Wednesday, September 15, 2010

కడపలో రచయతల కలబోత -రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి

సాహితీ సంస్థలు, సాహితీ పత్రికలు రచయితల్ని ఒకచోటికి చేర్చడం, సాహితీ సామాజికాంశాల గురించి చర్చించడం సహజం. ఒక వార్తాపత్రిక వారానికి ఒకరోజు ఒక పేజీని సాహిత్యానికి కేటాయించే పత్రిక ఈ పని చేయడం అరుదైన అంశమే. ‘ఆంధ్రభూమి’ తన స్వర్ణోత్సవం సందర్భంగా ఆ పని చేస్తున్నది. సెప్టెంబర్ 5న కడప ‘హరిత’ టూరిజం హోటల్ సమావేశ మందిరంలో ‘ఆంధ్రభూమి’ సంపాదకులు ఎం.వి.ఆర్. శాస్ర్తీగారి పర్యవేక్షణలో రాయలసీమ రచయితలతో చర్చాగోష్ఠి జరిగింది. చిత్తూరు, అనంతపురం, వైయస్సార్ జిల్లాలనుండి ఇరవై అయిదుమంది రచయితలు, కవులు, సాహిత్య విమర్శకులు హాజరయ్యారు. వాళ్లలో సంప్రదాయవాదులు, ఆధునికులు ఉన్నారు.
ఒక పత్రిక యాజమాన్యానికైనా, సంపాదకులకైనా తమదంటూ ఒక భావజాలం, ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక సాహిత్య సిద్ధాంతమూ, అభిరుచీ ఉంటాయి. అలాగే రచయితలకు కూడా. ఈ రెండు వర్గాల భావజాలాలు, అభిరుచులూ సమానమైనవైతే కలవడం, చర్చించుకోవడం సులభం. ఇద్దరి మధ్య ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటే పని నెరవేరుతుంది. కడపలో ‘ఆంధ్రభూమి’ నిర్వహించిన ఇష్టాగోష్ఠి అలా ప్రజాస్వామిక వాతావరణంలో జరిగింది.
అక్కడికొచ్చిన రచయితలందరూ కూడా ఒకేరకమైన వాళ్లు కారు. సంప్రదాయవాదులు, మార్క్సిస్టులు, దళిత బహుజనులు, మైనారిటీవాదులు అందరూ ఉన్నారు. సంపాదకులు శాస్ర్తిగారు మొదట్లోనే తన అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఎవరి అభిప్రాయాలను వాళ్లు స్పష్టంగా వ్యక్తం చేయవచ్చని ప్రకటించడంతో ప్రజాస్వామిక చర్చకు అనుకూల వాతావరణమేర్పడింది. అన్ని వాదాల రచయితలూ మూడు గంటలసేపు స్వేచ్ఛగా ఇష్టాగోష్ఠి జరిపారు. అది సీమ రచయితల కలబోత అయ్యింది.
గోష్ఠికి వచ్చిన ప్రతి రచయితకూ ‘ఆంధ్రభూమి’తో ఎప్పుడో ఒకప్పుడు రచనా సంబంధముండడం పరిచయాల సమయంలోనే తెలిసిపోయింది. అయినప్పటికీ పేరున్న రచయితలు ఏమిరాసినా ప్రచురిస్తారు, పేరులేని రచయితలు ఎంత బాగా రాసినా ప్రచురించరు అనే పాయింట్ రానే వచ్చింది. దానిమీద చర్చ సాగింది. రాయలసీమ సాహిత్య ప్రచురణకు సంబంధించి అనేకులు తమ అనుభవాలను నిర్మొహమాటంగా చెప్పారు.
