Thursday, September 23, 2010

ఎన్.జి.ఓ లేదా గుమాస్తా - ఆచార్య ఆత్రేయ (N.G.O play by Acharya Atreya)

ఈ మధ్యన నేను చదివిన పుస్తకం ఆత్రేయ గారు రాసిన ఎన్జీఓ అనే నాటకం. ఆత్రేయ..ఈ పేరు వినని తెలుగువాడు ఉండడనుకుంటా! ఆత్రేయ గురించి మనకు(నాకు!) తెలిసినంతవరకు ఏవో సినిమా పాటలు రాసాడని.

నా మిత్రుడు ఒకడు ఈ నాటకం గురించి చెప్పడంతో చదవటం మొదలెట్టా. ఒక గంటలో పూర్తి చేశా. చాల బాగా రాసారు ఆత్రేయ గారు. ఈ నాటకం రాసింది 1948 లో. అప్పుడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి మధ్యతరగతి పరిస్థితులను చక్కగా ఈ నాటకంలో ప్రతిబింబింప చేసారు ఆత్రేయగారు. ఇంకా చెప్పాలంటే Hungry 30's లోని పరిస్థితులను మనం ఇందులో చూడవచ్చు.

ఆత్రేయ గారి మాటల్లో "ఎన్.జి.ఓ అనే పేరేగాని, మన మధ్యతరగతి కుటుంబాల - అందులో పట్నవాసుల అగచాట్లు, మనస్తత్వం, ప్రెస్టేజి పేరుతో పడుతూన్న ఆర్థిక సాంఘిక బాధలు చిత్రించటానికి ప్రయత్నించాను. ఏమాత్రం సఫలుణ్ణి కాగలిగానో ప్రజా బాహుళ్యమే నిర్ణయించాలి". ఆత్రేయ గారు! మీరు సఫలం ఏంటి...ఈ నాటకంతో ట్రెండ్సెట్టర్ అయ్యారు. కావాలంటే 1950 నుంచి మొన్న మొన్నటి దాక వచ్చిన సాంఘిక సినిమాలు చుస్తే అర్ధమైపోతుంది. మధ్యతరగతి మీద వచ్చిన ప్రతీ సినిమాలో ఎన్.జి.ఓ మార్కు స్పష్టంగా కనబడుతుంది.

ఇప్పుడు మనం చదివితే అంత గొప్పగా అనిపించదు ఈ నాటకం. ఎందుకంటే దీని ఆధారంగా వచ్చిన సినిమాలు, నవలలు, నాటికలు, కధలు మనం ఆల్రెడీ చాలా చూసే (చదివే) ఉంటాం కాబట్టి.

ఇక download చేసి చదవడం ప్రారంభించండి: ఎన్.జి.ఓ
ఇందులో పాత్రలు:

రంగనాథం - గుమాస్తా
గోపి - అతని తమ్ముడు (విప్లవ భావాలు కలవాడు)
ముసలాయన - అతని తండ్రి
గుప్త - అద్దెకొంప యజమాని
.
..
...
కాలం - స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత

స్థూలంగా  ఈ నాటకం చెప్పాలంటే, మన కధానాయకుడైన రంగనాథం ఒక గుమస్తా. మధ్యతరగతి జీవి. అతని మాటల్లోనే చెప్పాలంటే ఇంటి ముందున్న గుడిసెలను చూసి వారి కన్నా తన స్థాయి బాగుందని తృప్తి పడలేదు. అలాగే పక్కనున్న కోటీశ్వరుడి బంగ్లా చూసి అసూయ పడకుండా ఉండలేడు. లేని పోని భేషజాలకు పోయి అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకుంటారు వీరు. ఇక గోపి రంగనాథం తమ్ముడు. విప్లవ భావాలు కల్గినవాడు. చిన్న వయసులోనే జీవితం పట్ల విరక్తి కలిగినవాడు. రంగనాథం ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగం తో బాధపడుతూఉంటారు. ఇన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ లంచం తీసుకోడు రంగనాథం. చివరికి ఒకానొక పరిస్థితిలో అతనికి డబ్బులు అత్యవసరం అయినప్పుడు లంచం తీసుకుంటాడు. అప్పుడే గోపి ఒక బహిరంగ సభలో ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తుంటే, అతన్ని నిలదీస్తాడు. చివరికి వీరిద్దరి పరిస్థితి ఏమయిందనేది నాటకం చదివితే తెలుస్తుంది.

