Monday, April 21, 2014

మన తెలుగు నిఘంటువులు (శబ్దరత్నాకరము -Shabda Ratnakaram)

శబ్దరత్నాకరము కొఱకు క్లిక్ చేయండి: శబ్దరత్నాకరము
Download Shabda Ratnakaram here: ShabdaRatnakaram

మన తెలుగు నిఘంటువులు

ఇప్పుడంటే ఉద్యోగాలు, వేడుకలు, సినిమాలు, కంప్యూటర్లు - కాని ఒకప్పుడు ఎక్కువమంది పుస్తకాలని చదివేవారు. అంటే ఇప్పుడు లేరనికాదు. ఆ పుస్తకాలు సాహిత్య పుస్తకాలు, చందమామలాంటి కథల పుస్తకాలు, శరత్‌-చలం-లత వంటివారి అనువా దాలు, వారి రచనలు, శతక పద్యాలు- పత్రికలు, నవలలు - ఇలా ఎన్నో - ఎన్నెన్నో చదివేవారు. భారతివంటి సాహిత్య పత్రికలను జనం విపరీతంగా చదివేవారు. అప్పటి పత్రికలలోను మంచి భాషను వాడేవారు. రేడియోలోను ''గణపతి'' వంటి ప్రసిద్ధ నవలలు నాటకాలుగావచ్చేవి. ఆఖరికి మనుషులు మాటాడే భాష కూడా ఒకస్థాయిలో వుండేది. అలా అన్ని పుస్తకాలను చదివేటప్పుడు అందరికి అన్నిమాటలు అర్ధమవ్వవుకదా? ఏదో ఒక పదానికైనా అర్ధం తెలియకనే ఉండేది. అంతేకాక ఒక భాష నుండి మరొక భాషాను వాదాలు వచ్చేవి. వాటిల్లో రాజకీయం, చరిత్ర, వాణిజ్యం వంటి రకరకాల శాస్త్రాలకి సంబంధించినవి చదువు తున్నాం నేడు. అలా అవన్నీ చదివే టప్పుడు కొన్ని అయినా అర్ధాలు తెలియనిపదాలు వస్తాయి. అది మనంద రికి అనుభవమే. మరి అలాంటపుడు ఏం చేయాలి అని మీరెపుడైనా ఆలోచిం చారా? ఎవరినైనా అడిగారా? అలాం టపుడు పదాల అర్ధాలకై చూడాల్సింది డిక్షనరి. ఆంగ్లభాషకు మాక్‌మీన్‌, ఆక్స్‌ఫర్డ్‌వంటి సంస్థలు ప్రచురించిన అనేకానేక డిక్షనరీలు అందుబాటులో ఉన్నాయి. మరి మన తెలుగు ఆ భాషా పదాల అర్ధాలకోసం తయారు చేయ బడిన డిక్షరీలను గురించి తెలుసు కోవాలని ఎవరికైనా ఎపుడైనా అనిపిం చింది. ఇలా ఎందుకడుగుతున్నానంటే ఒకనాటి కాలాశ భారతం, ఆముక్తి మాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర, వంటి ఉద్గ్రంధాలెన్నిటినో చదివేవారు జనం. చిన్నయసూరి మున్నగువారు రచించిన పంచతంత్రములోని వచనం వంటి వచనాన్ని చదివేవారు. కాని ఈ నాటి వచనము చాలా తేలికైనది. పద్యాలకు బదులు నేడు అందరూ వ్రాస్తున్నది, చదువు తున్నది వచన కవిత్వమే. మామూలుగా ఎవరైనాసరే ఒక కవిత, వ్యాసం లేదా ఒక కథ వ్రాస్తున్నారు. వాటి గురించే ఆలోచిస్తారు తప్ప తెలుగులో డిక్షనరీల గురించి తెలుగు చదువుకున్న వాళ్ళు కూడా అంతగా ఆలోచించరేమో. ఉపాధ్యాయులుగా ఉండి పదాల అర్ధాలకోసం డిక్షనరీని చూడనివారి గురించి నాకు తెలుసు. చాలాకాలం క్రిందటి నుండి ఈ డిక్షనరీల గురించి వ్రాయాలను కున్నారు. అశ్రద్ధ చేయబడింది. కాని కొన్ని నెలలక్రితం డా|| ఉషారాణి, గోవిందరాజులు గారి - నిఘంటువులు - ఒక అధ్యయనము అనే వారి పరిశోధనా గ్రంథాన్ని చదివాను. అది చదివిన తరువాత మన డిక్షనరీల గురించి ఆవగింజంతయినా వ్రాయాలని పించింది. నలుగురికి ఆ విషయమై తెలియజేయా లనిపించింది.