‘రాయలసీమ సాహిత్యం దశ దిశ’ అనే అంశం మీద రచయితలు ఆసక్తికరంగా చర్చించారు. రాయలసీమలో ఆధునిక సాహిత్యం ఆలస్యంగా మొదలు కావడానికి, ఇప్పటికీ అక్కడ అవధానాలకు, పద్యానికీ ఆదరణ బాగా ఉండడానికి అక్కడి అభివృద్ధిలోని వెలుగునీడలు, ఆ ప్రాంతపు భావజాలం కారణమని అందరూ ఆమోదించారు. రాయలసీమ నిర్దిష్ట జీవితమనగానే అక్కడి కరువు, కక్షలు అనే భావన స్థిరపడిపోయింది. రచయితలు ఈ రెండంశాలనూ విడివిడిగానే చిత్రించారు. ఈ సందర్భంలో రాయలసీమ రచయితల వేదిక ఒకటి మొదలైతే బాగుంటుందేమో చూడమని సంపాదకులు సూచించారు. ఆ ఆలోచన రాయలసీమలో ఇదివరకే నలుగుతూ ఉంది. కార్యరూపం ధరించవలసి ఉంది. రాయలసీమ సాహిత్య ప్రచురణను వేగవంతం చెయ్యడానికి ఆయన ఒక సూచన చేశారు. రాయలసీమ నాలుగు జిల్లాలకు కలిపి ఆ ప్రాంతానికి వచ్చే పత్రికలో వారానికి ఒకటి రెండు రోజులు రాయలసీమ చరిత్రా సంస్కృతుల మీద రచనల్ని వేస్తే బాగుంటుందా అన్నది ఆయన ప్రస్తావన. దానిమీద రచయితలు రెండు రకాలుగా స్పందించారు. ‘ఆంధ్రభూమి’ అనంతపురంనుంచి మొదలైనప్పుడు 1998లో అఫ్సర్ ఆ పని చేశారు. అది తర్వాత ఆగిపోయింది. దానిని పునరుద్ధరిస్తే మంచిదేనని ఒక అభిప్రాయం రాగా, అలా చేస్తే సీమ సాహిత్యాన్ని సీమకే పరిమితం చేసినట్లవుతుంది కదా అన్నది మరో అభిప్రాయం. గోష్ఠి ముగిసిపోయిన తరువాత కూడా రచయితలు దీనిని గురించి మాట్లాడుకున్నారు. ఏప్రాంతం సాహిత్యాన్నైనా అన్ని ప్రాంతాలకూ చేరవేసే మెకానిజమ్ మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ గోష్ఠిలో సంపాదకులు ఒక రాజకీయ చర్చను కూడా ఆసక్తికరంగా లేవనెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నడుస్తున్నది. రాయలసీమ మేధావులు ఎందుకు స్పందించవలసినంతగా స్పందించడంలేదు? అని అడిగారు. రాయలసీమ భౌగోళిక పరిస్థితి, అక్కడి రాజకీయ నాయకత్వం వంటివి ఇందుకు కారణాలని రచయితలు అభిప్రాయపడ్డారు.
ఆయన అన్నిటికన్నా మించిన ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తి సుదీర్ఘమైన చర్చకు అవకాశమిచ్చారు. యువత సాహిత్యానికి ఎందుకు దూరమైపోతున్నది? యువకులలో సాహిత్యాభిరుచిని కలిగించడం ఎలాగ? ఇది నాటి సమావేశంలో సంపాదకులను, రచయితలను, సాహిత్య విమర్శకులను వెంటాడిన ప్రశ్నలు. ఏ సాహిత్య సమావేశంలో చూచినా, రచనా రంగంలో చూచినా నలభై ఏళ్లకు పైబడిన వాళ్లు మాత్రమే కనిపిస్తున్నారు. వీళ్లంతా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యవసర పరిస్థితికి ముందు పుట్టినవాళ్లు. అత్యవసర పరిస్థితి తర్వాత పుట్టిన వాళ్లలో ప్రత్యేకంగా ఉద్యమాలు, భావజాలాలు ఆకర్షించినవాళ్లు తప్ప సాధారణ సాహిత్య పాఠకులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోపాతికేళ్లకు ఇప్పుడు రాస్తున్న చదువుతున్న వాళ్ల శకం ముగిసిందంటే, కొత్త తరాన్ని సాహిత్య రంగంలోకి తీసుకురాకుంటే అప్పుడు సాహితీ రంగం పరిస్థితేంటి? రాసేదెవరు? ఎవరైనా రాసినా చదివేదెవరు? నూటికి నూరు పాళ్లు పరిస్థితి ఇంత అద్వాన్నమై పోకపోవచ్చు గాని, మొత్తంమీద మన సాంస్కృతిక రంగం బాగా బలహీనపడిపోయే ప్రమాదముంది. ఈ దారుణ పరిణామాలను అరికట్టడం ఇప్పుడు సాహితీ రంగంలో ఉన్న వాళ్లదే బాధ్యత.
