు ప్రస్తావిస్తాను.

ప్రాక్తనకవులగురించి చదువుతున్నప్పుడు సహజంగానే ఆ కాలంలో ఆచారవ్యవహారాలగురించి కూడా తెలుసుకోగలుగుతాం అన్న ఆశ ఉంటుంది మనకి. సుప్రసిద్ధ కవులజీవితాలకీ, ఆనాటి సాంఘికపరిస్థితులకీ అవినాభావసంబంధం ఉంటుంది. మనఅవగాహన కూడా పరస్పరానుబంధంగానే ఉంటుంది. అంటే ఒకటి తెలిస్తే, రెండోది మరింత విపులంగా తెలుస్తుంది. అంచేతే ఏదో ఒక ఎజెండా పెట్టుకుని రచయితలు తమ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేస్తే, అది సాహిత్యానికి ద్రోహమే అవుతుంది. రచయితలో నిజాయితీ లోపించినట్టే అనిపిస్తుంది.

పలువురి ప్రశంసలు పొందిన ఒక సుప్రసిద్ధ కవయిత్రిని తీసుకుని నవల రాస్తున్నప్పుడు ఆ గౌరవం అలా నిలబెట్టేదిగా ఉండాలి రచన. అంతేకానీ తమ రాజకీయసిద్ధాంతాలు ప్రచారం చేసుకోడానికి ఆ పాత్రని తమ ఇష్టంవచ్చినట్టు మలచడం ఆపాత్రని అగౌరవపరచడమే అని నా అభిప్రాయం..

ఈనవలలో రచయిత మొల్ల చిన్నతనంలో అనాగరీకంగా, విసృంఖలంగా ప్రవర్తించినట్టు చిత్రించారు. ఆనాటి సాంఘికదురన్యాయాలు దుయ్యబట్టడం మొల్లద్వారా జరిగినట్టు చూపించడంకోసం అలా చిత్రించడం జరిగినట్టుంది. నిజానికి ఆనాటి సాంఘిక దురన్యాయాలు నిరసించడానికి మొల్ల వ్యక్తిత్వాన్ని వక్రీకరించనవసరం లేదనే నా అభిప్రాయం. సమర్థుడయిన రచయిత ప్రచారంలో ఉన్న వ్యక్తిత్వాలని యథాతథంగా వాడుకుంటూనే, కథని నడిపించగలడు. గలగాలి. అంతటి బలమైన మరొక పాత్రని సృష్టించలేక, మొల్లని వాడుకున్నట్టు అనిపించింది నాకు ఈనవల చదువుతుంటే. నాదృష్టిలో ఇది నవలారచనలో లోపమే.

రెండో అభ్యంతరం – అలా మొల్ల పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తుండగా, ఒక దేవదాసి ఉద్బోధనతో జ్ఞానోదయమై, అడవులకు పోతుంది. అక్కడ ఒక సుందరాకారుడు కనిపించి మొల్లకి “ఆడదాని”లా ప్రవర్తించడం, సిగ్గు పడడంతో సహా, నేర్పి ఆమెని “నిజమైన ఆడదాన్ని” చేస్తాడు. ఇది కూడా నాకు అసంబద్ధంగానే అనిపించింది.

ఆమె రచించిన రామాయణంలో అవతారికలోనూ, చివర మంగళాశాసనంలోనూ కూడా తాను శ్రీగౌరీశవరప్రసాద లబ్ధననీ, గురుజంగమార్చనవినోద, సూరిజనవినుత, నిత్యశైవాచార సంపన్న, కవితాచమత్కారి అయిన ఆతుకూరి కేసనసెట్టి తనయననీ, మొల్ల నామధేయననీ చెప్పుకుంది. మహాభక్తుడూ, కవీ అయిన కేసనసెట్టి ఇంట పెరిగిన మొల్లని అదుపాజ్ఞలు లేక దుడుకుగా ప్రవర్తించిన అనాగరీకురాలుగా ఊహించడం సమర్థనీయంగా తోచడంలేదు నాకు. అంతేగాదు. ఆమె రచించిన గ్రంథంలో ఎనలేని పాండితీగరిమ ప్రదర్శించింది. అంతటి పాండిత్యం శ్రద్ధగా నిష్ఠతో ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప రాదు. పరమ నిష్ఠాగరిష్ఠుడయిన తంఢ్రి శిక్షణలో ఆమె విద్యావతిగానే పెరిగినట్టు కనిపిస్తోంది.

సినిమావిషయం నాస్నేహితురాలు వైదేహికి చెప్తే, తను ఇంటర్నెట్‌లో ఉందని నాకు లింకు పంపింది. సినిమాగా బాగుంది. బహుశా మొల్ల పేరు పెట్టకుండా మరో బలమైన స్త్రీపాత్రని సృష్టించి తీసినా ఆ సినిమాకి లోపమేమీ ఉండేది కాదేమో.

మొల్ల రామాయణం పండితులనీ పామరులనీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. కారణం ఆమె పాండిత్యమే కానీ ఆమె కుమ్మరి వంశజురాలు కావడం కాదు. ఆమెచుట్టూ అల్లినకథలు ఆ కావ్యాన్నే ఆధారం చేసుకుని, ఆ గౌరవాన్ని ఇనుమడించేలా చేయడమే సమంజసం.

మొల్లకి పూర్వం చాలామంది మగకవులు రామాయణాలు రాశారు కానీ మొల్ల రామాయణం మాత్రమే కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచింది అన్నారు ఆరుద్ర సమగాంధ్ర. సాహిత్యం, 2వ సంపుటంలో. ఈ ఒక్కవాక్యం చాలు మొల్ల కవితాప్రౌఢిమ ఎంతటి పటిష్ఠమైనదో ఘనతరమైనదో చెప్పడానికి. ఈ రామాయణం అంతర్జాలంలో లభ్యం. పాఠకులసౌకర్యార్థం పిడియఫ్ ఫైలు ఇక్కడ

Wednesday, July 7, 2010

ఆముక్తమాల్యద Amukta Malyada by Sri Krishna Deva Rayalu


Download Amukta Malyada here: Amukta Malyada


సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలు లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది.


 ప్రారంభం

ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవేంకటేశ్వరుని స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు 'శ్రీ' శబ్దం తో కావ్యామారంభించినాడు.

    శ్రీ కమనీయ హారమణి
    జెన్నుగ దానును, గౌస్తుభంబునం
    దాకమలావధూటియును
    దారత దోప పరస్పరాత్మలం
    దాకలితంబు లైన తమ
    యాకృతు లచ్ఛత బైకి దోపన
    స్తోకత నందు దోచె నన
    శోభిలు వేంకట భర్త గొల్చెదన్.

సాధారణంగా శార్దూల విక్రీడములతో కావ్యములు ప్రారంభించుట పరిపాటియై యుండగా, ఈ కావ్యము ఉత్పలమాలతో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, రంగనాయకుల పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.

శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన

కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవేంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు.విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగు పరచి శ్రీవేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించినాడు. రాయలు తరువాతి పద్యములలో చాల భాగము తిరుమల నంతయు సాక్షాత్కరింపజేసినాడు.

తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:

    పూని ముకుందునాజ్ఞగనుబొమ్మనె
    కాంచి యజాండభాండముల్
    వానను మీద బోవ నడు
    వ న్గొనెదన్నననగ్రనిశ్చల
    త్వానుచలత్వనిష్ఠలె స
    మస్తజగంబుల జాడ్యచేతనల్
    గా నుతి కెక్కు సైన్యపతి
    కాంచనవేత్రము నాశ్రయించెదన్.

హరి పాంచజన్యమును పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడ ఒనగూర్చునని రాయల శుభాసంసన.

    హరిపూరింప దదాస్య మారుత సుగం
    ధాకృష్ణమై నాభిపం
    కరుహక్రోడమిళిందబృంద మెదు రె
    క్కందుష్క్రి యాపంక సం
    కరదైత్యాసు పరంపరం గముచు రే
    ఖం బొల్చురాకానిశా
    కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం
    గళ్యాణసాకల్యమున్.

శంఖు చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖువు గదలను వర్ణించినాడు. శ్రీవారి నందక ఖడ్గం పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:

    ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ
    భాస్వత్త్సరు స్తంభ సం
    స్థితి దీండ్రించెడుజాళువా మొసలివా
    దీప్తార్చిగా గజ్జలా
    న్వితధూమాసితరేఖ పైయలు
    గుగా విజ్ఞానదీపాంకురా
    కృతి నందం బగు నందకం బఘలతా
    శ్రేణిచ్ఛిదం జేయుతన్.


శ్రీ వైష్ణవ మతాచార్యులైన పన్నిద్దరాళ్వారులను రాయలు ఇలా కీర్తించాడు:

    అలపన్నిద్దఱు సురులందును సము
    ద్యల్లీలగా పన్నవె
    గ్గల ప్రందాపము బాపునా నిజమనః
    కంజాతసంజాతపు
    ష్కలమాధ్వీకఝరి న్మురారి నొగియం
    గా జొక్కి ధన్యాత్ములౌ
    నిలపన్నిద్దఱుసూరులందల తు
    మోక్షేచ్ఛామతిందివ్య్రులన్.

రాయలు ఆముక్తమాల్యదను శ్రీకాకుళాంధ్రదేవుని ఆనతిమీద శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. అనేక ప్రబంధ రాజములను కృతిభర్తగా శ్రీకృష్ణదేవరాయలు లోకైకనాధుడు శ్రీవేంకటేశ్వరునికి ఈ క్రింది విధంగా ఆముక్తమాల్యదను సమర్పించాడు:

    అంభోధికన్యకాకుచ
    కుంభోంభితఘసృణమసృణ గురువక్షునకున్
    జంభారిముఖాధ్యక్షున
    కంభోజాక్షునకు సామిహర్యక్షునకున్.

Tuesday, July 6, 2010

శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది పట్టాభిషేక ఉత్సవాలు

‘తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
ఎల్లనృపులు గొలువనెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స..!’
(You may ask why I instruct you to compose particularly in Telugu (because you are very adept in Samskritam, you may think writing in Telugu is not so great) - I tell you - this is Telugu land, and I am the Telugu Lord, and then Telugu is the only one (without comparison). Haven't you been speaking multiple languages, as you are worshipped by kings from all over - you should know that Telugu is the greatest among all languages! )

                        
ఈ సువర్ణాక్షరాలు కన్నడ రాజ్యరమారమణుడైన శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా తన ఆముక్తమాల్యద ప్రబంధంలో చెప్పిన పద్యమిది. దేశభాషలన్నింటిలోనూ తెలుగుకున్న ప్రత్యేక ఘనత ప్రకాశితమైనది. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిరోహించి 500 సంత్సరాలు పూర్తయ్యాయి.
తెలుగు భాషకు, జాతికీ గౌరవాన్ని తీసుకొచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ప్రాతఃస్మ రణీయుడు. విజయనగర సామ్రాజ్య వైభవం అనంతపురం జిల్లాలో కూడా విస్తరించి ఉంది. అందుకే ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఉత్సవ కార్యక్ర మాన్ని నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈనెల 27 నుం చి 29వరకూ కర్నాటక ప్రభుత్వం కూడా హంపి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. నేటి చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గరలోని దేవకీపురంలో నాగ లాంబ, నరసనాయక దంపతులకు 1471 జనవరిలో శ్రీకృష్ణదేవరాయలు జన్మించి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. నాడు శ్రీరంగపట్టణ గవర్నరుగా ఉన్న వీరప్పగౌడ కుమార్తె తిరుమలదేవితో 1498లో వివాహం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు నాగలాదేవిని వివాహమాడి ఆమె పేరును చిన్నాదేవి గా మార్చాడు. ఆ తర్వాత 1510లో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆయన పట్టాభిషేక మహోత్సవానికి ఇప్పటికి 500 సంవ త్సరాలైయ్యాయి.


కళాపోషకులు...
కవులను కళాకారులను ఆదరించడం కృష్ణదేవరాయల నిత్య కృత్యం. విజయ నగర రాజుల మొదటి రాజధాని హంపి. ఆ తర్వాత శ్రీకృష్ణదేవ రాయల కాలం లో అంతర్గత కలహాల అనంతరం తన ప్రధాన పరిపాలనా కేం ద్రం పెనుకొండ అయ్యింది. ఆనాడు పెనుకొండలో విడిది కేంద్రంగా శతృదుర్బేధ్యంగా ఒక కోట నిర్మించుకున్నారు. ఆ కోటలోనే మందుగుండు సామగ్రి, ఫిరంగులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన మంత్రి, గురువు అయిన అప్పాజీని ఖైదు చేసింది కూడా ఇక్కడే. అప్పాజీ మరణానంత రం ఇక్కడే ఆయన సమాధికూడా ఇక్కడే వుంది.అప్పాజీ మరణానంతరం శ్రీకృష్ణ దేవరాయలు కుంగిపోయి రాజ్యభారాన్ని నాడు చంద్రగిరిని పాలిస్తోన్న తన సోదరుడైన అచ్యు తరాయలుకు కట్టబెట్టాడు. తదనంతరం 1542లో అధికారం రామరా యలు చేతికి వచ్చింది.