Download NGO book here: NGO

Wednesday, September 15, 2010

కడపలో రచయతల కలబోత -రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి

సాహితీ సంస్థలు, సాహితీ పత్రికలు రచయితల్ని ఒకచోటికి చేర్చడం, సాహితీ సామాజికాంశాల గురించి చర్చించడం సహజం. ఒక వార్తాపత్రిక వారానికి ఒకరోజు ఒక పేజీని సాహిత్యానికి కేటాయించే పత్రిక ఈ పని చేయడం అరుదైన అంశమే. ‘ఆంధ్రభూమి’ తన స్వర్ణోత్సవం సందర్భంగా ఆ పని చేస్తున్నది. సెప్టెంబర్ 5న కడప ‘హరిత’ టూరిజం హోటల్ సమావేశ మందిరంలో ‘ఆంధ్రభూమి’ సంపాదకులు ఎం.వి.ఆర్. శాస్ర్తీగారి పర్యవేక్షణలో రాయలసీమ రచయితలతో చర్చాగోష్ఠి జరిగింది. చిత్తూరు, అనంతపురం, వైయస్సార్ జిల్లాలనుండి ఇరవై అయిదుమంది రచయితలు, కవులు, సాహిత్య విమర్శకులు హాజరయ్యారు. వాళ్లలో సంప్రదాయవాదులు, ఆధునికులు ఉన్నారు.
ఒక పత్రిక యాజమాన్యానికైనా, సంపాదకులకైనా తమదంటూ ఒక భావజాలం, ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక సాహిత్య సిద్ధాంతమూ, అభిరుచీ ఉంటాయి. అలాగే రచయితలకు కూడా. ఈ రెండు వర్గాల భావజాలాలు, అభిరుచులూ సమానమైనవైతే కలవడం, చర్చించుకోవడం సులభం. ఇద్దరి మధ్య ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటే పని నెరవేరుతుంది. కడపలో ‘ఆంధ్రభూమి’ నిర్వహించిన ఇష్టాగోష్ఠి అలా ప్రజాస్వామిక వాతావరణంలో జరిగింది.
అక్కడికొచ్చిన రచయితలందరూ కూడా ఒకేరకమైన వాళ్లు కారు. సంప్రదాయవాదులు, మార్క్సిస్టులు, దళిత బహుజనులు, మైనారిటీవాదులు అందరూ ఉన్నారు. సంపాదకులు శాస్ర్తిగారు మొదట్లోనే తన అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఎవరి అభిప్రాయాలను వాళ్లు స్పష్టంగా వ్యక్తం చేయవచ్చని ప్రకటించడంతో ప్రజాస్వామిక చర్చకు అనుకూల వాతావరణమేర్పడింది. అన్ని వాదాల రచయితలూ మూడు గంటలసేపు స్వేచ్ఛగా ఇష్టాగోష్ఠి జరిపారు. అది సీమ రచయితల కలబోత అయ్యింది.
గోష్ఠికి వచ్చిన ప్రతి రచయితకూ ‘ఆంధ్రభూమి’తో ఎప్పుడో ఒకప్పుడు రచనా సంబంధముండడం పరిచయాల సమయంలోనే తెలిసిపోయింది. అయినప్పటికీ పేరున్న రచయితలు ఏమిరాసినా ప్రచురిస్తారు, పేరులేని రచయితలు ఎంత బాగా రాసినా ప్రచురించరు అనే పాయింట్ రానే వచ్చింది. దానిమీద చర్చ సాగింది. రాయలసీమ సాహిత్య ప్రచురణకు సంబంధించి అనేకులు తమ అనుభవాలను నిర్మొహమాటంగా చెప్పారు.