ఈ డిక్షనరీని మన తెలుగు భాషలో నిఘంటువు అని అంటారు. నిఘంటువు అంటే భాషలోని పదసమూహాన్ని ఒకచోట చేర్చి, ఆ పద స్వరూపమును, అర్ధవిశేషము లను, పర్యాయపదములను, సమానార్ధక పదములను తెల్పేది నిఘంటువని చెప్పుకోవచ్చు. ఈ నిఘంటువుకే కోశము, అనుశాసనము, అభిధానము అనే పర్యాయపదాలున్నాయి. ఈ నిఘంటువు అనే పదం ఇటీవల వచ్చిన పదం కాదు. ఇది చాలా ప్రాచీనమైనది. ఎందుకంటే భారతదేశమున వేదకాలమునందే వైదిక నిఘంటువు ఉన్నదట.
మన తెలుగు భాషకు అనేకరకాలైన నిఘంటువులు అనేక మందిచే వ్రాయ బడినవి. ఇపుడూ మనం చాలచాల ప్రసిద్ధములైన కొన్ని నిఘంటువుల గురించి తెలుసుకుందాం. ముందుగా ''అమర కోశము'' అనే నిఘంటువు గురించి తెలుసుకుందాం. దీనిని 4, 5 శతాబ్దాల మధ్య కాలాన అమరసింహుడు రచించాడు. సంస్కృత భాషలో రచించబడిన ఈ అమర కోశం మూడు కాండలుగా (భాగాలుగా) ఉండి త్రిమూర్తులు, ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు, సర్వులకాధారమైన భూమి, దానిమీదుండు పర్వతములు, మృగాది సర్వప్రాణులు మున్నగు వాటికి సంబంధించిన విశేషణ + పర్యాయ + నానార్ధ పదములు గురించి చెప్పింది. దీని తర్వాత శాశ్వతకోశము (నానార్ధములు), అభిదారత్నమాల (పర్యాయపదములు), ఏకాక్షర కోశము - ఇలా ఎన్నో సంస్కృత నిఘంటువులు వచ్చాయి. ఇక మన తెలుగు భాషలో ఈ నిఘంటు ప్రక్రియ 17వ శతాబ్దాల్లో కవి చౌడప్ప రచనతో మొదలైంది. తరువాత పైడిపాటి లక్ష్మణ కవి రచించిన ''ఆంధ్రనామ సంగ్రహము'', అడిదము సూరకవి రచించిన ''ఆంధ్రనామ శేషము'' మున్నగు నిఘంటువులో వచ్చాయి. కాని అవన్నీ పద్య నిఘంటువులే. అవన్నీ కలిసి 29 వరకు వచ్చాయి.
ఆ తరువాత కాలంలో ఆంగ్లేయులు మన దేశపాలన గావించిన సమయంలో కొంత మంది ఆంగ్లేయులు తెలుగుభాషలో నిఘంటు రచనకు నాంది పలికారు. తెలుగు - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తెలుగు వంటి ద్విభాషా నిఘంటువులు రాగా విలియం బ్రౌన్‌, ఎ.డి.కాంబెల్‌, మెరిస్‌, సి.డి. బ్రౌను వంటివారు ద్విభాషా నిఘంటువులతోపాటు తెలుగు పదాలకు అకారాది అంటే వర్ణమాల క్రమంలో (అ ఆ ఇ ఈ అక్షర వరుసలో) నిఘంటు రచనా విధానమును పరిచయం చేశారు. ఇలాంటివి 60 నిఘంటువులు ఉన్నాయట. సి.పి.బ్రౌన్‌ దేశిపద నిఘంటువు, అకారాది దేశీయాంధ్ర నిఘంటువు అనే రెండు అముద్రిత నిఘంటువుల్ని సేకరించాడట. ఆ తరువాత కాలంలో పదపట్టికలు, పారిశ్రామిక పద పట్టికలు, శాస్త్రపద పట్టికలుగల నిఘంటువులు వచ్చాయి.
ఆ తరువాత తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా మామిడి వెంకయ్య 40 వేల పదాలతో తెలుగు - తెలుగు అకారాది నిఘంటువు రాగా ఆ పిదప చిన్నయసూరి రచించిన నిఘంటువు, బహుజన పల్లి సీతారామాచార్యులు రచించిన - ''శబ్ద రత్నాకరము'' (33 1/2 వేల పదాలతో) అనే నిఘంటువు వచ్చాయి. తరువాత ''ఆంధ్రపద పారిజా తము'' అను శుద్ధాంధ్ర నిఘంటువు (ఓగిరాల జగన్నాథకవి, గురజాడ శ్రీరామమూర్తి), ''లక్ష్మీనారాయణీయము'' అను పేరుతో కొర్రా లక్ష్మీనారాయణ శాస్త్రి వ్రాసిన శుద్ధాంధ్ర ప్రతిపదార్ధ పర్యాయపద నిఘంటువు, కొట్రా శ్యామల కామశాస్త్రి రచించిన ''ఆంధ్ర వాచస్పత్యము'' ఆపై అపూర్వము అద్వితీయమై శ్రీ జయంతి రామయ్య పంతులుగారి ఆధ్వర్యంలో లేదా నేతృత్వంలో తయారైన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఆపై తరువాత వావిళ్ళవారి