సన్నాహాలు చేస్తోంది...
శ్రీకృష్ణదేవరాయల పాలనలో హంపి వైభవాన్ని కవులు కళ్లకు కట్టినట్లు తెలిపా రు. 1565లో తళ్లికోట యుద్ధం జరిగింది. ఆ యుద్ధం శ్రీకృష్ణదేవరాయల అల్లుడు రామరాయలకూ, బహమనీ సుల్తానుల మధ్య ఘోర యుద్ధం జరిగిం ది. ఆయుద్ధంలో బహమనీ సుల్తానుల దాడికి ఆగలేక రామరాయలు పట్టుపడ్డాడు. తదనంతరం బహమనీ సుల్తానులు రామరాయల తల నరి కి విజయనగర సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నారు. ఒకనాడు హంపి వీధుల్లో వజ్రాలు, రత్నాలను రాసులుపోసి అమ్మేవారని చరిత్రకారుల వలన తెలుస్తోంది. అలాంటి ఉన్నతమైన విజయనగర సామ్రాజ్యం తళ్లికోట యుద్ధంతో పతనమైం ది. ఒక అద్వితీయ ప్రతిభావంతుడు, సాహిత్య సమరాంగణ సార్వభౌముడు, కళాపోషకుడు, కళారాధకుడు, సంస్కృతాంధ్ర కన్నడభాషల్లో కవి అయిన శ్రీకృష్ణదేవరాయలను స్మరించు కుంటూ ఈ నెలలో అటు కర్నాటక రాష్ట్రంలో నూ, ఇటు మన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్సవాలను ఇరు ప్రభుత్వాలూ నిర్వహిం చడానికి సన్నాహాలు చేస్తున్నాయి.


హంపి... 
ఆనాటి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ నగర వీధుల్లో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట! రాజులుపోయారు... రాజ్యాలూపోయా యి... నేడు ఆ అద్భుతమైన హంపి నగరం చారిత్రక కథలు చెప్పే శిధిల నగరం. తరువాత కాలగర్భంలో కలిసిపో యింది. పురాతత్వవేత్తలు తరువాత కాలంలో తవ్వకాల్లో అనేక కట్టడాలూ, దేవాలయాలూ బయల్పడ్డా యి. ఆ హంపి పరిసర ప్రాంతాల్లో తుంగభద్రా నది ప్రవహి స్తుండటంతో ప్రకృతి అందాలు రమణీయతను విరజిమ్ముతాయి. పచ్చని చెట్లు, పొలాల మధ్య వెలసిన హంపి క్షేత్ర దర్శనం మహా భాగ్యమని పర్యాటకుల అభిప్రాయం.


కొనియాడుతూనే ఉన్నారు...
హంపిలో వెలిసిన శివుని పేరు విరూపాక్షేశ్వరుడు. ఇక్కడ హంపిలో విరూపాక్ష దేవాలయం, రాతిర థం, ఉగ్ర నరసింహ, శివలింగ, గణేశ విగ్రహాలు, రాణి స్నానగృహం, కమలమహాల్‌, గజశాల, హజ రారామదేవాలయం, అనెగుంది కోట, మాతంగ పర్వతం, కోదండరామ ఆలయం, యంత్రోద్ధారక హనుమంతుడు, హేమకూటము, కడ్లెకాళు గణప తి, శ్రీకృష్ణ దేవాలయం, బడవలింగ ఆలయం, వీర భద్ర దేవాలయం, అక్కాచెల్లెళ్ల రాయి, పాతాళే శ్వర ఆలయం, దండనాయకుని కోట, మహానవమి దిబ్బ, నల్లరాతి కళ్యాణి, కమలాపురంలో ప్రాచ్య వస్తు సంగ్రహాల యం, మల్లప్పగుడి, అనంత శయ న గుడి, పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటు న్నాయి. హంపి గత వైభవాన్ని పర్యాటకులు, రచ యితలు తమ రచనల్లో నాటి నుంచి నేటి వరకూ కొనియాడుతూనే ఉన్నారు.


హంపి శిల్పకళా సౌంద ర్యం జీవితంలో ఎన్నడూ చూడలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది రోమ్‌ నగర మంత విశాలమైనదని, ప్ర పంచంలో అద్భుతమైన సదుపాయాలు కలిగి ఉన్న నగరంగా హంపిని విదేశీ పర్యాటకులు కూడా వర్ణించారు. హంపి ప్రాముఖ్యత చాటి చెప్పేందుకు ఆలస్యంగానైనా గుర్తించిన ప్రభుత్వం 1987లో మొదటిసా రిగా హంపి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఏటా హంపి ఉత్స వాల ను తిలకించేందుకు లక్షలాదిమంది ప్రజలు, పర్యాటకులు హంపికి చేరుకుంటా రు. అక్కడ పగటిపూటను తలపించే విధంగా రాత్రి వేళల్లో విద్యుత్‌ దీపాలు దేదీ ప్యమానంగా వెలుగుతుంటాయి. ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రజలు మంత్రముగ్ధులై తిలకి స్తూ పండుగ వాతావరణంలో గడపడం విశేషం. ఆ విశేషం ఈ నెల 27 నుండి 29 వరకు జరగనుంది.


-దామర్ల విజయలక్ష్మి,

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు


ఇతరమతాల బారినుండి హిందూ మత సంరక్షణకు కన్యాకుమారి నుండి కటకము వరకు రాయలసీమలో తెలుగుజాతి వీరులను నిల్పిన విజయనగర సామ్రాజ్యపు పట్టుకొమ్మలు కంచి, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి రాయదుర్గము, పంపానగర విజయనగరము. ''కంచి'' ఐక్యమత్య విధానంతో శివకంచి విష్ణు కంచి, వేగవతీ నది తీరాన నిల్పిన పుణ్య భూమి.

శ్రీ కృష్ణదేవరాయలు తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు, తిమ్మరుసు గోవింద రాజులు చంద్రగిరిలో జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానము పెనుగొండ. అన్ని విద్యలూ పెనుగొండ, చంద్రగిరి, విజయనగరాలలో అభ్యసించారు.


శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు పూర్వీకులు తెలుగుగడ్డలో పుట్టి తెలుగుతల్లి పాలు తాగిన వీరులు. తిమ్మరుసు, తండ్రి రాచిరాజు. తాత వేమరాజు. వీరు కొండవీడు, ఉదయగిరి సామంతరాజు. బహమనీ సుల్తాన్లు గజపతులు తాల్రాజును హతమార్చి నందువలన తిమ్మరుసు తండ్రి రాచిరాజు 1460లో చంద్రగిరి చేరారు. అందుకే తిమ్మరుసు పగపట్టిన కొండవీటి సింహం. గజపతులతో 7 సంవత్సరాలు యుద్ధం జరిపి పగతీర్చుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయలను గజపతుల అల్లునిగా జేసారు. కాని గజపతులు వ్లుెచ్ఛాబ్ధి కుంభోద్బవులు. తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అంత్య దశలో కుట్రలు పన్నారు. కాని తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అనుబంధము విడదీయరానిది. వారు చివరి వరకూ ఆత్మీయులే. శ్రీకృష్ణదేవరాయలుకు, తిమ్మరుసు 67 సంవత్సరముల వయస్సులో సాధారణ మరణము సంభవించినది. (వసుంధరా పిహ్లెట్‌-ఫ్రాన్స్‌ -విజయనగర్‌-నేషన్‌ బుక్‌ ట్రస్ట్‌).


వరాహపురాణములో తెలుగు ఆది జంటకవులు ఘంటసింగయ్య, నంది మల్లయ్య, శ్రీకృష్ణ దేవరాయల పూర్వీకులు కంచి, అరణి దగ్గర దేవకీపుర దుర్గాధీశులు అని వివరించారు. ఆనాటికి ఈనాటికి కంచి పరిసర ప్రాంతాలలో తెలుగు మాతృభాషగా గల బ్రాహ్మణులు, వైశ్య, కాపు బలిజలు, చేనేత వర్గాలు, బలహీనవర్గాలు, దళితులు, ముస్లిములు ఎక్కువగా యున్నారు. ఆనాటి రాయలకొలువులో రాజకీయ ప్రాబల్యము వీరిదే.


తిమ్మరాజు శ్రీకృష్ణ దేవరాయలు ముత్తాత. భార్య దేవకి పేరున కంచి దగ్గర దేవకీపురము నిర్మించారు. తిమ్మరాజు కుమారుడు ఈశ్వరాయలు, భార్య బుక్కాంబ. క్రీ.శ. 1456 సంవత్సరము నాటికే ఈశ్వరరాయలు విజయనగర రాజప్రతినిధిగా సాళ్వనరసింహరాయలు సేనాధిపతిగా చంద్రగిరి నారాయణ వనములో ఉన్నారు. ఈశ్వరరాయలు సాళ్వనరసింహరాయలు కుడి భుజంగా కన్నడ ప్రాంతాలైన ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నము, పశ్చిమ తెలుగు ప్రాంతాలు జయించారు. 1481 మార్చినెలలో బహమనీ సుల్తాన్‌ మహమ్మద్‌ షా కంచి దేవాలయము దోపిడీ సొమ్మును కందుకూరు వద్ద అడ్డగించిసొమ్ముతో సహా శిబిరము దోచుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయల తండ్రి నరసరాయలు సాళ్వనరసింహరాయల సేనాధిపతిగా, బహమనీ సైన్యాధ్యక్షుడు ఆదిఖాన్‌ ఫకాషి ఉల్ముల్కును పెనుకొండ వద్ద ఓడించాడు.


చివరి సంగమరాజు ప్రౌఢదేవరాయలు బలహీనుడు. ఈ సమయంలో నరసరాయలు పెనుకొండ నుండి సైన్యము సమీకరించుకొని విజయనగరము ప్రవేశించాడు. విజయనగరము అవలీలగా స్వాధీనమైనది. సాళ్వనరసింహరాజు సింహాసనము అధిష్టించాడు (1485).


శ్రీకృష్ణ దేవరాయల తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు యిరువురూ సాళ్వనరసింగరాయలు వద్ద చంద్రగిరి నారాయణవనములో సేనాధిపతులు, కార్యకర్తలు, విశ్వాసపాత్రులుగా వున్నారు. చంద్రగిరి నారాయణ వనములో జన్మించిన నరసరాయలు చంద్రగిరి , పెనుకొండ, గుత్తి ప్రాంత విజయనగర రాజప్రతినిధిగా ఎక్కువ కాలమున్నాడు.


ఈ కాలములో తిమ్మరుసు చంద్రగిరి నారాయణవనంలో ఉంటూ తమ్ముడు గోవిందరాజులు, నరసరాయలు పెనుకొండ యందు ఎక్కువ కాలము (1485 నుండి 1490) ఉండేవిధంగా ప్రయత్నించారు. ఈ సమయములో 1489లో శ్రీకృష్ణ దేవరాయలు సాగివంశపు రాజకుమారి నాగులాదేవికి పెనుకొండ యందు జన్మించినాడు.


''తిప్పాజీ నాగలాదేవ్యో: కౌసల్య సుమిత్రాయో'' వీరనరసింహ రాయల శాసనము ప్రకారము నాగలాదేవి నరసరాయకుని కుల వధువని దేలుచున్నది. (డా|| నేలటూరి వెంకటరమణయ్య) శ్రీకృష్ణ దేవరాయల తల్లి సాగివంశపు రాజకుమారి అని-శ్రీరాజాదాట్ల వేంకట సింహాద్రి జగపతిరాజు సమర్పించిన తామ్రశాసనము వివరించింది. విజయనగర చరిత్ర-నూతలపాటి పేరరాజు) శ్రీకృష్ణదేవరాయలు జన్మస్థానము చంద్రగిరి నారాయణవనము అనడానికి తక్కువ ఆధారాలు వున్నాయి. అచ్యుత దేవరాయలు, శ్రీరంగరాయలు జన్మస్థానాలు పెనుకొండ. పెనుకొండ సమీపాన స్మార్తసమన్వయ శివకేశవుల దేవాలయాలు 32 ప్రాకారాలు గల చోళ సముద్రం లేపాక్షి శిల్ప, చిత్ర, సంగీత, నాట్య కళల విశిష్ఠ దేవాలయము విరుపన్న నాయకుని సోదరుడు విరుపన్న చేత అచ్యుత దేవరాయలు నిర్మింపజేశాడు. అచ్యుతాపురము, తల్లి ఓ బుళాపురము, తమ్ముడు శ్రీరంగనాయకులు పేరున ఉక్కడం శ్రీరంగాపురం నిర్మించారు.