‘రాయలసీమ సాహిత్యం దశ దిశ’ అనే అంశం మీద రచయితలు ఆసక్తికరంగా చర్చించారు. రాయలసీమలో ఆధునిక సాహిత్యం ఆలస్యంగా మొదలు కావడానికి, ఇప్పటికీ అక్కడ అవధానాలకు, పద్యానికీ ఆదరణ బాగా ఉండడానికి అక్కడి అభివృద్ధిలోని వెలుగునీడలు, ఆ ప్రాంతపు భావజాలం కారణమని అందరూ ఆమోదించారు. రాయలసీమ నిర్దిష్ట జీవితమనగానే అక్కడి కరువు, కక్షలు అనే భావన స్థిరపడిపోయింది. రచయితలు ఈ రెండంశాలనూ విడివిడిగానే చిత్రించారు. ఈ సందర్భంలో రాయలసీమ రచయితల వేదిక ఒకటి మొదలైతే బాగుంటుందేమో చూడమని సంపాదకులు సూచించారు. ఆ ఆలోచన రాయలసీమలో ఇదివరకే నలుగుతూ ఉంది. కార్యరూపం ధరించవలసి ఉంది. రాయలసీమ సాహిత్య ప్రచురణను వేగవంతం చెయ్యడానికి ఆయన ఒక సూచన చేశారు. రాయలసీమ నాలుగు జిల్లాలకు కలిపి ఆ ప్రాంతానికి వచ్చే పత్రికలో వారానికి ఒకటి రెండు రోజులు రాయలసీమ చరిత్రా సంస్కృతుల మీద రచనల్ని వేస్తే బాగుంటుందా అన్నది ఆయన ప్రస్తావన. దానిమీద రచయితలు రెండు రకాలుగా స్పందించారు. ‘ఆంధ్రభూమి’ అనంతపురంనుంచి మొదలైనప్పుడు 1998లో అఫ్సర్ ఆ పని చేశారు. అది తర్వాత ఆగిపోయింది. దానిని పునరుద్ధరిస్తే మంచిదేనని ఒక అభిప్రాయం రాగా, అలా చేస్తే సీమ సాహిత్యాన్ని సీమకే పరిమితం చేసినట్లవుతుంది కదా అన్నది మరో అభిప్రాయం. గోష్ఠి ముగిసిపోయిన తరువాత కూడా రచయితలు దీనిని గురించి మాట్లాడుకున్నారు. ఏప్రాంతం సాహిత్యాన్నైనా అన్ని ప్రాంతాలకూ చేరవేసే మెకానిజమ్ మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ గోష్ఠిలో సంపాదకులు ఒక రాజకీయ చర్చను కూడా ఆసక్తికరంగా లేవనెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నడుస్తున్నది. రాయలసీమ మేధావులు ఎందుకు స్పందించవలసినంతగా స్పందించడంలేదు? అని అడిగారు. రాయలసీమ భౌగోళిక పరిస్థితి, అక్కడి రాజకీయ నాయకత్వం వంటివి ఇందుకు కారణాలని రచయితలు అభిప్రాయపడ్డారు.
ఆయన అన్నిటికన్నా మించిన ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తి సుదీర్ఘమైన చర్చకు అవకాశమిచ్చారు. యువత సాహిత్యానికి ఎందుకు దూరమైపోతున్నది? యువకులలో సాహిత్యాభిరుచిని కలిగించడం ఎలాగ? ఇది నాటి సమావేశంలో సంపాదకులను, రచయితలను, సాహిత్య విమర్శకులను వెంటాడిన ప్రశ్నలు. ఏ సాహిత్య సమావేశంలో చూచినా, రచనా రంగంలో చూచినా నలభై ఏళ్లకు పైబడిన వాళ్లు మాత్రమే కనిపిస్తున్నారు. వీళ్లంతా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యవసర పరిస్థితికి ముందు పుట్టినవాళ్లు. అత్యవసర పరిస్థితి తర్వాత పుట్టిన వాళ్లలో ప్రత్యేకంగా ఉద్యమాలు, భావజాలాలు ఆకర్షించినవాళ్లు తప్ప సాధారణ సాహిత్య పాఠకులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోపాతికేళ్లకు ఇప్పుడు రాస్తున్న చదువుతున్న వాళ్ల శకం