సమాజాన్ని గురించికాక, వ్యక్తిని గురించి జనం శకలాలు శకలాలుగా చీలిపోయి ఆలోచించే సందర్భంలో సాహితీరంగం నీరసపడిపోతుంది. అభ్యుదయ విప్లవ, స్ర్తి, దళిత బహుజన, మైనారిటీ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలన్నీ సమాజాన్ని గురించి వివిధ పరిధులలో పరిమితులలో సమష్టి ఆలోచనలు చేసేవే. సమష్టి ఆచరణలు గలిగినవే. ప్రపంచీకరణ వచ్చి ఈ ఉద్యమాలనన్నిటినుంచీ జనాన్ని లాగి వ్యక్తిగత సంచిలో కూరేస్తున్నది. ఈ కుట్రకు బలైపోకుండా నిలబడగలిగిన చిన్న సమూహమే ఇవాళ సాహిత్య రంగాన్ని బలోపేతం చేస్తున్నది.
కడప సదస్సులో రచయితలకు శిల్పశాలలు (వర్క్‌షాపులు) నిర్వహించాలని, సాహితీ సభలను నగరాలనుంచీ, పట్టణాలనుంచీ మండల కేంద్రాలకు తీసుకుపోవాలని, గ్రామాలకు వెళ్లాలని, గ్రామీణ విద్యాసంస్థలకు వెళ్లి సాహిత్య సభలు పెట్టాలని-ఇంకా అనేకమంది అనేకంగా సలహాలు, సూచనలు చేశారు. ఆలోచనలు మంచివే. ఆచరణతోనే గదా పేచీ. ఎవడు తీరిగ్గా ఉన్నాడు రచయితతో సహా? స్వక్షేమ సిద్ధాంతం ప్రబలమవుతున్న కొలదీ సమూహ సిద్ధాంతం బలహీనపడుతుంది. ఇవాళ సాహిత్యంలోనూ అదే ప్రతిబింబిస్తున్నది.
చివరకేమి మిగిలినది? ‘ఆంధ్రభూమి’ ఏర్పాటు చేసిన రాయలసీమ రచయితలతో ఇష్టాగోష్ఠి అక్కడి రచయితలు మరోసారి సాహితీ కర్తవ్యాన్ని గురించి ఆలోచించుకోడానికి అవకాశమేర్పడింది.
గోష్ఠిలో రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, జానుమద్ది హనుమచ్ఛాస్ర్తీ, మధురాంతకం నరేంద్ర, విఆర్ రాసాని, బండి నారాయణస్వామి, వేంపల్లి గంగాధర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రాధేయ, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, సుంకోజి దేవేంద్రాచారి, ఎన్.ఈశ్వరరెడ్డి, ఎన్.రామచంద్ర, ఎన్.కేశవరెడ్డి, కె.నరసింహులు, అబ్బిగారి రాజేంద్రప్రసాద్, డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్‌రెడ్డి, టిఎన్‌ఎ కృష్ణమూర్తి, పుత్తా పుల్లారెడ్డి, డాక్టర్ రామచంద్రయ్య, వేంపల్లి సికిందర్, కలువకుంట్ల రామ్మూర్తి, వై.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
--------------------
September 13th, 2010

No comments:

Post a Comment