శ్రీకృష్ణ దేవరాయలు యింటి పేరు సంపెటవారు అని పెద్దన వల్ల తెలుస్తోంది. పెద్దన గారి చాటువు- ''సంపెట నరపాల సార్వభౌముడు''


రాయరావుతుగండ రాచయేనుగు వచ్చి- యార్లకోట గోరాడునాడు- ''సంపెట నరపాల సార్వభౌముడు'' వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు.


సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు- మా పెనుకొండ గ్రంథము- పేజీ నెం.59.


పొరపాట్లు చరిత్రలో అనేకం జరుగుతుంటాయి. ''రాయల సీమలో ఒక వింత అలవాటుంది. వంశం పేరు వేరుగా ఉంటుంది. రాయలవంశం తుళువంశం వారి యింటి పేరు సంపెట వారు. నేటికీ అనంతపురం జిల్లాలో సంపెట అని యింటిపేరు గల బలిజలు చాలామంది ఉన్నారు. పెనుకొండలో అనేక యుద్ధాలు జరిగాయి. విజయనగర ప్రారంభదినాల్లో పెనుకొండ ప్రధాననగరము. తర్వాత రాజధానిగా మారింది. పెనుకొండ శాపం వల్ల శిలగా మారిన ఒక అప్సరస.


అల్లసాని పెద్దన మనుచరిత్రలో చంద్రవంశపు యయాతి రాజు కుమారుడు తుర్వసుని కీర్తి స్ఫూర్తి వలన రాజవంశము పేరు తుళువాన్వయ మైయ్యిందని (పద్యము 21-22 యందు) వివరించారు. తెలుగు వ్యాకరణం ప్రకారము ''ర'' ''ళ''గా వ్యవహరింపబడి తుర్వసులు-తుళువసులుగా మారింది.


కర్ణాటకము భాషాపదము కాదు. విశాల దక్షిణాపథములో ఒక భాగం, ఒక రాగం, ఒక కర్నాటక సంగీతం. విజయనగర సామ్రాజ్యము దక్షిణాపథ సామ్రాజ్యము. కన్యాకుమారి నుండి కటకము వరకు గల రాయల సామ్రాజ్యము రాయలసీమ.


విజయనగరము పంపానగరమని, అనాది నుండీ పేరుగల తెలుగు తల్లి పార్వతీ పరమేశ్వురుల పుణ్యస్థలము. తెలుగువారు ఆదిశివగణము నాగులయక్షుల ప్రతిబింబాలు. అందరూ నేడు చాళుక్యుల ప్రాంతము హిరణ్యరాష్ట్రమని అంగీకరిస్తున్నారు. చాళుక్య నందరాజు వారసుడు విజయద్వజుడు క్రీ.శ.1150లో విజయనగరము నిర్మించినారు. ఆ పుణ్యఫలము చేత చాళుక్యుల వారసుడు ఆరవీటి సోమదేవ రాజు కుంజరకోన (ఆనెగొంది)లో మాలిక్‌ నెబిని ఓడించాడు (క్రీ.శ.1334). ఆనెగొంది స్వాధీనం చేసుకొన్నాడు. ఆర్వీటి పిన్నమరాజు, రాఘవుడు కంపిలి రాయలను ఓడించారు. ఆనాడే తెలుగు తేజము కాకతీయుల రాజ్యం శంఖం పూరించి ''తేషాం శిరోభూషణమేవ దేశ త్రిలింగ నామా జగదేక సీమా'' అని తెలుగువారి యందు ఏకతా భావం కలిగించారు. విశాల విజయనగర సామ్రాజ్యానికి తెలుగు రాజులు పునాదులు వేశారు. ముస్లిములు ఆనాడే విభజించి పాలించే విధానాలు ప్రారంభించారు. హరహరరాయులు, బుక్కరాయలు తెలుగువారు కాకతీయుల బంధువులు. విధివశాన ముస్లిము రాజుల చేతిలో బందీలైనారు. ముస్లిము సుల్తాన్‌ పంటపండింది. ముస్లింల సైన్యసహకారంతో ఆనెగొంది, కంపిలి ప్రాంతాల స్వాధీనానికి సహకరించినారు. ప్రారంభంలో హరిహరరాయలు, బుక్కరాయలు ఆరవీటి వారిని వీరబల్లాలుని ఎదురించలేక గుత్తి, పెనుకొండ ప్రాంతాలలో మొదట స్థావరాలు ఏర్పరచుకొని క్రమంగా ఆనెగొంది స్వాధీనపరచుకొన్నారు. కావున విజయనగర స్థపనకు ఆదిస్థానం తెలుగు నేల స్మార్తసమన్వయ బ్రాహ్మణ మత విద్యారణ్య స్వామి అండదండలతో విజయనగర సామ్రాజ్యము అభివృద్ధి చెందింది. విద్యారణ్యస్వామి వారు తెలుగువారు. ఆనాటికి ఈనాటికి విజయనగర సామ్రాజ్యము తెలుగువారి సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్యము కుంజరకోన (ఆనెగొంది) పంపానగరము (హంపి) నేడు కన్నడ రాష్ట్రములో వున్నా తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యములో మొదటి నుండి చివర వరకు తెలుగు, తమిళ, మళయాళ భాషా ప్రాంతాలు 80 శాతము కన్నడ ప్రాంతాలు కేవలము 20 శాతము! కన్నడ ప్రాంత రాజులు ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్నం నిరంతరం స్వతంత్రించేవారు.


విజయనగర సామ్రాజ్యము తల, మొండెము, కాళ్లు, చేతులు కంచి, చంద్రగిరి, పెనుకొండ, గుత్తి పంపానగరము విజయనగరము. విజయనగర సామ్రాజ్య స్థాపన కాలము నుండి చివరి వరకు -యువరాజులు లేక కాబోవు విజయనగర రాజులు ఈ ప్రాంతాల రాజప్రతినిధులుగా ఉన్నారు.


శ్రీకృష్ణ దేవరాయలు రెండవ రాజధాని విజయనగరం వలే ఏడు కోటలు గల పెనుకొండ, వేసవి విడిది, వసంతోత్సవాలు స్థావరంగా ఎక్కువ కాలము గడిపేవారు. వ్యాసరాయలు కృష్ణరాయలు ఏకాంతంగా రాజకీయాలు పెనుకొండలో చర్చించుకొనేవారు. నాగలాపురము, నాగసముద్రము గ్రామాలు పెనుకొండ సమీపంలో వున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానమో? విద్యాస్థానమో? రణరంగ విద్యాబుద్ధులు అప్పాజీ, గోవిందరాజులు నేర్పించిన స్థానమో? చారిత్రక పరిశోదనలు అవసరము. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, రాజకవి, కవిపోషకుడు. భువనవిజయంలో అశువుగా కవిత్వం చెప్పగల మేథావి. యాంధ్రులతో గుడిమాడి జీవనము సల్పియాంధ్రమున గ్రంథరచనము చేసి యాంధ్రకవుల నాదరించి పోషించి యాంధ్రవాజ్ఞయమును పెంపొందించిన తుళువరాజులు ఆంధ్రులనడంలో సందేహం లేదు. -డాక్టర్‌ నేలటూరి వెంకటరమణయ్య.


దేవకి, తిప్పాంబ, నగలాదేవి, ఓబాంబ, తిరుమలమ్మ, వరదరాజమ్మ తెలుగు రాజ పుత్రికలను వివాహమాడిన విజయనగర రాజులు తెలుగువారే.


శ్రీకృష్ణదేవరాయలు శ్రీవేంకటేశ్వరుని నిరంతర భక్తుడు. తిరుమలాంబ, చిన్నాదేవి విగ్రహాలు తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయప్రాంగణంలో ఆనాడు కొలువు తీరి వుండేవి. మరి ఈనాడో?


చివరికి మిగిలేది? శ్రీకృష్ణదేవరాయల అమరగాథ తెలుగువారి అందరి కథ. చిటికన వేలు కొనగోటితో దక్షణాపథము సంరక్షించిన తిమ్మరుసు తమ్ముడు గోవిందరాజు స్మృతి చిహ్నాలు పెనుకొండలో నిదిరిస్తున్నవి. ఆ స్మృతి చిహ్నాలను శ్రీకృష్ణదేవరాయలు రాయలసీమ రాజసం, తేజంతో ఉట్టి పడేలా నిర్మించారు. ఆనాడుబానిసలం. తిమ్మరుసు వర్దంతి ఉత్సవాలు సమాధుల వద్ద జరుపలేదు.


నేడు స్వంతంత్రులం. కాని ఈనాడో?

శ్రీ కృష్ణదేవరాయ మహోత్సవాలు! - 500th Anniversary of Coronation Of Sri Krishnadevaraya