ముగిసిందంటే, కొత్త తరాన్ని సాహిత్య రంగంలోకి తీసుకురాకుంటే అప్పుడు సాహితీ రంగం పరిస్థితేంటి? రాసేదెవరు? ఎవరైనా రాసినా చదివేదెవరు? నూటికి నూరు పాళ్లు పరిస్థితి ఇంత అద్వాన్నమై పోకపోవచ్చు గాని, మొత్తంమీద మన సాంస్కృతిక రంగం బాగా బలహీనపడిపోయే ప్రమాదముంది. ఈ దారుణ పరిణామాలను అరికట్టడం ఇప్పుడు సాహితీ రంగంలో ఉన్న వాళ్లదే బాధ్యత.
సమాజాన్ని గురించికాక, వ్యక్తిని గురించి జనం శకలాలు శకలాలుగా చీలిపోయి ఆలోచించే సందర్భంలో సాహితీరంగం నీరసపడిపోతుంది. అభ్యుదయ విప్లవ, స్ర్తి, దళిత బహుజన, మైనారిటీ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలన్నీ సమాజాన్ని గురించి వివిధ పరిధులలో పరిమితులలో సమష్టి ఆలోచనలు చేసేవే. సమష్టి ఆచరణలు గలిగినవే. ప్రపంచీకరణ వచ్చి ఈ ఉద్యమాలనన్నిటినుంచీ జనాన్ని లాగి వ్యక్తిగత సంచిలో కూరేస్తున్నది. ఈ కుట్రకు బలైపోకుండా నిలబడగలిగిన చిన్న సమూహమే ఇవాళ సాహిత్య రంగాన్ని బలోపేతం చేస్తున్నది.
కడప సదస్సులో రచయితలకు శిల్పశాలలు (వర్క్‌షాపులు) నిర్వహించాలని, సాహితీ సభలను నగరాలనుంచీ, పట్టణాలనుంచీ మండల కేంద్రాలకు తీసుకుపోవాలని, గ్రామాలకు వెళ్లాలని, గ్రామీణ విద్యాసంస్థలకు వెళ్లి సాహిత్య సభలు పెట్టాలని-ఇంకా అనేకమంది అనేకంగా సలహాలు, సూచనలు చేశారు. ఆలోచనలు మంచివే. ఆచరణతోనే గదా పేచీ. ఎవడు తీరిగ్గా ఉన్నాడు రచయితతో సహా? స్వక్షేమ సిద్ధాంతం ప్రబలమవుతున్న కొలదీ సమూహ సిద్ధాంతం బలహీనపడుతుంది. ఇవాళ సాహిత్యంలోనూ అదే ప్రతిబింబిస్తున్నది.
చివరకేమి మిగిలినది? ‘ఆంధ్రభూమి’ ఏర్పాటు చేసిన రాయలసీమ రచయితలతో ఇష్టాగోష్ఠి అక్కడి రచయితలు మరోసారి సాహితీ కర్తవ్యాన్ని గురించి ఆలోచించుకోడానికి అవకాశమేర్పడింది.
గోష్ఠిలో రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, జానుమద్ది హనుమచ్ఛాస్ర్తీ, మధురాంతకం నరేంద్ర, విఆర్ రాసాని, బండి నారాయణస్వామి, వేంపల్లి గంగాధర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రాధేయ, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, సుంకోజి దేవేంద్రాచారి, ఎన్.ఈశ్వరరెడ్డి, ఎన్.రామచంద్ర, ఎన్.కేశవరెడ్డి, కె.నరసింహులు, అబ్బిగారి రాజేంద్రప్రసాద్, డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్‌రెడ్డి, టిఎన్‌ఎ కృష్ణమూర్తి, పుత్తా పుల్లారెడ్డి, డాక్టర్ రామచంద్రయ్య, వేంపల్లి సికిందర్, కలువకుంట్ల రామ్మూర్తి, వై.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
--------------------
September 13th, 2010

