Sunday, January 26, 2014

1838వ సంవత్సరం నాటి ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర


 

కాశీయాత్ర చరిత్ర పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి: కాశీయాత్ర చరిత్ర

 

కాశీయాత్ర చరిత్ర


కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

యాత్రా విశేషాలను ఒక జర్నలుగా వ్రాసి పంపవలెనని వీరాస్వామయ్య కాశీయాత్రకు బయలు దేరే ముందు అతని మిత్రుడు శ్రీనివాస పిళ్ళై కోరాడు. అలా వ్రాసిన సంగతులను 1838లో అచ్చు వేయించారు. 1869లో గవర్నమెంటు ఉత్తరువుల ప్రకారం పునర్ముద్రింపబడింది. 1941లో దిగవల్లి వేంకటశివరావు కొంత పరిశోధించి, మరిన్ని సమగ్రమైన వివరణలతో పునర్ముద్రింపజేశాడు. 19వ శతాబ్దం ఆరంభ కాలానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకంలా మరే తెలుగు పుస్తకమూ ఉపకరించడంలేదు. ఆ కాలంలో జీవనం గురించి, భాష గురించి, పాలనా వ్యవస్థ గురించి అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుస్తున్నాయి.

యాత్రా విశేషాలు వ్రాయడం 19వ శతాబ్దంలో ఈ పుస్తకానికి ముందు లేదనే చెప్పవచ్చును. తెలుగులో యాత్రా చరిత్రకు వీరాస్వామయ్య ఆద్యుడు అనవచ్చును. అప్పటిలోనే ఇది తమిళ మరాఠీ భాషలలోకి తర్జుమా చేయబడింది.

కాశీయాత్ర

వీరాస్వామయ్య కాశీయాత్ర జర్నల్ మొదటి వాక్యం ఇది -
జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని ౧౮౩౦ సంవత్సరము మే నెల ౧౮వ తేదీ కుజవారము రాత్రి ౯ ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు ౩ గడియల దూరము.

ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. షుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్త్రీ జనం, బంధువులు, పరిజనులు షుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా కలకత్తా నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతం భువనేశ్వరం, బరంపురంల మీదుగా శ్రీకాకుళం చేరారు. రాజమహేంద్రవరం, బందరు, నెల్లూరుల గుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి రైళ్ళు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. కంకర రోడ్లసలే లేవు. "బాట సరాళము" అంటే మనుషులు, బండ్లు నడవడానికి వీలుగా ఉన్నదని అర్ధం చేసుకోవాలి. అతని యాత్రలో సందర్శించిన కొన్ని ఊళ్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక ఊరి మజిలీకి చెందినవవుతాయి.