‘శ్రీకృష్ణదేవరాయలు’ పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అందించే స్ఫూర్తితో తెలుగు సంస్కృతీ పునర్వికాసానికి నడుం కట్టడం మన విద్యుక్త ధర్మం.
తెలుగు ప్రజలున్న అన్నిచోట్లా నేటికీ శ్రీకృష్ణదేవరాయలు నిలిచే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, బయటి రాష్ట్రాల్లోకూడా తెలుగువారికి నేటికీ ఆయన స్ఫూర్తి దాత. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవే ఇందుకు కారణం. యుద్ధతంత్రంలో ఎంత నేర్పరో, సాహితీక్షేత్రంలోనూ అంతటి ప్రతిభాశాలి. సైనికబలంతో పాటు కవి దిగ్గజాలను కూడా తనతో తోడ్కొని వెళ్లి యుద్ధ విరా మ సమయాల్లో సాహితీగోష్ఠి జరిపిన రాజు మరొకరు మనకు చరిత్రలో కనిపించరు. అందుకే ఆయనను సాహితీ సమరాంగణ సార్వభౌముడు అన్నారు.
తెలుగువారు భాషాప్రయుక్త రాష్ట్రంకోసం, విశాలాంధ్ర కోసం చేసిన పోరాటంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు స్ఫూర్తికేంద్రం. సంస్కృత భాషలో పండితుడయివుండీ, ఇతర ద్రావిడ భాషలు తెలిసినవాడయివుండీ తెలుగులో ‘అముక్తమాల్యద’ వంటి ప్రబంధ రచన చేయడం ఆయనకు తెలుగుభాషతో, తెలుగుజాతితో ఉన్న మమేకతను తెలుపుతుంది. ప్రజల భాషలో పరిపాలన చెయ్యాలని, తన ప్రజల భాషాసాహిత్యాల వికాసానికి రాజే బాధ్యుడనీ ఆచరణాత్మకంగా నిరూపించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. నేటి మన ప్రజా ప్రభుత్వాలు శ్రీకృష్ణదేవరాయల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. పరిపాలకుడుగా సామరస్యతను, రాజనీతిని ఎలా ప్రదర్శించగలిగాడో, ప్రజల భాషను ప్రోత్సహిస్తూనే వివిధ భాషీయులున్న సమాజం లో భాషా జాతి సమైక్యతను ఎంత నేర్పుగా సాధించ గలిగాడో, శ్రీకృష్ణదేవరాయలనుంచి నేర్చుకోవాలి. భారతీ య సంస్కృతీ మర్యాదలను పటిష్టం చేస్తూ, వాటి విలువలను చాటి చెప్పడంలో నిపుణతకు ఆయన ఒక ప్రతీకగా నిలిచాడు.
అయితే, ఇంతటి మహావ్యక్తి గురించి, ఇంతటి గొప్ప పాలకుడి గురించి పరిశోధన ఏమాత్రం జరిగింది? ఆయనను గురించిన వివరాలను వెలికితీసి ఎంతమాత్రం గ్రంథస్థం చేశాం? విదేశీ రచయితలు మన ముందుకు తెచ్చిన వివరాలే మనకు ఆయన్ను గురించి కొంత సమాచారాన్నందిస్తున్నవి. శిలాశాసనంతోపాటు, సాహిత్య సంపద మాత్రమే మనకు ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తున్నది. వీటి ఆధారాలతోనైనా మనం ఎంతో పరిశోధన చేయవలసివుంది.
కృష్ణాజిల్లా విజయవాడకు 45 కి.మీ. దూరంలో కృష్ణా నది ఒడ్డున శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణువు దేవాలయం ఉన్నది. తొలి ఆంధ్ర సామ్రాజ్య స్థాపకుడుగా ప్రసిద్ధుడై, ఆదర్శ రాజ్యాన్ని స్థాపించి, చరిత్రకెక్కిన ఆంధ్ర మహా విష్ణువు క్రీస్తుపూర్వం అయిదారు శతాబ్దాల నాటివాడని తెలుస్తున్నది. అప్పటికే భాషా సంస్కృతులు కలిగిన నాగరిక రాజ్యాన్ని ఆ ఆంధ్ర నాయకుడు ఏలినట్లు తెలు స్తున్నది. ఇప్పుడు తెలుగుభాషా ప్రాచీనతను మనం నిరూపించుకొనే కృషిలో దీన్ని ఒక ప్రధానాంశంగా గ్రహించాలి. తర్వాత దాదాపు 2000 ఏళ్లకు, 1518లో కళింగ జైత్ర యాత్రకు వచ్చిన ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడు’ శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించడానికి 1518 ఫిబ్రవరి 11న వచ్చి ఇక్కడ విడిది చేశాడు. ఆ పుణ్యరాత్రి శ్రీకాకుళాంధ్రదేవుడు రాయలవారికి కలలో ప్రత్యక్షమై ‘అముక్తమాల్యద’ రచన చేయవలసిందిగా ఆదేశించాడట. దాదాపు రెండువేలేళ్ల తర్వాత, మరొక సువిశాల తెలుగు సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ తొలి తెలుగు నాయకరాజు దేవాలయాన్ని దర్శించి స్ఫూర్తి పొందడం, ‘అముక్త మాల్యద’ వంటి ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టడం… ఈ తెలుగుజాతి ఆత్మజ్యోతి ఎంత శక్తి మంతమైనదో మనకు తెలుపుతున్నది.
తెలుగువారి తొలి రాజధానిలో విడిది చేసిన శ్రీకృష్ణదేవరాయల అంతరంగంలోకి ప్రవేశించిన ఆంధ్ర మహా విష్ణువు- ఆనాటికీ ఏనాటికీ చెదరరాని ఒక ఆదేశాన్నిచ్చాడు. ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగు’ అని ఆ ఆదేశం. అంటే ఈ దేశం తెలుగు ప్రజలది కనుక ఇక్కడ తెలుగే రాజ్యమేలాలి అని. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని కూడా ఆయనే చెప్పాడు. ఈ దేశాన్ని పాలించేవాడిగా తాను తెలుగు వల్లభుడననీ చెప్పుకున్నాడు. ఆంధ్రమహావిష్ణువు ఇచ్చిన ఈ ఆదేశాన్ని స్పష్టం చేయడం ద్వారా శ్రీ కృష్ణదేవరాయలు ఒక తెలుగు రాజ్యాధీశుడుగా తన విధాన ప్రకటన చేశాడన్నమాట. ఇదే సమయంలో రాయలు, తన సామ్రాజ్యంలోని అయిదు భాషా ప్రాంతాలకు విజయనగరాన్నే కేంద్రంగాచేసి, శాసనములను తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ, కొంకణ భాషల్లో వేయించాడని, తన ఆస్థానంలో తెలుగు కవులతో పాటు తమిళ, కన్నడ కవులకు కూడా స్థానం కల్పించి గౌరవించాడని మరచి పోకూడదు. భాషా సమైక్యత, జాతీయ సమైక్యతలకు ఆయన ఎంత ప్రాధాన్యమిచ్చాడో గమనించండి.
మన గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా మనం మన భాషా సంస్కృతులను వికసింపజేసుకోవడం మీదే ఆధార పడి ఉంటుంది. మన జాతి ఐక్యతను కాపాడుకొంటూ, రాజ్యాన్ని సుభిక్షంగా విలసిల్లజేసుకోవడం మీదే ఆధార పడి ఉంటుంది. ఈ సత్యాన్ని నాటి ఆంధ్రనాయకుడయిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు, నిన్నటి తెలుగు వల్లభుడైన శ్రీకృష్ణదేవరాయలు ఆచరణాత్మకంగా చాటిచెప్పారు.ఈ మహత్తర చారిత్రక సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసు కుని శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు ఫిబ్రవరి 9నుండి మూడు రోజుల పాటు జరుగుతాయి. అముక్తమాల్యద మండపంలో శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది.మనది తెలుగుజాతి. రెండువేల అయిదువందల సంవ త్సరాల ఘనమైన చరిత్రగల మహోన్నత జాతి. మన జాతి, చరిత్ర, భాష, సంస్కృతుల ఔన్నత్యాన్ని మరచి పోతున్న ప్రస్తుత తరాన్ని జాగృతం చేయడం, వాటి ప్రాచీనతను, గొప్పతనాన్ని మన జీవనవిధానంలోని విశిష్టతను తెలియజేస్తూ ఆత్మౌన్నత్యభావాన్ని పెంపొందించుకుని ‘నేను తెలుగువాడిని’ అని సగర్వంగా ప్రపంచంలో ఏ మూలనైనా ప్రకటించుకొనేలా చేయడానికి కావలసిన స్ఫూర్తిని, సమాచారాన్నీ, ఉత్తేజాన్నీ నింపడానికి శ్రీ కృష్ణ దేవరాయలు సదా మనకు స్ఫూర్తికేంద్రం.


ఆంధ్రజ్యోతి నుంచి: వ్యాసకర్త అవనిగడ్డ శాసనసభ్యులు – మండలి బుద్ధప్రసాద్‌

Friday, July 2, 2010

Viswambhara by C Narayana Reddy


Download Viswambhara here: Viswambhara

విశ్వంభర డా.సి.నారాయణరెడ్డి రచించిన పద్య కావ్యము. ఈ గ్రంధానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడినది. సినారె దీనిని రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. దీనిని మొదటిసారిగా 1980లో ముద్రించారు.


ఈ విశ్వంభర కావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ.స్థాయిలో పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి. దీని మీద ఎం.ఫిల్., పి.హెచ్.డి. పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. దీనిని హిందీలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్ర అనువదించారు.

ప్రస్తావన

ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథ. ఈ కథకు నేపధ్యం ప్రకృతి.

మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.

అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!

కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం - ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!

ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు.

మనిషి సాధన త్రిముఖం - కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.

ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రం 'విశ్వంభర' కావ్యరచనకు పునాది.

రచననుండి ఉదాహరణలు


విశ్వంభర రచయిత డా.సి. నారాయణరెడ్డి
ఆరంభం
నేను పుట్టక ముందే
నెత్తి మీద నీలి తెర
కాళ్ళ కింద ధూళి పొర

ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో
మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి
చిచ్చుముద్దల్లోంచి
చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు
పాలమీగడల్లా పరుచుకున్నాయి

ఇంకా
బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదలింది హరిణాలుగా
నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది
నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది

వేయి తోటలను నరికిన చేయి
పూయిస్తుందా ఒక్క పువ్వును
ఉర్వీతలాన్ని వణికించిన శక్తి
ఒక్క హృదయాన్ని జయిస్తుందా...


ముగింపు
మనసుకు తొడుగు మనిషి
మనిషికి ఉడుపు జగతి
ఇదే విశ్వంభరా తత్వం
అనంత జీవిత సత్యం

అనువాదాలు

    విశ్వంభర కావాన్ని డాక్టర్ అమరేంద్ర ఆంగ్ల భాషలోకి అనువదించారు. దీనిని స్టెర్లింగ్ పబ్లిషర్స్ 1986లో ముద్రించారు. దీనిని హిందీ భాషలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్ అనువదించారు.

ప్రశంసలు, పురస్కారాలు

ఈ రచనకు 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆంగ్ల, హిందీ భాషలలోకి ఇది అనువదించబడింది. కొన్ని విశ్వవిద్యాలయాలలో దీనిని పాఠ్యగ్రంధంగా నిర్ణయించారు. దీనిపై డాక్టరేటు పరిశోధనలు కూడా జరిగాయి. కలకత్తా భారతీయ భాషా పరిషత్తు 'భిల్వారా' అవార్డును, త్రివేండ్రం కుమారన్‌ ఆసాన్‌ అవార్డును, సోవియెట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డును పొందింది.

    ఈ రచన గురించి చీకోలు సుందరయ్య ఇలా వ్రాశాడు - భూమ్యాకాశాల పుట్టుక నుంచి మొదలైన ఈ విశ్వంభర కాలం స్వరూపాన్ని, మనిషి వికాసాన్ని, చైతన్యాన్ని, ఆ చైతన్యం ప్రదర్శించిన విశ్వరూపాన్ని అనేక విధాలుగా ఆవిష్కరిస్తుంది. మానవ ప్రస్థానంలో మజిలీలు, ఆ మజిలీల పునాదుల మీద భవిష్యత్తరాలు సాధించిన విజయాలు, ఆ విజయాల సోపానాల మీద పయనించిన మానవుడు పొందిన అనుభవాలు... అన్నీ విశ్వంభరలో పాఠకుల కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. మనశ్శక్తి వ్యక్తిగా సాగితే జీవిత చరిత్రగా, సమష్టిగా సాగితే సమాజ చరిత్రగా ఎలా కనిపిస్తుందో సినారె కలం దాన్ని ఒడిసి పట్టుకుని మనముందు నిలుపుతుంది. విశ్వంభర ఆధునిక ఐతిహాసిక వచన కవితా కావ్యం. కాల గమనానికి దర్పణం. తేదీలు, దస్తావేజులు, గణాంకాలు లేక మానవ చరిత్రను కీర్తిస్తున్న గానం. ఇందులో కవిత్వాన్ని ఆస్వాదించే వారికి అడుగడుగునా కవిత్వమే లభిస్తుంది... . ... కళాత్మకంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని అంశాలను స్పృశిస్తోన్న విశ్వంభర మరో మాటలో చెప్పాలంటే మనసు కావ్యం ... . విశ్వంభరలోని మానవుడు, కథానాయకుడు ఒక్క భారతీయుడే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇందులో సంపూర్ణ మానవ వికాసమే కావ్యాత్మగా ఉంది. సినారె ప్రతి పంక్తినీ చమత్కారంగా, రసాత్మకంగా తీర్చిదిద్దారు. భావాల్లో కొన్నిచోట్ల నూతనత్వం కొరవడినా సినారె నాజూకు నగిషీ పనితనం నూతనత్వం కలిగిస్తుంది. ఆధునిక కవిత్వంలోని గందరగోళం ఏమాత్రం లేకుండా ప్రతి దృశ్యం పాఠకుల ముందు కదలాడుతూ కాలయంత్రంలా సాగిపోతుంది. ఆ అనుభవాలతో తడిసిపోతుంది.

    ఆచార్య ఎన్‌.గోపీ - "విశ్వంభర అంటే భూమి, ప్రపంచం అని అర్థాలు. అయితే ఇది కేవలం భూగోళం అనే మట్టిముద్దను గురించిన కావ్యం కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని గురించి, వికాసాన్ని గురించి ఆ వికాసక్రమంలో ఆ మనిషి చైతన్యస్థాయి గురించి, ఈ చైతన్యానికి మూలమైన మట్టితో అతని సంబంధాన్ని గురించి. మట్టే విశ్వంభర. విశ్వంభరే మానవుడు"

    డా. పి.వి.రమణ - "విశ్వమానవ ఆత్మకథగా, అనుభవ గాథగా క్లాసిక్‌ ప్రమాణాలతో భావచిత్రాభి వ్యక్తి కవితా శిల్పంలో ప్రతీకాత్మంగా విశ్వంభరను అలంకరించారు.