తొలి ప్రబంధం - ద్వా.నా.శాస్త్రి

పదహారవ శతాబ్దం నాటి రాయలకాలాన్ని విమర్శకులు ప్రక్రియాపరంగా ‘ప్రబంధయుగం’ అన్నారు. రాయలకాలంలో వెలువడిన వాటికే ప్రబంధాలనే పేరు వచ్చింది. రాయలు రాసిన ‘ఆముక్తమాల్యద’ కూడా ప్రబంధం అన్నారు. నిజానికి ఇది ఆధునిక విమర్శకుల సృష్టితప్ప వేరొకటి కాదు. తిక్కన తన భారతాన్ని ‘ప్రబంధమండలి’ అన్నాడు. ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనే బిరుదు వుంది. అవచి తిప్పయసెట్టి శైవ ప్రబంధం రాయమంటే శ్రీనాధుడు ‘హరవిలాసం’ రాశాడు. దండి కావ్యానికి చెప్పిన అష్టాదశ వర్ణనలే ప్రబంధానికి ఉంటున్నాయి. కాబట్టి పూర్వం ప్రబంధ శబ్దం మంచి రచన, మంచి కూర్పుకలది, కావ్యం, కృతి అనే అర్ధాలలోనే వాడబడింది. ఇప్పటికీ మనుచరిత్ర కావ్యం, ఆముక్తమాల్యద కావ్యం అనే అంటున్నాం కదా! ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య కె.వి.ఆర్.నరసింహం, ఆచార్య పల్లా దుర్గయ్య, ఆచార్య దివాకర్ల వేంకటావధాని మొదలైనవారు ప్రబంధ లక్షణాలు తెలిపి కావ్యంకన్నా ప్రబంధం భిన్నమైందని నిర్ధారించారు. మరి తొలి ప్రబంధమేది? అనే అంశంపై మళ్లీ వాదోపవాదాలు బయలుదేరాయి. కొంతమంది నన్నెచోడుని ‘కుమార సంభవం’ తొలి ప్రబంధమన్నారు. దానికి కారణం వర్ణనలు, కథా నిర్వహణ శిల్పం, ఉక్తి వైచిత్రి వంటి లక్షణాలే. అయితే మరి కొందరు దీనిని అంగీకరించలేదు. ప్రబంధం అనువాదం కాకూడదు, శృంగారం ప్రధానంగా వుండాలి... అని చెప్పినవి పూర్తిగా కుమారసంభవానికి అన్వయించడంలేదు. కాళిదాసు కుమారసంభవంనుంచి కొన్ని అనువాదాలుండడం గమనార్హం. ఎఱ్ఱనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు అతని వర్ణనా నైపుణ్యం వల్లనే వచ్చింది కాబట్టి అతని నృసింహ పురాణం, హరివంశాలు అనువాదాలు కావడంవల్ల కావ్యాలుగానే పరిగణిస్తున్నారు. పురాణాలు అరణ్యాలవంటివైతే ప్రబంధాలు తీర్చిదిద్దిన ఉద్యానవనములవంటివి-అన్న వేటూరి ప్రభాకరశాస్ర్తీగారి మాటలు సమంజసాలు.ఆ కోణంనుంచి చూస్తే అల్లసాని పెద్దన రాసిన ‘మనుచరిత్ర’ తొలి ప్రబంధనమనటం సముచితం. ప్రబంధ లక్షణాలన్నీ మనుచరిత్రకి అన్వయించకపోయినా (చాలా ప్రబంధాలకి అన్ని లక్షణాలు వర్తించవు) రసానందం, చమత్కారత్వం వంటివి పుష్కలంగా గలది మనుచరిత్ర. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం కూడా ప్రబంధ యుగంలో పెద్దన ఒక మేరుపర్వతం వంటివాడనీ, ప్రబంధ ధ్వని ప్రతీయమానమయ్యేట్టు కథా సంవిధానం చేశాడనీ పేర్కొన్నారు. ఆరుద్ర ప్రబంధ వృక్షానికి ఎన్ని కాయలు కాసినా-తొలి ఫలం మనుచరిత్ర అన్నారు. అంతకు ముందు కల కావ్యాలలో ప్రబంధ పోకడలు వున్నాయి. ప్రబంధ మార్గానికి స్పూర్తినిచ్చాయి. ప్రబంధం అనగానే మనుచరిత్ర,పెద్దన గుర్తుకురావాల్సిందే! కాబట్టి ఎక్కువమంది మనుచరిత్రనే తొలి ప్రబంధంగా నిర్ణయించారు.
----------------------

తొలి రచన 15 - ద్వా.నా.శాస్ర్తీ, September 5th, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/toli-rachana-566