 • 1830 మే 18 - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము), తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
 • మే 23 - దిగువ తిరుపతి, తిరుపతి కొండ
 • మే 30 - కరకరంబాడు, శెట్టిగుంట, బాలపల్లె, కోడూరు, వోగంబాడు, పుల్లంపేట, నందలూరు, అత్తిరాల, భాకరాపేట, వొంటిమిట్ట
 • కడప, పుష్పగిరి, కాజీపేట, దువ్వూరు, వంగలి
 • జూన్ 2 - అహోబిళం, శ్రీరంగాపురం, రుద్రవరము, మహానంది, బండాతుకూరు, వెలపనూరు, ఓంకారము, వెంపెంట, ఆత్మకూరు, నాగులోటి, పెద్ద చెరువు
 • జూన్ 16 - శ్రీశైలము, భీముని కొల్లము, పెద్దచెరువు
 • జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం), ముసలిమడుగు
 • జూన్ 21 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి, పానగల్లు, చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట, జడచర్ల, నాగనపల్లె (బాలనగరం), జానంపేట (ఫరక్కునగరం), షాపురం
 • జూన్ 29 - హైదరాబాద్ (బేగం బజారు)
 • జూలై 8 - సికింద్రాబాదు, గోల్కొండ
 • జూలై 20 - మేడిచర్ల, మాషాపేట, బిక్కనూరుపేట, కామారెడ్డిపేట, మల్లుపేట, యాదలవాయి, జగనంపల్లె, వేములవాడ, దూదుగాం, స్వర్ణ, ఆర్మూరు, రామనపేట
 • జూలై 31 - (గోదావరి దాటడం), నిర్మల (కుశ దర్పణం)
 • ఆగష్టు 2 - వొడ్డూరు, విచ్చోడా, యేదులాబాదు (పిన్నగంగ దాటడం), గూంగాం
 • ఆగష్టు 14 - నాగపూరు
 • ఆగష్టు 21 - కామిటి
 • ఆగష్టు 26 - రామటెంకి
 • సెప్టెంబరు 6 - నర్మదావది దాటడం, తిలవారా
 • సెప్టెంబరు 8 - జబ్బల్ పూరు
 • సెప్టెంబరు 13 - గోసలపూరు
 • సెప్టెంబరు 22 - రీమా
 • సెప్టెంబరు 29 - మిరిజాపూరు
 • అక్టోబరు 9 - వింధ్యవాసిని
 • అక్టోబరు 12 - ప్రయాగ (అలహాబాదు)
 • అక్టోబరు 23 - గంగమీద ప్రయాణం
 • అక్టోబరు 27 - కాశీ, హరిద్వాఱము, గంగోత్రి, బదరీ నారాయణము, కాశ్మీరము
 • డిసెంబరు 17 - గయకు ప్రయాణం, గాజీపూరు
 • డిసెంబరు 28 - పట్నా, జ్వాలా ముఖి, దేవప్రయాగ
 • 1831 జనవరి 1 - పున:పునః నది, నీమా నదామా
 • జనవరి 4 - గయ
 • ఫిబ్రవరి 18 - పట్నా
 • మార్చి 5 - గంగానదిపై ప్రయాణం, మూంగేరి (మాంఘీరు), భాగల్పూరు
 • మార్చి 17 - రాజా మహలు
 • ఏప్రిల్ 1 - కృష్ణనగరు
 • ఏప్రిల్ 9 - కలకత్తా
 • జూన్ 3 - వుడుబడియా, భద్రకాళి, రాణీసరాయి
 • జూన్ 18 - మహానది దాటడం, కటకం(కటక్), పిప్పిలి
 • జూన్ 21 - జగన్నాధము (భువనేశ్వరం)
 • జూన్ 27 - నరసింగగాటు
 • జూన్ 28 - మాణిక్యపట్టణం, చిలక సముద్రం
 • జూన్ 30 - గంజాం (ఋషికుల్య నది)
 • జూలై 1 - నాయుడిపేట, ఛత్రపురం, బరంపురం
 • జూలై 3 - ఇచ్ఛాపురం, గంజాం జిల్లాలోని రేవులు, కంచర్ల, పలాస, రఘునాధపురం, హరిశ్చంద్రపురం, నరసన్నపేట, రావులవలస
 • జూలై 7 - శ్రీకాకుళము, శ్రీకూర్మము
 • జూలై 9 - వెజ్జపురం, గిరివాడిపాళెం, గంజాం మరియు విజయనగరం తాలూకాలలోని అగ్రహారాలు, మహాస్థలాలు
 • జూలై 10 - విజయనగరం, ఆలమంద, సబ్బవరం, సింహ్వాచలము, కసంకోట, అనకాపల్లి, యలమంచిలి, దివ్యల, నక్కపల్లి, వుపమాకా, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, యింజరము, మాదయ పాళెము, వుప్పాడా
 • జూలై 20 - పిఠాపురము, పెద్దాపురము
 • జూలై 21 - రాజానగరము
 • జూలై 21 - రాజమహేంద్రవరము, కాకినాడ, కోనసీమ, ధవిళేశ్వరం, భద్రాద్రి, కోరంగి
 • జూలై 28 - గోదావరి దాటడం, వాడపల్లి, రాల (ర్యాలి), ఆచంట, శింగవృక్షము, బొండాడ, యేలూరిపాడు, కలిదండి. తుమ్మడి
 • ఆగష్టు 2 - మచిలీ బందరు
 • కొత్తపాళెం - చల్లపల్లి, కళ్ళేపల్లి
 • ఆగష్టు 19 - కృష్ణానదిని దాటడం, కనగాల, భట్టుప్రోలు, లంజదిబ్బ, చందవోలు, బాపట్ల, వేటపాళెం, చినగంజాం, అమ్మనబోలు, ఆకులల్లూరు, వెలగపూడి సత్రము, కరేడు, కొత్త సత్రము, జువ్వులదిన్నె, పంటల్లూరు, కొడవలూరి సత్రం
 • ఆగష్టు 14 - పినాకినీ నదిని దాటడం, నెల్లూరు
 • ఆగష్టు 27 - మనుబోలు, గూడూరు, నాయుడుపేట, బ్రాహ్మణపుదూరు, దొరవారి కోనేరు, మన్నారు పోలూరు (కోటపోలూరు), చిలకలపూడి రామస్వామి సత్రం, సుళూరుపేట, గుమ్మడిపూడి
 • సెప్టెంబరు 1 - పొన్నేరి, విచ్చూరు
 • సెప్టెంబరు 2 - తిరువట్టూరు
 • 1831 సెప్టెంబరు 3 - చెన్నపట్టణము
చివరి అధ్యాయంలో కొన్ని వాక్యాలు:
౩వ తేదీ సాయంకాలము ౫ గంటలకు బయలువెళ్ళి యిష్టులతో గూడా చెన్నపట్టణమునకు అరకోశెడు దూరములో తండయారువేడులో ఉండే నాతోటయిల్లు ఆరు గంటలకు చేరినాను. ... ... నేను స్వస్థలమును వదలి మళ్ళీ చేరిన కాలము ౧౫ మాసాలు ౧౫ దినాలు ౧౦ నిముషాలు. నా స్వస్థలము వదలి దూర దేశమును సంచరించి మళ్ళీ వచ్చినట్టు నాకు నా పరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లు గూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్థలము చేర్చినాడు గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువు చేస్తాడనే మాట సత్యం సత్యం పునఃసత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలసినది. (తరువాత చెన్నపట్నం చరిత్ర గురించి వ్రాసాడు రచయిత)