Thursday, July 1, 2010

‘మహాప్రస్థానం’లో మార్క్సిజం ఎంత? - డా. మలయశ్రీ, ( Marxism in Mahaprasthanam)

శ్రీశ్రీ’’ ఎంత అందమైన పేరో. అది అర్ధవంతం, అపురూప పదం కూడా. ఎందుకంటే మన రాష్ట్రంలో, దేశంలో మరో శ్రీశ్రీ లేరు. ఇది కావాలని పెట్టుకుంది కాదు. సొంత పేరును మార్చలేదు. కొంత కొత్తగా చేర్చలేదు. వ్యక్తిపేరు, ఇంటిపేరు ఆ రెంటి మొదటి అక్షరాలు కలిసి శ్రీశ్రీ అయింది. ఇంత అందంగా మరే సంక్షిప్త నామం కానీ, కలంపేరు కానీ కనిపించదు.
60-70 ఏళ్లుగా అభ్యుదయ కవిత్వానికి అడ్రసు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఎన్ని రాసినా ‘మహాప్రస్థానం’ మలి గేయసంపుటి (తొలి గేయ సంపుటి-ప్రభవ) వారికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. పద్యపుస్తకాల్లో కరుణశ్రీగారి ‘ఉదయశ్రీ’ (మొదటి భాగం), గేయసంపుటాల్లో శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పొందినన్ని ముద్రణలు వేరే తెలుగుపుస్తకం కానీ పొందలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఆ కవిత్వ మహత్యం, భావ పటుత్వం.
శ్రీశ్రీ సినిమా పాటలు, రేడియో నాటికలు మొ. రచనలు వేరు. అవీ బాగున్నాయ్. కొన్ని చప్పనివన్నా, ఉన్నా అది తప్పు కాదు. ముఖ్యంగా మహాప్రస్థానం కమ్యూనిజానికి, కమ్యూనిజం శ్రీశ్రీకి అవినాభావ సంబంధం కలవి అయినై అనవచ్చు. శ్రీశ్రీ కమ్యూనిస్టులకు కొండంత అండ. ఆయన సామ్యవాద సిద్ధాంత కేంద్రం-ఆయన కవిత్వం ప్రచార సాధనం అయింది.
‘మహాప్రస్థానం’ మరోసారి చదవండి. మార్క్సిజం ఊపు, ఉద్యమం ముందు చూపు వున్న గేయాలు అందులో ఎన్ని వున్నవో లెక్కించండి. కాలక్షేపానివి, నిరాశవి, సొంత విషయాలు, అనువాదాలు వదిలితే దాదాపు పదికి మించవు. అవునా? పావుభాగం అయితేనేం! ‘పదండి ముందుకు’, ‘దేశ చరిత్రలు’ రెండు గేయాలు చాలు, శ్రీశ్రీని మహాకవి పీఠంమీద కూర్చోబెట్టడానికి.
ఆధునిక భావాలకు ఆద్యుడు! గురువు అనదగిన గురజాడ ‘సుభద్ర’ పద్యాలు కేవలం సంప్రదాయ కవిత్వమే కదా. పూర్ణమ్మ, కన్యక గేయాలు, సంస్మరణాత్మకమైనవే అయినా అవి కొన్ని కులాల సమస్యలే ‘కన్యాశుల్కం’ భాష, నాటకీకరణ నవ్యంగా భవ్యంగా ఉన్నా ఆ సమస్య ఒక కులానిదే. ‘దిద్దుబాటు’ కథ కథనం శిల్పం గొప్పగా ఉన్నా విషయం సామాన్యం. ‘ముత్యాల స్వరాలు’లో ప్రగతిశీల భావాలున్నాయి. ఒక్క ‘దేశభక్తి’ గేయం చాలు గురజాడ అప్పారావుని ఆధునిక అభ్యుదయ కవుల పంక్తిలో అగ్రస్థానాన నిలపడానికి.
శ్రీశ్రీ సైతం అంతే. ఆయనే కాదు, మరే కవి/రచయిత కానీ, రాసినదంతా వాసికి రాదు-కాదు కూడా! జనం ఆసక్తి అవసరాన్ని బట్టి కవుల రచనలకు ఆదరణ విలువ లభిస్తాయ. ప్రచారం వేరు, మన కులం మతం, పార్టీ అయితే వారి తప్పయిన ఒప్పే. కాకపోతే ఒప్పయినా తప్పే అనే పనికి మాలిన పద్ధతి ఇప్పుడు మన సమాజంలో చాలావరకు చలామణి అవుతున్నది.
శ్రీశ్రీకి యుగకవి, మహాకవి అనే బిరుదులు అనవసరం. అవి రాచరిక కాలంనాటి వందిమాగధ స్తోత్ర పదాలు. శ్రీశ్రీ ఈనాటి ప్రజాకవి. శ్రామిక జన పక్షపాత సామ్యవాద కవి-విప్లవ కవి.
అయితే ఆయనపై కొన్ని విమర్శలు లేకపోలేదు. అవి ఇవి
1. అలవాట్లు, ఆహార విహారాల విషయాలు. అవి వ్యక్తిగతం. లోకంలో ఎవరూ సంపూర్ణ సుగుణవంతులు కారు. సమాజానికి కష్టం కలిగించనంత వరకు వాటి జోలి మనకు అనవసరం. ‘‘పేరు ధర్మరాజు పెనువేప విత్తమా’’ అన్నాడు అజాత శత్రువును మన కవి వేమన. ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది?
2 కమ్యూనిస్టును అంటూ క్యాపిటలిస్టుల సినిమాలకు పనిచేయడమేమిటి? అని మరో ప్రశ్న. ఉదర నిమిత్తం బహుకృత వేషం. తొలి తరం కమ్యూనిస్టు కవులు, నటులు చాలామంది సినీరంగాన్ని ఆశ్రయించినారే. వృత్తిని కాదు, వారి ప్రవృత్తి! ప్రవర్తన ఎట్లుంది? అనేది మాత్రమే మనము పట్టించుకోవలసిన అంశం.
3. శ్రీశ్రీ సంప్రదాయ భావాలు పూర్తిగా వదులు కోలేదని-అప్పుడే కాదు, ఇప్పటికీ కమ్యూనిస్టులు ముఖ్యంగా ఆర్థిక-సామాజిక విషయాలపై చూపుతున్న శ్రద్ధ, కులమత నిర్మూలన-్భతికవాద భావ వ్యాప్తిపై చూపుతూ లేరుకదా, ఇది మన కమ్యూనిస్టుల లోపం, అయినా శ్రీశ్రీ కవనంలోని సంప్రదాయ విధేయత కొంతవరకు ఆలోచనీయాంశమే.
‘‘త్రికాలాలలో త్రిలోకాలలో’’ మొదటిది సరే. రెండవది ఏమిటి? సంప్రదాయ భావమనేనా?
‘‘జగన్నాధుని రథ చక్రాల్ వస్తున్నాయ్’’ అంటే అది పూరి జగన్నాథుని రథ చక్రాల ప్రభావమేనా? సమర్ధన వేరు.
‘‘బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను’’ ఎందుకో? ఉత్తదె అది
‘‘పొలాల నన్నీ హలాలదున్ని’’ అది ప్రాస కోసమే కదా, హలం కంటే నాగలి, అరక అనేవే జనం ఎక్కువగా వ్యవహరించే పదాలు.
ఇంకా ‘‘ఖడ్గసృష్టి’’లో ‘కవి’కి సమాంతరంగా ‘పవి’ అనే పదముంది. అది ఎవరికి తెలిసేది?పవి=వజ్రాయుధం, ఇంద్రునిది.
శ్రీశ్రీకి భాషా సౌందర్యంతోపాటు, భావ గాంభీర్యం, ప్రాసలు ఇష్టం. పులి చంపిన వేడి నెత్తురు-సరే. యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని-జంజెం (జంధ్యం) ప్రసక్తి అవసరమా? ఇది ‘‘బసవనీదు భక్తి బ్రాహ్మంబుతో పొత్తు వదలలేను నేను’’ అని 12వ శతాబ్ది వీరశైవ కవి పాల్కురికి సోమనాథుడు అన్నట్లేనా?
‘‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’ అంటే, ఆ అగ్ని, హోమకుండం! శ్రీశ్రీ కవిత్వంలో సంప్రదాయ వాసన కొంత వుంది. ఉండకూడదు. కాని, అది మన కమ్యూనిజం ప్రారంభ దశ. ఆ తర్వాతి కవులైనా దాన్ని వదులుకున్నారా? అంటే, వారికి ‘‘మహాప్రస్థానం’’ మార్గదర్శకమయ్యె. అందుకే- ‘దివంగత, నివాళి, అదృష్ట దురదృష్ట పదాలు’’ ఇప్పటికీ వాడుతున్నారు కొందరు.
శ్రీశ్రీకి దళిత స్పృహ లేదు-అనేది ఇటీవలి మరో విమర్శ. లేదు నిజమే. కానీ, ఆయన ఏ కులాన్నయినా ఉన్నతమైనదనో, అధమమనో-బలపరచెనా, త్రోసిపుచ్చెనా? లేదే! సామ్యవాదులకు కులమత పక్షపాతం ఉండదు. ఉండకూడదు! శ్రీశ్రీకి లేదు. దళిత కులవాదం ఇటీవలిది. అది కమ్యూనిజంను విమర్శించేదాకా వెళ్లింది. అది వేరు, వాళ్లిష్టం.
ఒక్కో వ్యక్తి అభిరుచి ఒక్కో తీరు. వారి స్థాయిని, సాధనను గుర్తించి వారిని అభిమానించారు. అవసరమైతే అనుసరించాలె. మనకు సాధ్యమైతే మరింత ముందుకు సాగిపోవలె. అట్లయితేనే ప్రయోజనం. ఊరకే విమర్శిస్తూ ఉంటే వృధా కాలహరణం. సాహిత్యమంటే ఏ ఒక్క ప్రక్రియో, భావమో, సిద్ధాంతమో కాదు. సంప్రదాయ విధేయులూ ఉన్నారు. అభ్యుదయ వాద రచయితలూ ఉంటారు. ఎవరివాళ్లను వాళ్లు అతిగా పొగడుతూ వుంటే, విమర్శలు రాక తప్పవు. శ్రీశ్రీ మంచి మనిషి. గొప్ప కవి. ఆయన భావాలకంటే కవిత్వానికి ముగ్ధులమయాం అన్న వాళ్లున్నారు. అయితే శ్రీశ్రీ అభిమానులు కేవలం భజనలు మాని, నిష్పాక్షిక సమీక్షలు వెలువరిస్తే విపక్షుల విమర్శలకు తావుండదు.
- డా. మలయశ్రీ

రాయప్రోలు సాహితి రాశీభూతమైన రసానుభూతి (30న రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి) - - మంగు శివరామ ప్రసాద్