దాశరథి ‘అగ్నిధార’కు అరవయ్యేళ్ళు -పున్న అంజయ్య

తెలంగాణలో ఎందరో కవులున్నారు. కానీ పీడిత ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి గొంతెత్తి చెప్పగలిగిన మహాకవి ఒక్కరే. ఆయనే దాశరథి.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేనీ
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన ఘనత ఆయనకే దక్కింది. తన కవిత్వం ద్వారా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అభ్యుదయ కవి. 1949లో దాశరధి తొలి కృతి అయిన ‘అగ్నిధార’ను వెలువరించిన కీర్తి సాహితీ మేఖల సంస్థదే. 1934లో అంబటిపూడి వెంకటరత్నం చండూరులో స్థాపించిన ఈ సంస్థకు 75 వసంతాలు నిండాయంటే ఆశ్చర్యమేమరి. ఆంధ్ర, తెలంగాణ భేదాలను పోగొట్టడానికా అన్నట్లు ఆంధ్రలో పుట్టి తెలంగాణలో స్థిరపడ్డి ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలుగు జాతికి వెలుగుబాటగా సాహిత్య కృషిచేసిన అంబటిపూడి ధన్యులు.
నల్లగొండ జిల్లా చండూరు ప్రాంతంలో అంబటిపూడి స్థాపించిన సాహితీ మేఖల ఎందరినో ప్రభావితం చేసింది. ఈ సంస్థకు పట్టుగొమ్మల్లాంటి వారిలో ధవళా శ్రీనివాసరావు, సిరిప్రెగడ భార్గవరావు, పులిజాల హనుమంతరావు, మద్దోజు సత్యనారాయణలతోపాటు దాశరథి కూడా ఉన్నారు. దాశరథి కవిత ‘అగ్నిధార’ ఐతే ధవళశ్రీ కవిత అమృతధార అని చెప్పుకుంటారు. సాహితీ మేఖలతో సాన్నిహిత్యం పెంచుకున్న దాశరథి నాడు వెలువడిన మాతృభూమి, ప్రజామిత్ర, గోలకొండ, సారధి, అభ్యుదయ, విశాలాంధ్ర వంటి పత్రికల్లో ప్రచురింపబడిన కవితలన్నీ సంపుటీకరించి ‘అగ్నిధార’ పేరుతో సాహితీ మేఖల ప్రచురించింది. ఈ పవిత్ర కార్యానికి ప్రధాన కారకులైన దేవులపల్లి రామానుజరావు అభినందనీయులు. ఈ విషయాన్ని దాశరథి తన ‘కవితా పుష్పకాన్ని’ దేవులపల్లి రామనుజరావుకు అంకితంచేస్తూ ఇలా అన్నారు.
నాడు వెన్ను తట్టి ననుమెచ్చి
చిననాడు
కైత యనెడు లతకు నూతనిచ్చి
మొదటి పొత్తమీవు
పులిజాలతో గూడి
అచ్చువేసి వెలుగు లిచ్చినావు
దాశరథి తన ‘అగ్నిధార’ను వట్టికోట అళ్వార్‌స్వామికి అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా దాశరథి వట్టికోటను గురించి ఇలా అంటారు.
మిత్రుని కోసం కంఠం
ఇవ్వగలవాడు
మంచికి పర్యాయపదం ఆళ్వార్
అతనిదే సార్థకమైన జీవితం
అతనికే అగ్నిధార అంకితం
దాశరథి, ఆళ్వార్‌స్వామి 1948లో మూడునెలలు నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనతో మైత్రికి చిహ్నంగా ఈ అగ్నిధారను అంకితం చేసుకున్నానని వట్టికోట అన్నారు. అందుకే దాశరథిని ‘కవితా పయోనిధి’ అని వట్టికోట సంభోధించేవారు.
ముసలి నక్కకు రాచరికంబు దిక్కునే’ అని నిజాంను నిలువెల్లా వణికించిన ఉద్యమకవి దాశరథి. ‘తెలంగాణము రైతుదే’ అని ఘంటాపథంగా ఎలుగెత్తి చాటిన ధీశాలి ఆయన. రుద్రవీణను మీటి, అగ్నిధార కురిపించి అభ్యుదయ కవితా మార్గంలో పయనించిన దాశరధి ఎప్పటికీ చిరస్మరణీయుడే.