 

  మూలాలు, వనరులు

కాశీయాత్ర చరిత్ర మొదటిసారి ముద్రింపబడినపుడు దానికి కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన పీఠిక వీరాస్వామయ్య గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం. మరియు గ్రంథంలో వీరాస్వామయ్య సమయోచితంగా చెప్పిన కొద్దిపాటి స్వవిషయాలు గమనించవచ్చును. ఇప్పుడు ఆ పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.
 • ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869 లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది  దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగవల్లి వేంకటశివరావు గ్రంథకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకం నుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.
 • కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య - ఇది 1992లో ముక్తేవి లక్ష్మణరావు చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ. 1992లో తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇందులో పాత పుస్తకంలో ఉన్న విషయాలు ఆధారంగా సంపాదకుడు ముక్తేవి లక్ష్మణరావు వీరాస్వామయ్య జీవితం, కాలం గురించి సుదీర్ఘమైన వ్యాసం సంపాదకీయం వ్రాశాడు. మూల ప్రతిలో కొంత భాగాన్ని (ముఖ్యంగా ఉత్తరాది ప్రయాణంలో భాగాన్ని) వదలివేసి, తక్కిన భాగాన్ని మాత్రం ప్రచురించాడు. మూల ప్రతిలో ఉన్న తెలుగు అంకెలు స్థానే ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న ఇంగ్లీషు అంకెలు వాడాడు.

ఈ వ్యాసంలో వీరాస్వామయ్య గురించిన విశేషాలు పై రెండు పుస్తకాలనుండి సేకరింపబడ్డవి.

 

 

కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత

యాత్రా క్రమం, విశేషాలు

 • అప్పటికి (1831-1832) బ్రిటిషు వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజు ల క్రింద ఉండేది.
 • ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగాడు.
 • అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశాడు.
 • విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశాడు.
 • కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
 • పుప్పాడ లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.

 

ముద్రణలు

 • చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన వీరాస్వామి యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై మొదటిసారిగా 1838 లో ముద్రించాడు.
 • ఈ గ్రంథం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది.
 • ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు అనేక వివరణలతో ప్రచురించాడు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.

 

మూలాలు, వనరులు

 • తెలుగు సంగతులు, బూదరాజు రాధాకృష్ణ, మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2003.