కచకుచాది స్ర్తి అంగాంగ వర్ణనలతో సంభోగ శృంగారానికి పట్ట్భాషేకం చేసిన ప్రబంధ కవుల కబంధ హస్తాలనుంచి సాహిత్య సరస్వతికి విముక్తి కలిగించి శారీరక సంపర్కం లేని వియోగ శృంగారాన్ని శారదా పీఠంపై అధివసింపచేసిన మహోన్నత సాహితీవేత్త రాయప్రోలు సుబ్బారావు. అమలిన శృంగార సమారాధమే తన సాహిత్య సాధనగా పేర్కొన్నారు రాయప్రోలువారు. ‘‘శృంగారః శుచిరుజ్జలః‘‘ అన్న ఆర్యోక్తి వీరి అమలిన శృంగార సిద్ధాంతానికి మూలాధారము. ‘మేఘ సందేశం’ రెండవ సర్గ 52వ శ్లోకంలో వియోగంలోనే ప్రేమ విలసితమని కాళిదాసు ఇలా చెప్పాడు:
‘‘స్నేహనాహుః కిమపి విరహే ద్వంసినస్తే త్వభోగా
దిష్టే వస్తు న్యుపచితరసాః ప్రేమ రాశీభవంతి’’
విరహంలో ప్రేమ నశిస్తుందంటారు. కాని వియోగంలోనే ఇష్టమైన వస్తువుపై ప్రేమ రసానుభూతిని చెంది రాశీభూతమవుతుందని మహాకవి కాళిదాసు భావన. కాళిదాసు ప్రవచించిన వియోగము చివరికి సంయోగానికే దారి తీయడం ప్రాచీన కవులు నిర్వచించిన శృంగార లక్షణం. రాయప్రోలువారు విఫ్రలంబ శృంగారానికే చరమస్థాయిలో ప్రాధాన్యాన్ని కల్పించారు.
‘‘కాలేనా వరణాత్యయాత్ పరిణతే యత్ స్నేహసారే స్థితం
భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకంహి తత్ ప్రాప్యతే’’
కాలం గడిచేకొద్దీ భార్యా భర్తల మధ్య సంబంధము స్నేహంగా మార్పు చెందుతుందని భవభూతి ఉత్తర రామ చరితలో ఈ అంశానే్న చెప్పాడు. భవభూతి ఈ భావానే్న రాయప్రోలు తన అమలిన శృంగార తత్వానికి పరమావధిగా పరిగ్రహించారు. ఆయన రచనల్లో మకుటాయమైన ‘‘తృణ కంకణము’’ ఖండ కావ్యంలో ఈ అభిప్రాయానే్న కావ్యనాయికచేత ఇలా పలికించారు.
‘‘సరససాంగత్య సుఖ వికాసముల కన్న
దుస్సహవియోగ భరమై మధురము సకియ...
కనుల నొండొరులను జూచుకొనుటకన్న
మనసు లన్యోన్య రంజనల్ గొనుటకన్న
కొసరి ‘యేమోయి’యని పిల్చుకొనుటకన్న
చెలుల కిలమీదనేమి కావలయా సఖుడు’’
ఉదాత్త ప్రణయ భావనకు అపురూపమైన రూపకల్పన. పూవుకు తావి అబ్బినట్టు ఈ భావనకు రమ్యతను ప్రసాదించింది స్నేహ మాధుర్యము. చిన్నప్పటినుండి ప్రేమించుకున్న యువతీ యువకులకు విధి వశాన వివాహం కాలేదు. ఆమెకు వేరొకరితో వివాహమవడంతో అతడు భగ్నప్రేమికుడై, ఆమెనే తలుస్తూ కాలం గడుపుతూ వుంటాడు. చాలా కాలం తర్వాత వారిద్దరు కలుసుకున్నప్పుడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా నవకమోడని తృణకంకణాన్ని అతడు ఆమెకు కడ్తాడు. ఎటువంటి మనో వికారానికి లోను కాకుండా వియోగం లోనే స్నేహ మాధుర్యం వుందని భావిస్తూ దానినే జీవితమంతా అనుభవించాలనుకోవడమే ఈ ఖండ కావ్యంలోని ప్రధానాంశం. ‘తృణకంకణము’ కావ్యంలో శృంగారాన్ని సంభోగాభిముఖంగా కాక స్నేహ ఉద్దీపనగా ప్రయోగించారు రాయప్రోలువారు. ‘‘పూజా శాలకు శయ్యా గృహమునకు అంతరముండదా! శృంగారమునకు శుచి, రుచి రెండు అంశాలు ఏర్పరుచుకున్నాను. అందువలన ఇందలి శృంగారముని విలక్షించి, అమలిన శృంగారమని,’’ ఆయన అన్నారు. కామం, ప్రేమ రెండూ ఆయన భావనలో శృంగారంగా భాసించాయి. కొమర్రాజు లక్ష్మణరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగార్ల సానిచర్యం, స్నేహంతో రాయప్రోలువారు నవ్యకవిత్వానికి కవాటాలు తెరిచారు. శబ్ద మాధుర్యము, అర్ధ ప్రసన్నత, సంప్రదాయ అభిమానము, దేశభక్తి, ఆత్మసౌందర్యము, తెలుగు సంస్కృతిపై ప్రేమ, ఆధ్యాత్మిక చింతనల సమాహారము వీరి వాజ్ఞయము. కథా కథనంలో వర్ణనలో, భావ ప్రకటనలో కొత్త బాటలు వేసారు. భావ గాంభీర్యము, భాషా సౌకుమార్యము, శైలివిన్యాసము సరస సమ్మేళనము వీరి కవిత్వము. మేఘదూతం, మృచ్ఛకటికం, స్వప్న వాసవదత్త వంటి ప్రాచీన సంస్కృత కావ్యాలు వీరిని బాగా ఆకర్షించాయనడానికి నిదర్శనం వాటి ప్రభావం ఈయన రచనల్లో ప్రతిబింబించడమే. అల్లసానిపెద్దన, శతావధాని తిరుపతి శాస్ర్తీని అనుకరించానని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. భవభూతి కాళిదాసాది ప్రాచీన సంస్కృత కవులు వీరికి ఆరాధ్య దేవతలు. శంకరాచార్యులు సౌందర్య లహరిలో చెప్పిన విషయాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని, పాశ్చాత్యతత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని ఆకళింపు చేసుకుని తన అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మహాకవి కాళిదాసు రచించిన ‘మేఘ సందేశం’ కావ్యాన్ని ‘దూత మత్త్భు’ పేరుతో తెనిగించారు. ‘శకుంతల’, ‘ఉత్తర రామచరిత్ర’ రాసారు. ‘ఉమర్ ఖయ్యామ్’ను ‘మధుకలశం’ పేరుతో అనువదించారు. రవీంద్రుని వ్యాసాలను తెనిగించారు. తెలుగు వాజ్ఞయాన్ని ఆంగ్లంలోకి అనువదించి ‘త్రివేణి’ పత్రికలో ప్రకటించారు. ‘సాహిత్య సౌందర్య దర్శనం’ అనే వ్యాస సంపుటిలో రాయప్రోలువారు తన జీవిత విశేషాలను, శాంతినికేతన్‌లో ఆయన అనుభవాలను ప్రస్తావించారు. వీరి సాహిత్య విమర్శ, సౌందర్య దృష్టిని వివరించే గ్రంథం ‘రమ్యాలోకం’పై సాగిన చర్చల నేపథ్యంలో ‘మాధురి దర్శనం’, ఈ రెండింటికి వ్యాఖ్యాన రూపంగా వచ్చింది ‘రూప నవనీతం’. దీనిలో స్ర్తి మనస్తత్వ పరిశీలన వుంది. ‘మిశ్రమంజరి‘ అనే రచనా సంపుటికి రాయప్రోలువారి 1962లో కేంద్రసాహితి అకాడమీ అవార్డు లభించింది. ‘స్నేహలత’ కావ్య ఖండికలో వరశుల్క నిరసనగా పితృగృహరక్షణకు ఆత్మార్పణ చేసుకున్న పధ్నాలుగు వసంతాల కన్యక కరుణామయ గాథ సాంప్రదాయ ఆర్ష వాతావరణంలో ప్రతిబింబించింది. ‘అనుమతి’లోని నాయిక తను వివాహమాడదలచిన వ్యక్తి వేరొక స్ర్తికి భర్త అయినా, అతని మరణానంతరం అతని భార్యాబిడ్డలకోసం త్యాగం చేసి పెద్ద మనసు కలిగిన దయాశీలి.
‘‘నాకు ఆంధ్రాభిమానం జన్మాంతర వాసనగా వచ్చినట్లున్నది’’ అంటూ ఆ అభిమానంతో దేశభక్తి గేయాలు, ఆంధ్రాభిమాన కవిత్వం చాలా వ్రాసారు. బంకిం చంద్రుని వందేమాతర గీతం రాయప్రోలు వారి దేశాభిమాన కవిత్వానికి ఓంకార నాదమయింది. అలనాటి ఆంధ్రౌన్యత్యాన్ని అపురూపమైన కవితా దృష్టితో చూడగల సాహితీ స్రష్ట, దార్శనికుడు రాయప్రోలు. ‘‘పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’ అనే ఆయన ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనే దేశభక్తి గేయం తెలుగు లోకోక్తిగా ప్రజల నాల్కులపై నిలిచిపోయింది. ‘‘ఆంధ్రావళి’’, ‘‘తెనుగుతోట’’ వంటి రచనలు ఆయన ఆంధ్రాభిమానానికి ఉదాహరణలు. ‘తెనుగు తల్లి’ అనే గేయంలో ‘నందనోద్యాన సౌందర్యము నెగబోయి’ అంటూ అని ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాల వైభవాన్ని స్తుతించారు.
- మంగు శివరామ ప్రసాద్

కథ కంచికి - - బి.ఎస్.రాములు

కథను పాఠకుల కోసం రాయాలా? ఆ కథల్లోని పాత్రలకోసం రాయాలా? అనేది ఒక వౌలిక ప్రశ్న. ఈ ప్రశ్న వుంటుందని చాలా మంది రచయితలకు తెలియదు.
కథలోని పాత్రలకోసం వారి జీవితాల మెరుగుదల కోసం వారికి చేయూతనందించడం కోసం కథ రాయడమనేది కేవలం సాహిత్యానికి, సాహిత్య వస్తువు, శిల్పం, అలంకార శాస్త్రాలకు సంబంధించిన అంశం కాదు. అక్కడినుండి దాని బంధనాలను విడగొట్టుకుని ప్రత్యక్షంగా సమాజంలోకి, జీవితంలోకి పాత్రధారుల మధ్యలోకి కథ ప్రవేశించింది.అందువల్ల వారిగురించి రాసే కథ, వారికి జీవితంలో ఒక వెలుగునివ్వాలి. ఒక దారి చూపాలి. కనుక సాహిత్యం ఇంతదాకా చర్చించిన కథా విలువలు, శైలి, శిల్పాలు, రచనా పద్ధతులు అన్నీ వౌలికమైన పరిణామం చెందాల్సి వుంటుంది. ఇంతదాకా పాఠకులకోసం ప్రేక్షకులకోసం రచనలు చేశారు. సినిమాలు తీసారు. ఉద్యమాల్లో పాట, ప్రసంగాలు ప్రత్యక్షంగా ఆయా ఉద్యమాల్లో పాత్రధారులైన ప్రజలను ఉద్దేశించి సాగుతాయి. కథ, నవల, వచన కవిత, సినిమా కూడా ఇలా ప్రజల దగ్గరికి చేరాలి. ప్రజలతో మమేకం కావాలి. ప్రజలు దాన్ని చదవాలి, చూడాలి. పాటలతో, ప్రసంగంతో ఉత్తేజాన్ని పొందాలి. తమ జీవితాలను మరింత బాగుపరుచుకునే మార్గాలను సూచించాలి. కష్టాల్లోంచి బయటపడి జీవితాలను గెలుచుకునే అనేక మార్గాలను చూపి జీవితంపట్ల కోల్పోయిన ఆశలను తిరిగి కల్పించాలి. అప్పుడే వాళ్లు ధైర్యంగా ముందుకు సాగుతారు. జీవితం గెలుచుకోవడం కోసం ఉద్యమిస్తారు. కష్టపడతారు కంచికి చేరే కథ ముగింపు చక్కని సందేశాన్ని, హామీని నిలబెట్టుకుందా? ముగింపు,కథ నడక ఒకే వేగంలో చక్కగా సాగాయా? సడన్ బ్రేక్ వేసినట్టు కథంతా అతలాకుతలమయిందా? పాఠకుడు రచయితను నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కథ చదివి ఏదో కొత్త విషయం తెలుసుకున్నానని పాఠకుడు అనుకోగలగాలి.
కొన్నికథలు రాయడం ఈజీ. కానీ ముగింపులు ఇవ్వడం కష్టం.
1. జీవితంలో గమ్యం లేనట్టుగానే గమ్యం లేని కథలుంటాయి. అవి తొలిదశ రచనలు.
2. గమ్యం వుండి గమ్యం చేరని కథలుంటాయి.
3. గమ్యంకోసం సాగే కథలు వుంటాయి. గమ్యంకోసం సాగే కథల్లో ఓటమి ముగియవచ్చు. గమ్యం చేరవచ్చు.
4. గమ్యం చేరిన తరువాత అందరూ సుఖంగా వుంటారు అని సినిమాలు, పాత కథలు ముగిసేవి. ఉదాహరణకు ప్రేమించుకున్న వాళ్లు పెళ్లిదాకా రావడంతో కథ ముగియడం, విలన్ కష్టాలనుండి బయటపడి హీరో హీరోయిన్లు ఒకటి కావడం.
కథ ముగింపు కలలోంచి వాస్తవంలోకి రావడంతో ముగియవచ్చు. కష్టాలు వాస్తవికత నుంచి మధురమైన కలలు కనడంతో ముగియవచ్చు. కథ మొదలుపెట్టిన చోటునుంచి అక్కడక్కడే గిరికీలు తిరగవచ్చు. కానీ ముగింపు కథ ప్రారంభంనుంచి కొంతైనా ముందుకు సాగినట్టు వుండాలి. జ్ఞాపకాలు, గతంలోకి వెళ్లి కథంతా నడిపి వర్తమానంలోకి తిరిగి వచ్చినపుడు కథ ప్రారంభంలో వున్న చోటే కథ ముగియవచ్చు. ఆలోచనలు, తలపోతలు మొత్తం కథంతా ఆక్రమించినా ముగింపులో కొంతైనా కొత్తదనం, కాస్త కొత్త విషయం అయోమయం నుండి స్పష్టతలోకి, ఏ నిర్ణయం లేనితనంనుండి ఒక నిర్ణయానికి రావడంతోటి కథ ముగియవచ్చు. కొన్ని కథలకు ముగింపు ఇవ్వడం అంత సులభం కాదు. జీవితానే్న కథగా రాసినప్పుడు జీవితంలో ఎలాంటి మలుపు రావాలో, వచ్చే అవకాశం వుంటుందో అది మాత్రమే చెప్పాల్సి వుంటుంది. అలాంటి ముగింపు జీవితానికే లేనప్పుడు దాన్ని కథలో చెప్పి ముగించడం ఎలా అనేది ప్రధానమైన సమస్య.సాంప్రదాయక కథలు, నూతన పోకడలు పోయే కథలు, ప్రయోగాత్మక కథలు అని కథల్ని మూడువిధాలుగా వర్గీకరించవచ్చు. సాంప్రదాయక కథా వస్తువు సులభంగానే గుర్తుపట్టవచ్చు. నవలలోలాగా ముగింపును కూడా ఆంచనా వేయవచ్చు. నవలలో లాగానే ముగింపు వుండవచ్చు. సంక్షోభాలు, సన్నివేశాలు అన్నీ పరిష్కారంలోకి రావచ్చు.
నూతన పోకడలు పోయే కథలు కథ ముగింపులో ఏ సమస్యను పరిష్కరించకపోవచ్చు. పాత్రలకు సందేశం వుండకపోవచ్చు. ఇలాంటివి చదివితే చివరి పేజీ మిస్సయిపోయామా అని అనుకునే అవకాశం వుంటుంది. ముగింపుతో కథకుడు కథను, కథలోని భావాలను, పాత్రలను ఫీల్ కావాలి. వాటితో మమేకత్వం చెందాలి. అవి తనవిగా భావించగలగాలి. కథ ముగింపులో వేసిన ముడిని విప్పేదిగా కూడా వుండవచ్చు. కథలో లేవనెత్తిన అంశాలు కథనుండి పాఠకులు ఆశించినవి ముగింపులో అందినప్పుడే కథ సార్ధకత.
- బి.ఎస్.రాములు
(అయపోయంది)