తొలి చిత్ర గర్భ బంధ కావ్యం - ద్వా.నా.శాస్త్రి

నన్నెఛొడుడు మొట్టమొదటగా ఈ చిత్ర గర్భ బంధ కవితా రచన చేశాడు. ఆ తర్వాత ప్రబంధ కవులు అక్కడక్కడ చిత్ర, గర్భ, బంధ కవితారచనలు చేసారు. ఒకే అక్షరంతో పద్యం రాయడం, ఎటు చదివినా ఒకేపద్యం రావడం, మొదటి రెండు పాదాలు తిరగేస్తే తర్వాతి రెండు పాదాలు రావడం మొదలైన విచిత్ర కవిత్వం. ఒకేపద్యంలో అనేక పద్యాలను ఇమిడ్చి రాయడం గర్భకవిత్వం. నాగబంధం, చక్రబంధం వంటి రచనలుప్రత్యేకం. ఆరుద్ర ఇటువంటి రచనల్ని ‘సాముగరిడీలు’ అన్నారు. అయితే ఈ చిత్ర, గర్భ, బంధ కవిత్వం రాయటం మాటలు కాదు. ఎంతో పాండిత్యంతోపాటు పద్యరచనా శిల్పంపై సాధికారం వుండాలి. మెదడు కంప్యూటర్‌లా వుంటేనే ఇటువంటి రచన సాధ్యం.
17వ శతాబ్దికి చెందిన గణపవరపు వేంకట కవి ఏకంగా కావ్యమంతా ఈ చిత్ర, గర్భ, బంధ కవిత్వంతో నింపేశాడు. కొన్ని పద్యాలు రాయడమే కష్టమైనప్పడు దాదాపు కావ్యమంతా రాయటానికి ఎంత ప్రతిభ ఉండాలో ఊహించలేం. పనె్నండవ ఏటనే కావ్యరచన ప్రారంభించిన కవి ఇతడు. యమశతకం, శృంగారమంజరి, కృష్ణమల్ల కధ, బాలరామాయణం, వేంకటేశ్వర నిఘంటువు మొదలైన రచనలు ఇరవైకి పైగా రాశాడు. అవన్నీ ఒక ఎత్తు. ‘‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము’’ ఒక ఎత్తు. ఇది తొలి చిత్ర, గర్భ, బంధ కావ్యం. అంతేకాదు-ఏకాశ్వాస కావ్యం. ఇదీ విశేషమే. వేంకటేశ్వరునికి ఆకాశరాజు కూతురికి జరిగిన వివాహమే ఇందులోని కథ. కథకంటే చిత్రకవితా భేదాలే ఎక్కువ. ‘సుఖసుప్తినున్న సమయంబున వేకువజామువేళ బాలవేంకట శౌరి ప్రత్యక్షమై’’ అంకితం కోరాడట. ఈ ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయవిలాస కావ్యం శ్రీపూండ్ల రామకృష్ణయ్యగారివల్ల వెలుగుచూసింది. శబ్ద చిత్ర సీసము, అనుప్రాసయుక్త అక్కలివడి సీసము, చౌపదములు, ద్వంద్వ ప్రాసకందము, సర్వలఘురూప సీసము, జాతి వార్తావచనము, గర్భిత చరణ దుర్ఘట సీసము, గర్భిత కందము, కటారికాబంధ కందము, రథబంధకందయు మొదలైనవెన్నో ఈ కావ్యంలో వున్నాయి. అయితే ఈ కావ్యంలోగల 808వ సీస పద్యం వంటిది ప్రపంచ సాహిత్యంలోనే లేదు. ఆపద్యం ఇది
‘‘సారాగ్య్రసారస సమనేత్ర యుగళ నారద రుచి కాంతిన రఘనపనిత
సారాగధీర విశదవీనతురగ భైరవభవ జైత్రభరశుభకరణ...’’
ఈ సీసపద్యంలో 64 పద్యాలున్నాయి. తేటగీతులు, ఆటవెలదులు, మంగళారతులు, శ్లోకములు, వృత్తములు, అష్టకములు, ఉత్కళికలు, 20 కందాలు, చేపదాలు అన్నీ కలిపి మొత్తం అరవె నాలుగున్నాయట! చాలావరకు పండితులు గుర్తించారు. ఇదీ మన భాషా ప్రాభవం మన పద్యరచనా వైభవం! అందుకే గణపవరపు వేంకటకవిని చిత్రగర్బ బంధకవిత్వాల పహిల్వాన్ అనటం!
-----------------------

తొలి రచన 16 - ద్వా.నా.శాస్ర్తీ, May 23rd, 2010 - http://www.andhrabhoomi.net/sahiti/dwana-395