Thursday, July 1, 2010

‘మహాప్రస్థానం’లో మార్క్సిజం ఎంత? - డా. మలయశ్రీ, ( Marxism in Mahaprasthanam)

శ్రీశ్రీ’’ ఎంత అందమైన పేరో. అది అర్ధవంతం, అపురూప పదం కూడా. ఎందుకంటే మన రాష్ట్రంలో, దేశంలో మరో శ్రీశ్రీ లేరు. ఇది కావాలని పెట్టుకుంది కాదు. సొంత పేరును మార్చలేదు. కొంత కొత్తగా చేర్చలేదు. వ్యక్తిపేరు, ఇంటిపేరు ఆ రెంటి మొదటి అక్షరాలు కలిసి శ్రీశ్రీ అయింది. ఇంత అందంగా మరే సంక్షిప్త నామం కానీ, కలంపేరు కానీ కనిపించదు.
60-70 ఏళ్లుగా అభ్యుదయ కవిత్వానికి అడ్రసు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఎన్ని రాసినా ‘మహాప్రస్థానం’ మలి గేయసంపుటి (తొలి గేయ సంపుటి-ప్రభవ) వారికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. పద్యపుస్తకాల్లో కరుణశ్రీగారి ‘ఉదయశ్రీ’ (మొదటి భాగం), గేయసంపుటాల్లో శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పొందినన్ని ముద్రణలు వేరే తెలుగుపుస్తకం కానీ పొందలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఆ కవిత్వ మహత్యం, భావ పటుత్వం.
శ్రీశ్రీ సినిమా పాటలు, రేడియో నాటికలు మొ. రచనలు వేరు. అవీ బాగున్నాయ్. కొన్ని చప్పనివన్నా, ఉన్నా అది తప్పు కాదు. ముఖ్యంగా మహాప్రస్థానం కమ్యూనిజానికి, కమ్యూనిజం శ్రీశ్రీకి అవినాభావ సంబంధం కలవి అయినై అనవచ్చు. శ్రీశ్రీ కమ్యూనిస్టులకు కొండంత అండ. ఆయన సామ్యవాద సిద్ధాంత కేంద్రం-ఆయన కవిత్వం ప్రచార సాధనం అయింది.
‘మహాప్రస్థానం’ మరోసారి చదవండి. మార్క్సిజం ఊపు, ఉద్యమం ముందు చూపు వున్న గేయాలు అందులో ఎన్ని వున్నవో లెక్కించండి. కాలక్షేపానివి, నిరాశవి, సొంత విషయాలు, అనువాదాలు వదిలితే దాదాపు పదికి మించవు. అవునా? పావుభాగం అయితేనేం! ‘పదండి ముందుకు’, ‘దేశ చరిత్రలు’ రెండు గేయాలు చాలు, శ్రీశ్రీని మహాకవి పీఠంమీద కూర్చోబెట్టడానికి.
ఆధునిక భావాలకు ఆద్యుడు! గురువు అనదగిన గురజాడ ‘సుభద్ర’ పద్యాలు కేవలం సంప్రదాయ కవిత్వమే కదా. పూర్ణమ్మ, కన్యక గేయాలు, సంస్మరణాత్మకమైనవే అయినా అవి కొన్ని కులాల సమస్యలే ‘కన్యాశుల్కం’ భాష, నాటకీకరణ నవ్యంగా భవ్యంగా ఉన్నా ఆ సమస్య ఒక కులానిదే. ‘దిద్దుబాటు’ కథ కథనం శిల్పం గొప్పగా ఉన్నా విషయం సామాన్యం. ‘ముత్యాల స్వరాలు’లో ప్రగతిశీల భావాలున్నాయి. ఒక్క ‘దేశభక్తి’ గేయం చాలు గురజాడ అప్పారావుని ఆధునిక అభ్యుదయ కవుల పంక్తిలో అగ్రస్థానాన నిలపడానికి.
శ్రీశ్రీ సైతం అంతే. ఆయనే కాదు, మరే కవి/రచయిత కానీ, రాసినదంతా వాసికి రాదు-కాదు కూడా! జనం ఆసక్తి అవసరాన్ని బట్టి కవుల రచనలకు ఆదరణ విలువ లభిస్తాయ. ప్రచారం వేరు, మన కులం మతం, పార్టీ అయితే వారి తప్పయిన ఒప్పే. కాకపోతే ఒప్పయినా తప్పే అనే పనికి మాలిన పద్ధతి ఇప్పుడు మన సమాజంలో చాలావరకు చలామణి అవుతున్నది.
శ్రీశ్రీకి యుగకవి, మహాకవి అనే బిరుదులు అనవసరం. అవి రాచరిక కాలంనాటి వందిమాగధ స్తోత్ర పదాలు. శ్రీశ్రీ ఈనాటి ప్రజాకవి. శ్రామిక జన పక్షపాత సామ్యవాద కవి-విప్లవ కవి.
అయితే ఆయనపై కొన్ని విమర్శలు లేకపోలేదు. అవి ఇవి
1. అలవాట్లు, ఆహార విహారాల విషయాలు. అవి వ్యక్తిగతం. లోకంలో ఎవరూ సంపూర్ణ సుగుణవంతులు కారు. సమాజానికి కష్టం కలిగించనంత వరకు వాటి జోలి మనకు అనవసరం. ‘‘పేరు ధర్మరాజు పెనువేప విత్తమా’’ అన్నాడు అజాత శత్రువును మన కవి వేమన. ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది?