నిజాంగారి నరకం... ఆంధ్రుల కథ - 10 (ఎం.వి.ఆర్.శాస్ర్తీ)Nizam's Tyranny - The story of Andhrulu by M V R Sastry

గుంటూరులో నలుగురూ కూడారు. ఫలానా తేదీన బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ పెట్టాలనుకున్నారు. పెట్టారు. సర్కారువారు సభను జరపనిస్తారో లేదో అన్న సంశయం వారికి కలగలేదు. నిజంగానే ఏ సమస్యా ఎదురుకాలేదు.
అదృష్టవంతులు. వారి నెత్తిన నిజాం నవాబులేడు.
అదే వాళ్లు తెలంగాణ వాళ్లయినా, తెలంగాణలో సభ పెట్టాలనుకున్నా వాళ్లను మించిన దురదృష్టవంతులు ఉండరు.
తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. మిగతా భారతదేశాన్ని నిరంకుశంగా అణచిపెట్టిన తెల్లవాళ్లే తెలంగాణానేలే నిజాం మీదా నిరంకుశంగా పెత్తనం చేస్తున్నారు. ఐనా మిగతా బ్రిటిషిండియాలో అరకొరగా ఉన్నపాటి రాజకీయ పౌరహక్కులకు, స్థానిక స్వపరిపాలన వ్యవస్థలకు కూడా నైజాం వంటి సంస్థానాల ప్రజలు నోచుకోలేదు.
సర్కారు జిల్లాల్లో ఆంధ్రోద్యమ భావాలు 1911లో అంకురించే నాటికే మద్రాసు రాష్ట్రంలో శాసనసభ ఉండేది. దానికీ, పై ఎత్తున జాతీయస్థాయిలో సెంట్రల్ అసెంబ్లీకీ ఆంధ్ర ప్రాంతాలనుంచి ప్రతినిధులు ఎన్నికవుతూండేవారు. వారిలో గొప్ప పార్లమెంటేరియన్లుగా పేరుతెచ్చుకుని ప్రభుత్వానికీ, ప్రజలకూ గౌరవ పాత్రులైనవారు ఉండేవారు. అలాగే 1880ల నాటికే మిగతా బ్రిటిష్ ఇండియాతోబాటు తీరాంధ్ర, సీడెడ్ జిల్లాల్లోనూ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పడ్డాయి. రాజమండ్రిలో వీరేశలింగం పంతులు వంటివారు స్థానిక పురపాలక సంస్థల్లో జరిగే అవకతవకలను పత్రికల్లో చీల్చిచెండాడుతూ, అధికారుల అక్రమాలను, అవినీతిని నిర్భయంగా ఎదిరిస్తూండేవాళ్లు.
హైదరాబాదుకూ పేరుకు శాసనసభ ఉంది. 1894నుంచీ అది పనిచేస్తున్నది. కాని దానిలో ప్రజలకు ప్రాతినిధ్యం సున్న. దానిలోని సభాసదుల సంఖ్య 20. వారిలో ఎన్నుకోబడే సభ్యులు కేవలం నలుగురు. వారినైనా ఎన్నుకునేది ఎవరు? ఇద్దరినేమో సంవత్సరానికి ఆరువేల రూపాయల ఆదాయంగల జాగీర్దార్లు ఎన్నుకుంటారు. మిగతా ఇద్దరిని నైజాం రాజ్యంలోని హైకోర్టు వకీళ్లు ఎన్నుకుంటారు. అదీ నిజాం మార్కు ప్రజాస్వామ్యం!
పేరుగొప్ప శాసనసభ అలంకారానికే. శాసన వ్యవహారాల్లో సైతం దానికి అధికారాలు సున్న. లార్డ్ రిపన్ వైస్రాయిగా ఉన్న 1880-84 కాలంలోనే హైదరాబాద్ రాజ్యంలోనూ స్థానిక స్వపరిపాలన సంస్థలు జన్మనెత్తాయి. కాని వాటిలో ఎక్కడా సభ్యులను ఎన్నుకునే పద్ధతి లేదు. అందరినీ నైజాము సర్కరోళ్లే ఇష్టానుసారం పైనుంచి రుద్దుతారు. ప్రజల్లో తగినంత విజ్ఞానం కలిగిన తర్వాత ఎన్నికల పద్ధతి ప్రవేశపెడతామని స్థానిక సంస్థలను పెట్టిన కొత్తలో ప్రభువులు ఊరించారు. ఎన్ని దశాబ్దాలు తిరిగినా సర్కారు దృష్టిలో జనానికి విజ్ఞానం కలగాలేదు. ఎన్నికల అవసరం కనపడనూ లేదు. ఏ స్థానిక సంస్థలోనైనా అంతా నియంతృత్వమే. నవాబుల ఇష్టారాజ్యమే!
1914లో ఆంధ్రపత్రిక ఆనంద సంవత్సరాది సంచిక నైజాం రాజ్యంలో ఆంధ్రుల స్థితిగతుల గురించి ఏమి రాసిందో చిత్తగించండి:
‘‘నిజాం రాష్టమ్రున తెలుగువారు ఏమాత్రమును గొప్ప స్థితికి వచ్చినట్లు కానరాదు. హైకోర్టు జడ్జి పదవికి వచ్చిన తెలుగువాడు లేనేలేడు. ఉన్నతోద్యోగములందున్న తెలుగువారు లేనేలేరు. తుదకు హైదరాబాదు హైకోర్టులో పనిచేయుచున్న న్యాయవాదులలో ఆంధ్రుడెవడైన నున్నాడాయని సంశయింపవలసి యున్నది. 1895లో హైదరాబాదునందు శాసన నిర్మాణ సభ యొకటి స్థాపింపబడినది. అప్పటినుండి నేటివరకు ఒక యాంధ్రుడేనియు దానిలో సభ్యుడగు భాగ్యమును పొందలేదు.
‘‘ఈ రాజ్యమున చదువుకొనిన వారి సంఖ్య వేయింటికి 28 మంది కంటె మించలేదు... తురకలలో చదువు వచ్చినవారు వేయింటికి 59 మంది; హిందువులలో అట్టివారు 23 మాత్రమే.
‘‘ఇక ఇచ్చటి తెలుగువారు మాట్లాడు భాషను చూడుడు. ఉర్దూతోనె కలయికవలన తెలుగు భాషకు కలిగిన దురవస్థ ఇట్టిదని చెప్పుట కష్టము. ఉదాహరణము: ‘‘ఈమొకద్దమాలో చలాయించిన కార్రవాయి అంతా జాలీది. సాహెబ్ జిల్లా జాయె వౌక్ఖాకు పోయి తహకీకాతుచేసి వైఫ్యియతు రాసినాడు గదాకె, ఫరీజు దావా బిల్కులు నాజాయజు. అయిందా రుూ తౌర్న కార్రవాయి చేసిన సూరతులో మాఖూలు తదారకు చేయటం కాగలదు.’’
ఈ వ్యవహారంలో నడచిన చర్య అంతా తప్పు సృష్టి. జిల్లా తాలూక్దారు ఆ స్థలానికి పోయి విచారణ చేసి నివేదిక రాశాడు. ఏమనంటే- కక్షిదారు చేసిన వాదం పూర్తిగా అక్రమం. ఈ విధంగా చర్య తీసుకుంటే తగిన శిక్ష విధించినట్టు కాగలదు- అనడానికి వచ్చిన తురక తెలుగు తిప్పలివి.
నైజాం రాజ్యం వైశాల్యంలో సగం తెలంగాణలోనే ఉన్నా, అక్కడి ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు తెలుగువారైనా, తెలుగు భాషకు దిక్కులేదు. తాము తెలుగువాళ్లమన్న స్పృహే చాలామంది ఆంధ్రుల్లో ఉండేది కాదు. వేషం, భాష, అలవాట్లు, ఆచారాలు, ఆలోచనలు అన్నిటిమీదా ముస్లిం సంస్కృతి ప్రభావం బాగా ఉండేది. సంస్థానంలో ప్రజలకు పౌర హక్కులు లేనే లేవు. సమావేశ స్వాతంత్య్రం అసలే లేదు. ‘గస్తీ నిషాన్ తిర్పన్’ అనే జీవో ప్రకారం ఏవయినా ఒక సమావేశం జరగడానికి నిజాం కేబినెటునుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఎక్కడ ఏ సమావేశాన్ని లేక ఏ సంఘాన్ని ఏర్పాటుచేసుకోవాలన్నా నాలుగైదు ఫారాలు నింపి వివిధ అధికారులకు దరఖాస్తుపెట్టాలి. ఆ సంఘం లేక సమావేశం దేనికోసం, దానిలో ఎవరుంటారు, ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఏమి చర్తిస్తారు. ఎవరెవరు ఏమి మాట్లాడుతారు అన్నది వాటిలో రాయాలి. అన్నీ పరిశీలించిన మీదట అనుమతికాస్తా సర్వసాధారణంగా నిరాకరించబడేది. ఆఖరికి జాతీయ నాయకులు అస్తమించినప్పుడు సంతాప సభలు జరుపుకోవడానికి కూడా అనుమతి లభించేది కాదు. అతి కష్టంమీద అనుమతి వచ్చినా, సవాలక్ష ఆంక్షలతో సభ జరుపుకోవలసి వచ్చేది. ఎక్కడైనా పొరపాటున అనుమతి లేకుండా ఏ కార్యక్రమమో నిర్వహిస్తే క్రూరమైన శిక్షలకు గురికావలసి వచ్చేది. ఆఖరికి బంధుమిత్రులు ఒక ఇంట్లో చేరి సమావేశమైనా ఆ సంగతి తెలిస్తే పోలీసులు వచ్చివాలి నానా ఆగం చేసేవాళ్లు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రులంతా కలిసి ఓ సంఘం పెట్టుకుంటాం అంటే నైజాం సర్కారు రాకాసులు ఊరుకుంటారా? ‘అసలు ఆంధ్ర’ పదమంటేనే నిజాంకు ఎలర్జీ. ఎక్కడైనా పత్రిక పెట్టుకోవడానికి పొరపాటున అనుమతి ఇచ్చినా పత్రిక పేరులో ‘ఆంధ్ర’ ఉండకూడదని సర్కారు ఆంక్ష పెట్టేది. (ఈ కారణంవల్లే ‘గోలకొండ పత్రిక’కు ఆ పేరు వచ్చింది.) ‘ఆంధ్ర’ పదమే చెవిన పడకూడదనుకునేవాళ్లు ఏకంగా ‘ఆంధ్ర మహాసభ’నే పెడతామంటే విరుచుకుపడరా? ఆంధ్రులంతా కలవాలనో, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనో కోరుతున్నామంటే అందిన వారిని అందినట్టు లాక్కెళ్లు బందీఖానాలో వెయ్యరా? బడిలో తెలుగు నేర్పటానికి వీల్లేదన్నవారు... ఆఖరికి ప్రైవేటుగా బడి నడపటానికి కూడా తమ అనుమతి కంపల్సరీ అని ఫర్మానావేసి, అప్పటిదాకా నడుస్తున్న ప్రైవేటు తెలుగుబడులను మూయించిన ఘనులు, తెలుగువాళ్లు ఏకమై రాజకీయ డిమాండ్లతో సంఘం పెడతాం, సభలు జరుపుతాం అంటే కస్సున లేచి కాటెయ్యరా? పౌర హక్కులకు దిక్కులేని ఇలాంటి రాక్షస రాజ్యంలో 1921 దాకా ఆంధ్రోద్యమం లేవకపోవటం వింత కాదు. కనీసం అప్పుడైనా లేవటమే అబ్బురం!
