Wednesday, September 15, 2010

దాశరథి ‘అగ్నిధార’కు అరవయ్యేళ్ళు -పున్న అంజయ్య

తెలంగాణలో ఎందరో కవులున్నారు. కానీ పీడిత ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి గొంతెత్తి చెప్పగలిగిన మహాకవి ఒక్కరే. ఆయనే దాశరథి.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేనీ
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన ఘనత ఆయనకే దక్కింది. తన కవిత్వం ద్వారా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అభ్యుదయ కవి. 1949లో దాశరధి తొలి కృతి అయిన ‘అగ్నిధార’ను వెలువరించిన కీర్తి సాహితీ మేఖల సంస్థదే. 1934లో అంబటిపూడి వెంకటరత్నం చండూరులో స్థాపించిన ఈ సంస్థకు 75 వసంతాలు నిండాయంటే ఆశ్చర్యమేమరి. ఆంధ్ర, తెలంగాణ భేదాలను పోగొట్టడానికా అన్నట్లు ఆంధ్రలో పుట్టి తెలంగాణలో స్థిరపడ్డి ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలుగు జాతికి వెలుగుబాటగా సాహిత్య కృషిచేసిన అంబటిపూడి ధన్యులు.
నల్లగొండ జిల్లా చండూరు ప్రాంతంలో అంబటిపూడి స్థాపించిన సాహితీ మేఖల ఎందరినో ప్రభావితం చేసింది. ఈ సంస్థకు పట్టుగొమ్మల్లాంటి వారిలో ధవళా శ్రీనివాసరావు, సిరిప్రెగడ భార్గవరావు, పులిజాల హనుమంతరావు, మద్దోజు సత్యనారాయణలతోపాటు దాశరథి కూడా ఉన్నారు. దాశరథి కవిత ‘అగ్నిధార’ ఐతే ధవళశ్రీ కవిత అమృతధార అని చెప్పుకుంటారు. సాహితీ మేఖలతో సాన్నిహిత్యం పెంచుకున్న దాశరథి నాడు వెలువడిన మాతృభూమి, ప్రజామిత్ర, గోలకొండ, సారధి, అభ్యుదయ, విశాలాంధ్ర వంటి పత్రికల్లో ప్రచురింపబడిన కవితలన్నీ సంపుటీకరించి ‘అగ్నిధార’ పేరుతో సాహితీ మేఖల ప్రచురించింది. ఈ పవిత్ర కార్యానికి ప్రధాన కారకులైన దేవులపల్లి రామానుజరావు అభినందనీయులు. ఈ విషయాన్ని దాశరథి తన ‘కవితా పుష్పకాన్ని’ దేవులపల్లి రామనుజరావుకు అంకితంచేస్తూ ఇలా అన్నారు.
నాడు వెన్ను తట్టి ననుమెచ్చి
చిననాడు
కైత యనెడు లతకు నూతనిచ్చి
మొదటి పొత్తమీవు
పులిజాలతో గూడి
అచ్చువేసి వెలుగు లిచ్చినావు
దాశరథి తన ‘అగ్నిధార’ను వట్టికోట అళ్వార్‌స్వామికి అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా దాశరథి వట్టికోటను గురించి ఇలా అంటారు.
మిత్రుని కోసం కంఠం
ఇవ్వగలవాడు
మంచికి పర్యాయపదం ఆళ్వార్
అతనిదే సార్థకమైన జీవితం
అతనికే అగ్నిధార అంకితం
దాశరథి, ఆళ్వార్‌స్వామి 1948లో మూడునెలలు నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనతో మైత్రికి చిహ్నంగా ఈ అగ్నిధారను అంకితం చేసుకున్నానని వట్టికోట అన్నారు. అందుకే దాశరథిని ‘కవితా పయోనిధి’ అని వట్టికోట సంభోధించేవారు.
ముసలి నక్కకు రాచరికంబు దిక్కునే’ అని నిజాంను నిలువెల్లా వణికించిన ఉద్యమకవి దాశరథి. ‘తెలంగాణము రైతుదే’ అని ఘంటాపథంగా ఎలుగెత్తి చాటిన ధీశాలి ఆయన. రుద్రవీణను మీటి, అగ్నిధార కురిపించి అభ్యుదయ కవితా మార్గంలో పయనించిన దాశరధి ఎప్పటికీ చిరస్మరణీయుడే.

No comments:

Post a Comment