2 కమ్యూనిస్టును అంటూ క్యాపిటలిస్టుల సినిమాలకు పనిచేయడమేమిటి? అని మరో ప్రశ్న. ఉదర నిమిత్తం బహుకృత వేషం. తొలి తరం కమ్యూనిస్టు కవులు, నటులు చాలామంది సినీరంగాన్ని ఆశ్రయించినారే. వృత్తిని కాదు, వారి ప్రవృత్తి! ప్రవర్తన ఎట్లుంది? అనేది మాత్రమే మనము పట్టించుకోవలసిన అంశం.
3. శ్రీశ్రీ సంప్రదాయ భావాలు పూర్తిగా వదులు కోలేదని-అప్పుడే కాదు, ఇప్పటికీ కమ్యూనిస్టులు ముఖ్యంగా ఆర్థిక-సామాజిక విషయాలపై చూపుతున్న శ్రద్ధ, కులమత నిర్మూలన-్భతికవాద భావ వ్యాప్తిపై చూపుతూ లేరుకదా, ఇది మన కమ్యూనిస్టుల లోపం, అయినా శ్రీశ్రీ కవనంలోని సంప్రదాయ విధేయత కొంతవరకు ఆలోచనీయాంశమే.
‘‘త్రికాలాలలో త్రిలోకాలలో’’ మొదటిది సరే. రెండవది ఏమిటి? సంప్రదాయ భావమనేనా?
‘‘జగన్నాధుని రథ చక్రాల్ వస్తున్నాయ్’’ అంటే అది పూరి జగన్నాథుని రథ చక్రాల ప్రభావమేనా? సమర్ధన వేరు.
‘‘బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను’’ ఎందుకో? ఉత్తదె అది
‘‘పొలాల నన్నీ హలాలదున్ని’’ అది ప్రాస కోసమే కదా, హలం కంటే నాగలి, అరక అనేవే జనం ఎక్కువగా వ్యవహరించే పదాలు.
ఇంకా ‘‘ఖడ్గసృష్టి’’లో ‘కవి’కి సమాంతరంగా ‘పవి’ అనే పదముంది. అది ఎవరికి తెలిసేది?పవి=వజ్రాయుధం, ఇంద్రునిది.
శ్రీశ్రీకి భాషా సౌందర్యంతోపాటు, భావ గాంభీర్యం, ప్రాసలు ఇష్టం. పులి చంపిన వేడి నెత్తురు-సరే. యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని-జంజెం (జంధ్యం) ప్రసక్తి అవసరమా? ఇది ‘‘బసవనీదు భక్తి బ్రాహ్మంబుతో పొత్తు వదలలేను నేను’’ అని 12వ శతాబ్ది వీరశైవ కవి పాల్కురికి సోమనాథుడు అన్నట్లేనా?
‘‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’ అంటే, ఆ అగ్ని, హోమకుండం! శ్రీశ్రీ కవిత్వంలో సంప్రదాయ వాసన కొంత వుంది. ఉండకూడదు. కాని, అది మన కమ్యూనిజం ప్రారంభ దశ. ఆ తర్వాతి కవులైనా దాన్ని వదులుకున్నారా? అంటే, వారికి ‘‘మహాప్రస్థానం’’ మార్గదర్శకమయ్యె. అందుకే- ‘దివంగత, నివాళి, అదృష్ట దురదృష్ట పదాలు’’ ఇప్పటికీ వాడుతున్నారు కొందరు.
శ్రీశ్రీకి దళిత స్పృహ లేదు-అనేది ఇటీవలి మరో విమర్శ. లేదు నిజమే. కానీ, ఆయన ఏ కులాన్నయినా ఉన్నతమైనదనో, అధమమనో-బలపరచెనా, త్రోసిపుచ్చెనా? లేదే! సామ్యవాదులకు కులమత పక్షపాతం ఉండదు. ఉండకూడదు! శ్రీశ్రీకి లేదు. దళిత కులవాదం ఇటీవలిది. అది కమ్యూనిజంను విమర్శించేదాకా వెళ్లింది. అది వేరు, వాళ్లిష్టం.
ఒక్కో వ్యక్తి అభిరుచి ఒక్కో తీరు. వారి స్థాయిని, సాధనను గుర్తించి వారిని అభిమానించారు. అవసరమైతే అనుసరించాలె. మనకు సాధ్యమైతే మరింత ముందుకు సాగిపోవలె. అట్లయితేనే ప్రయోజనం. ఊరకే విమర్శిస్తూ ఉంటే వృధా కాలహరణం. సాహిత్యమంటే ఏ ఒక్క ప్రక్రియో, భావమో, సిద్ధాంతమో కాదు. సంప్రదాయ విధేయులూ ఉన్నారు. అభ్యుదయ వాద రచయితలూ ఉంటారు. ఎవరివాళ్లను వాళ్లు అతిగా పొగడుతూ వుంటే, విమర్శలు రాక తప్పవు. శ్రీశ్రీ మంచి మనిషి. గొప్ప కవి. ఆయన భావాలకంటే కవిత్వానికి ముగ్ధులమయాం అన్న వాళ్లున్నారు. అయితే శ్రీశ్రీ అభిమానులు కేవలం భజనలు మాని, నిష్పాక్షిక సమీక్షలు వెలువరిస్తే విపక్షుల విమర్శలకు తావుండదు.
- డా. మలయశ్రీ

1 comment:

  1. SRI SRI RASINA MAHA PRASTHANAM BADUGU BALAHINA VARGHALA GEVITHA CHAKRAM . PIRIKI VANI CHATHILO VAJRAAYUDHAM 'MAHAPRASTHANAM'. A.S.HARI NATH 9000599357

    ReplyDelete