నిఘంటువు, చెలమచర్ల రంగాచార్యులు గారు రచించిన ''ఆంధ్రశబ్దరత్నాకరము'' నిఘంటువు, ఇంకా మాండలిక వృత్తి పదకోశములు, మహాకాళి సుబ్బారాయుడు రచించిన ''శబ్దార్ధచంద్రిక'' అను ఆంధ్ర నిఘంటువు, ఇంకా కె. వయాపురి శెట్టి రచించిన ''శబ్దార్థ రత్నావళి'', భమిడిపాటి అప్పయ్యశాస్త్రిగారు రచించిన ''శబ్దకౌముది'' (ఆంధ్ర నిఘంటువు), ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి ''తెలుగు నిఘంటువు'', పిల్లలకోసం బహుజన పల్లి సీతారామా చార్యులు వ్రాసిన ''బాల చంద్రోదయము'' వంటి లఘు నిఘంటువులు వంటి ఎన్నో నిఘంటువులు వచ్చాయి.
ఇంకా అకారాది క్రమములో కూర్చబడిన మనిషి మరచిపోలేనటువంటి సామెతలు, మనిషి జీవన విధానానికి అవసరమైన సూక్తులు, భాషాప్రయో జనాలకు అనువైన జాతీయాలు, పద జ్ఞానాన్నిచ్చే పదసూచికలు, విద్యార్థులకెంతో ఉపయోగపడే విద్యార్థి కల్పతరువు, పూర్వగాధాలహరి, పురాణనామ చంద్రిక ఇవన్నీ ప్రకీర్ణములు అని పిలువబడు తున్నాయి. ఇంకా పరిశీలిస్తే పదబంధ కోశము, తులనాత్మక నిఘంటువులు ఎన్నో ఉన్నాయి. నిఘంటువు అనేది ఎందుకనే అభిప్రాయం వెలిబుచ్చారు కొందరు. వరుసగానే వివరము ఉన్న పదాలు ఎంతచదివినా అవి గుర్తుండవు కదా అనేవారున్నారు. నిఘంటువును ఉపయోగించుకోవటం వలన అర్ధనిర్ణయము, వ్యాకరణ విషయములు, క్రియాపదాలు, విశేషణాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలు వంటి ఎన్నో విషయాలు అందునా భాషకు చెందిన ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.
పద సమృద్ధితో ఉండే నిఘంటువులు విషయ విపులీకరణ, విజ్ఞాన సర్వస్వాలుగా ఉండే నిఘంటువులు గణితము, వైద్యము, న్యాయములు, సంఖ్యా వివరణములు, విజ్ఞానము, ఏవిధమైనా వివిధ వృత్తుల ప్రకృతి శాస్త్రము, ధర్మశాస్త్ర విషయములు, పురాణ పురుషుల వివరాలు, మాండలిక పదాలు - ఇలా ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. మారే జీవన విధానంలో వచ్చే కొత్త పారిభాషిక పదాలతో కొత్త నిఘం టువూ ఆవశ్యకత ఉంది. ఎంతోమంది తెలుగుభాషకోసం ఇది చేయాలి అది చేయాలి అంటూ వేదికలపై ఉపన్యాసాలను ఇస్తారు. కాని తెలుగు భాషకోసం నిఘంటువునో, మరోదాన్నో రచిస్తే ఆ వ్రాసిన వారు ఆ రచనలను బయటకు తేవటానికి చాలా శ్రమపడాల్సి వస్తోంది. కొందరైతే ''నేనో నిఘంటువు''ను తయారు చేస్తున్నానంటే - అదేదో పనికిమాలిన విషయంగానే చూస్తున్నారు.
ఏది ఏమైనా తెలుగువారమైన మనం అంతా మన భాష మనుగడకోసం ఎంతోసేవ చేయాల్సివుంది. నాల్గవ స్థానానికి పడిపోయిన మన భాషను మొదటి స్థానానికి తీసుకురావాల్సిన బాధ్యత మనమీద వుంది. అందుకే భాషను ఎప్పటికీ నిలిచి ఉంచే భాషా పదాలను, స్వరూపాన్ని తెలియజెప్పే నిఘంటువు నిర్మాణం అనేది ఎంతో ఓపికతో, ఓర్పుతో, శ్రమతో కాలాన్ని వెచ్చించి చేయాల్సినపని. మరి అంతటి ప్రయాస కోర్చి కొంతమంది నిఘంటు నిర్మాణానికి సహకరించమని భాషను ప్రేమించేవారందరికి సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌనే తెలుగు - తెలుగు నిఘంటువు తయారీకి ప్రయత్నంచేయగా మరిమనం-?

- మల్లీశ్వరి (Visaalandhra -- Fri, 28 May 2010)