అలాగని 1921లో తెగించి ‘ఆంధ్ర జన సంఘం’ పెట్టేదాకా తెలంగాణ ఆంధ్రులు చేతులు ముడుచుకునేమీ కూర్చోలేదు. ఏమి చేయాలా, ఏమి చేయగలమా అని దారులు వెతుకుతూనే ఉన్నారు. రాజకీయ కార్యకలాపాల మీద, రాజకీయ వాసన ఉండొచ్చని ‘పైవాళ్లకు’ అనుమానంతోనే అన్ని కార్యాలమీద పూర్తి నిషేధం ఉన్నప్పుడు ఎవరైనా చేపట్టగలిగింది రాజకీయేతరమైన కార్యక్రమాలు మాత్రమే. కావాలనుకుంటే సంఘ సంస్కార సభలు పెట్టుకోవచ్చు. సర్కారుకు అభ్యంతరం లేదు. కాని నూటికి 97 మంది నిరక్షరాస్యులైన సమాజంలో సంఘ సంస్కారం గురించి మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? పోనీ మతపరమైన కార్యక్రమాల ద్వారా జనంలోకి వెడదామా అంటే దానికీ వీలులేదు. చివరి నిజాం ఉస్మానలీఖాన్ పక్కా ముస్లిం మతోన్మాది. హిందువులు పండుగలు పబ్బాలు ఎవరింట్లోవాళ్లు గుట్టుగా చేసుకోవలసిందే తప్ప పదిమందీ ఒకచోట కూడి వేడుకలు జరుపుకోవటానికి వీలే లేదు. మత స్వాతంత్య్రం మచ్చుకు కూడా లేదు. హిందూ, మహమ్మదీయ పండుగలు రెండూ ఒకసారి రావటం తటస్థిస్తే హిందూ పండుగల్ని ప్రభుత్వం నిషేధించేది.
ఇలాంటి దుస్థితిలో ప్రజల్లో స్వాభిమానం, ఆంధ్రత్వభావం పురికొల్పాలంటే దూరదృష్టితో ఆచితూచి అడుగువెయ్యాలి. ప్రభుత్వధికారులకు అనుమానం రాకుండా, రాజకీయ లక్షణాలు ఎక్కడా కానరాకుండా జనానికి మాతృభాష పట్ల అభిమానం కలిగించి, చైతన్యం ఎలా తేగలమా అని ఆలోచిస్తే వెనకటి నాయకులకు కనపడిందల్లా గ్రంథాలయాల, పఠన మందిరాల స్థాపన ఒక్కటే! కొమర్రాజు లక్ష్మణరావుగారు సంకల్పించారు. మునగాల జమీందారు రాజానాయని వెంకట రంగారావు అండగా ఉంటానన్నారు. రావిచెట్టు రంగారావు లాంటి ప్రముఖులను కలుపుకొని మునగాల రాజావారి పోషకత్వంలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని హైదరాబాదు రెసిడెన్సీ బజారులో 1901 సెప్టెంబరు 1న స్థాపించారు. మళ్లీ మూడేళ్లు తిరగకుండా అదే జమీందారు పోషణలో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం హనుమకొండలో వెలసింది. క్రమంగా సికిందరాబాదు, ఎర్రుపాలెం, రేమిడిచర్ల, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్లులోనూ గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. 1921లో ఆంధ్రోద్యమం మొదలయ్యేనాటికి ఇలాంటి గ్రంథాలయాలు పదివరకూ నడుస్తూ తెలంగాణలో ఆంధ్ర భాషా ప్రచారానికి యధాశక్తిగా పాటుపడుతూండేవి. రాజకీయ స్వభావం లేకుండా, సర్కారువాళ్ల వక్రదృష్టి పడకుండా ఎంత జాగ్రత్తపడ్డా గ్రంథాలయాల నిర్వహణలో చాలా చిక్కులు వస్తూండేవి. దేశ భాషల్లో పాఠశాలలు నెలకొల్పే విషయంలో చూపిన పక్షపాతాన్నీ, పరమత ద్వేషానే్న ఆంధ్ర గ్రంథాలయాల మీద చూపిస్తూ నైజాం సర్కారు అయినదానికీ కానిదానికీ సతాయిస్తూ, ఎప్పుడెప్పుడు వాటిని మూయించాలా అని సాకులు వెదుకుతూండేది.
ఉదాహరణకు 1920లో కాబోలు నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయం అటువైపు పర్యటనకు వెళ్లిన అవ్వల్ తాలూక్దారు (జిల్లా కలెక్టరు) కంట పడింది. తన ఇలాకాలో అలగాజనమంతా కలిసి చందాలు వేసుకుని గ్రంథాలయం నడపటం అతగాడి ఒళ్లుమండించింది. ‘గ్రంథాలయం పెట్టుకోవటానికి సర్కారు అంగీకారం పొందారా’ అని అక్కడివాళ్లను అడిగాడు ‘లేదు’ అని జవాబువచ్చింది. ఇంకేం? అనుమతి పొందలేదు కనుక ఇది నడవటానికి వీల్లేదని హుంకరించి బలవంతంగా మూతవేయించాడు. దానిమీద చచ్చీచెడి హైదరాబాదులో హోం సెక్రటరీగా ఉన్న సర్ అక్బర్ హైదరీకి మొరపెట్టుకుంటే- గ్రంథాలయం పెట్టటానికి ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని స్పష్టం చేశాడు. ఆయన పుణ్యమా అని గ్రంథాలయం తలుపులు మళ్లీ తెరచుకున్నాయి.
గవర్నమెంటు నుంచి ఈ వివరణ ఇప్పించుకున్నాక అయినా అధికార ప్రమథగణం గ్రంథాలయాలను వాటి మానాన వాటిని బతకనిచ్చిందా? లేదు. ఉదాహరణకు వరంగల్ జిల్లా మడికొండలో పోలీసు పటేలు ఆ ఊరి గ్రంథాలయాన్ని సర్కారు అనుమతి లేకుండా ఎలా నడుపుతున్నారని గొడవపెట్టాడు. గ్రంథాలయానికి అనుమతి అక్కర్లేదని సర్కారే చెప్పిందని కార్యదర్శి మొత్తుకున్నా వినకుండా కేసు పెట్టాడు. దానిమీద వరంగల్ జిల్లా ఆదాలతు నాజింసా-
‘‘ప్రతిరోజు సదర్ లైబ్రరీకి పుస్తకములు చదువుకొనగలందులకు జనులు వస్తూ ఉన్నారు. మరిన్ని ఆంధ్ర పత్రిక, కృష్ణపత్రిక, ముషీరె దకన్ వగైరా పత్రికలు వస్తూ వున్నవి. హాల్ సదరు లైబ్రరీ ఖాయం చేయుటకు మీరు యే మహకమా నుంచి అయినా హుకుం పొంది వున్నారా? లేదా? అగరు హుకుం పొందనట్లయితే ఫవురన్ పొందవలసినది. మరియొక హుకుము పంపువరకు లైబ్రరీ మూసి యుంచవలెను’’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ అక్రమమని, గ్రంథాలయానికి అలాంటి అనుమతి ఏదీ అక్కర్లేదని కార్యదర్శి ఎంతమంది అధికార్లకు ఎన్నితీర్ల మొత్తుకున్నా ఆలకించినవారు లేరు. 1948లో పోలీసు యాక్షను అయ్యేదాకా సర్కారునుంచి జవాబేలేదు.
విశేషమేమిటంటే-ప్రభుత్వం ఎన్నివిధాల వేధించి వెంటాడినా కార్యకర్తలు నిస్పృహచెందలేదు. గ్రంథాలయాలకు చందాలిచ్చేవారిని, అద్దెకు భవనమిచ్చేవారిని అధికారులు ఎంత భయపెట్టినా, కార్యనిర్వాహక సమావేశం జరుగుతూంటే పోలీసులు వచ్చి కూర్చుని ఎంత గొడవపెట్టినా, రికార్డులు పట్టుకుపోయి, ఎప్పటికీ తిరిగివ్వకుండా కార్యదర్శిని తిప్పినా నడిచే గ్రంథాలయాలు నడుస్తూనే ఉండేవి. గ్రామాల్లో చదువుకున్నవారు ఏ పదిమంది ఉన్నా ఒక గ్రంథాలయమో రీడింగ్ రూమో పెట్టుకుని పత్రికలు, పుస్తకాలు తెప్పించుకుని చదివేవారు. తీరిక సమయాల్లో సాధక బాధకాలను చర్చించుకునేవారు.
మొదట్లో ఎవరికివారేగా పనిచేసి నానా ఇబ్బందులు పళ్లబిగువున సహించిన వారికి 1921 నవంబరులో ఆంధ్ర జన సంఘం ఏర్పడటంతో కొత్త ఉత్తేజం వచ్చింది. ‘ఆంధ్ర జన సంఘం’ పేర నైజాంలో అనేక ప్రాంతాల్ల సంఘాలు ఏర్పడ్డాయి. తరవాత వాటినన్నిటిని సమన్వయం చేయటానికి 1923 ఏప్రిల్ 1న హనుమకొండలో మాదిరాజు రామకోటీశ్వరరావుగారి చొరవతో అందరూ కలిసి ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’ ఏర్పాటుచేశారు. అర్థరాత్రిదాకా చర్చించి దానికి నియమావళిని ఖరారుచేశారు. రాజకీయపరమైన కార్యకలాపాలకు నైజాం దుష్టపాలనలో ఆస్కారం బొత్తిగా లేదు కనుక గ్రంథాలయాలు, పఠన మందిరాలు, పాఠశాలలు స్థాపించటం... విద్యార్థులకు సహాయం చేయటం... విజ్ఞానాన్ని వ్యాపించెయ్యటం, ఆంధ్ర భాష ప్రచారానికి కృషిచేయటం, తాళపత్ర గ్రంథాలను, శాసనాలను సంపాదించి పర్కిష్కరించటం, అనాధలకు సాయపడటం వంటి కార్యాలకే ఆంధ్ర సంఘం తొలి దశలో పరిమితమైంది. కేంద్ర సంఘం ఏర్పడ్డాక గ్రంథాలయోద్యమానికీ మంచి ఊపు వచ్చింది. 1925 ఫిబ్రవరిలో మధిరలో ఆంధ్ర జన కేంద్ర సంఘం మూడో సమావేశంతోబాటు నైజాంలో ప్రప్రథమంగా గ్రంథాలయాల మహాసభ జరిగింది. అలాగే మరుసటి సంవత్సరం (1926 జూన్‌లో) సూర్యాపేటలో రెండో మహాసభ పెడదామనుకున్నారు. కాని అన్ని ఏర్పాట్లు అయ్యాక నైజాం ప్రభుత్వం సభలు జరిపేందుకు వీల్లేదని నోటీసిచ్చి అడ్డుకున్నది. అయినా పట్టువదలక ఆహ్వాన సంఘంవారు మూడేళ్లపాటు తీవ్రంగా ప్రయత్నించి, అత్యున్నత స్థాయివరకూ వెళ్లిన తరవాత గానీ 1929 జూన్ 1న సూర్యాపేటలో ఆంధ్ర కేంద్ర జన సంఘం సమావేశాలు, గ్రంథాలయాల మహాసభలు జరుపుకోవటానికి అనుమతి రాలేదు. వ్యయప్రయాసలు ఎన్నిపడ్డా గ్రంథాలయ సభల్లో గ్రంథాలయాల గురించే చర్చించటానికి వీలుంటుంది కదా? దానికి బదులు జన సామాన్యం ఎదుర్కొనే సమస్యలన్నీ చర్చించటానికి ఏకంగా ఆంధ్ర మహాసభలే ఎందుకు జరపకూడదు అన్న ఆలోచన మాడపాటి వంటి పెద్దలకు వచ్చింది. ఎనిమిదేళ్ల ఆంధ్రోద్యమ అనుభవంతో అలాంటి సభను జరపగలమన్న ఆత్మవిశ్వాసం కలిగింది. మెదక్ జిల్లా జోగిపేటలో ప్రథమాంధ్ర మహాసభకు తెర లేచింది. *